Saturday, May 7, 2011

పిల్లలతో ఇల్లు పీకి పందిరి వేయించే ADHD

ఆనందరావు, సుజాతలకు ఒక్కగా నొక్క కొడుకు భరత్. మూడో తరగతి చదువు తున్నాడు. పుట్టిన పిల్లవాడిని చూసు కొని మురిసి పోయారు. వాడి మీద ఎన్నో ఆశలు పెంచు కున్నారు. చిన్నప్పటి నుంచీ హుషారైన పిల్లవాడు. ఎంత హుషారు అంటే వాడితో పుట్టిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని భరత్‌తో పోల్చు కొని తమ బిడ్డలో ఏదో తేడా ఉందేమో! అని అనుమానపడేంత హుషారు వాడిది. భరత్ వయసు పెరిగే కొద్ది ఉషారు, చురుకుదనం, వయసుకు నాలుగింతలు పెరిగింది. రాను రాను వాడి చురుకుదనాన్ని భరించటం ఆనంద రావుకు, సుజాతకే కాక ఇంటికి వచ్చిన స్నేహితులు, బంధువులకు కూడా కష్టంగా ఉంది. కాలు, చెయ్యి ఒక దగ్గర ఉండవు. ఎప్పుడూ దేన్ని పగల గొడతాడో తెలియదు. ఎప్పుడు ఏ ప్రమాదాన్ని తెచ్చి పెడతాడోనని వెయ్యి కళ్ళతో గమనిస్తూ ఉండాలి. స్కూల్లో కూడా వీడిని భరించడం మా వల్ల కాదు తీసుకెళ్ళి మరెక్కడయినా చేర్చు కోండని ఒకటే కంప్లెయిట్‌లు. 
==================================================

పిల్లలు అన్నాక అల్లరి చేయకుండా ఉండరు. ప్రతి దానికి ఓ పరిమితి ఉన్నట్టే అల్లరికి కూడా ఓ పరిమితి ఉంది. భరత్‌లాంటి పిల్లల ఉషారు ఈ మితి మీరిన కోవ లోకి వస్తుంది. అతి చురుకుగా ఉండే ‘తులవ’ ప్రవర్తన పిల్లల్లో కనిపించే ఓ మానసిక రుగ్మత. దీన్ని ‘అటెన్షన్ డిఫిషిట్ అండ్ హైపర్ యాక్టిన్ డిస్టార్’’ అని, పొట్టిగా ‘‘ఎ.డి.హెచ్.డి.’’ అంటారు.

ఈ రకం పిల్లల్లో అతి చురుకుదనం ఛాయలు పుట్టినప్పటి నుంచీ ఉన్నప్పటికీ మూడు, నాలుగేళ్ళు వచ్చే వరకు అది సమస్యగా అనిపించదు. ఆ వయసులో వారిని ‘చురుకైన బిడ్డ’ కిందే పరిగణిస్తాము. 5 ఏళ్ళు నుంచి వీరు మిగతా పిల్ల లతో పోలిస్తే కాస్త తేడా కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్ది వీరి లక్షణాలు ప్రస్ఫుటంగా బయట కనపడుతూ మిగతా పిల్లలతో పోల్చ లేని విధంగా ఒక్కొక్క లక్షణం బైట పడుతూ ఉంటుంది. 

ఈ జబ్బులో కనిపించే ప్రధాన లక్షణాలు ఏమిటంటే వీరి శరీరము, మనసు రెండూ నిలకడగా ఉండవు. నిద్ర పోయేటప్పుడు తప్ప మిగతా వేళలంతా కదులుతూనే ఉంటారు. ఈ పిల్లలు ఒక దగ్గర కుదురుగా ఉండలేరు. ఆడు కొనేటప్పుడు చదువుకొ నేటప్పుడు, టీవీ చూసేటప్పుడు లేదా వారికి ఆసక్తిగా ఉన్న పనుల్లో నిమగ్నం అయి ఉన్నప్పుడు మట్టసంగా ఉంటారు. కానీ ఎ.డి.హెచ్.డి. ఉన్న పిల్లలు ఇలాంటి సందర్భా లలో కూడా స్థిరంగా ఉండరు. ఎక్కడా కాసేపు కూర్చో లేరు. నిలబడ లేరు. ఎప్పుడు గెంతుతూ, దూకుతూ ఉంటారు. ఏదో ఒకదాన్ని కలియ బెడుతూనే ఉంటారు. ఆడే ఏ ఆటని పూర్తిగా ఆడరు. ప్రతి పనిని సగంలో వదిలి మరో దానివైపు పరుగులు తీస్తారు. కొత్త బొమ్మ కొనిస్తే అరగంటలో పీకి అవతల పారేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే దేన్నయినా కాసేపటిలో పీకి పాకాన పడేసి అది పూర్తి కాకుండానే మరో వైపు మరలుతారు. 

పిల్లల్లో మానసిక ఎదుగుదల, బుద్ధి వికాసం బాగా జరగాలంటే నేర్చుకొనే అంశాల పట్ల మనసు నిలపాలి. అంటే ధ్యాస పెట్టాలి. ఆ ధ్యాసను తదేకంగా నిలిపి ఉంచితే దేన్నయినా నేర్చు కోగలరు. ఈ రుగ్మతతో బాధపడే పిల్లల్లో అటు ధ్యాస, ఇటు ఏకాగ్రత రెండూ ఉండవు. కాబట్టి పుట్టుకతో స్వతహాగా తెలివిగల వారు అయినప్పటికీ చదువుపరంగా దాన్ని ఉపయోగం లోకి తేవటం కష్టం అవుతుంది. 

ఈ సమస్య ఉన్న పిల్లలు చాలావరకు చదువులో వెనుకబడి ఉంటారు. చాలా మంది పిల్లల్లో వీటి తోపాటు ఇతర అసాధారణ ప్రవర్తనలు కూడా కలిసి ఉంటాయి. ఈ తరహా పిల్లలకు జాగర్త అనేది ఉండదు. నిర్లక్ష్యం ఎక్కువ. అనుభవాల నుండి జాగర్తలు నేర్చు కోలేరు. మచ్చుకు గోడ మీద నుండి దూకినప్పుడు బాగా దెబ్బలు తగిలితే రెండో సారి దూకడానికి జంకు రావాలి. కానీ ఈ పిల్లలు పది సార్లు పడ్డా అదేమీ పట్టనట్టు మళ్ళీ నిర్లక్ష్యంగా గోడ ఎక్కుతారు. కొంత మంది పిల్లలు ఉన్నట్టుండి విపరీతంగా ఉద్రేక పడి పోతారు. దుడుకు స్వభావం ఎక్కువ. చిన్న చిన్న విషయా నికే కోపం కట్టలు తెంచుకొనే వస్తుంది. ఇలా జరిగినప్పుడు చేతికి ఏ వస్తువు దొరికితే పగుల గొట్టడం, ఇతర పిల్లల్ని కొట్టడం లాంటి ప్రవర్తన కలిగి ఉంటారు. 

పై చెప్పిన రెండు లక్షణాలు ఉన్న పిల్లల్ని బడికి పోనంత వరకూ తల్లిదండ్రులు ఎలానో భరిస్తారు కానీ, బడి లోకి పోవటం మొదలైనప్పటి నుంచి ఇబ్బందులు పెరుగుతాయి. వెనుకబడి పోవటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగి పోతుంది. ఈ జబ్బుతో బాధ పడే పిల్లలు చెడి పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బడిలో కాని, ఆడుకొనే టప్పుడు కానీ పాటించాల్సిన నిబంధనలు పాటించరు. పైగా దురుసు ప్రవర్తనవల్ల మిగతా పిల్లలు వీరిని దగ్గరకు రానీయరు. పెద్దవారు ఈ పిల్లల్ని అంతగా ఇష్ట పడరు. ఉపాధ్యాయులకు కూడా ఇలాంటి పిల్లల పట్ల చిన్నచూపు ఉన్నందు వల్ల వారు కూడా చేర దీయరు. వీటన్నింటి పర్యవసానంగా ఒక పక్క ఈసడింపుకు గురి కావటం, మరో పక్క చదువులో రాణించ లేక పోవడం వల్ల పోకిరి పిల్లలతో చేరి ప్రవర్తన వక్రమార్గం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మగ పిల్లలు పొగరు బోతులుగా, జులాయిలుగా, గుర్తింపు పొందిన తన ఈడు పిల్లలు తోడయినప్పుడు ఆ వైపుగా ఆకర్షణ పెరుగుతుంది. ఆది లోనే సమస్యను గుర్తించి అడ్డుకట్ట వేయక పోతే ముందు ముందు నేర ప్రవర్తన వైపుగా ఎదగటానికి పునాదులు వేసినట్లు అవుతుంది. అదే ఆడపిల్లల్లో ఇలాంటి అవకాశం ఉండదు. కానీ తెలివి ఉన్నా చదువు సరిగ్గా సాగనందు వల్ల ఆశించిన మేరకు ఎదుగుదల ఉండదు. 

ఎ.డి.హెచ్.డి. పిల్లల్లో పైన చెప్పిన అన్ని లక్షణాలు అందరిలో ఉండక పోవచ్చు. కానీ ప్రధానంగా శరీరం నిలకడ లేక పోవడం, మనసు నిలకడగా లేక పోవడం అనే రెండు ప్రధాన లక్షణాల ఆధారంగా అసలు సమస్య ఉందా లేదా అనేది వైద్యులు నిర్ధారణ చేస్తారు. కొందరిలో కేవలం మనసు నిలకడ లేక పోవడం అనే క్షణం మాత్రమే ఉండ వచ్చు. మరికొందరిలో మనసు నిలకడగా ఉన్నా శరీరం కుదురుగా లేక పోవడం మాత్రమే ఉండ వచ్చు. ఎక్కువ మందిలో ఈ రెండింటి కలగలుపుగా లక్షణాలు ఉంటాయి. వైద్యుల లక్షణాల ఆధారంగా తీవ్రతను అంచనా వేసి, దాన్నిబట్టి చికిత్సను మందు లతో చేయాలా లేక ప్రవర్తన   సరి పోతుందా? అని నిర్ణయిస్తారు. 

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సమస్య ఉందనే విషయాన్ని అంగీకరించ టానికి ఒప్పు కోరు. కొంత మంది గుర్తించినా వైద్యం చేయించ టానికి వెనుకడుగు వేస్తారు. పైగా అది మానసిక జబ్బు అని తెలిసాక ఈ విషయాన్ని అంగీకరించ డానికి మనసు ఒప్పదు. ఇలాంటి వారు మనసు వైద్యులకు తప్ప మిగతా వైద్యుల దగ్గర వైద్యం చేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వైద్యులు సమగ్ర వైద్యం అందిస్తే ఫరవా లేదు. కానీ అలా కానప్పుడు తగిన వయసులో చికిత్స చేయనందు వల్ల బిడ్డకు జరగాల్సిన నష్టం జరిగి పోతుంది. ఎందుకంటే ఈ జబ్బును వీలైనంత త్వరగా అదుపు లోనికి తెస్తే అంత బాగా విద్యలో రాణించేందుకు అవకాశాలు మెరుగు పడతాయి. ఆలస్యం అయ్యే కొద్ది జరిగిన నష్టాన్ని పూరించడం దాదాపు కష్టం అవుతుంది. 

చికిత్స: జబ్బు ఉన్నదీ... లేనిదీ... దాని తీవ్రతను అంచనా వేసి, అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతులను వివరిస్తారు. తీవ్రమైన కేసుల్లో ఖచ్చితంగా మందులు వాడాల్సి ఉంటుంది. కేవలం మందులే కాకుండా ప్రవర్తనా పరమైన చికిత్స మందులకు రంగరించాలి. మనసు వైద్యులు, క్లినిక్‌లు, సైకాలజిస్టు, సైకాలజిస్టు మెడికో సోషల్‌వర్కర్ల ఉమ్మడి పర్యవేక్షణ ప్రాతిపదికన సమగ్ర చికిత్స జరిగితే ఎ.డి.హెచ్. ని అదుపు చేయడం సులభం.
ఈ జబ్బు నూటికి తొంభై మందికి ఈడు వయసు రాగానే దానంతట అదే తగ్గి పోతుంది. అప్పటి వరకు చికిత్చను ఏదో ఒక రూపంలో కొన సాగించాలి. లేదంటే చదువు కోవలసిన వయసులో అది కొన సాగక భవిష్యత్తు పాడవుతుంది 

సాధారణ వైద్యులు ఈ జబ్బుకు వైద్యాన్ని అందించ లేరు. అలాగే సాధారణ సైకాలజిస్టులు, స్వయం ప్రకటిత కౌన్చ్సిలింగు సైకాలజిస్టులు, హిప్నటిస్తులు గా తమకు తాముగా Hypnotists  చికిత్సను అందించ లేరు.4 ఏప్రెల్ 2011 2 comments:

  1. Hi sir
    my kid is of 3 years,he is of too active and cant sit at a place more than 3min,,our family doctor told that he is little hyper active.Is there any food that to restrict at least to reduce up to some extent..and by keeping busy there will be any improvement

    ReplyDelete
  2. ముందుగా మీ పాప/బాబుని సైకియాట్రిస్టుకు ఒకసారి చూపించండి. ADHD ఉందా లేదా అని తేలుస్తారు. ఉంటే చికిత్చ ఎప్పుడు, ఎలా మొదలు పెట్టాలో తెలుపుతారు. చదువుకు ఇబ్బంది వచ్చేటట్లు అయితే అయిదు ఏళ్ళు దాటాక మందులు వాడక తప్పదు. అప్పటి వరకు బిహేవియరల్ తెరఫి ప్రయత్నం చేయవచ్చు. తిండికి ADHD కి ఏమీ సంబంధం లేదు. కాబట్టి తిండి నియమాలు ఏమీ లేవు. ఉందని ఎవరయినా చెబితే అది అబద్దమే.

    ReplyDelete