Wednesday, December 8, 2010

సెక్సులో ధాతు పుష్టిని పెంచే మందులు!


ప్రశ్న: లైంగిక శక్తి కోసం ధాతుపుష్టి పెరగటానికి అని నాలుగువేలు పెట్టి ఏదో తైలం కొన్నాడు నా మిత్రుడు. మొదటిరోజు కొంతపని చేసిందట. ఆ తరువాత ఉపయోగం లేదని అంటున్నాడు. అసలు ధాతుపుష్టి పెరగడానికి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎక్కడ దొరుకుతాయి                                        - కె. కృపాకర్, ఏలూరు
మాధానం:  మీ మిత్రుడు లాంటి వారు ఉన్నంత కాలం అలాంటి ధాతుపుష్టి మందులు దొరుకుతూనే ఉంటాయి. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అధునాతన మెడికలు షాపుల నుండి నాటు మందులు అమ్మే దుకాణాలలో ఎక్కడయినా దొరుకుతాయి. ఇక అవి పనిచేయటం అంటారా? అద్భుతంగా పనిచేస్తాయి. కాకుంటే మీ మిత్రుడులాంటి వారి ధాతుపుష్టికి కాదు. అమ్మినవాడి ఆర్థిక పుష్టికి. 
     లైంగికతలో మనసు, శరీరం సమన్వయంతో పని చేయాలి. ఈ రెంటిలో లోపంలేకుండా ఉంటే మనిషిలో పుట్టే ‘ఆలోచనే’ లైంగిక ధాతువుగా పనిచేస్తుంది. శరీరం బాగుండి మనసు ఒత్తిడి, దిగులు, అలజడి, సైకొసిసులాంటి ఇబ్బందుల్లో ఉన్నా, మనసు బాగుండి శరీరంలో (హార్మోనులు, నరాలు, రక్తనాళాలలో) లోపం ఉన్నా లైంగిక ఇబ్బందులు వస్తాయి. అందుకు కారణాలను గుర్తించి వాటిని సరిచేస్తే సమస్య తీరుతుంది. ఎవరు ఏది చెబితే వాటిని గుడ్డిగా అనుసరిస్తే నష్టపోక తప్పదు. లైంగికతను పెంచే ధాతువులు ఏమీ లేవు. ప్రస్తుతం లేపుడు మాత్రంగా వాడే ‘సిల్డెనాఫిల్’ కూడా అంగంలో మూసుకుపోయిన నెత్తురు గొట్టాలను తాత్కాలికంగా వెడల్పు చేసి అప్పటికప్పుడు పని జరిగేట్టు ఉపయోగపడతాయి.
ప్రశ్న: మా అమ్మాయి వయసు 21 సంవత్సరాలు. మూడేళ్ళ ముందు వరకూ చదువుల్లో బాగా ఉండేది. చలాకీగా అందరితో కలుపుగోలుగా ఉండేది. పాప ప్రవర్తన రాను రానూ ఘోరంగా తయారౌతోంది. ఎవరినీ కలవటానికి ఇష్టపడటం లేదు. తనకు తానుగా ఏ పనీ చేయదు. ప్రతీ పనికీ నెట్టాల్సిందే. అరచి గోల చేస్తే కదులుతుంది. బలవంతంగా చేయించానా నిదానంగా చేస్తుంది. పని చేస్తూ అలాగే కూర్చొండి పోతుంది. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. స్నానం గంటలకొద్ది చేస్తుంది. ఎప్పుడూ తనలో తానే ఏదో ఆలోచించుకుంటున్నట్లు ఉంటుంది. నేరుగా మనవైపు చూసి మాట్లాడదు. అప్పుడప్పుడూ తనలోతానే మాట్లాడుకోవటం, నవ్వుకోవటం చేస్తుంది. కాలేజీ చదువు దాదాపు మానేసినట్టే. చెప్పీ, చెప్పీ మాకు విసుగు వస్తోంది. ఆసుపత్రికి రమ్మంటే రాదు. నేను బాగానే ఉన్నాను. రాను అంటుంది. మా బంధువులు యోగా, మెడిటేషన్ చేయిస్తే తగ్గుతుందని చెబుతున్నారు. అలా చేయించడానికి కూడా వీలు కావటం లేదు. ఏమీ చేయాలో తోచటం లేదు.                                         - ఈ మెయిలు ద్వారా ఓ తండ్రి

సమాధానం: మీరు రాసిన లక్షణాలను బట్టి మీ అమ్మాయికి ‘కెటటానిక్ స్కిజో ఫ్రెనియా’ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మనిషికి వచ్చే మానసిక వ్యాధుల్లో ఇది తీవ్రమయిన దానికందే లెక్క. ఈ జబ్బు మొదలయినప్పటి నుండి చాపకింద నీరులా తెలియకుండానే ముదురు దశకు వస్తుంది. జబ్బు పెరిగే కొద్ది వ్యక్తిత్వాన్ని (Personality), గుర్తింపు(Identity)ని దెబ్బతీస్తుంది. సమాజంలో భాగంగా ఉండాల్సిన వారు సమాజంతో సంబంధం లేకుండా వారిదయిన ప్రపంచంలో బతుకుతారు. దీనివల్ల, విద్యా, ఉపాధి, వైవాహిక తదితర మానవ సంబంధాలలో వారి పాత్రను పోషించలేరు. జబ్బు తీవ్రత పెరిగే కొద్ది జీవచ్ఛంలా మారిపోతారు. మీ అమ్మాయి విషయంలో ఇప్పటికే కొంత ఆలస్యం జరిగింది. త్వరగా మానసిక వైద్యుల దగ్గర వైద్యం చేయించండి. మందులు వాడటం తప్పనిసరి. మీరు చేయించే వైద్యాన్ని బట్టి మూడు, నాలుగు నెలల్లో కొంత మెరుగు కనిపిస్తుంది. మెరుగు అయింది కదా అని మందులు ఆపకూడదు. సుమారు రెండేళ్ళపాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఈ జబ్బుకు  యోగా, మెడిటేషన్ లాంటి ప్రక్రియలు కాలయాపనకు తప్ప పనికిరావు. మొదట మందులు వాడటం ఒక్కటే పరిష్కారం. ఆ తరువాత ఆమెను సమాజంలో కలపటానికీ, జబ్బు పెరగకుండా ఉండటానికి పునరావాస చికిత్స అవసరం అవుతుంది. అవన్నీ వైద్యం చేసే డాక్టరు చూసుకుంటారు.

ప్రశ్న: మా అబ్బాయి టెన్త్ ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. టెన్త్ ఇంట్లో ఉండే చదివాడు. ఇప్పుడు ఇంటర్ ఫస్టియిర్ బైపీసీ శ్రీ చైతన్యలో చేర్పించాము. చేరినప్పటి నుండి వాడికి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. తరచూ తలనొప్పి వస్తుంది. చదవాలంటే ఏకాగ్రత కుదరటం లేదని చెబుతున్నాడు. క్లాసులో తూగు  వస్తుందని, పాఠాలు అర్థం కావటం లేదని అంటున్నాడు. ఈ రెండేళ్ళూ ఎలాగో కష్టపడి చదివి ఎంసెట్‌లో ర్యాంకు తెచ్చుకోమని నచ్చజెప్పాము. ఇప్పుడు అసలు నేను చదవనే చదవనని మొండికేస్తున్నాడు. ఇంటికి వచ్చేస్తానని ఒకటే గొడవ. వాడిని డాక్టర్‌ని చేయాలని మా కోరిక. కౌన్సిలింగు ఇప్పిస్తే ఉపయోగం ఉంటుందా?                                               - వి. రమణారెడ్డి, మదనపల్లె

సమాధానం: కౌన్సిలింగు తప్పకుండా ఉపయోగపడుతుంది,కాకుంటే కౌన్సిలింగు చెయ్యాల్సిందే. పిల్లవాడికి కాదు. ప్రధానంగా తల్లిదండ్రులకు. పిల్లల చదువులో వారి శక్తి సామర్థ్యాలు చదువుపట్ల వారికి ఉండే ఆసక్తి, తగిన వాతావరణం ఈ మూడు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ మూడు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే తల్లిదండ్రులు సమకూర్చే వనరులు (మరో మాటలో డబ్బు) అదనపు పాత్ర పోషిస్తుంది. కానీ ఇప్పటి చదువుల్లో ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. కేవలం డబ్బు ఉంది కాబట్టి కార్పొరేటు సంస్థల్లో చేర్పిస్తే ఇవి రావు. ఇప్పటి కాలంలో పదో తరగతిలో మంచి మార్కులు వచ్చినంత మాత్రాన పిల్లవాడికి నిజంగా సామర్థ్యం ఉండాలన్న రూలేం లేదు. కారణం ఏమిటంటే దాదాపు కార్పొరేటు బడులన్నీ పిల్లల మానసిక సామర్థ్యాన్ని పట్టించుకోకుండా కేవలం వారిలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఉపయోగించి మార్కుల రూపంలోకి మారుస్తున్నాయి. దీనివల్ల నిజంగా సామర్థ్యం ఉన్న పిల్లలకు పోయేది ఏమీ లేదు కానీ లేని పిల్లలు ఉన్నత చదువులకు పోయేకొద్ది చదువు భారంగా మారి మానసిక సమస్యలు తలెత్తుతాయి. మీ అబ్బాయికి పై చదువుకి సామర్థ్యం ఎంత ఉందనేది మంచి క్లినికల్ సైకాలజిస్టు దగ్గర అంచనా వేయించండి. అలాగే పిల్లవాడికి మీరు చదివించదలచుకున్న చదువుపై ఆసక్తి ఉందో లేదో కనుక్కోండి. ఈ రెండింటిలో ఇబ్బంది లేకపోతే చదువు వాతావరణం కారణం అయి ఉంటుంది.
         దాదాపు కార్పొరేటు విద్యా సంస్థలన్నింటిలో పిల్లలకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఈ సంస్థలు పిల్లల మానసిక, శారీరక ఉల్లాసానికి దాదాపు సమాధి కడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల నిద్రను దారుణంగా దోపిడీ చేస్తాయి. మీ అబ్బాయి వయసుకు రోజుకు తొమ్మిది గంటల నిద్ర కావాలి. కానీ కార్పొరేటు కాలేజీలలో పిల్లల్ని నిద్ర పోనిచ్చేది కేవలం 5 లేదా 6 గంటలే. తగ్గిన ఆ మూడు గంటల నిద్రవల్ల కూడా మీ అబ్బాయికి మీరు చెప్పిన లక్షణాలు రావొచ్చు. మీ అబ్బాయిని ఒకసారి క్లినికల్ సైకాలజిస్టు దగ్గర చూపించి, వారి సలహా పాటించండి.


ఇవి 8 - 12 - 2010 ఆంధ్రభూమి దిన పత్రికలో ఇచ్చిన "సందేహాలు - సమాధానాలు" మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా dr.teja @ymail.com  


No comments:

Post a Comment