Wednesday, December 1, 2010

కొలెస్టరాలుతో కొందరికే చిక్కు

ప్రసాద రావుకి 40 నిండాయి. ఇప్పటి వరకూ ఎలాంటి అనారోగ్యమూ లేదు. పత్రికలలో ఆరోగ్య శీర్షికలు చదవటం అలవాటు. ‘‘40 దాటాక ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది’’ అనే విషయం ఎక్కడ చదివాడో కానీ బుర్రలోకి దూరింది. ఒక డాక్టర్ని కలిసి, ఓ అయిదు వేలు ఖర్చు పెట్టి మొత్తం పరీక్షలు చేయించు కున్నాడు. అదృష్టవశాత్తు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రక్తంలో పిసరంత కొలెస్టరాలు ఎక్కువగా ఉందని తేలింది. అసలే ఆనంద రావుకి ఆరోగ్యం పట్ల కాస్త జాగర్త ఎక్కువ. పైగా పత్రికలలో ఆరోగ్య శీర్షికలు చదివే అలవాటు. దీనికి తోడు పరీక్షలు చేయించిన డాక్టరు కాస్త ‘కొలెస్టరాలు’ ఉండే ఆహారం తగ్గించమని చెవిలో వేశాడు. ఇంకేముందీ! ఆగమేఘాల మీద ఏయే పదార్థాలలో కొలెస్టరాలు ఉంటుందో లిస్టు సేకరించటం మొదలయింది. టీవీ ప్రకటనల్లో ‘మా కంపెనీ నూనెలో జీరో కొలెస్టరాలు’’ అన్న బ్రాండుల నూనెని మాత్రమే కొనుమని భార్యకు హుకుం జారీ చేశాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ప్రసాద రావుకి కొలెస్టరాలు ఫోబియా పట్టుకుంది.
            *************************************************                                  *************************

ప్రసాద రావుది కాస్త అతిశయోక్తి ‘స్టోరీ’ అనుకున్నా ఆరోగ్యం పట్ల అంతో ఇంతో శ్రద్ధ తీసు కునే వారిలో పత్రికలలో ఆరోగ్య శీర్షికలు చదివే వారిలో, ‘సరుకు’ లేకుండా పత్రికల్లో శీర్షికలు రాసే వారిలో (అందులో డాక్టర్లు, తిండి నిపుణులు కూడా ఉండ వచ్చు) కొలెస్టరాలు వ్యవహారం ఓ పెద్ద భూతంలా పరిగణిస్తారు. నిజానికి కొలెస్టరాలు గురించి పూర్తిగా తెలుసు కుంటే దానికి అంత ‘సీను’ లేదని తేట తెల్లమవుతుంది.

కొలెస్టరాలు మన శరీరంలో చాలా ముఖ్యమయిన కీలక జీవన క్రియలను పోషిస్తోంది. పైత్య రసం తయారు కావటానికీ, వైటమిను-డి తయారీకి, మరికొన్ని హార్మోనులు (ప్రాజెస్టరాను, గ్లూకో కార్డికాయిడు, అండ్రోజను, ఈస్ట్రోజను, మినరలో కార్టికాయడు) తయారు కావటానికి కొలెస్టరాలు కావాలి. వాటి తయారీలో ఇది ముడి సరుకుగా ఉపయోగ పడుతుంది. అంతటి ప్రాధాన్యత ఉన్నా ఈ కొలెస్టరాలు శరీరానికి రెండు రకాలుగా అందుతుంది.
శరీరానికి అవసరమయిన కొలెస్టరాలులో దాదాపు మూడో వంతు శరీరం తయారు చేసు కోగా మిగిలిన పావు వంతు తిండి ద్వారా అందుతుంది. అయితే ఇందులో మరో వెసులుబాటు కూడా ఉంటుంది. మన ఆహారంలో అసలు కొలెస్టరాలే లేక పోతే అవసరమయిన మొత్తాన్ని శరీరమే దానంత అదే తయారు చేసుకుంటుంది. మన తిండిలో ఎక్కువ కొలెస్టరాలు ఉంటే ఆ మేరకు శరీరం తన తయారీని తగ్గించు కుంటుంది. కాబట్టి మనం తిన్నా, తినక పోయినా దాని అదుపులో అది ఉంటుంది. అంటే కొలెస్టరాలు ‘సొంత అదుపు’ (Auto regulation) మన శరీరం లోనే ఉంటుంధి. కాబట్టి సాధారణ జనం కొలెస్టరాలును అదుపులో ఉంచు కొనే నియమాలేవీ పాటించాల్సిన అవసరం లేదు. చాలా మంది ఆరోగ్యం  పట్ల అదనపు జాగర్త తీసు కోవాలన్న నెపంతో ‘అది తింటే కొలెస్టరాలు, ఇది తింటే కొలెస్టరాలు’ అని అతి జాగర్తలకు పోతారు. అలాంటివేమీ అవసరం లేదు. వయసుతో నిమిత్తం లేకుండా సాధారణ జనం అన్నీ హాయిగా తిన వచ్చు.

అయితే పైన చెప్పిన నీతులు చాలా కొద్ది మందికి వర్తించవు. వీరిలో కొలెస్టరాలను అదుపులో ఉంచే ‘మర’లో లోపం రావటం వల్ల శరీరంలో కొలెస్టరాలు నిలువలు ఎక్కువగా పేరుకు పోతాయి. రక్తంలో '‘ఉండాల్సినంత కొలెస్టరాలు ఉంది. ఇక మీ తయారీని ఆపండి’' అని కొలెస్టరాలును తయారు చేసే అవయవాల చెవిన వేసే ఎంజైములు లోపించటం వల్ల వాటికి తిరుగు సమాచారం (Feed back) లేక అవి తయారు చేస్తూనే ఉంటాయి. 

మరి కొందరిలో కొలెస్టరాలును వివిధ అవసరాలకు మళ్ళించాల్సిన ఎంజయములు పుట్టుక తోనే లోపించటం వల్ల అది ఖర్చు కాకుండా నిలువలుగా పేరుకు పోతాయి. సాధారణంగా ఈ రెండు లోపాలు వంశపారంపర్యంగా వస్తాయి.

గుండె జబ్బు, పక్షవాతం లాంటి అనేక జబ్బులు రావటానికి ‘రక్త నాళాలు గట్టి పడటం’ (Atherosclerosis) ఒక ప్రధాన కారణం. రక్త నాళాలు గట్టి పడటానికి బీపీ, షుగరు, ఊబకాయం, సోమరి జీవితం, వ్యాయామం లేక పోవటం, మానసిక ఒత్తిడి, పొగ తాగటం అనే ‘పాలయ్యే కారణాలు (Risk factors) ఉండే వారికి ఎక్కువగా జరుగుతుంది. వీటిలో విడివిడిగా దేనికి అదే పాలుబడే కారణంగా పని చేస్తాయి. వ్యక్తిలో పాలయ్యే కారణాలు  పెరిగే కొద్ది ఎక్కువగా ఉన్న కొలెస్టరాలు కూడా రక్త నాళాలు గట్టి పడ టానికి ఉడుత సాయం చేస్తుంది. కొలెస్టరాలు నిలువలు మరీ ఎక్కువ అయినప్పుడు అవి రక్తం లోనే కాకుండా శరీరంలో అక్కడక్కడా పేరుకు పోతాయి.

కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే మామూలు వ్యక్తులు కేవలం కొలెస్టరాలు పెరుగుతుందనే నెపంతో తినాల్సిన వాటిని త్యాగించాల్సిన అవసరం లేదు. వారసత్వపు కొలెస్టరాలు జబ్బు ఉండే వారిని మినహాయిస్తే సాధారణ జనానికి కొలెస్టరాలు పెరిగే అవకాశం లేదు. ఎప్పుడయినా ఒకసారి రక్తంలో కొలెస్టరాలు ఎక్కువ అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. సాధారణంగా అది తప్పుడు రిపోర్టు అయి ఉంటుంది. అనుమానం వస్తే తూకం బాగుండే (Standard Lab) దగ్గర ఒకటికి రెండు సార్లు పరీక్ష చేయించండి.

ఎప్పుడూ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ కొలెస్టరాలు ఉన్నప్పుడు కూడా దానికి మందులు వాడటం మంచిది కాదు. దాన్ని తగ్గించ టానికి కూడా ఒక జీవన సరళి ఉంది. అలాంటి జీవన సరళి పాటించాక కూడా అదుపు లోకి రాక పోతే, రక్త నాళాలు గట్టి పడ టానికి మిగిలిన పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు, మలి ప్రయత్నంలో భాగం గానే మందులు వాడాలి. అధికంగా కొలెస్టరాలు ఉన్న వారు దాన్ని తగ్గించు కోవటానికి మార్చు కోవాల్సిన జీవన సరళి ఇలా ఉండాలి.
 • పైత్య రసం తయారీకి అధిక మొత్తంలో కొలెస్టరాలు కావాలి. ఎంత ఎక్కువ పైత్యరసం తయారయితే అంత ఎక్కువగా కొలెస్టరాలు ఖర్చు అయిపోతుంది. పీచు పదార్థాలు ఎంత ఎక్కువగా తింటే, అంత ఎక్కువ పైత్యరసం తయారవుతుంది. మల్ల బద్దకం తగ్గటం, బరువు తగ్గటం, ఇందులో మీరు వద్దనుకున్నా వచ్చే అదనపు బహుమతి.
 • వ్యాయామం ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా కొలెస్టరాలు తగ్గుతుంది. బీపీ తగ్గటం, షుగరు అదుపులో ఉండటం, బరువు తగ్గటం, చలాకీగా ఉండటం అదనపు ప్రయోజనాలు.
 • ఎవరికయినా తినే తిండి మొత్తంలో కొవ్వు లేదా నూనెలు 30 శాతం ఉండాలి. అంతకు మించి ఎంత ఎక్కువ కొవ్వు లేదా నూనెల వాడకం పెరిగితే అంత ఎక్కువగా కొలెస్టరాలు పెరుగుతుంది. లావు కావటం వద్దనుకున్నా వచ్చే అదనపు నష్టం.
 • ఊబకాయం, సోమరితనం, చక్కెర జబ్బు కొలెస్టరాలును పెంచుతాయి. వాటిని తరిమిస్తే కొలెస్టరాలు కూడా పరారు అవుతుంది.
 • ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా కొలెస్టరాలును తగ్గిస్తాయి. వీటిని వాడటం వల్ల నష్టం అయితే ఏమీ లేదు.
 • కొలెస్టరాలు తగ్గ టానికి వాడే మందులు అన్నీ చాలా చెడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. జీవన సరళిని మార్చటం ద్వారా కూడా అదుపులో లేక పోతే అప్పుడు మాత్రమే డాక్టర్లు మందులు రాయాలి. రోగులు వేసు కోవాలి.  ఈ సంగతి ఎప్పుడూ గుర్తుంచు కోండి.


5 comments:

 1. శ్రీనివాస తేజ గారు.. చాలా మంచి టపా. మంచి ఉద్ధేశ్యంతో మొదలు పెట్టారు బ్లాగు. అభినందించదగ్గ విషయం. అదే చేత్తో లావు ఎలా అవ్వాలి అన్న విషయంపై ఒక టపా రాసేద్దురూ..;)

  ReplyDelete
 2. థాంక్స్.. మీ టపా కొన్ని అపోహలు తొలగించింది..

  ReplyDelete
 3. sir
  my age is 40-male in i recently did my blood tests and received the report regarding cholesterol as below
  TOTAL CHOLESTEROL 256
  HDL 54,LDL 169,TRIGLYCERIDES 165
  i just did it in a lab without doctors priscription
  is the above levels confortable or not
  pls give me advice

  ReplyDelete
 4. మంచి విషయాలు అందరికీ అర్ధమయ్యేలా చాలాబాగా రాస్తున్నారండి. Thanks for the information.

  ReplyDelete
 5. ఈ పోస్ట్‌ చాలా బాగుంది తేజ.
  నిజంగానే కొలెస్ట్రాల్‌ అనగానే దాన్నో భూతంలా చూపించేస్తుంటారు.
  ఈ ఆర్టికల్‌ ఎక్కువమంది చదివితే బాగుంటుంది.
  చాలా బాగుంది.

  ReplyDelete