Wednesday, October 20, 2010

పుట్టింది త్వరగా చావటానికా?


52 ఏళ్ళ సత్యమూర్తి ఓ కార్పొరేటు సంస్థకు సి.ఇ.వో. లక్షల్లో జీతం. కాలు బైట పెడితే కారు. తినటానికి వీలు లేకుండా చేతిలో ఫోను. క్షణం తీరిక ఉండదు. రాత్రి ఏ రెండుకో కాని పడుకోవటానికి వీలు కాదు. తెల్లారి ఐదు గంటలకు లేస్తే కూడా పనులు పూర్తికావు. అలాంటి సత్యమూర్తిని ఒకేసారి బీపీ, షుగరు కూడబలుక్కుని ఆవహించాయి. డాక్టరను కలిస్తే వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాక మందుల వాడకం ఒక్కటే చాలదనీ, ‘లైఫ్ స్టైల్ మాడిఫికేషన్’ తప్పనిసరి అని చెప్పాడు డాక్టరు. ‘‘అంటే ఏం చేయాలి డాక్టర్!’’ అమాయకంగా అడిగాడు. ఆహార నియమాలు పాటించటం, వ్యాయామం చేయటం, ఒత్తిడి తగ్గించుకోవటం, రిలాక్సు కావటం అని హెడ్డింగులు మాత్రమే చెప్పి వివరాలు అదే ఆసుపత్రిలో ఉన్న నిపుణులను కలవాలని చెప్పాడు.
                                ********************************

ఎందుకు మార్చు కోవాలి?
ప్రకృతిలో ప్రతి జీవ జాతికి వాటిదైన జీవన విధానం ఉంటుంది. ఏ జాతి జీవులైనా అవి ఉండే ప్రదేశం వేరుగా ఉండవచ్చు కానీ వాటి ప్రవర్తన ప్రకృతి ఆదేశించిన దానికన్నావేరుగా ఉండేందుకు అవకాశం లేదు. ఒక జాతి జీవులన్నీ ఒకే విధమైన ‘‘స్టీరియో టైపిక్’’ ప్రవర్తన కలిగి ఉంటాయి. అంటే మందలో ఏ జంతువును చూసినా వాటి మధ్య తేడా లేకుండా ఒకే రకమైన ప్రవర్తన కలిగి ఉంటాయి. వాటి చేతిలో లేని అంశాలలో తప్ప వాటికి అవిగా తమ ప్రవర్తనవల్ల జబ్బులు కొని తెచ్చుకోలేవు. కానీ మనుషుల ప్రవర్తన ఇతర జీవజాతుల్లాగా ఒకేరకమైన ప్రవర్తనని కలిగి ఉండదు. ఆ మాటకొస్తే ఏ ఇద్దరు మనుషుల ప్రవర్తన ఒక రకంగా ఉండదు. మిగతా సంగతుల్ని అలా వుంచితే ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి ప్రకృతి రూపకల్పన చేసిన శారీరక శ్రమ, తిండి, నిద్రలను విపరీతంగా దుర్వినియోగం చేయటంలో మనిషిది అందె వేసిన చెయ్యి. శరీరాన్ని ఎంతో కొంత కష్టపెట్టటం, అవసరం మేరకు తినటం, తగినంత సేపు నిద్రపోవటమనే సహజ ప్రవర్తనను ఎప్పుడు వదిలేస్తామో ఆ క్షణం నుండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం దురాశే అవుతుంది. 

చేయాల్సినవి చేయకపోవటానికి తోడు, రోగాలను కొని తెచ్చుకొనే ప్రవర్తనని కలిగి ఉండే వారికి ఆరోగ్యం దూరమవటానికి ప్రయత్నం చేస్తుంది. మచ్చుకు పొగతాగటం, మద్యం సేవించటం, మాదక ద్రవ్యాలు వాడటం, నిర్లక్ష్య ప్రవర్తనవల్ల జరిగే ప్రమాదాలు మొదలైనవి. 

ఏ కొద్దిమందికో తప్ప చాలా మందికి ఆరోగ్యంగా ఉన్నంతకాలం దాని విలువ తెలియదు. కొందరికి దెబ్బ తగిలినపుడు తెలుస్తుంది. ఇంకొందరికి తగిలినా తెలియదు.

ప్రతిదీ ఒక దానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్న నేటి జీవనంలో ఆరోగ్యాన్ని పాడుచేయటానికి కావాల్సినన్ని మనకు తెలియకుండానే మన చుట్టూ ముసురుకొని ఉంటాయి. మచ్చుకు గతంలో రోడ్డు వరకూ ‘నడిచి’పోయి బస్సు లేదా ఆటో ఎక్కి ఆఫీసుకు పోయే వారు ‘బైకు’ కొనగానే ఆ నడక కాస్తా దూరం అయి కూర్చుంటుంది. 
తెలివిగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడు కొనే విధంగా జీవన సరళిని మార్చుకోకపోతే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఆరోగ్యానికి సంబంధించి రెండు ప్రయోజనాల కోసం జీవన సరళిని మార్చు కోవాల్సి ఉంటుంది. మొదటిది వచ్చిన జబ్బును తగ్గించుకోవటానికి లేదా అదుపులో ఉంచుకోవటానికి సాధారణ జీవన సరళిని కాస్త మలుపు తిప్పి ప్రత్యేకమైన నడవడికను పాటించాల్సి ఉంటుంది. రెండోది జబ్బు లేక పోయినా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో భాగంగా జీవన సరళిని మార్చు కోవటం మరో పద్ధతి.

మచ్చుకు అన్నవాహికకు సంబంధించిన ‘పేగు పుండు’ ఉండేవారికి భోజనం చేసి పడుకుంటే ఉన్నట్టుండి తిన్న తిండి గొంతులోకి ఎగదన్నినట్టు ఉండి ఛాతిలో తీవ్రంగా నొప్పి మొదలై నిద్ర లేపేస్తుంది. లేచి కూర్చుంటే కాసేపటికి నొప్పి తగ్గుతుంది. పడుకుంటే మళ్లీ నొప్పి మొదలవుతుంది. రోగ తీవ్రతను బట్టి రాత్రంతా నిద్ర లేకుండా గడిపేవారు ఉన్నారు. ఇది ఒక రోజుతో పోయే జబ్బు కాదు.

మందుల వాడకానికి తోడు మసాలా తిండిని తగ్గించటం లేదా రాత్రిపూట మానేయడం, పొగ పూర్తిగా మానెయ్యటం, ఆల్కహాలు జోలికి పోకుండా ఉండటం, తాగినా రాత్రి వేళ తాగకుండా ఉండటం, పడుకోవటానికి కనీసం మూడు గంటల ముందు భోజనం చేయటం, మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవటం, పడుకొనే మంచాన్ని తలవైపున కనీసం అర అడుగు ఎత్తుగా ఉంచు కోవటం అవసరం. ఇది జబ్బును అదుపులో ఉంచు కొనేందుకు వీలుగా మార్చాల్సిన ‘జీవన సరళి’. పై సూత్రాలను పాటించకుండా ఎన్ని మందులు వాడినా జబ్బు అదుపు లోకి వచ్చే సమస్యే లేదు. ఈ సుత్ర్హాలను పాటించటంవల్ల మందుల జోలికి పోవాల్సిన అవసరం దాదాపు ఉండదు.

ఇలా అనేక జబ్బులకు జీవనసరళి మార్పు అవసరం అవుతుంది. ఏ జబ్బుకు ఏ విధంగా నడుచుకోవాలో డాక్టర్లు వివరిస్తారు. జబ్బు వచ్చాకే కాకుండా అనేక జబ్బులకు దూరంగా ఉండటానికి కొన్ని సాధారణ పద్ధతుల్ని పాటించటం అవసరం అవుతుంది.

అవసరం మేరకు తిండి
ప్రకృతిలో మనిషి తప్ప మిగిలిన జంతువులన్నీ అవసరం మేరకే తింటాయి తప్ప అంతకు మించి ఒక్క రవ్వ కూడా ఎక్కువ తినవు. కానీ మనిషి పరిస్థితి అలా కాదు. అవసరానికి మించి అదనంగా తినటంవల్ల ప్రధానంగా వచ్చే సమస్య ఊబకాయం. ఈ ఊబకాయం బీపీ, షుగరు, కీళ్ళవాతం, గుండె జబ్బుల్లాంటి అనేక రోగాలు రావటానికి నెలవుగా ఉంటుంది. ఒకసారి షుగరు వచ్చాక తిండి మీద అదుపు లేకుండా జబ్బును అదుపుచేసే సమస్యే లేదు. కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినే విధంగా తిండి అలవాట్లను మార్చుకోవాలి. అలా తినటం నాకు వీలు కాదు అంటే కుదరదు. జబ్బుకు తగ్గట్టు మనం పోవాలే కానీ మన ప్రకారం జబ్బు ఉండదు. దాని పని అది చేసుకుపోతుంది. ఉండాల్సిన బరువుకన్నా అధికంగా ఉన్న ప్రతి కేజీ బరువు వ్యక్తి నేలమీద ఉండాల్సిన రోజుల్ని తగ్గిస్తుంది.

రోజుకో గంట వ్యాయామం:
ఏ వస్తువును అయినా ఉపయోగించకుంటే అది పనికిరాకుండా పోతుంది. దీనికి శరీరం మినహాయింపేమీ కాదు. సోమరితనం అనేక జబ్బులకు నెలవుగా ఉంటుంది. ఇక్కడ సోమరితనం అంటే ప నిలేకుండా కూర్చో వటం అని మాత్రమే కాదు. ప్రతిదానికి యంత్రాలమీద ఆధార పడి ఒంటికి శ్రమ ఇవ్వక పోవటం. రవాణా సాధనాలు అందుబాటు లోకి రావటంతో నడక అరుదై పోతుంది. అర కిలోమీటరు దూరంలో ఉన్న ఆఫీసుకు సైతం ఇంటి ముందు బైకు కిక్కు కొట్టటం, ఆఫీసు ముందు ఆపటం, పోనీ దానికి ప్రత్యామ్నాయంగా పొద్దున ఓ గంట నడుస్తారా అంటే రాత్రి ఆలస్యంగా పడుకొని పొద్దున హడావుడిగా పనులు చక్క బెట్టుకోవటంతో తీరిక ఎక్కడిదీ? శరీర శ్రమ ఏ మేరకు తగ్గుతుందో ఆ మేరకు రోగాలు దగ్గరవుతూ ఉంటాయి. యాభై ఏళ్ళ వయసులో గుండె పోటుకు గురై చనిపోయిన వ్యక్తి రోజులో కొంత సేపు ఒంటిని శ్రమ పెట్టి ఉంటే మరో ఇరవై ఏళ్లు సజీవుడై ఉండేవాడు.

కంటి నిండా నిద్ర:
ఎనిమిది గంటల నిద్ర ప్రతివారికి చాలంటారు వైద్యులు. పరుగులు పెట్టించే నేటి సామాజిక జీవనానికి ఉన్న ఇరవై నాలుగు గంటలు చాలటంలేదు. కాబట్టి చేయ గలిగింది నిద్ర వేళల్లోకి చొరబడి ఆ సమయాన్ని దొంగిలించటం. లక్షల సంవత్సరాలుగా ప్రకృతి సహజంగా 12 గంటలుగా ఉన్న నిద్ర పారిశ్రామిక విప్లవం తరువాత అంటే మూడు వందల ఏళ్ళలో 8 గంటలకు కుదించుకు పోయింది.
ఇంత వేగంగా తగ్గిన నిద్రకు మనసు అలవాటు పడి తట్టు కోగలిగిందే కానీ, శరీరం సర్దుబాటు చేసు కోలేకుండా ఉంది. ఫలితంగా ఆరు, ఏడు పదుల్లో రావాల్సిన గుండె జబ్బులు, పక్షవాతం ఇపుడు ముందుకు జరిగి యాభైలోనే మనిషిని కుదిపేస్తున్నాయ. మరీ ఘోరం ఏమిటంటే గత పుష్కర కాలంలో పిల్లల్లో కార్పొరేటు విద్యవల్ల, పెద్దల్లో టీవీ, కంప్యూటరు వల్ల మరో రెండు గంటలు తగ్గి ఇప్పుడు సరాసరి నిద్ర ఆరు గంటలకు కుదించుకు పోయింది. ఎనిమిది గంటలకు తక్కువగా ఏ మేరకు నిద్ర తగ్గితే దానికి అనుగుణంగా జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. మచ్చుకు రోజుకు గంట నిద్ర తగ్గితే అరవై ఏళ్ళకు రావాల్సిన (కుటుంబ చరిత్ర ఉన్నపుడు) షుగరు యాభై ఏళ్ళకే వచ్చి కూర్చుంటుంది. రెండు గంటలు తగ్గితే నలభైకే సిద్ధం.

ఒత్తిడి నుండి ఊరట:
ఒత్తిడి సర్వాంతర్యామి. దానికి ఎంత దూరంగా ఉంటే అంతా, ఎంత ఎదుర్కొనే ఛావ ఉంటే అంతగా ఈ భూమీద ఉండ టానికి అవకాశం పెరుగుతుంది. ఒత్తిడికి గురైనపుడు విడుదల అయ్యే ‘ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్’ అనే క్యాటకాల అమైనులు, ‘కార్టిసాల్’ అనే హార్మోను అవసరానికి మించి విడుదల అయినపుడు శరీరంలో అవయవాల వయసును తగ్గిస్తాయి. నష్ట తీవ్రతను బట్టి తొంభై ఏళ్ళు పని చేయటానికి రూప కల్పన చేసిన గుండె అరవై ఏళ్ళకే చేతులెత్తేయవచ్చు. ఒత్తిడిని జయించ గలిగిన వారు ‘జీవన కాలాన్ని’ జయిస్తారు.
అలవాట్లు:
ఆరోగ్యం చెడి పోవటానికి ఏ అలవాట్లు అయితే పాటిస్తారో అవన్నీ వాటివైన నష్టాలను తెచ్చి పెడతాయి. పొగ తాగటం, మందు బిగించటం, మాదక ద్రవ్యాలు వాడటం, ఇవేకాదు దురుసుగా వాహనాలు నడపటం, దుడుకు ప్రవర్తన, హడావిడి పరుగులు, బాధ్యతా రాహిత్యం కూడా వ్యక్తి ‘జీవిత నాణ్యత’ను, ‘జీవితకాలాన్ని హరించి వేయ వచ్చు. 


Wednesday, October 13, 2010

బోడి(ఆరోగ్య) సలహాలతో జేబుకు బొక్క

ప్రపంచంలో కాణీ ఖర్చు లేకుండా దొరికేవి ఆరోగ్య సలహాలు. ఇచ్చేది డాక్టర్లు కాదండోయ్... డాక్టర్లు తప్ప మిగతా అందరూ. కావాలంటే మీకై మీరే ఈ విషయాన్ని పరీక్షించి తెలుసుకోవచ్చు.
పేపర్లో మీ పేరు చూసుకోవాలని ముచ్చట పడుతున్నారా! చాల సులభం. ఎలా అంటారా ఓ పెన్నూ, కాగితం తీసుకొని ఆరోగ్యం పైన మీ బుర్రకు ఏది తోస్తే అది రాయండి. అవి నిజామా కాదా అని మీరు ఆలోచించక్కర లేదు. మచ్చుకు ఇలా రాయవచ్చు 
  • నేరేడు కాయలు తింటే అరికాళ్ళకు మంచిది.
  • పసుపు, చింతపండు బాగా నూరి పాలల్లో కలుపుకొని తాగితే కళ్ళకింద నల్లమచ్చలుపోతాయి.
  • కాకరకాయ రసాన్ని బెల్లం వేసుకొని తాగితే పురుగులు (ఏం పురుగులో) చనిపోతాయి
ఇవన్నీ నిజం కాదు ఉత్తుత్తువే. రాసిన దాన్ని ఏదో ఒక పత్రికకు పంపండి. మీ పేరు అది ప్రింటు కావటం ఖాయం. మీరు ఏ పత్రిక తిరగేసిన ఆరోగ్య శీర్షికలలో యిలాంటి సలహాలు ఎన్ని కావాలంటే అన్ని కనిపిస్తాయి. ఎవరు చెబుతున్నారనే దానితో నిమిత్తం లేదు. ఎవరైనా చెప్పొచ్చు. ఏమైనా చెప్పొచ్చు. అది నిజమా కాదా అని రాసేవారు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్య సలహాలు అంటే అలానే ఉంటాయి మరి. మరో విషయాన్ని చూద్దాం 

‘‘నాకు తల విపరీతంగా తలనొప్పి పుడుతుంది’’ అని మాటల సందర్భంలో మీకు తెలిసిన ఓ పదిమంది దగ్గర అని చూడండి! వారిలో ఒక్కరంటే ఒక్కరు ఆ..హా.. అలాగా! అని గమ్మున ఉంటారేమో చూడండి!

‘‘అయ్యో! కాస్త టైగర్‌బామ్ పట్టించలేకపోయారా!’’ ఠక్కున అంటాడు తెలిసిన ఆయన.
‘‘డాక్టర్ భలేరావు. తలనొప్పికి భలే డాక్టరు. ఒకసారి చూపించకూడదూ?’’ పక్కింటాయన.
‘‘సిటీ స్కాన్ తీయించండి ఎందుకైనా మంచిది’’ సహ ఉద్యోగి. 
‘‘ధ్యానం చేస్తే తలనొప్పీ గిలనొప్పులు రావోయ్..’’ మరో స్నేహితుడు.
‘‘మిరియాల కషాయం రెండు పూట్లా తాగితే తలనొప్పి పోతుంది’’ పక్కింటి బామ్మ.
‘‘పని ఒత్తిడి ఎక్కువై ఉంటుంది’’ చుట్టం చూపుగా వచ్చిన బామ్మ.
‘‘ఊరికే ఇంగ్లీషు మందులు వాడొద్దు సార్... హోమియో మందులు ఇప్పించండి’’ పిల్లాడికి ట్యూషను చెప్పటానికి వచ్చిన మాస్టారు.
........ఇలా మీకు ఓపిక ఉండి అడుగుతూ పోవాలే గానీ, వచ్చిన సలహా మళ్ళీ రాకుండా ఎన్ని కావాలంటే అన్ని సలహాలు దొరుకుతాయి. వీరంతా కావాలనో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, మీ చేత ఖర్చుపెట్టించాలనో పథకం వేసుకొని మీకు సలహాలు ఇవ్వలేదు. అడిగినా అడక్కపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా, మీరు పాటించినా పాటించకపోయినా వారికి తోచింది చెబుతారు. చెప్పేటప్పుడు కాస్త కూడా ఆలోచించరు. అలవోకగా నోటి నుండి మాట వచ్చేస్తుంది.

రోగం, మందులు, వైద్యం, ఆసుపత్రి, డాక్టరు లాంటి ప్రస్తావన వచ్చిందంటే దానిపై అభిప్రాయం చెప్పకుండా, సలహా ఇవ్వకుండా ఉండనుగాక ఉండరు. చివరకు డాక్టరుకు బాగాలేక ఆసుపత్రిలో చేరినా చూడటానికి వచ్చే బంధు మిత్రులు ఏదో ఒక సలహా వదిలి పోతారు. ఆరోగ్యంమీద ఇచ్చే సలహా ఇలా ఉంటుంది మరి.

ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా లేదా ఇంట్లో వారికి బాగాలేకపోయినా ఉన్నంతలో ఎవరి స్థాయిలో వారు కాస్త మంచి వైద్యం చేయించాలని అనుకుంటారు. వారికి తెలిసినంతలో ఏదో ఒక విధమైన వైద్యాన్ని చేయించుకోను బైలుదేరుతారు. మధ్యలో ఎవరో దూరుతారు. ఏదో సలహా ఇస్తారు. అనుకున్నదాన్ని అనుకున్నట్టు జరగనీయరు. మిమ్మల్ని బలవంత పెట్టి కాదు. మీ బుర్రలో అనుమానపు తుట్టె కదిల్చి, ఫలానా డాక్టరు బాగా చూస్తారనే నమ్మకం మీకు ఉందనుకోండి. అక్కడికి పోదామని మీరు బైలుదేరుతారు. దారిలో కనపడ్డ మీ మిత్రుడు ‘‘చ చ్ఛా ఆ డాక్టరా? పరమ వేస్టు’ అంటాడు. అసలే ఆరోగ్యం. ఆపై అనుమానం ఒకటి! అక్కడికి మీ పని అయిపోయింది. అతను నిజంగా మంచి డాక్టరు అయినా మీరు దారి మార్చక తప్పని పరిస్థితిని కల్పిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి పోదామని బైలుదేరితే ‘‘ప్రభుత్వ ఆసుపత్రికా?’’ అని దీర్ఘం తీస్తాడు ఓ తెలిసిన బంధువు. దాంతో వాటంతట అవే తెలియకుండా ప్రయివేటు డాక్టరు వైపు లాగుతాయి కాళ్ళు. సలహా ఇచ్చిన దానయ్యకి ఇక్కడ పోయేది ఏమీ లేదు. సలహా పాటించినందుకు తక్కువలో తక్కువ అంటే ఓ నాలుగు వందలు వదిలాయి. అంతే.
మీరు ఒక డాక్టరు దగ్గర వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పటికి బాగానే ఉంది. పూర్తిగా తగ్గటానికి మరో నాలుగు నెలలు మందులు వాడాలని చెప్పాడు వైద్యం చేస్తున్న డాక్టరు. ఆ విషయం తెలిసిన ఒకాయన ‘‘ఎందుకైనా మంచిది ఒకసారి ఫలానా స్పెషాలిటీ ఆసుపత్రిలో చూపించకూడదూ?’’ అని (ఉచిత) సలహా పడేసి మాయమైపోతాడు. అది అది మనసులో దూరినప్పటినుండి జరుగుతున్న వైద్యం మీద నమ్మకం సడలుతుంది. డబ్బులు పోగేసుకొని పెద్ద ఊరికి వెళ్ళి కార్పొరేటు ఆసుపత్రిలో చూపించుకుంటారు. ఫీజులు, పరీక్షలు, ఖర్చులు మొత్తం కలిసి ఓ యాభై వేలు అయింది. చివరకు తేలింది ఏమిటంటే మొదటి డాక్టరు రాసిన మందులే పేర్లు మార్చి రాసి, మరో నాలుగు నెలలు వైద్యం చేయాలి కాబట్టి నెలనెలా రమ్మని సున్నితంగా చెప్పి పంపాడు.
ప్రతినెలా ఎక్కడ పోతావులే అని మళ్లీ పాత డాక్టరు దగ్గరకు పోతే, ‘‘అంటే నా మీద నమ్మకం లేదన్నమాట!’’ అని ఇక నుండి తేడగా చూస్తాడు. ఇపుడు మీరు ఆ డాక్టరు దృష్టిలో అవకాశవాది. మిమ్మల్ని ప్రతిసారీ అనుమానంగా చూస్తాడు ఫలితం మీరు ఎప్పుడు డాక్టరు దగ్గరకు పోయినా కాస్త ఎక్కువే ఖర్చుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీ అదృష్టం ఏమిటంటే ఆ విషయం మీకు తెలియకపోవటం. దీనంతటికీ కారణం ఇతరులు ఇచ్చిన ఉచిత సలహా. దాన్ని పరిశీలించకుండా అమలు పరిచినందుకు చెల్లించిన జరిమాన. ఇక్కడ సలహా ఇచ్చిన వాడికి పోయేది ఏమీ ఉండదు. పైగా సలహా ఇచ్చినవాడికి ఫలానా సలహా ఇచ్చానన్న సంగతే గుర్తుండదు. ఆలోచించకుండా వచ్చిన డయలాగే కదా!
కొత్తగా పెళ్లయిన ఓ సాఫ్టువేరు ఇంజనీరుకు పెళ్లాంమీద అనుమానం. ఇది పెద్ద గొడవకు దారితీసింది. మానసిక వైద్యుల దగ్గరకు పోతే ఇది ‘పారానాయిడ్ స్కిజోఫ్రెనియా’ అని వైద్యం మొదలుపెట్టారు. భార్య కూడా సహకరించింది. నెలకంతా బాగయ్యాడు. అయినప్పటికీ రెండేళ్ళు మందులు వాడాలని డాక్టర్లు సూచించారు. తిరిగి ఉద్యోగంలో చేరాడు. ఇక్కడివరకూ బాగనే వుంది.
మానసిక వైద్యుల దగ్గర మందులువాడితే మెదడు పాడైపోతుందని పక్క సాఫ్టువేరు అడగకుండానే ఓ ఉచిత సలహా వదిలాడు. కావాలని కాదు అనాలోచితంగానే. అసలే అనుమానపు రోగం, ఇంకేముందీ? దాన్నినమ్మి మందులు మానేశాడు. ఇపుడు అనుమానపడటం లేదు కదా అని భార్య కూడా మందులు ఆపినందుకు పెద్దగా పట్టించుకోలేదు. ఆరు నెలలు గడిచింది మళ్లీ అనుమానం మొదలైంది. ఇంతకుముందు భార్యనే అనుమానించిన వ్యక్తి ఇపుడు ప్రతిదానికి ఇతరులను అనుమానిస్తున్నాడు. మందులు వాడకానికి సుముఖంగా లేడు. కారణం ఏమిటంటే ఆ జబ్బుతో బాధపడేవారికి తనలో జబ్బు ఉన్నట్టు గుర్తించలేరు. అందువల్ల మందులు వాడాల్సిన పనేముందని వాదనకు దిగుతారు. జబ్బు కాస్త ముదిరింది. ఉద్యోగం పోయింది. కుటుంబాన్ని పట్టించుకోవటం మానేశాడు. తనలో తానే మాట్లాడుకుంటూ ఇంట్లోనంచి బైటకు కదలటంలేదు. ఇలాంటి మొగుడితో జీవితాంతం వేగలేనని పెళ్లాం విడాకుల కోసం కోర్టుకు ఎక్కింది. పైసా ఖర్చులేని వైద్య సలహాల ప్రభావం ఇలా ఉంటుంది.

ఉచిత సలహాలవల్ల చాలామంది మధ్యలో మందులు మానేస్తారు. రోగాలు ముదరటానికి కారణం అవుతాయి. అనవసరంగా డాక్టర్లను, ఆసుపత్రులను మార్చటం ఖర్చు తడిచి మోపెడు అవుతుంది. అడగకుండా ఇచ్చిన సలహాలు పాటించడంవల్ల పాటించే వారకి నష్టం జరగడంతోపాటు సలహా ఇచ్చేవారికి కూడా ఇబ్బందే. మీ సలహాతో మంచి జరిగితే దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. మహా అంటే "థాంక్స్" చెబుతారు. కానీ చెడు జరిగిందో సలహా ఇచ్చివారిని బండబూతులు తిడతారు
ఇన్ని ఇబ్బందులు వున్నాయి కాబట్టే పక్క వారికి వైద్య సలహాలు ఇవ్వటం లోనూ, తీసుకోవటంలోనూ కొన్ని జాగర్తలు తీసుకోవాలి. అలాంటి జాగర్తలు కొన్ని:
  1. వైద్యం ఓ పెద్ద మయా సముద్రం. దీన్ని గురించి డాక్టర్లకే పూర్తిగా అవగాహన ఉండదు. కాబట్టి సలహా ఇచ్చే వారికి ఏమీ తెలియదనుకోవాలి 
  2. సలహా ఇచ్చ్హేవారు ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా, ఎంత చదువుకున్నా వారు ఇచ్చే సలహాలో వారి నమ్మకాలు కలిసి ఉంటాయి. అవి మీకు పనికిరాక పోవచ్చు 
  3. సలహా సరైనది కాకపొతే రోగం ముదరవచ్చు, వికలాంగులు కావచ్చు, డబ్బులు వదలవచ్చు, బాధను భరించాల్సి రావచ్చు, కాలం కలిసిరాకపోతే చివరకు ప్రాణం మీదకు రావచ్చు అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి.
  4. అడగకుండా ఎవరికీ వైద్య సలహాలు ఇవ్వకండి. అలాగే అడగకుండా ఇచ్చే సలహాలను చెవిన వేసుకోవద్దు 
  5. మిమ్మల్ని ఎవరైనా సలహా అడిగితే మీకు బాగా తెలిస్తేనే ఇవ్వండి. అడిగారు కదా అని నోటికి వచ్చింది చెప్పకండి. తెలియదని చెబితే మిమ్మల్ని ఎవరూ కొట్టరు. తెలియకుండా చెబితే అవతలి వారికి నష్టం.
  6. మంచి డాక్టరు గురించి, మంచి ఆసుపత్రి గురించి నలుగురికి చెప్పటంలో తప్పు లేదు. అలా అని మీరు  పి. ఆర్. ఓ, అవతారం పోషించకండి. సూచనప్రయంగానే చెప్పి, "మీరు కుడా విచారించుకోండి" అని చెప్పండి. 
  7. ఇతరుల సలహా మేరకు డాక్టర్లను, ఆసుపత్రిని మార్చవద్దు. మార్చే ప్రతి సందర్భంలోనూ డబ్బులు ఖర్చు కాక తప్పదు. చేసిన పరీక్షలే మళ్లీ మళ్లీ చేయకా తప్పదు.
  8. ఇతరుల సలహా పాటించబోయే ముందు దాన్ని గురించి కొంత ఆలోచించండి. జరగబోయే మేలుతోపాటు ఖర్చు, పడబోయే ఇబ్బందులు, (పెద్ద ఊర్లలో ఉండే ఆసుపత్రులకు పోయినప్పుడు ఫీజులు, వసతి, ప్రయాణం, తోడు ఉండేవారు, వీటన్నింటికి అయ్యే ఖర్చులు) బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి.
  9. శాస్త్రీయంగా పస లేని సలహాలను "జోక్"గా తీసుకోవాలి. మచ్చుకు తయత్తు కట్టించమనటం, పసరు పోయించమనటం, పట్టు వేయించమనటం లాంటివి. 
  10. ఎవరైనా మంచి సలహా ఇచ్చారనిపించినా ఆ విషయాన్ని మీ కుటుంబ డాక్టరుతో చర్చించండి 
  11. జబ్బును బట్టి, తీవ్రతనుబట్టి, రోగిని బట్టి, కట్టుకోగల డబ్బును బట్టి వైద్యం మారుతూ ఉంటుంది. మీకు సరిపోయిన వైద్యం మరొకరికి సరిపోక పోవచ్చు. అలాగే మీ అనుభవాలు ఇతరులకు పనికిరాక పోవచ్చు.
  12. మీ ప్రాంతంలో ఉండే నాటు వైద్యులు (వీరినే ఆరెంపి, పిఎంపి లని అంటారు) ఇచే సలహాలు మిడి మిడి జ్ఞానంతో ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి 
  13. వైద్య సలహాలు ఇవ్వటానికి అర్హత పొందిన డాక్టర్లు ఉన్నారు. వారి దగ్గర వైద్యం చేయించుకోవటానికే కాదు. సలహా కోసం కూడా సంప్రదించ వచ్చు. సలహా పొందినందుకు ఫీజు చెల్లించటం మరచిపోవద్దు.