Wednesday, April 20, 2011

త్వరగా అయిపోతుంది! మా ఆవిడ రచ్చ చేస్తుంది! ఏం చేయమంటారు?


ఆడక:
 నా వయస్సు 36. మా ఆవిడ వయస్సు 34. నేను లెక్చరర్‌గా పని చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు. నాకు పెళ్ళి అయి ఏడు సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి శీఘ్రస్కలన సమస్య ఉంది. ఇంతకు ముందు మా ఆవిడ ఏమీ అనేది కాదు. గత రెండు మూడేళ్ళుగా ఆ సమయంలో చాలా విసుగు ప్రదర్శిస్తోంది. ఇలాంటి విషయాన్ని డాక్టరుతో చెప్పాలంటే సిగ్గు, బిడియంవల్ల పోలేక పోతున్నాను. మందులు ఏవైనా రికమెండ్ చేస్తారా?
                                                                                                                                 - సత్యమూర్తి, నంద్యాల
బదులు: ఆరోగ్య శీర్షికలు అవగాహన కోసమే తప్ప వైద్యం చేయటానికి కాదు. పత్రికల ద్వారా మందులు సూచించటం సరైన పద్ధతి కాదు. శీఘ్రస్కలనం విషయంలో భర్తది అయితే, బాధ అనుభవించేది భార్య. ఇప్పటికే మీ ఆవిడ లైంగిక జీవితాన్ని ఏడేళ్ళు వృథా చేశారు. ఇకనైనా మేలుకోండి. మీరు డాక్టరు దగ్గరకు పోవాలే కానీ మీరు ఊహించుకున్న సిగ్గు, బిడియం అక్కడ ఏమీ ఉండవు. ముందస్తు ఊహలు పక్కనపెట్టి తెరచిన మనసు (ఓపెన్ మైండ్)తో వెళ్ళండి.

దీనికి రెండు రకాల చికిత్సలు ఉంటాయి. మందులతో వైద్యం చేయవచ్చు. కానీ అది అతుకుల వైద్యమే. మందులు వాడిన్నంత కాలం నిలబడగలరు. మందులు ఆపగానే తిరిగి మామూలు స్థితికి వస్తుంది. అలా కాకుండా శాశ్వతంగా చికిత్స చేయించుకోవాలంటే సెక్స్ థెరఫీ తీసుకోవాల్సి ఉంటుంది. భార్యా భర్తలిద్దరూ చికిత్సలో భాగస్వాములు కావాలి. సైకియాట్రిస్టు లేదా సమర్థత ఉన్న సెక్స్ థెరపిస్టును కలవండి. సరుకు లేని సెక్స్ థెరపిస్టులు ఉంటారు. జాగ్రత్త. పోబోయేముందు విచారించి అర్హతలు చూసి కలవండి.

 ఆడక: డాక్టరు గారూ. మనసు బాగాలేని వారు మానసిక వైద్యుల దగ్గరకు వెళ్లితే ఎక్కువగా మత్తు మందులు రాస్తారనే అపవాదు ఉంది. ఇది ఎంతవరకు నిజం?                                                                     - కేశవ రావు, తడ

బదులు: మీరే అన్నారు కదా! అపవాదు అని. ఇది నిజంగా అపవాదే. ఇలాంటి నమ్మకాలు ప్రబలటానికి కారణం వైద్యం. ఇంకా పాత పద్ధతుల్లో జరుగుతుందని జనం మనసు బిగింపు చేసుకొని ఉండటమే. వైద్యం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్తకొత్త పద్ధతుల్లో వైద్యం చేయగలుగుతున్నారు. పాతికేళ్ళ క్రితం కడుపులో ఏదైనా సమస్య వచ్చి ఆపరేషను చేయాలంటే ఖచ్చితంగా కత్తితో కోసి ఆపరేషను చేయాలి. తరువాత కోసినదాన్ని మూసేయటానికి కుట్లు వేయాల్సి వచ్చేది. వారం నుండి రెండు వారాల వరకూ నొప్పిని భరిస్తూ ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చేది. మరి ఇప్పుడో? కడుపులోకి కేవలం మూండంటే మూడు చిన్న చిల్లులు పెట్టి లాపరోస్కోపిక్ సర్జరీ చేయడం ద్వారా రెండో రోజే ఇంటికి పంపగలుగుతున్నారు.
     మానసిక సమస్యలకు పాతకాలంలో వాడే మందులు మత్తుగా ఉండటం అన్నది నిజమే. అప్పుడు అన్ని మానసిక జబ్బులకు కలిపి మహా ఉంటే ఓ 10 మందులు ఉండేవి. దాదాపు ఇవన్నీ మత్తుగా ఉండేవి కాబట్టి అప్పుడు అలా అనుకొనే వారు. ఇప్పుడు దాదాపు 200 రకాల మందులు డాక్టర్లకు అందుబాటులో ఉన్నాయి. గతంలో మందుల వాడకంవల్ల రోగం తగ్గటంతో పాటు చెడు ఫలితాలను కూడా ఎక్కువగా భరించాల్సి వచ్చేది. ఇప్పుడు చెడు ఫలితాలు దాదాపుగా లేని మందులు అందుబాటులో ఉన్నాయి.
     మరో విషయం ఏమిటంటే కొన్నిరకాల మనసు జబ్బుల్లో నిద్ర పట్టదు. అలాంటప్పుడు జబ్బు తగ్గటంతోపాటు నిద్రకోసం కూడా మందులు కలిపి వాడాలి. బహుశా ఇది కూడా అలాంటి అపవాదు రావటానికి ఒక కారణం. డాక్టర్లు నిరంతరం వారి వైద్య ప్రమాణాలను మెరుగు పరుచుకుంటూ ఉండాలి. అలా మెరుగు పరుచుకోకుండా ఇంకా పాత పద్దతుల్లో వైద్యం చేసే డాక్టర్ల చేతిలో అలా జరిగితే జరగవచ్చు.

ఆడక: మా అమ్మాయి వయసు 23. స్కిజోప్రెనియా ఉంది. హైదారబాద్‌లో వైద్యం చేయిస్తున్నాం. బాగానే ఉంది. అంతకు ముందు ‘ఒలాపిన్ 10ఎం.జి’ వాడేది. దానితో లావు అవుతుందని డాక్టరు గారితో చెబితే ‘సల్పిటాక్ 200 ఎం.జి’ మాత్రలు రాశారు. జబ్బు అయితే బాగా అదుపులో ఉంది కానీ ఆ మందు వాడుతున్నప్పటి నుండి నెలనెలా వచ్చే బ్లీడింగ్ ఆగిపోయింది. డాక్టరు గారితో చెబితే మరేం పరవాలేదు అంటున్నారు. మాకు తెలిసిన వారంతా బ్లీడింగ్ రాకపోతే ఆరోగ్యం చెడిపోతుందని, చెడురక్తం అంతా ఒంట్లో ఉండిపోతుందని అంటున్నారు. పాప భయపడి మందులు వాడను అంటోంది. నిజంగా అలా జరుగుతుందా?                                              - ఈమెయిల్ ద్వారా రాజేశ్వరి

బదులు: మీ ఆ డాక్టరుగారు సరిగ్గానే చెప్పారు. ఈ మందు పనిచేసే విధానంలో గర్భ నిరోధక మాత్రల పాత్రను కూడా అదనంగా పోషిస్తుంది. దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఋతుసమయంలో పోయేది చెడు రక్తం కాదు. మంచి రక్తమే. మహిళల్లో అండం విడుదల అయిన రెండు వారాలకు గర్భం అంటుకోకపోతే రక్తం బయటకు వస్తుంది. పిల్లలు కావాలనుకుంటే ఋతుసమయం గురించి పట్టించుకోవాలి. మీ అమ్మాయికి పెళ్ళి కాలేదు కాబట్టి పెళ్ళయి పిల్లలు కావాలనుకొనేంత వరకూ భయం లేకుండా మందును వాడవచ్చు. డాక్టరు సలహా లేకుండా మీకు మీరే ఆపేసే నిర్ణయం తీసుకోకండి. అవసరం అయినప్పుడు మందును నిలిపేయగానే తిరిగి ఎప్పటిలా బహిస్టు అవుతారు.20 ఏప్రెల్ 2011

1 comment: