Wednesday, September 29, 2010

వైద్యం పవిత్రమూ కాదు, వైద్యుడు దేవుడూ కాదు

"వైద్యం చాలా పవిత్రమైనది" "వైద్యుడు నారాయణుడితో సమానం" ఇవి వారసత్వంగా కొన సాగుతున్న భావాలు. కాలం మారుతుంది. జనం మారు తున్నారు. వారి ఆలోచనా విధానం మారుతుంది. గతంలో మాదిరి వైద్యం చేయా లంటే ఏ ఆకునో, కాయనో నూరి మందుగా ఇస్తే కుదరదు. ఇస్తే జనం ఒప్పుకోరు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత  పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంత కాలం ఉంటాయి. ఇంకొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను, అవశేషాలను వదిలి పోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం. ఆపరేషను చేయాల్సిన కేసుల్లో సర్జరీ మొదలైనప్పటినుంచి రోగి కోలుకొనేవరకూ కేవలం డాక్టరు సమర్థత ఒక్కటే చాలదు. రోగం తీవ్రత, రోగి శరీరం తట్టు కొనే తీరు, మందుల ప్రభావం, వైద్య వసతులు, రోగి చెల్లింపు సామర్థ్యం మొదలైనవన్నీ వాటి వాటి స్థాయిలో కలిసి రావాలి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటుంది. కాని రోగి అవగాహన, అర్థం చేసుకొనే తీరును బట్టి వారి ఆశింపు మరో రకంగా ఉంటుంది. 

ఏది ఎలా ఉన్నా, జనానికి ఆధునిక వైద్యం కావాలి. వైద్యంలో నాణ్యత ఉండాలి. రోగి ఆసుపత్రిలో అడుగు పెట్టే సమయానికి అన్నీ అమరి నట్టు ఉండాలి. బాధతో ఉన్నప్పుడు వైద్యం ఆలస్యం కాకూడదు. త్వరగా జబ్బు తగ్గి పోవాలి. ఇవి సగటు రోగి ఆశింపు.
రోగి ఆశించి నట్టు వైద్య సేవలు అందించాలంటే డాక్టరు పూర్తిగా సమర్థుడై ఉండాలి. వైద్యాన్ని బాగా నేర్చు కోవాలి, కొత్త కొత్త పోకడల్ని నిరంతరం తెలుసు కుంటూ ఉండాలి. అందుకు వృత్తిపరమైన కాన్ఫెరన్స్లకు పోతూ ఉండాలి. ఎడిషను మారినపుడల్లా కొత్త పుస్తకాలు మారుస్తూ ఉండాలి. జర్నళ్ళకు చందా కడు తూనే ఉండాలి. అన్నింటికి మించి నిరంతరం చదువు తూనే వుండాలి. రోగం చేయటంలో ఏమైనా తేడా వచ్చి వినియోగదారుల ఫారంలో కేసు పడవచ్చు. "ఇన్ని కష్టాలు పడే మాకు కష్టానికి తగ్గట్టు డబ్బులు ఫీజు రూపంలో రావద్దూ?" ఇది రోగి ఆశింపుపై సగటు డాక్టరు కామెంటు.

మరోవైపు డాక్టరుకి సామజిక బాధ్యత ఉండాలని సమాజం ఖచ్చితంగా ఆశిస్తుంది. ఇంజనీర్లకు, టీచర్లకూ, లాయర్లకూ, చార్టెడు అకౌంటెంట్లకూ ఇలా ఒకరనేం? ఎవరికీ సామాజిక బాధ్యతని జనం గుర్తు చేయరు. ఐ.ఐ.టీలలో, ఐ.ఐ.ఎంలలో ప్రజల డబ్బుతో చదివిన వారిని "సమాజం పట్ల మీ బాధ్యత ఏమిటని ఎవరూ అడగరు. వారు సమాజం డబ్బుతో చదవరా? కేవలం డాక్టరు మాత్రమే జనం డబ్బుతో చదువు తారా? డాక్టర్లు మాత్రమే జనాల సేవల తరించాలా?" వైద్యం మీద, వైద్యుల మీద చర్చ వచ్చిన ప్రతిసారీ డాక్టర్లు ముందుకు తెచ్చే ప్రశ్నలు ఇవి. 

ఇక్కడ కొన్ని వాస్తవాలు కుడా గమనించాలి. వైద్యుడిని దేవుడిగా నెత్తిన పెట్టు కునే ఈ జనమే వైద్యంలో ఎక్కడైనా తేడా వచ్చిందంటే ఊరకనే ఉండరు. అదే "దేవుడి"ని తిడతారు. కొన్నిసార్లు కొడతారు. ఆసుపత్రుల మీద దాడి చేస్తారు. మంచి సిటిజను అయితే జరిగిన నష్టానికి డబ్బులు కట్టించమని కోర్టుకు తిప్పు తాడు.

వైద్యులకూ, రోగులకు మధ్య ఈ విధమైన వైవిధ్యాలు రావటానికి కారణం ఏమిటంటే డాక్టరు - పేషంటుమధ్య సంబంధాలను వాస్తవ దృష్టితో అర్థం చేసుకోలేక పోవటమే. జనం మారి, వైద్యం మారి, వైద్య పద్ధతులు మారి, వైద్యానికి సంబంధించి మిగతా అన్ని అంశాలు మారినా వైద్యుల్ని చూడటంలో జనం ఆలోచనలు మాత్రం సంప్రదాయ పద్ధతుల్లో అలాగే ఉన్నాయి. అందుకే జనం ఆశింపుకూ, వైద్యుల ప్రవర్తనకూ మధ్య అంత అంతరం.

సమాజంలో ఆర్థిక, సామజిక, సాంస్కృతిక అంశాలలో మార్పులు అనివార్యం. వాటితోపాటే మానవ సంబంధాలు మారుతూ ఉంటాయి. పూటకుళ్ళ ఇళ్ళు రెస్టారెంట్లు అయినట్లు, సత్రాలు స్టార్ హోటళ్ళు అయినట్టు వైద్యమూ దాని  తీరుతెన్నులు మారాయిన్న అంశాన్ని పరిగణ లోకి తీసు కోవటం లేదు. వైద్యాన్ని డబ్బులు తీసుకొని చేసే "సేవ"గా గుర్తించకుండా, పవిత్రమైనదిగా, డాక్టరును వైద్య నిపుణుడిగా కాకుండా దేవుడిగా, దయమయుడిగా, శాంత ముర్తిలా, రోగ పీడిత దరిద్ర నారాయణులను ఆడు కోవటానికి పుట్టిన అవతార మూర్తులుగా భావించి నేటి కాలానికి తగ్గట్టు నైతికతను ఆశిస్తే ఎలా కుదురుతుంది?
జనం మారి, వైద్యం మారి, వైద్య పద్ధతులు మారి, వైద్యానికి సంబంచిన అన్నీ మారినా వైద్యుల్ని చూడటంలో మాత్రం జనం ఆలోచన లను పాత పద్ధతుల్లోనే ఉన్నాయి. అంటే జనంలో  ఉండే ద్వంద ప్రమాణ ఆలోచనల వల్ల వైద్యులకు, జనానికి మధ్య దూరం పెరుగు తుంది. 
మారే కాలంతో పాటు డాక్టర్లూ మారు తారు. చేసే వైద్యమూ మారుతుంది. దానికి తగ్గ ఖర్చూ పెరుగు తుంది. మార్పులన్నీ సమాజంలో వచ్చే మొత్తంలో భాగం గానే ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచు కొని "డాక్టరు - పేషంటు" సంబంధాన్ని చూస్తే వారి మధ్య సంబంధాలు సజావు గానే ఉంటాయి. లేదంటే పరస్పరం అనుమానం తోనే కలిసి నడవాలి.

మిగతా వారిని వదిలేసి డాక్టర్ల నుండి మాత్రమే సామాజిక బాధ్యతను ఆశించటంలో మరో కనబడని కోణం కూడా ఉంది. అదేమిటంటే రోగం వ్యక్తిని ప్రత్యక్షంగా బాధకు గురి చేస్తుంది. దాన్నుండి విముక్తి పొందాలంటే డాక్టరుతో ప్రత్యక్ష సంబంధం, వారి సేవలు అవసరం. అలాగే దానికి నేరుగా తనే ప్రత్యక్ష "చెల్లింపు" కూడా చెయ్యాలి. ఆ చెల్లింపు మనసులో "అయిష్టమైన చెల్లింపు" ఎలానో చూద్దాం.

రోగం రావటం ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా రాకుండా ఉండవు. వచ్చాక వైద్యం చేయించు కోక తప్పదు. ఇష్టం ఉన్నా, లేక పోయినా డాక్టరు దగ్గరికో, ఆసుపత్రికో పోయి వైద్యం చేయించు కోవాలి. అంటే జబ్బున పడ్డప్పుడు "రోగి- డాక్టరు" సంబంధం అనివార్యమూ, అవసరమూ. యిది ఇలా ఉంచుదాం.

మనిషి అవసరాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకం మనకు కావలసినవి, మనం ఇష్టపడేవి, మనకు ఆనందాన్ని ఇచేవి. వీటి కోసం వెంపర్లాడతాం. ఖరీదు అయిన టీవీ కొనటం, ఆరు రెట్లు ఎక్కువ పెట్టి నచ్చిన హీరో సినిమా టికెట్టును బ్లాకులో కొనటం, దప్పిక వేసినప్పుడు కోకకోల తాగటం, ఎంత డబ్బు పెట్టి అయిన మందు కొట్టటం ఇలా చాల పనులు ఎవరికి వారికి ఇష్టంగా ఉంటాయి కాబట్టి ఎంత డబ్బు పెట్టవనే దానితో పనిలేదు. ఇష్టమైన అవసరాలు కాబట్టి ఎంతైనా పెట్టవచ్చు. దీనికి బాధ పడేది ఏమి ఉండదు.

రెండో రకం అవసరాలు మనకు ఇష్టం లేనివి. ఇష్టం లేక పోయినా అవసరం కాబట్టి వాటి కోసం ఖర్చు పెట్టాలి. లంచాలు, కోర్టు కేసులు, ఆసుపత్రి ఖర్చులు మొదలయినవి ఈ కోవ లోకి వస్తాయి. ఇవి వచ్చాయి కాబట్టి అవసరాలు అయ్యాయి కాని నిజానికి మనం కోరు కోలేదు. కాబట్టి వీటికోసం ఖర్చు చేయటం సంతోషంగా ఉండదు.

అయితే వీటిల్లో లోతు పాతులు మనకు తెలియదు కాబట్టి నిపుణుల సహాయం కావాలి. వారి సేవలకు "ఫీజు" చెల్లించాలి. కాని దాని మీద పెట్టే ఖర్చు బూడిదలో పోస్తున్నంత "ఫీలింగు"

పది వేల రూపాయలు ఆలోచించ  కుండామందుకు ఖర్చు పెట్టే వ్యక్తి దాన్ని మానటానికి వైద్యం చేసిన డాక్టరు బిల్లు ఐదు వేలు కట్ట డానికి మనసు ఒప్పదు. దీనికి ఇంత అవుద్దా! అని ధర్మ సందేహం. డాక్టరు ఎక్కువ లాగు తున్నాడని లో లోన మథనం. డాక్టర్లు ఊరికే సంపాదిస్తున్నారని నింద. డాక్టర్లకు మానవత్వం లేదని కామెంట్లు.
తీవ్రంగా గాయ పడ్డప్పుడు వైద్యం చేయించు కోకపోతే ప్రాణం పోతుందనే భయం. తక్షణ ఆపద్బాంధవుడు డాక్టరు "ఎక్కడా? త్వరగా రాడే?" ఆ పరిస్థితిలో, ఆ సమయంలో రోగి ఆక్రందన అలా ఉంటుంది. డాక్టరు వచ్చాడు. వైద్యం జరుగుతూ ఉంది. ఫరవా లేదు. ఇపుడు బాగుంది. బిల్లు ఎంత అవుతుందో’? రోగి అనుమానం. రోగం తగ్గింది. బిల్లు చేతికి వచ్చింది. అది ఎంతైనా ఉండనీ! ‘‘అమ్మ బాబోయ్ ఇంతా? ఈ డాక్టర్లకు కరుణ లేదు. దారుణంగా దోచేసు కుంటున్నారు’’, ‘‘ఏం పెద్ద ఊడ బొడిచారనీ’’ ఇవి జబ్బు నయం అయ్యాక, సగటు రోగి ఆలోచనలు. దీనికి కారణం ఇష్టం లేని అవసరంకోసం చెల్లించాల్సి రావటమే. అందుకే రోగికి డాక్టరు ప్రాణం పోయేటపుడు దేవుడుగానూ, రోగం తగ్గేటప్పుడు స్నేహితుడిగా, బిల్లు కట్టించు కొనేటప్పుడు యముడిలా కనిపిస్తాడని ఒక ఆధునిక నానుడి పుట్టుకు వచ్చింది.

చేయించుకున్న వైద్యానికి బిల్లు కట్టాల్సి వచ్చినపుడు రోగి మనసులో "అవసరం - అయిష్టత" పునాదిగా ఆలోచిస్తారు. మారిన సామాజిక నేపథ్యంలో వైద్యం చేసే డాక్టరు సేవ "సేవ - ప్రతిఫలం" అనే ఆలోచనల పునాదిగా ఫీజును ఆశిస్తాడు. ఈ రెండింటి మధ్య పొంతన ఎంత చెడిపోతే "డాక్టరు - రోగి" మధ్య సంబంధం కూడా అంతగా దెబ్బ తింటుంది.

రోగి - డాక్టరు మధ్య సంబంధాలను వ్యాపార సంబంధాలుగా పరిగణించి "వినియోగదారుల చట్టం" పరిధిలోకి తెచ్చాక కూడా "సేవ - దయ" అనే పాత పునాదులపై నుండి వైద్యాన్ని చూడటం సరి కాదు. "సేవకు తగ్గ చెల్లింపు" రోగికి ఉండాలి. అలాగే ‘‘చెల్లించినదానికి నాణ్యమైన సేవ’’ను డాక్టర్లు అలవరచు కోవాలి. అంటే రోగి మంచి వినియోగదారుడై ఉండాలి. డాక్టరు నాణ్యత అందించగల సర్వీసు ప్రొవైడరుఅయి ఉండాలి. 

సేవకు తగ్గట్టు చెల్లించని మనస్తత్వం రోగికి ఉన్నపుడు ఏదో ఒక రూపంలో దాన్ని రాబట్టుకొనే విధంగా వైద్యులు ఉంటారు. వైద్యం అనే రైలు నడవాలంటే దానికి "రోగి - వైద్యుడు" రెండు పట్టాల్లాంటి వారు. ఒక పట్టా అదుపు తప్పి, రెండో దాన్ని అదుపు తప్ప కుండా బాగుండమని ఆశించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వినియోగదారుడు వైద్యులపట్ల తమ దృక్పథం మార్చు కోవాలి.

 • వైద్య వృత్తి పవిత్రమినదేమీ కాదు. కట్టిన డబ్బుకు అందించే సేవ మాత్రమే 
 • డాక్టరు గోప్ప వాడేమి కాదు. అన్నీ పనుల్లో నిపుణులు ఉన్నట్టే డాక్టర్లు వైద్యంలో నిపుణులు.
 • డాక్టర్లందరూ మేథావులు కాదు. అందరిలో ఉన్నట్టే డాక్టర్లలో కూడా మేథావులు ఉంటారు
 • డాక్టర్లు కేవలం "మంచి"గా ఉంటారని ఆశించటం పొరపాటు.
 • సమాజంలో ఎంత మంచి ఉంటుందో అంత కంటే ఎక్కువను ఎలా ఆశించటం?  
 • డాక్టరు చదువును దృష్టిలో ఉంచు కొని వైద్యంలో నాణ్యతని ఆశించాలి.
 • ప్రతి డాక్టరుకు అన్నీ  విషయాలు తెలిసి ఉండవు. తెలిసి ఉంటాయని ఎప్పుడు ఆశించ వద్దు 
 • ఒకే డిగ్రీ చదివిన నిపుణుల మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది
 • సమాజంలో ఉండే అన్నీ రుగ్మతలు వైద్య వ్యవస్థ లోనూ, వైద్యు ల్లోనూ ఉంటాయని అర్థం చేసు కోవాలి.
 • ప్రభుత్వ డాక్టర్లు ఉచితంగా సేవ చేయరు. మన తరపున ప్రభుత్వం చెల్లిస్తుంది   


Wednesday, September 22, 2010

మంచి డాక్టర్ని ఎలా గుర్తించాలి?

మంచి డాక్టరు అంటే ఎవరు? బాగా చూసేవారా? ఫీజు తక్కువ తీసుకొనేవారా? రోగాన్ని నయం చేయటంలో నైపుణ్యం ఉన్నవారా? బాగా మాట్లాడేవారా? ఎక్కువమంది రోగుల్ని చూసేవారా?
సీనియరు మెడికల్ కాలేజి ప్రొఫెసర్లు చాలామంది తమ విద్యార్థులను గమనించిన తరువాత చెప్పే అనుభవం ఏమిటంటే, బాగా చదివిన వారిలో చాలామందికి పెద్దగా ప్రాక్టీసు ఉండటంలేదని. అలాగే ఇపుడు బాగా ప్రాక్టీసులో ఉన్న వారు మెడికలు కాలేజీలకు ఉన్నపుడు పెద్దగా చదివేవారు కాదని. పాతకాలంలో, అంటే వైద్యం వ్యాపారం కాని రోజుల్లో వైద్యంమీద ఆసక్తి ఉండేవారే ఆ వృత్తిలోకి వచ్చేవారు. చేసే వైద్యం ఎలాంటిదైనా అందులో నిజాయితీ, నమ్మకమూ ఉండేవి. కాబట్టే వైద్యులకు దేవుడి హోదా కట్టబెట్టి ‘వైద్యో నారాయణ హరి’ అన్నారు. ‘అప్పిచ్చువాడు, వైదుడు, ఎప్పుడూ పారే ఏరు, ద్విజుడు ఉండే వూరు మాత్రమే ఉండటానికి యోగ్యమైనదని’’ సెలవిచ్చాడు సుమతి నూటకకారుడు. అంటే సమాజంలో వైద్యానికి అంతటి ప్రాముఖ్యత వైద్యుడికి అంత గౌరవమూ ఉండేవి. వైద్యుడికి ఏ లోటూ రానీయకుండా, ఊరు వదిలి పోనీయకుండా చూసుకొనేవారు. అది అప్పటి సంగతి. కాలం మారింది. మనుషులు మారారు. వైద్యమూ, వైద్యుల తీరు తెన్నులూ మారాయి.
ఇపుడు జనం డాక్టర్లని చూసి ‘‘అప్పిచ్చువాడు వైద్యుడు’’ అని చతుర్లాడుతుంటే, డాక్టర్లు మేమేమీ తక్కువ తినలేదని రోగం వచ్చిన వాడని రోగి అనకుండా "ఫిజిచ్చువాడు రోగి" అనే పల్లవిని ఎత్తుకున్నారు. ఇప్పుడు మన సమస్య ఏమిటంటే ఫీజు ఇచ్చినా మంచి డాక్టరు దొరక్కపోతే ఎలా అని.
ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. ఇది వ్యాపార సమాజం. వ్యాపారానికి అతీతమైనది ఏదీ లేదు. బిడ్డను కనే కడుపునే అద్దెకిచ్చి వ్యాపారం చేస్తున్న ఈ రోజుల్లో వైద్యం మాత్రం వ్యాపారం కాకుండా ఎలా పోతుందీ? కాదు అని ఎవరైనా అనుకుంటే అది ముమ్మాటికీ పొరపాటే. వైద్య సేవలు వినియోగదారుల చట్టం పరిధిలోకి వచ్చి పాతికేళ్లు అయి వెండి పండగ చేసుకోబోతున్న తరుణంలో కూడా వైద్యుల్ని పాత చింతకాయ పచ్చడి తరహాలో చూస్తే ఎలా కుదురుతుంది? ఆసుపత్రిని కానీ, డాక్టరుని కానీ మనం చూడాల్సింది పవిత్రత ముసుగు వేసి కాదు. ముసుగు తీసి కట్టిన డబ్బుకు సమానమైన, నాణ్యమైన, సేవ అందుతుందా లేదా అని.
ఇపుడు వైద్యం వ్యాపారం. రోగి వినియోగదారుడు. డాక్టరు సర్వీసు ప్రొవైడరు. మనం కట్టిన డబ్బుకు నమ్మకంగా, నిక్కచ్చగా, నాణ్యమైన సేవలు అందించగలిగే డాక్టరు మనకు కావాలి. మరి అలాంటి డాక్టరు ఎక్కడ దొరుకుతారు? ఎలా ఉంటారు? వెతికి పట్టుకోవడం ఎలా?
ఇది జఠిలమైన సమస్యే. కారణం ఏమిటంటే మంచి డాక్టరును పొందటం అనేది అనేక అంశాలమీద ఆధారపడి ఉంటుంది. సాధారణ వైద్యమా, నైపుణ్య వైద్యమా అనేదానిమీద, కట్టగల ఫీజుపైనా, డాక్టరు అందుబాటుపైనా, వైద్యం కోసం వాడే పరికరాల లభ్యతపైనా ఆధారపడి ఉంటుంది. పైగా ఇక్కడ నకిలీ వైద్యులు, ప్రావీణ్యం లేని వారు, నిపుణత లేని సరుకు నుండి పూర్తి భిన్నంగా మంచి సేవలు అందించగలిగే సరుకు ఉన్న డాక్టర్లవరకూ వివిధ స్థాయిల్లో ఉన్నారు.
నకిలీ డాక్టర్లని వదిలేస్తే అర్హత పొందిన డాక్టర్లలో విషయ పరిజ్ఞానం, దాన్ని ఉపయోగించే విధానాన్ని గీటురాళ్లుగా తీసుకుంటే మొత్తం మూడు కేటగిరీలుగా విడదీయవచ్చు.
సరుకు లేని డాక్టర్లు:
గతంలో ఇలాంటి వైద్యులు మొత్తంలో పావు వంతు కంటే తక్కువగా ఉండేవారు. కానీ ప్రయివేటు వైద్య కళాశాలలు కుప్పలు తెప్పలుగా వచ్చిన నేపథ్యంలో రాను రాను ఇలాంటివారు చాలా ఎక్కువ అవుతున్నారు. ప్రయివేటు వైద్య కళాశాలలు నుండి కొత్తగా వైద్యం మార్కెట్టులోకి వచ్చేవారిలో సాధారణ వైద్యుల్లో అంటే జనరలు ప్రాక్టీషనర్లలో దాదాపు ముప్పావు వంతు. స్పెషాలిటీ వైద్యుల్లో సగానికి పైగా సరుకులేని వైద్యులే. ప్రభుత్వం వీరికి లైసెన్సులు ఇచ్చింది కాబట్టి చట్టపరంగా వీరు వైద్యులే. నాలుగైదుసార్లు వీరి దగ్గర చూపించుకున్నాక పస లేదని అర్థం అవుతుంది. లేదా మరో డాక్టరు అదే కేసును చూసే విధానంలో నాణ్యతను చూపినపుడు వీరి విషయం అర్థం అవుతుంది. జనమే అనుభవం మీద తమను తాము కాపాడుకోవాలి.


బాగా సరుకు ఉన్న డాక్టర్లు :
వీరు చదువుల్లో టాపర్లు. చదవటం మొదలుపెడితే ఆ అంశాన్ని ఈకలు పీకేదాకా వదలరు. అంటే ఏది చదివినా మూలల్లోకిపోతారు. ప్రతిదీ పద్ధతిగా నేర్చుకుంటారు. వైద్యం చేయాల్సి వచ్చినా చాలా పద్ధతిగానే చేస్తారు. ఎక్కడా రాజీపడరు. చిన్న జ్వరాన్ని కూడా భూతద్దంలో చూపే స్వభావం. అంత బాగా నేర్చుకొని కూడా దాన్ని ఎక్కడ, ఎవరికి ఎలా, ఎంతలో, జనానికి తగ్గట్టు వైద్యం చేయటంలో విఫలం అవుతారు. కోటీశ్వరుడికి వైద్యం ఎంతఖర్చులో వైద్యం ఉంటుందో రిక్షా కార్మికుడికి కూడా అలాంటి వైద్యమే, ఇంతే ఖర్చు కూడా. వీరు పెట్టుకోగలిగిన వారికి మంచి వైద్యులే కానీ సాధారణ జనం వీరిని భరించలేరు. సాధారణంగా ఇలాంటివారు మెడికల్ కాలేజీలలో బోధకులుగా, రీసెర్చి సెంటర్లలో బాగా సరిపోతారు. భరించగలిగితే మంచి డాక్టర్లే. సాధారణ జలుబుతో వెళ్లినా దాన్ని రెండు వందల కోణాలలో ఆలోచిస్తారు.
విజ్ఞత ఉన్న డాక్టర్లు :
విషయ పరిజ్ఞానం మరీ ఎక్కువ ఉండదు కానీ, అలా అని తక్కువ కూడా ఉండదు. విజ్ఞత అంటే ‘కామన్ సెన్సు’తో వైద్యం చేయటం వీరి ప్రత్యేకత. రోగి ఆర్థిక స్థితి, రోగ తీవ్రత, దానివల్ల వ్యక్తికి కలిగే ఇబ్బందీ మొదలైన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడికి అక్కడ వర్తింపచేస్తూ వైద్యం చేస్తారు. వీరు సాధారణ డాక్టర్లు కావచ్చు లేదా నిపుణులు కావొచ్చు.వీరిలో తొలి రకాన్ని వదిలేస్తే, రెండూ మూడు రకాలలో కలపోతలో కూడా కొంతమంది ఉంటారు. మూడు రకాలలో మళ్లీ మంచితనం. నిజాయితీ, డబ్బుకు తగ్గ సేవను కలిపి బేరీజువేయాల్సి ఉంటుంది. ఇన్ని లక్షణాలతో కలగాపులంగా ఉండే డాక్టర్లలో నుండి అవసరమైన అన్ని లక్షణాలను కలబోసుకున్న డాక్టర్లు దొరికితే అదృష్టమే. అందుకే మంచి డాక్టర్లు ఇలా ఉంటారు అని నిర్వచించడం కష్టం. అవన్నీ ప్రత్యక్షంగా, అనుభవం మీద తెలియాల్సిందే.
మంచి డాక్టరు లక్షణాలు(సాధారణంగా) ఇవి:
*అర్హత లేకుండా నిపుణులమని చెప్పుకోరు
*తరచూ వృత్తిపరమైన కాన్ఫరెన్సులకు హాజరు అవుతుంటారు.
*రోగికి సాధ్యమైనంతవరకూ తక్కువ పరీక్షలు చేయిస్తారు.
*మందులు రాశాక వీరు అడగకుండానే జాగ్రర్తలు చెబుతారు.
*రోగి పరిస్థితి తనకు అర్థం కానపుడు మరో డాక్టరి అభిప్రాయం తీసుకుంటారు.
*చికిత్స చేయగలిగినా వసతులు లేనపుడు వేరే వైద్యుల దగ్గరకు పంపుతారు.
*రోగి దగ్గర ఎక్కువ వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తారు.
*మందులతో తగ్గకపోతే అపుడు పరీక్షలు చేయిద్దాం అంటారు.
*రోగ నిర్థారణ అయ్యాక దాన్ని గురించి వివరంగా చెపుతారు.
*రాసిన మందు బ్రాండును  షాపువాళ్ళు మార్చితే ఒప్పుకోరు.
*మీరు చెప్పే సమస్య అంతా విన్నాక ప్రశ్నలు అడుగుతారు.
*అవసరం అయితే తప్ప సూదులను, సలైను వాడరు
*అలవాటుగా, రోటినుగా  బి- కాంప్లెక్స్ మాత్ర్హలు రాయరు
*బలం మాత్రలు రాయమని మీరు అడిగినప్పుడు మిమ్మల్ని సున్నితంగా తిడతారు
*ప్రతివారికి సరుకుల పట్టీ మాదిరి మందులు రాయరు
*ఇతర డాక్టర్లు రాసిన మందులు సరైనవే అయినప్పుడు వాటిని కొనసాగించమని చెబుతాడు
*మందుతాగి ఉన్నపుడు రోగుల్ని చూడరు
ఇక్కడ చెప్పిన వాటిలో ఎన్ని లక్షణాలు ఉంటే  అంత మంచి డాక్టరు అయి ఉండేందుకు "అవకాశం" ఉంది. చివరిగా తేల్చాల్సింది "నిజాయితి"పరుడైన రోగి మాత్ర్హమే

Wednesday, September 15, 2010

వారంలో బరువు తగ్గడం ఎలా ?

ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఉంటే ఉన్న అదనపు బరువు ఉన్న వారిని ఊబకాయులు అంటారు. వీరిలో అదనంగా ఉన్న లావును బట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అసలు అలా ఉండటమే ఒక అనారోగ్యం. ఏవో కొన్ని వైద్య పరమైన సమస్యలు ఉన్న వారిలో తప్ప లావు కావటం అనేది నూటికి 98 పాళ్ళు "తిండి-కష్టం"ల  మధ్య మనకు మనమే తూకాన్ని దెబ్బ తీయటం వల్ల కొని తెచ్చు కొనే సమస్య. అంటే "ప్రవర్తనా" పరమయిన సమస్య. గతంలో ఈ సమస్య ధనవంతులది. ఇప్పుడు ఉన్న వారు- లేని వారు, నలుపు-తెలుపు, ఆడా-మగ, చిన్నా-పెద్ద, ఉత్తరం-దక్షిణం అనే తేడాలు చూపని అసలయిన "సోషలిస్టు' సమస్య.  

చాల మంది సమస్యను పట్టించు కోరు. కొంత మంది తగ్గటానికి నానా రకాల పాట్లు పడుతుంటారు. అందులో పూర్తిగా  అశాస్త్రీయ  పద్ధతుల నుండి  శాస్త్రీయ పద్ధతుల వరకూ ఉండొచ్చు.  ఇక్కడ మీకు ఇచ్చింది  శాస్త్రీయ పద్ధతుల్లో బరువు తగ్గే పద్ధతుల్లో ఒకటి. ప్రయత్నం చేసే ఓపిక ఉంటే మొదలు పెట్టండి.  పాటించటంలో మీ నిజాయితీని బట్టి వారం రోజుల్లో 2 నుండి  5 కేజీల బరువు తగ్గ వచ్చు. 

ఇదేదో ఒబేసిటి సెంటర్ల వ్యాపార ప్రకటనో, టీవీల్లో చూపే టెలిబ్రాండ్‌ ప్రకటనో కాదు. ఎక్కడికి వెళ్ళకుండా, ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే శాస్త్రీయ పద్ధతుల్లో బరువు తగ్గే పద్ధతి. దీనికి కావల్సిందల్లా అదనపు బరువు తగ్గాలన్న బలమైన కోరికా, అమలు పరిచే దృఢ సంకల్పం. ఆ తరువాత బరువు పెరగ కూడదన్న తలంపు మీకుంటే చాలు. ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని "జాన్‌హప్‌కిన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌" రూపొందించింది. ప్రయోగాత్మకంగా నిరూపణ చేసిన పధ్ధతి. 

వారం రోజుల పాటు మీరు తీసుకునే ఆహారం శరీరానికి ఏ మాత్రం అదనపు కాలరీలను ఇవ్వకుండా మీ వంట్లో ఉన్న అదనపు నిల్వలను (కొవ్వు, ప్రొటీన్లను) కరిగించడానికి ఉద్దేశించిన డైట్‌ చార్టు ఇది. మరైతే ఆలస్యం దేనికి ?  వెంటనే ప్రారంభించండి.

ముందుగా మీ అదనపు బరువు లెక్క వేసుకోండి 
ముందుగా మీరు ఉండాల్సిన దానికన్నా అదనంగా ఎంత బరువు ఉన్నారో చూడండి. అదనపు బరువును లెక్కించటానికి ఒక చిన్న లెక్క. ముందుగా మీ బరువును కేజీలలో, మీ ఎత్తును సెంటీమీటర్లలో కొలుచు కోండి. సెంటీ మీటర్లలో మీ ఎత్తు నుండి 100 తీసెయ్యండి. వచ్చిన విలువను 0.9తో పెంచండి. అది మీరుండాల్సిన బరువు. మీరు ఉన్న బరువులో నుండి ఉండాల్సిన బరువు తీసి వేస్తే మీరు ఎంత అదనంగా ఉన్నారో తెలుస్తుంది. ఇక వారం రోజుల 'డైట్‌ చార్టు'లోకి వెళ్లి మీరు ఏమేం తినాలో, ఎలా తినాలో చూద్దాం. ప్రతి రోజు ఆహార నియమాలతో పాటు చివర ఇచ్చిన సాధారణ నియమాలను ఖచ్చితంగా పాటించాలి.

మొదటిరోజు
అరటి పండు తప్ప అన్నిరకాల తాజా పళ్ళు: ఈ రోజు మీ ఆహారం. మీకు నచ్చిన అన్ని రకాల పండ్లను తినొచ్చు. అరటి పండు మాత్రం లేదు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కిరిణికాయలు (కడప దోసకాయలు) ఎక్కువ తింటే మంచిది. పరిమితి ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు. పళ్ళను ఆహారంగా తీసు కోవటం వల్ల రా బోయే ఆరు రోజులకు మీ శరీరాన్ని, జీర్ణ  వ్యవస్థను సిద్ధం చేస్తున్నారన్న మాట.

రెండవరోజు
అన్నిరకాల కూరగాయలు : ఈ రోజు మీ ఆహారం కేవలం కూరగాయలు మాత్రమే తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక పెద్ద బంగాళ దుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజును ప్రారంభించండి. తరువాత బంగాళా దుంప తినొద్దు. మిగతా కూరగాయలు పచ్చివి కాని, ఉడికించినవి కాని తినొచ్చు. ఉప్పు, కారం మీ ఇష్టం. నూనె మాత్రం వాడొద్దు. ఈ రోజు కూడా పరిమితి అంటూ ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు.

మూడవరోజు
పళ్ళు, కూరగాయలు : పళ్లలో అరటి పండు, కూరగాయల్లో బంగాళా దుంప తప్ప మిగిలిన పళ్ళు, కూరగాయలు కలిపి తీసుకోండి. ఈ రోజు కూడా పరిమితి ఏమీ లేదు. అవసరం మేరకు తినొచ్చు. ఈ రోజు నుండి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగటం ప్రారంభిస్తాయి.

నాల్గవ రోజు
8 అరటిపళ్లు, మూడు గ్లాసుల పాలు : నాల్గవరోజు దాదాపు ఆకలి ఉండదు. రోజంతా హాయిగా గడచి పోవడం గమనిస్తారు. 8 అరటి పళ్ళు తినాల్సిన అవసరం రాక పోవచ్చు. తగ్గించగలిగితే తగ్గించండి. (ఒక గ్లాసు 200 మి.లీ.) పాలల్లో చక్కెర ఎక్కువ ఉండ కూడదు. ఇంకా అవసరం అనిపిస్తే 100 మి.లీ. వెజిటబుల్‌ సూప్‌ తాగవచ్చు. (తాజా కూరగాయలతో మీ అభిరుచికి తగ్గట్లు మీ ఇంట్లో తయారు చేసింది మాత్రమే తాగండి).

ఐదవ రోజు
ఒక కప్పు అన్నం, 6 టమోటాలు : మీకిది విందు రోజు. మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దాని లోకి కూరగాయలు లేదా ఆకు కూరతో నూనె లేకుండా వండిన కూరతో తినండి. ఉదయం టిఫిన్‌గా రెండు టమోటాలు తీసుకోండి. మిగిలినవి అవసరం అయినప్పుడు తినండి. కప్పు అన్నం తినొచ్చు కదా ఏమవుతుందని ఇంకాస్త లాగించే పని చేయ వద్దు. వీలయితే కప్పు కన్నా కాస్త తక్కువే తినండి.

ఆరవ రోజు
ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం :  రెండవ రోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు (బగాళ దుంప మినహా) తీసుకోండి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే. కూరగాయలకు లిమిట్‌ లేదు. అయినప్పటికి ఆకలి లేకపోవడం వల్ల రెండవ రోజు తిన్నంత అవసరం లేదు.

ఏడవ రోజు
ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం:  ఆరవరోజులాగే తింటూ, అదనంగా కూరగాయలను కాస్త తగ్గించి, పళ్ళ రసం (చక్కెర లేకుండా) తీసుకోండి. మధ్యాహ్నం యథా విధిగా ఒక కప్పు లేదా అంత కంటే తక్కువ అన్నం తినండి. ఇక రేపటి కోసం ఎదురు చూడండి.

వారం తరువాత
మీలో మార్పును మీరే కాకుండా పక్కవాళ్ళు సైతం గుర్తించేలా ఉంటుంది. మీ బరువు ఎంత వున్నారో చూసు కోండి. ఈ పద్ధతి కచ్చితంగా పాటిస్తే, శరీరం అవసరం మేరకు తింటే, 4 నుండి 5 కేజీల బరువు తగ్గుతారు. మినహాయింపులూ, ఉల్లంఘనలు ఉంటే దానికి తగ్గట్టే తగ్గుతారు. ఇంకా మీరు బరువు తగ్గాలంటే కనీసం రెండు వారాల విరామం తర్వాత లేదా మళ్లీ మీ ఇష్టం వచ్చినప్పుడు ఇదే వారం చార్టుని తిరిగి ప్రారంభించండి. ఈ విధంగా మధ్య మధ్యలో విరామంతో మీ బరువు తగ్గించ దలచుకున్నంత వరకు ఈ చార్టుని ఫాలో కావచ్చు. వారం రోజుల పాటు ఈ పద్ధతిని పాటించడం వల్ల ఆ తరువాత కూడా మీకు పెద్దగా ఆకలి ఉండదు. అంటే ఆకలి స్థాయి తగ్గుతుంది. కాబట్టి ఇక నుండి మీ ఆహారపు అలవాట్లను పక్కాగా మార్చుకుని పరిమితంగా తింటూ వుంటే మీ బరువు అదుపులో ఉంటుంది. లేదంటే  మళ్ళీ లావు పెరుగుతారు.

సాధారణ నియమాలు

 1. ఈ వారం రోజులు మీరు 20 నిమిషాల పాటు ఒక మోస్తరు వ్యాయామం అంటే నడక, సైక్లింగ్‌, ఎరోబిక్స్‌, స్విమ్మింగ్‌ లాంటి వాటిలో ఏదో ఒకటి చెయ్యాలి.
 2. రోజూ 10 గ్లాసులకు తక్కువ కాకుండా నీళ్ళు తాగాలి  
 3. పైన చెప్పిన ఆహారం అవసరం మేరకు తినాలే తప్ప తినమన్నాం కదా అని అవసరం లేకపోయినా తింటే ఫలితం అనుకున్నంత రాదని గుర్తించండి.
 4. ఏడు రోజులు మీరు తినే ఆహారంతో పాటు ఈ క్రింద వాటితో చేసిన వెజిటబుల్‌ సూప్‌ పరిమితి లేకుండా ఎప్పుడైనా తాగవచ్చు.వెజిటబుల్‌ సూప్ తాయారు చేసే విధానం:
పెద్ద ఉల్లిపాయలు రెండు, క్యాప్సికప్‌ ఒకటి, టమోటాలు మూడు, 30 గ్రాముల క్యాబేజి, కాస్తంత కొత్తి మీర, 500 మిల్లీ లీటర్ల నీరు, ఉప్పు, మిరియాల పొడి మీ ఇష్టాన్ని బట్టి. వీటితో సూప్‌ చేసు కోవచ్చు.

గమనిక : బరువు పెరగడం అనేది మనిషి తినే ప్రవర్తనకు సంబంధించిన సమస్య. తిండి విషయంలో మీ ప్రవర్తన మార్చు కోకుండా బరువు తగ్గాలను కోవడం జరగని పని. ఇందుకు మీరు ఒబెసిటి సెంటర్ల చుట్టూ తిరిగితే చేతి డబ్బులు వదలటం, ఆరోగ్యం పాడు కావడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఓబెసిటి సెంటర్లది ప్రచార ఆర్భాటం, మోసం తప్ప మరేమి కాదు. సలహాల కోసం మీ కుటుంబ డాక్టరును లేదా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించండి.
బరువు తగ్గారా ?బాగానే ఉంది! కాని జాగర్తలు తీసు కోక పొతే తగ్గిన బరువును సరిగ్గా నెల నుండి రెండు నెలల్లో తిరిగి మామూలుగా అంతకు ముందు ఎంత బరువు ఉన్నారో అంతకు వస్తారు! బరువు తగ్గించు కోవటంలో ముఖ్యమయిన 'కిటుకు'(సూత్రం) ఏమిటంటే తగ్గిన బరువును పెరగకుండా చూసు కోవటం.

"నెట్"లో వైద్య సమాచారం మంచిదేనా?

నాకే కొద్ది కంచం, గోకేకొద్ది తీట’ బాగుంటాయనేది తెలుగు నానుడి. అనుభవించే వారికే తెలుస్తుంది వాటి మాధుర్యం. ‘క్లిక్కుకొద్ది నెట్టు, సర్ఫుకొద్ది సమాచారం’ అనేది ఇంటర్నెట్‌ను వాడే ‘నెటిజన్’ల నానుడి. అవునన్నా కాదన్నా ఇపుడు ప్రజల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సమాచార సాధనం ఇది. ఆవగింజ నుండి అంతరీక్షం దాకా ఎపుడు ఎక్కడ ఏ సమాచారం కావాలన్నా క్లిక్కువేటు దూరంలో "ప్రపంచ సాలెగూడు తావులు"(world wide websites)  మన ముందు ఉంచుతాయి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించిన మాయాజాలమే ఇంటర్నెట్టు. అన్ని రంగాలలో ఇంటర్నెటు ఉపయోగ పడ్డట్టే వైద్యం లోనూ ఇంటర్నెట్టు ఉపయోగ పడుతుంది. రోగాన్ని గురించి, వైద్య పద్ధతుల గురించి, మందులను గురించిన సమాచారం కోసం చాలా మంది ఇపుడు ఇంటర్నెట్టు ‘వెతుకు మర’( Search engine) పై ఆధారపడుతున్నారు. ఆ రకంగా దాని ఉపయోగం అంతా ఇంతా కాదు. అయితే ఏ సమాచారాన్ని ఎలా ఉపయోగ పెట్టు కోవాలనేది ఉపయోగించే వ్యక్తి అవగాహనా సామర్థ్యం మీద, పొందే సమాచారపు విలువ మీదా ఆధారపడి ఉంటంది. ఉపయోగించాలే కానీ నెట్టులో దొరికే సమాచారంతో డాక్టర్లు ఎప్పటికప్పుడు వైద్య పద్ధతులను, మెళకువలను తాజా పరుస్తుంది. గతంలో డాక్టర్లు వైద్య సమాచారం పొందాలంటే పుస్తకాలమీద, జర్నళ్ల మీద ఆధార పడే వారు.

తెలుసు కోవాలనుకున్న విషయం ఎక్కడ ఉందో వెతు క్కోవటానికి చాలా సమయం పట్టేది. పైగా పుస్తకాల ఖరీదు వేలల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ అవసరం లేదు. కావాల్సిన సమాచారం ఒక క్లిక్కుతో క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. ఇపుడు ప్రతీ వైద్య కళాశాలలో విద్యార్థులకు ఇంటర్నెట్టు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వం నిబంధన విధించింది. వైద్యులకు మెడలో స్టెతోస్కోపుతో పాటు ఇంటర్నెట్టు కనెక్షను ఉండాలని బహుశా నిబంధనలు రావచ్చు.

ఇంటర్నెట్‌లో అత్యంత విలువైన పరిశోధన అంశాల నుండి పనికిరాని పరమ చెత్తవరకూ ఉంటుంది. అయితే ఏ 'తావు'(site)లో దొరికే సమాచారం సరైనదో తెలుసు కోవడం డాక్టర్‌కు పెద్ద పనేం కాదు. కానీ సాధారణ జన విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. దాన్ని సరైన విధంగా ఉపయోగ పెట్టుకుంటే వైద్యం పొందటంలో అటు డాక్టర్లకూ, ఇటు జనానికి మేలు జరుగుతుంది. అలా కాకుండా నెట్టులో దొరికే సమాచారమంతా నిజమని నమ్మితే మాత్రం బుర్ర పాడవటం ఖాయం.

ముందు వెనకా ఆలోచించకుండా ‘తావు’లో దొరికే సమాచారాన్ని నేరుగా తలలోకి ఎక్కించుకున్నా, ఉపయోగించుకున్నా ఇబ్బందులు తప్పవు. వైద్య పరమైన అంశాలు అయితే వాటిపట్ల డాక్టరుకు అవగాహన ఉంటుంది కాబట్టి దాన్నుండి దేన్ని తీసు కోవచ్చు, దేన్ని తీసుకో కూడదు అనే విచక్షణని ఉపయోగిస్తారు. ఇంటర్నెట్టును విరివిగా ఉపయోగించే చాలామంది ముఖ్యంగా సాఫ్టువేరు వ్యక్తులు తమకు ఆరోగ్యపరమైన ఏ సమస్య వచ్చినా డాక్టరు దగ్గరకు పోబోయే ముందుగా వారికి ఉన్న లక్షణాలను నెట్టులో వెతుక్కుంటున్నారు. కావాల్సిన సమాచారానికి సంబంధించి ముఖ్య పదాలను "వెతుకు మర" టైపు చేయగా దానికి సంబంధించిన వేల తావులు తెరచుకుంటాయి. అయితే వీటిలో మొదటి రెండు మూడు పుటల(Pages)నే ఎక్కువ తెరుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయా ప్రభుత్వాల ఆరోగ్య శాఖలు, విశ్వ విద్యాలయాలు, వైద్య విజ్ఞాన సంస్థలు నిర్వహించే సైట్లు దాదాపు సరైన సమాచారాన్ని అందిస్తాయి. ఇవికాక వైద్యునికి సంబంధించిన వృత్తిపరమైన సంఘాలు అంటే, ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పెడియాట్రిక్స్’, ‘అమెరికన్ స్లీప్ ఫౌండేషన్’, ‘అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్’ లాంటి సంస్థలు నిర్వహించే సైట్లలో సరైన సమాచారం దొరుతుంది.

మరో వైపు కొన్ని వ్యాపార సంస్థలు వారి వస్తువుల్ని అమ్ము కొనేందుకు వీలుగా ఆ వస్తువులకు వైద్య ప్రాముఖ్యతను ఆపాదిస్తూ వైద్య సమాచారం పేరుతో తప్పుడు సమాచారాన్ని అందిస్తాయి. ఉదాహరణకు గురకను తగ్గించటానికి ‘మొక్క మందులు’ (Herbal medicine) శాస్ర్తియంగా పనిచేస్తాయని చెప్పటానికి నానా చెత్త విషయాలను     అశాస్ర్తియంగా అంశాలుగా తమ సైటులో ఉంచుతారు. అది నిజమే అని నమ్మిన గురకపెట్టే వ్యక్తి నెట్టులో దాన్ని కొంటాడు. అలాగే ‘లైంగిక ఉత్తేజకాలు’ మీరు వెతుకు మరలో టైపుచేస్తే కావాల్సినన్ని సైట్లు తెరచుకుంటాయి. కానీ నిజానికి అలాంటి ఉత్తేజకాలు ఏమీ ఉండవు. నెట్టులో వైద్య సమాచారం వెతికే వారు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం తమకు జబ్బు చేసినపుడు అది ఫలానా జబ్బు అని వారికి వారే నిర్ణయించుకొని దాన్ని గురించి తెలుసు కోవటానికి నెట్టులో వెతికే వారు. ఉదాహరణకు ‘దగ్గు’ ‘జ్వరం’ అని ‘వెతుకు మర’లో చూస్తే వేలసైట్లు వీటిని గురించిన సమాచారంతో ప్రత్యక్షం అవుతాయి. వైద్యపరమైన దన్నులేని వారు వాటిని వర్తింపజేసు కోవటంలో అయోమయానికి గురి కావటం, భయ పడటం జరుగుతుంది.

రెండో రకం డాక్టరు దగ్గర చూపెట్టుకున్నాక డాక్టరు జబ్బును ఫలానా అని నిర్థారించి వైద్యం మొదలు పెట్టాక దాన్ని గురించి అదనపు సమాచారం కోసం ‘వల’లో వెతకటం. సాధారణంగా డాక్టర్లు వైద్యం చేసేటప్పుడుమీ హాని కలిగిస్తాయి అన్న విషయాలను తప్ప వైద్యంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను, అరుదుగా తలెత్తే ఇబ్బందుల్ని గురించి రోగితో చెప్పరు. చెప్పినా పైపైన, చాలా తేలిక చేసి చెబుతారు. అలా చెప్పకుండా ప్రతిదాన్ని భూతద్దంలో చూపించి చెబితే రోగి భయభ్రాంతులకు లోనయ్యే అవకాశం ఉంది.చివరిగా ఒక మాట- వైద్యులు, వైద్య విద్యార్థులు బైబిలు, ఖొరానులా పరిగణించే ‘హచ్చి సన్సు క్లినికల్ మెథడ్స్’ అనే పుస్తకం ఇప్పటికీ యాభైసార్లు తిరిగి రాశాక కూడా తొలి రచయిత అయిన ‘హచ్‌సన్స్’ అన్న మాటలు ఇప్పటి ఎడిషన్‌లో కూడా మొదటిగా ప్రచురిస్తారు. అదేమిటంటే- ‘‘వైద్యశాస్త్రంలో ఎంత విప్లవాత్మక మార్పులు వచ్చినా, ఎన్ని అధునాతన యంత్రాలు వచ్చినా అవి రోగాన్ని కుదర్చటంలో డాక్టరుకు "సహాయ"పడతాయే కానీ, డాక్టరుకు ప్రత్యామ్నాయంగా వచ్చే సమస్యే లేదు’’. ఇంటర్నెట్ వైద్య సమాచారం కూడా అంతే.


Thursday, September 9, 2010

మందులతో కాస్త జాగర్త

డాక్టర్ని సంప్రదించి, మందులు వాడు కోవటం తప్పనిసరి అయినపుడు అందులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జబ్బు నయం అవటం తోపాటు మందుల వల్ల జరిగే నష్టాలను నివారించు కోవచ్చు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చివరకు బాధ పడేది రోగినే. కాలం కలిసి రాకపోతే జరిగే నష్టం ప్రాణం పోయేంత ఉండ వచ్చు. మందుల వాడకంలో పాటించాల్సిన అంశాలు, తీసు కోవాల్సిన జాగర్తలు ఇవీ.

1. మీ డాక్టర్ రాసే మందులు మీకు అర్థం అవుతున్నాయో లేదో పరిశీలించండి. డాక్టర్లది బ్రహ్మరాతనీ, మెడికలు షాపువారికి తప్ప మరెవరికీ అర్థం కాదనే ఛలోక్తులు మనకు ఉండనే ఉన్నాయి. మందుల్ని విడి అక్షరాలలో రాయలనేది ఏ డాక్టరూ ఎవరూ పాటించని రూలు.

2. సాధారణంగా డాక్టరుకి అనుబంధంగా ఉన్న మెడికలు షాపుల్లో డాక్టరు రాసినవి తప్ప వేరేవి ఇవ్వరు. కానీ బయట కొనాల్సినపుడు ఆ మందులు, వారి దగ్గర లేనప్పుడు ఉన్న అలాంటి మందును అంట గట్టడానికి ప్రయత్నిస్తారు. దాని నాణ్యత మనకు తెలియదు. ఉదాహరణకు నొప్పులకు మీ డాక్టరు ఒక బ్రాండు మందు రాస్తే, 10 మాత్రల ఖరీదు 30 రూపాయలు. దాని మీద 10 శాతం మందుల షాపువారికి లాభం ఉంటుంది. అంటే లాభం మూడు రూపాయలు. అలాంటిదే ‘జెనెరిక్’ రూపంలో బోలెడు దొరుకుతాయి. దానిపైన గరిష్ట చిల్లర ధర 30 రూపాయలే ఉంటుంది కాని అది షాపువారికి కేవలం నాలుగు రూపాయలకే దొరుకుతుంది.

3. నిజంగా డాక్టరు రాసిన మందు దొరక్కపోతే మళ్ళీ డాక్టరు దగ్గరకు వెళ్ళి మార్పించు కోవాలే తప్ప షాపువాడు ఇచ్చింది తీసు కోకూడదు. మీరు ఏ బ్రాండు వాడాలో నిర్ణయించాల్సింది డాక్టరు, మందుల షాపు వాళ్ళు కాదు. మెడికలు షాపువారికి మందుల్ని గురించి అంతా తెలిసి ఉంటుందన్న భ్రమలు వదలాలి.

4. మందుపేరు, మోతాదు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోండి. చాలాసార్లు పేరులో సారూప్యత ఉన్నందు వల్ల ఒక దానికి బదులు మరొకటి ఇస్తారు. ఉదాహరణకు పిల్లల్లో అతి చురుకుదనం కోసం వాడే ‘అటిరోమాక్సిటిన్’కు బదులుగా కేన్సరు చికిత్సలో వాడే ‘టొమాక్సిపైన్’ అనే మందును ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే డోసు కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసు కోవాలి. కొన్నిసార్లు 0.5కి బదులు 5 ఎం.జి ఇచ్చే అవకాశం ఉంది.

5. కొనబోయే ముందు దానిపైన మందు వాడటానికి ముందు ముగింపు (ఎక్స్‌పైరీ) తేదీని గమనించి కొనండి. బీపీ, చక్కెర జబ్బు, మానసిక సమస్యలకు మందులు వాడే వాళ్ళు కొన్నిసార్లు మూడు నాలుగు నెలలకు సరిపడా మందులు ఒకేసారి కొంటారు. అలాంటప్పుడు దగ్గర ముగింపు తేదీ ఉన్న మందులు కొనకుండా కనీసం నాలుగు నెలల గడువు ఉండేవిధంగా కొను క్కోవాలి.

6. మందుల షాపు వాళ్ళు ‘ఫిజీషియన్ శాంపుల్’ అమ్మటానికి ప్రయత్నిస్తుంటారు. వాటిని కొన వద్దు. డాక్టర్లు వీటిని తెలిసిన వారికి ఉచితంగా ఇస్తారు. సరిపోయినన్ని ఇస్తే ఫర్వాలేదు. రెండు మూడు మాత్రలు ఇచ్చినపుడు మిగతా మందులు కొనాల్సి వస్తుంది. డాక్టరు ఇచ్చినా మర్యాదగా వాటిని తిరస్కరించండి. కారణం మిగతా మందులు కొనాలంటే అదే బ్రాండు దొరక్క పోవచ్చు. పైగా మందుల తయారీ బ్యాచ్చీ, ముగింపు తేదీలు తేడాగా ఉంటాయి. ఏ డాక్టరు అయినా శాంపుళ్ళను అమ్మటం మీ దృష్టికి వస్తే అతని దగ్గరకు వెళ్ళనే వెళ్ళ వద్దు. ఇది డాక్టరు నైతిక పతనానికి పరాకాష్ఠ.

7. తక్కువ మాత్రలు కొనేటప్పుడు కత్తిరించి ఇస్తారు. దాంతో కొన్నిసార్లు మందు పేరు, ముగింపు తేదీ వేరుపడిపోతాయి. ఎప్పుడైనా మనం మందును వాడాల్సి వస్తే అది ఏ మాత్రో తెలియదు. అందుకే అలాంటప్పుడు వాటిని ఒక కవరులో వేసి దానిపైన మందు పేరు, డోసు, ముగింపు తేదీని రాయించి తీసుకోండి. అవి పూర్తి అయ్యేవరకూ అదే కవరులో ఉండేటట్టు జాగ్రత్త పడాలి.

8. మందు చివర తిజ ,XL, XR, CR, SR, ER, OD,Chrono. Retard, Contin,  అని ఉంటే అవి శరీరంలోకి కొద్ది కొద్దిగా మందును విడుదల చేసేవి అని అర్ధం. ఇలాంటి మాత్రలను మొత్తంగా మింగాలే తప్ప కొరకటం, తుంచటం చేయకూడదు. అలాగే వీటిని నీటిలో కరిగించి కానీ, పొడి చేసి కానీ వాడ కూడదు. అలా చేస్తే మందు అంతా ఒక్కసారిగా విడుదల అయిపోతుంది. కొన్నిసార్లు ఇది ప్రమాదానికి దారితీస్తుంది. మాత్రల మద్యలో గీత ఉంటే అలాంటి వాటిని తుంచి సగం వాడు కోవచ్చు.

9. పిల్లల కోసం వాడే సిరప్పులు కొనేటపుడు పొడి రూపంలో ఉంటాయి. నీరు పోసి కలపటంవల్ల అవి సిరప్పుగా మారుతుంది. ఇలా తయారు చేసిన సిరప్పును వారం లోపలే వాడాలి. ఆ తరువాత వాడితే ఆ మందు ప్రభావం తగ్గి పోతుంది. అలా తగ్గకుండా ఉంచటానికే వాటిని వాడబోయే ముందు వరకూ పొడి రూపంలో తయారు చేస్తారు. కాబట్టి మిగిలి ఉంటే పారెయ్యాలి తప్ప మళ్ళీ అవసరానికి ఉంచకూడదు.

10. నేరుగా సిరప్పుల రూపంలో దొరికే సీసా మందును మూత తెరచిన నెల లోపే వాడాలి. మిగిలితే పడెయ్యాలి.

11. పిల్లలకు వాడే సిరప్పులు సరిగా కొలత ప్రకారమే వెయ్యాలి తప్ప కొసరు వెయ్య కూడదు. చాలామంది తల్లులు జబ్బు త్వరగా తగ్గనపుడు చెప్పిన దానికంటే కాస్త కొసరు వేస్తారు. ముఖ్యంగా దగ్గు మందులు. పిల్లలకు దగ్గు ఏమాత్రం కాస్త ఎక్కువ అయినా ఇంకొక డోసు ఇస్తారు. అలా చెయ్య కూడదు.

12. మందులను పిల్లలకు అందకుండా ఉంచాలి. వాటితో ఆడు కోవడం మంచిది కాదని పిల్లలకు నేర్పాలి.

13. అన్ని మందులు అందరికీ పడవు. ఈ విషయం డాక్టరుకి కూడా తెలియదు. మందులు ఏమైనా పడకపోతే ఆ విషయం ముందు గానే డాక్టరుతో చెప్పాలి.

14. కొన్ని జబ్బుల వారికి కొన్ని మందులు వాడటంవల్ల ఆ పాత జబ్బు రెచ్చి పోతుంది. మచ్చుకు ఆస్తమా ఉన్న వారు బీటా బ్లాకరు తరగతి మందులు వాడితే ఆస్తమా వస్తుంది. థైరాయిడు జబ్బు ఉన్న వారికి దిగులు జబ్బుకు వాడే లీథియం మందు వాడ కూడదు. కాబట్టి మీకు ఇతర నిడివికాల జబ్బులు, అప్పుడప్పుడూ వచ్చిపోయే జబ్బులు ఉంటే ముందు గానే డాక్టరుకు చెప్పాలి.

15. కొన్ని మందులు పర్యవేక్షణ లేకుండా వాడ కూడదు. అంగం లేవటానికి వాడే ‘సిల్డనాఫిల్’ అనే మందును డాక్టరు సలహా లేకుండా వేసుకుంటే ఆ మందు నాకు పడలేదని చెప్పటానికి మీరు ఉండక పోవచ్చు. కారణం మీరు గుండెకు సంబంధించిన యాంజైనా అనే జబ్బుతో బాధపడుతూ దానికి మందులు వాడేవారు అయి ఉండ వచ్చు. అపుడు మాత్ర వాడగానే ప్రాణం హరీ అంటుంది.

16. డాక్టరు చెప్పినంత కాలం మందులు వాడాలి. మీకై మీరు నిర్ణయం తీసు కొని మార్చటంవల్ల వచ్చే నష్టాలను అనుభవించేది మీరే.

17. చాలామంది మందుల్ని దేనితో వేసు కోవాలనేది పెద్ద ప్రశ్న. ఏ మందులు అయినా నీటితో వేసు కోవాల్సిందే. అయితే కొన్ని నోటిలో కరిగే మందులు ఉంటాయి. వాటిని చప్పరిస్తే సరిపోతుంది. సాధారణంగా అలాంటి మందు పేరు చివర ఎం.డి అని ఉంటుంది. అంటే ‘మవుత్ డిసాల్వింగ్’ అని అర్ధం. ఇలా చప్పరించే మందులు మింగే మందులతో పోలిస్తే త్వరగా పని చేస్తాయి.

18. వైద్యం జరిగేటపుడు అందరూ అడిగే ప్రశ్న పత్యం ఏమిటని. సాధారణంగా 95 వంతులు జబ్బులకు పత్యం అంటూ ఏమీ ఉండదు. పత్యం పాటించాల్సిన అవసరం ఉంటే మీరు అడగకుండానే డాక్టరు చెబుతాడు.

19. మందులకు- తిండికి చాలా సంబంధం ఉంది. నొప్పికి వాడే మందులన్నీ ఖచ్చితంగా తిన్నతరువాతే వేసుకోవాలి. అసిడిటీకి వాడే మందుల్ని దాదాపు తిండికి ముందే వేసు కోవాలి. ఎప్పుడు వేసు కోవాలనేది సాధారణంగా డాక్టరే చెబుతాడు. చెప్పకపోయినా మీరు అడగవచ్చు.

20. కొన్ని మందుల్ని పొద్దున మాత్రమే వాడాలి. మరికొన్ని పడు కోవటానికి ముందు వేసు కోవాలి. తారుమారు అయిందంటే గందరగోళం అవుతుంది. ఏ మందు ఎప్పుడు వేసు కోవాలనేది డాక్టరే చెబుతాడు. అనుమానం వస్తే ఒకటికి రెండు సార్లు సరిచూసు కోవాలి.

21. కొన్ని మందులు కొందరికి పడవు. అలాంటప్పుడు కడుపులో వికారంగా ఉండటం, వాంతులు, విరోచనాలు, నిద్ర పట్టక పోవడం, మత్తుగా ఉండటం లాంటి స్వల్పకాలిక లక్షణాల నుండి ప్రాణం మీదకు వచ్చే వరకూ ఉండొచ్చు.

22. ఏ మందు అయినా పడలేదని అనిపిస్తే, వాటిని వేసు కోవటం ఆపి వెంటనే డాక్టర్ని కలవాలి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మీ డాక్టరు అందుబాటులో లేకపోతే ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న మరో డాక్టరును సంప్రదించాలే తప్ప మీ డాక్టరు దొరికే వరకూ వేచి ఉండ కూడదు.

23. పిల్లలకు మందులు ఎక్కువ భాగం సిరప్పుల రూపంలో వాడుతుంటారు. ఇవే కాకుండా కంటికి వాడే మందులు, చెవి, ముక్కులో వేసు కొనే చుక్కల మందులు ఒకసారి మూత తెరిచాక వాటి అవసరం అయి పోయాక పడెయ్యాలే తప్ప నెలల తరబడి మళ్ళీ అవసరానికి పనికివస్తుందిలే అని ఉంచకూడదు. మూత తెరిచాక ఎంత కాలం వాడవచ్చని డాక్టర్ని అడగండి.

24. కొన్ని మందులు వాడేటప్పుడు తూగు వస్తుంది. కానీ సర్దుకొని అలవాటు అయ్యే వరకు బండ్లు నడపడం, యంత్రాల మీద పని చేయడం చేయ కూడదు. సాధారణంగా ఇలాంటి మందులు రాసే ముందు డాక్టరు ముందు గానే చెబుతారు.
·