Friday, May 13, 2011

ప్రేమికులను విడదీయటం ఎలా ?

ఆడక: నేనో రచయిత్రిని. చాలా మంది వారి వారి సమస్యలతో నా దగ్గరకు వస్తుంటారు. ప్రస్తుతం నా దగ్గర ఉన్న సమస్య. మా ఫ్రెండు వాళ్ళ అబ్బాయి లవ్వులో పడ్డాడు. మనం ఆ అమ్మాయిని మరిచి పోయేటట్టు చేయవచ్చా? ఎన్నాళ్ళోలో?
                                                                       
                                                                            - యలమర్తి అనూరాధ, పెనుగొండ, తూ.గో జిల్లా

బదులు: ప్రేమలో పడ్డ అబ్బాయి వయసు, చదువు, చేసే పని ప్రేమించిన అమ్మాయి తాలుకు వివరాలు రాయలేదు. నిర్ణయాలు తీసుకోగలిగిన వయసు, సంపాదనలో నిలకడ ఉన్న వ్యక్తి మంచి అమ్మాయిని ఇష్టపడితే పెళ్ళి చేసుకోనివ్వక మరిపింప చేయటం ఎందుకూ?

ఈడు వయసు పిల్లలకు సహజంగానే ‘అపోజిట్ సెక్స్’ పట్ల అంటే అబ్బాయిలకు అమ్మాయిలపై, అమ్మాయిలకు అబ్బాయిలపై కొంత ఆకర్షణ ఉండటం సహజం. దీనినే ప్రేమగా వారు భావిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఉన్నవారు అలాంటి దశలో నుండి వచ్చినవారే. చాలా సందర్భాల్లో ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. వయసు పెరిగే కొద్ది ఎవరికి వారే ఈ భ్రమల నుండి బయట పడతారు. అలా కాకుండా వయసుకు మించిన ప్రవర్తన, చేష్టలు ఉన్నప్పుడు కొంత కట్టడి చేయాల్సి ఉంటుంది. మరీ అంత సమస్యగా నిపుణుల దగ్గరకు కౌన్సిలింగ్ తీసుకు వెళ్ళమని సలహా ఇవ్వండి.


...................................................................................................................................

ఆడక: మా బాబు వయసు నాలుగేళ్ళు. చాలా తెలివిగలవాడు. చురుగ్గా ఉంటాడు. మాటల పుట్ట. కాకుంటే కొన్ని పదాలు సరిగ్గా పలకలేక జారవిడుస్తాడు. మాట్లాటేటప్పుడు నాలుకు మందం అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ‘ట’ ని ‘త’గా పలుకుతాడు. ‘అటక’ని ‘అతక’గా పలుకుతాడు. అలాగే ‘ర, డ’ అక్షరాలు, వాటి గుణింతాల పదాలను కూడా పలకలేడు. ‘ల’ని సగమే పలుకుతాడు. మా ప్రాంతంలో ఉన్న పిల్లల డాక్టరుకు చూపిస్తే వస్తాయిలే అని ‘మోంటాడ్’ అనే మందును రాసి ఇచ్చాడు. వాడుతున్నాం. అయినా ఉపయోగం లేదు. మా వాడి మాటలు విన్న కొందరు ఇది మామూలే, వయసుతో పాటు వస్తాయి అంటున్నారు. కొందరేమో స్పీచ్ థెరపీ ఇప్పించమంటున్నారు. మాకు సలహా ఇవ్వగలరు.

                                                                                                         - అనుపమ, శ్రీకాకుళం


బదులు: మీ అబ్బాయికి బహుశాః నాలుక కింద ఈనె (ఫ్రెన్యులం) లాగా ఉన్న భాగం మందంగా ఉండి అడుగు భాగానికి అతుక్కుపోయి ఉంటుంది. దీనివల్ల నాలుక పూర్తిగా అన్ని వైపులకు తిరగలేదు. ముఖ్యంగా అంగలికి నాలుకకు కొస తగలదు. దీన్ని ‘టంగ్ టై’ అంటారు. పైన మీరు చెప్పిన అక్షరాలు అన్ని నాలుక చివరను అంగిలికి అంటించి పలకాల్సినవి. ‘టంగ్ టై’ ఉన్న వారికి నాలుక కొస అంగిలికి అంటుకోనందువల్ల సరిగ్గా పలుకలేరు. మీ అబ్బాయిని ఒకసారి ‘సర్జన్’కి చూపించండి. అతుక్కున్న భాగానికి చిన్న గాటు పెట్టడం ద్వారా నాలుకను పూర్తిగా విడుదల చేస్తారు. ఇలా చేయగానే మాటలు బాగా వస్తాయి. ఒకవేళ డాక్టరు అలాంటిది ఏమీ లేదని చెబితే మీ పిల్లవాడు అలవాటుగా అలా మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు. అప్పుడు స్పీచ్ థెరపీ ఉపయోగపడుతుంది. బడికి పంపబోయేలోపల మాట సరిగ్గా పలకగలిగే విధంగా చెయ్యాలి. ‘మోంటాడ్’ మందును ఆపేయండి. దానవల్ల ఖర్చు తప్ప ఒరిగేది ఏమీ ఉండదు.

11 ఏప్రిల్ 2011 



No comments:

Post a Comment