Wednesday, August 17, 2011

ఊబకాయం మనుషుల్లోనే ఎందుకు ఉంటుంది?

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని రోజు రోజుకు అందుబా టులోకి వస్తున్న వినిమయ వస్తువుల వల్ల కానీ లేదా మన తరఫున పని చేసి పెట్టడానికి సేవారంగాలు అందుబాటు లోకి రావటం మూలాన అయితేనేమి కాలు కదపకుండా పనులు జరగ టానికి వెసులుబాటు కలుగు తోంది.

అయితే గమనించాల్సింది ఏమిటంటే వీటిని అవసరాలకు తగ్గట్టు పొదుపుగా జాగ్రత్తగా వాడు కోకుండా ఉన్నాయి కదా! ఇష్టం వచ్చినట్టు విచ్చల విడిగా వాటిమీద ఆధార పడి సుఖాన్ని మూట కట్టుకుంటూ ఉంటే తెలియ కుండానే దానికి సమానమయిన కష్టాలను, నష్టాలను కూడా భరించాల్సి ఉంటుంది. కాకుంటే ఆ కష్టాలు, నష్టాలు నేరుగా మనకు కన పడవు.
మనం అనుభవించే సుఖాల మాటున మనకు తెలియ కుండానే జరిగే అలాంటి కష్ట నష్టాలలో ఊబకాయం కూడా ఒకటి. ఇది భూమి మీద ఉండే జీవరాసుల్లో వాటికి లేనిదీ, కేవలం మనిషికి మాత్రమే ఉండే సమస్య ఊబకాయం. ప్రపంచంలో ఏ జంతువు కూడా అది ఉండాల్సిన దాని కంటే ఒక్క పిసరు కూడా ఎక్కువ లావు కావు. మరి మనుషులు మాత్రమే ఎందుకు లావు అవుతున్నారని తరచి చూసుకోవాలి.
మనిషి తోసహా అన్ని జంతువులకు పుట్టేటప్పుడే పెరిగి పెద్దయ్యాక ఎంత ఎత్తు, ఎంత బరువు ఉండాలనే మాస్టర్లు ప్లాను వాటి జన్యువుల్లో రాసి పెట్టి ఉంటుంది. దానికి తగ్గట్టు ఆ జీవి జీవన విధానం ఉంటుంది. అంటే ఆ జీవి పడే శరీర కష్టం, దానికి తగ్గట్టు తినటం అనే వాటి మధ్య పొంతన ఉంటుంది. జంతువులు ఆ తూకాన్ని పొర పాటున కూడా అతిక్రమించవు. అవసరాన్నిబట్టే తింటాయి తప్ప అదనంగా తిననుగాక తినవు. కాబట్టే అవి లావు పెరగవు.
ఆకలి మీద ఉన్న ఒక ఆవును ముందు ఎండుగడ్డి వేస్తే అది చాలినంత వరకూ తిని ఆపేస్తుంది. వెంటనే ఎండుగడ్డి తీసి పచ్చగడ్డి వేసినా వాసన చూసి గమ్మున ఉండిపోతుందే తప్ప పచ్చగడ్డి కదా! అని దాన్ని ముట్టను కూడా ముట్టదు. తిరిగి ఆకలి అయినప్పుడు (శరీరంలో గ్లూకోజు శాతం పడిపోయినప్పుడు) మాత్రమే తినటం మొదలు పెడుతుంది. మరి అదే మనుషులు అయితే పచ్చడి మెతుకులతో కడుపునిండా తిన్నాక వెంటనే ఘుమ ఘుమ లాడే బిర్యాని పెడితే కడుపులో ఖాళీ లేక పోయినా కనీసం రెండు ముద్దలు నోట్లోకి తీసు కోకుండా ఎంత మంది ఉండ గలరు?

ముందు చెప్పినట్లు మనం పుట్టేటప్పుడే మన శరీర శ్రమకు తగ్గట్టు ఆకలి ఉండటం అనే సమతా స్థితిని ప్రకృతి మన శరీరంలో అమర్చి పెడుతుంది. అంటే ఎక్కువ శ్రమ చేస్తే ఎక్కువ ఆకలి, తక్కువ శ్రమ చేస్తే తక్కువ ఆకలి ఉండే విధంగా. సాధారణంగా వీటి మధ్య తూకం దెబ్బ తినకూడదు. కానీ మన ప్రవర్తనతో ప్రకృతి అమర్చిన ఆ సెట్టింగులను మనకు తగ్గట్టు మనం మార్చి పడేస్తాను. దానితో అటు బరువు పెరగటం కానీ, ఇటు తగ్గటం కానీ జరుగుతుంది. తిండి తినటాన్ని అలాగే ఉంచే పని తక్కువ చేశామనుకోండి. పనికి ఉపయోగ పడిన తిండి పోగా మిగిలిన తిండి ఒంట్లో పేరుకు పోతుంది. లేదా పనిని అలాగే ఉంచి తిండి అవసరానికి మించి తిన్నా అదనంగా తిన్న తిండి శరీరంలో పేరుకుపోతుంది


తగ్గిన ఒంటి కదలికలు:
ఆర్థిక స్థితి బాగ లేనప్పుడు ఆఫీసుకు పోవాలంటే ఇంటి నుండి అరకిలో మీటరు దూరంలో ఉన్న రోడ్డు వరకూ నడుచు కుంటూ పోయి అక్కడ బస్సు కానీ, ఆటో కాని ఎక్కి ఆఫీసుకు దగ్గరగా ఉన్న స్టేజీలో దిగి నడుచుకుంటూ పోతారు. కానీ ఇప్పుడు స్థితి మారి బైకు కొంటే ఇంటి దగ్గర కిక్కు కొడితే ఆఫీసు ముందు ఆగుతుంది. కాబట్టి గతంలో మాదిరి నడిచే అలవాటు పోయినట్టే. శరీర శ్రమ తగ్గింది. పనికి తగ్గట్టు తిండి ఏమైనా తగ్గిందా అంటే అదేమీ లేదు. కాబట్టి జరిగే పరిణామం ఏమిటి? కొవ్వు పెరగటం. అంటే లావు కావటం. తిండి మామూలుగా తింటున్నా లావు కావటానికి తెలయకుండానే కారణమయ్యే ఇలాంటి జీవన విధానాలు కొన్ని...

  • స్కూలు పిల్లలు ఇంటి దగ్గర వ్యాను/ఆటో ఎక్కి స్కూలు దగ్గర దిగటం.
  • హాలుకు పోకుండా ఇంట్లోనే కూర్చుని టీవీలో సినిమాలు, సీరియళ్ళు చూడటం.
  • పిల్లలు బయట ఆడుకోకుండా ఇంట్లోనే కంప్యూటర్లు, వీడియో గేములు ఆడుకోవటం.
  • మోటారు బైకులు కొన్నాక నడిచే లేదా సైకిలు తొక్కే అలవాటు తగ్గటం.
  • మిక్సీలు, గ్రైండర్లు వచ్చాక రుబ్బే/నూరే/దంచే అలవాటు పోవటం.
  • వాషింగు మిషన్లు రాకతో బట్టలు ఉతికే పని లేకపోవటం.
  • పనిమనిషిని పెట్టుకొని ఇంట్లో పనులు తగ్గించుకోవటం.
  • బయటకు పోయి సరుకులు తెచ్చుకోకుండా డోరు డెలివరీలు అందుబాటులోకి రావటం.
  • మనుషుల్ని కలవను బయటకు పోవటానికి బదులు సెల్లు ఫోనులు అందుబాటులోకి రావటం.
  • బిల్లులు కట్టటానికి, ప్రయాణపు రిజర్వేషన్లకు బయటకు కదలకుండా ఇంటర్‌నెట్టులోనే చేసుకొనే వెసులుబాటురావటం.
  • చిన్నచిన్న దూరాలకు కూడా నడిచిపోకుండా ఆటోలు, బైకులు వాడటం.
ఇలా రాసు కుంటూ పోవాలే కానీ కోకొల్లలుగా శరీరాన్ని కదలనివ్వ కుండా పనులు జరిగి పోయే ప్రతి పనీ మనం ఖర్చు చేయాల్సిన కాలరీలను ఒంట్లో మిగుల్చుకోవటం వల్ల అదనంగా కొవ్వు పేరుకు పోతుంది. మరి లావు కాక ఏమవు తారు?
తిండితో తిప్పలు
ఇక తిండి సంగతికి వస్తే మారిన జీవన సరళి వల్ల అది కూడా లావు కావటానికి ఇతోధికంగా తోడ్పడుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దొరికే రెడీమేడ్ ఫుడ్స్. అందు లోనూ ఎక్కువ కొవ్వు నూనెలతో చేసిన పిజ్జాలు, బర్గర్లు, చాక్‌లెట్లు, ఇక చెప్పేది ఏముందీ? ఇంట్లోకి అదనపు కేలరీలను ఎక్కించే ఇలాంటివే కొన్ని.
  • ప్రతి సంఘటనకూ పార్టీలు ఇచ్చే వరవడివల్ల విందులు ఎక్కువ అవటం.
  • ఏ ఇంటికి పోయినా తినటానికి ఏదో ఒకటి పెట్టటం, వాటిని తినటం.
  • ఇంటికి వచ్చిన వారికి మర్యాదపూర్వకంగా ఇచ్చే నీళ్ళు, మజ్జిగ స్థానంలో ఎక్కువ కాలరీలు ఉండే కూల్‌డ్రింక్స్ ఆక్రమించటం. అలాగే స్వీట్లు పెట్టటం.
  • తరచూ హోటళ్ళకు పోవటం అక్కడ తిండి ఎక్కువ కావటం.
  • మందుకొట్టే వారు మంచింగు రూపంలో ఎక్కువ తినటం.
  • టీవీ ప్రచార మాయలో ఉన్న పిల్లలు చాక్‌లెట్లు, చిప్స్, కురుకురేలు, క్రీం బిస్కట్లు ఎక్కువగా తినటం.
  • టీవీ చూస్తూ తినటంవల్ల ఎంత తింటున్నామో తెలియకపోవడం.
  • మగ వారికి పార్టీలు ఎక్కువ కావటం.
  • చిరు తిండిగా తినే సాంప్రదాయ పిండి వంటల స్థానంలో ఎక్కువ కొవ్వు ఉండే పిజ్జాలు, బెర్గర్లు, పావు బాజీలు రావటం.
  • అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండటం వల్ల రాత్రి భోజనం తరువాత కూడా ఏదో ఒకటి తింటూ ఉండటం.
  • మాంసాహార వాడకం ఎక్కువ అయినప్పుడు నోరు అదుపు తప్పటం. 
చూశారు కదా! కారణం కనపడకుండా లావు కావటానికి వెతకాలే కాని ఇలాంటివి బోలెడు కనిపిస్తాయి. అందుకే జాగ్రత్త సుమా.



                                                      
                                                                 17-08-2011
                                                            

1 comment:

  1. I agree to some extent.
    అయితే ఒక ప్రశ్న. పైన చెప్పినట్లుగా చాలా మంది చేస్తారు కదా, కాని అందులో కొందరే ఎందుకు fat అవుతారు?

    ReplyDelete