Wednesday, December 22, 2010

కోపాన్ని ఎలా తగ్గించు కోవాలి ? పార్టు - 1

నిర్లక్ష్యంగా  ఆటో తోలుతూ తన కారుకి అడ్డం వచ్చిన ఆటో వాడిని నిలిపి తిట్టాడు గోపాల రావు. వాడు ఎదురు తిరిగాడు. మాట మాట పెరిగి ఆటో వాడిపై చెయ్యి చేసుకున్నాడు. విషయం పోలీసుల దాకా పోయింది. ఆ గొడవ నుండి బయట పడటానికి ఓ వెయ్యి నోటు వదిలింది. కాలేజీ నుంచి ఓ అరగంట ఆలస్యంగా వచ్చిన కూతురి మీద కారణం అడగకుండా కోప్పడింది తల్లి కనక మహాలక్ష్మి. అంతే ఆవేశంతో గదిలోకి వెళ్ళి ఫ్యానుకు ఉరేసుకుంది కూతురు కోమల. శ్యామలరావు ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. నిజాయితీ పరుడేకాక పనిలో దిట్ట. కానీ ముక్కు మీద కోపం ఉండటంవల్ల తోటి ఉద్యోగులతో సంబంధాలు సజావుగా లేవు. మేనేజరు ప్రమోషను లిస్టులో ఉన్నాడు. కేవలం కోపదారి ప్రవర్తన వల్ల అతనికంటే జూనియరు, సౌమ్యుడు అయిన రాజారావు ఆ పోస్టును ఎగరేసుకు పోయాడు. అవధులు దాటే కోపం వల్ల జరిగే అనర్థాలు అనేకం.

                                        *********************************

ఇన్ని అనర్థాలకు కారణం అయిన కోపం ఎందుకు వస్తుంది? ఒకే సంఘటనకు ఒకరికి కోపం రాగా మరొకరికి ఎందుకు రాదు? మెదడులో ఉన్న కోప యంత్రాంగం మర్మాలు ఏమిటి? కోపాన్ని కోపంగానే ప్రదర్శించాలా? మార్చి ప్రదర్శించలేమా? అనే విషయాలను అవగతం చేసుకుంటే కోపాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చెయ్యవచ్చు.
కోపం ప్రకృతి పరమయిన సహజ ఉద్వేగం. ఇది జీవుల శరీర భౌతిక ధర్మం. నేలమీద మనుగడ సాగించే ప్రతిజీవి కోప లక్షణాన్ని తనలో ఇముడ్చుకొనే పుడుతుంది. జీవులు మనుగడ సాగించడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన రక్షణ ఆయుధం కోపం. ఇతర జీవులవల్ల తన ప్రాణానికి ప్రమాదం ఏర్పడినప్పుడు మనుగడలో (తిండి, లైంగిక అంశాలలో) పోటీ వచ్చినప్పుడు ఆ స్థితి జంతువుకు ‘సవాలు’ (Threat)గా మారుతుంది. ఈ సవాలను ఎదుర్కోవటానికి జీవులు భయాన్ని లేదా కోపాన్ని ప్రదర్శిస్తాయి.

జీవికి ఎదురయిన సవాలు పెద్దది అయినప్పుడు లేదా తన శక్తికి మించినప్పుడు భయంతో దూరంగా ‘పరారు’ (Flight) అవుతుంధి. అయితే అదే సవాలు చిన్నది అయినప్పుడు లేదా తన స్థాయికి తక్కువ అయినప్పుడు ‘దబాయింపు’ (Aggression)కు ధిగుతుంది. దబాయింపులో భాగంగా అవసరం అయితే 'పోరాటం'. (Fight) ఛేస్తుంది. ఆ విధంగా భయం, దబాయింపు అనే రెండు ప్రవర్తనల జీవులు మనుగడ కోసం రూపొందించిన ఒకే నాణానికి ఉండే రెండు వైపులు. జీవ సంబంధమైన సహజ ఉద్వేగాలు అన్నీ మానవుల్లో సమాజకీకరణ చెందుతాయి. అందులో భాగంగానే మనలో ఉండే జంతు స్వభావ ‘దబాయింపు’కు  నాగరికపు పూత పూసి ‘కోపం’గా ప్రపర్శిస్తాము.

కోపాన్నీ, భయాన్ని పుట్టించే కేంద్రం మెదడు లోపల ‘లింబిక్ లోబు’లో ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఈ రెండింటిలో ఏ ఉద్వేగం కలిగినా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి శరీరాన్ని సమాయత్త పరచే అడ్రినలిను, నారడ్రినలిను హార్మోనులు విడుదల అవుతాయి. దీనివల్ల బీపీ పెరగటం, గుండె వేగంగా కొట్టుకోవటం, కాళ్ళూ చేతులకు రక్త ప్రసరణ ఎక్కువ కావటం, ఊపిరి ఎక్కువగా తీసుకోవటం లాంటి లక్షణాలు కనపడతాయి. అలా కోపం వచ్చినా, భయం వచ్చినా శరీరంలో జరిగే మార్పులు, కనపడే లక్షణాలు ఒకేలా ఉంటాయి.
మెదడులో భయం, కోపానికి సంబంధించిన కేంద్రాలు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నిరంతరం రావణ కాష్టంలా మండుతూనే (Fire) ఉంటాయి. అయితే వాటిని బయటకు పొక్కనీయకుండా బలవంతంగా ‘అణచి’ (Inhibit) ఉంచే కేంద్రం కూడా ‘లింబిక్ లోబు’లోనే ఉంటుంది. ఈ కేంద్రాన్ని సడలిస్తే కోపం బయటకు వస్తుంది. ఎంత సడలింపు జరిగితే ఆ మేరకు కోపం వస్తుంది. అయితే ఈ సడలింపును అణచివేత కేంద్రం తనకు తానుగా ఇవ్వదు. మానవులలో సామాజిక ఆంశాలను పర్యవేక్షించే ‘ప్రీ ప్రాంటల్ కార్టెక్సు’ ఆదేశాలను అందుకొని దాని ప్రకారం సడలిస్తుంది.

నిత్యం మనముందు జరిగే సామాజిక సంఘటనల ఆధారంగా ‘ప్రాంటల్ కార్టెక్సు’ (వ్యవహార సౌలభ్యం కోసం దీనే్న మనసు అనుకుందాం) స్పందిస్తుంది. కోపాన్ని తెప్పించే సంఘటన జరిగినప్పుడు దాని తీవ్రతను బట్టి సడలింపు ఆదేశాలను ఇస్తుంది. మనం ‘అదిపని’గా పట్టించుకోనంత వరకూ ఈ చర్య యథాలాపంగా జరిగిపోతుంది. కానీ మనం పట్టించుకుంటే మాత్రం సడలింపు ఆదేశాలు ఇవ్వటమా, వద్దా అనేది నూటికి నూరు పాళ్ళు ‘మన’ (Will power) అదుపులోకి తీసుకోవచ్చు.

మనం సామాజిక జీవులం కాబట్టి పుట్టుకతో వచ్చే సహజ ఉద్వేగాలను అలాగే వదిలేస్తే కుదరదు. వాటిని సమాజ పరిస్థితులకు తగ్గట్టు అదుపులో ఉంచుకోవాలి. ఈ అదుపు పుట్టుకతో రాదు. ఎదిగే కొద్ది ఎవరికి వారు నేర్చుకోవాలి. దీనినే 'సామాజకీకరణ' (Socialization) అంటాము. అందులో భాగంగా సహజ ఉద్వేగం అయిన కోపాన్ని మన అదుపులో ఉంచే ‘ఓర్పు నేర్చుకోవాలి. వ్యక్తి పెరిగే వాతావరణం, పరిసరాలు, కుటుంబ కట్టుబాట్లు, చుట్టూ ఉన్న సమాజం దన్నుగా ఓర్పు రూపొందుతుంది. ఇది ఎంత బలంగా ఏర్పడితే కోపాన్ని అణచే కేంద్రానికి అంత బలం చేకూరుతుంది.

కోపం నేరుగా ఉన్నట్టుండి పుట్టుకు రాదు. దానికో కారణం కావాలి. మన చుట్టు ఉండే వ్యక్తులు, పరిస్థితులు, సందర్భాలు కోపం రావటానికి కారణాలుగా ఉంటాయి. కారణ తీవ్రతను బట్టి విడుదల అయ్యే కోపం ఏ రూపంలో, ఎంత త్వరగా, ఎంత తీవ్రతతో ప్రదర్శించాలనే తేడాలు ఉంటాయి. సంఘటన పట్ల అవగాహన, దాన్ని అర్థం చేసుకునే తీరు, అలవర్చుకున్న ‘ఓర్పు’ తదితర అంశాలు దీన్ని నిర్ణయిస్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే నిరంతరం రగులుతూ ఉండే కోపాన్ని బయటకు రానివ్వటమా, వద్దా అనేది మన మనసులో ఉన్న ‘అణచివేత-విడుదల’ బలా బలాలపై ఆధారపడి ఉంటుంది. కోపం రావటం అంటూ జరిగితే అటు పూర్తిగా జంతు ప్రవర్తన అయిన కొట్లాట నుండి ఇటు అత్యంత నాగరికమయిన సహాయ నిరాకరణ వరకూ ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఎంత తీవ్రంగా అయినా ఉండవచ్చు.

మనుషుల్లో కోపానికి కారణాలను పరిశీలిస్తే ప్రకృతి పరమయిన సహజ పరిస్థితుల (ప్రాణాపాయం, మనుగడ) కంటే సామాజిక పరిస్థితులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంటే వ్యక్తిత్వం, అహంభావం, నమ్మకాలు, గుర్తింపు, గౌరవం, ఆధిపత్యం, తదితర అంశాలకు భంగం వాటిల్లినప్పుడు కోపంపై ఉన్న అణచివేత వైదొలుగుతుంది. వచ్చే కోపాన్ని వ్యక్తీకరించటంలో కూడా ఇదే వైవిధ్యం కనపడుతుంది. మిగతా జీవులు పోరాటం, పలాయనం అనే ఆదిమ పద్ధతుల్లో మాత్రమే కోపాన్ని వ్యక్తీకరిస్తాయి. మనుషులు అరవటం, తిట్టటం, అవమాన పర్చటం, చెయ్యి చేసుకోవడం, దాడి చేయడం, వస్తువులు పగలగొట్టటం లాంటిచురుకు కోపపు’ (Active Aggression) రూఫాలతో పాటు, మౌన పోరాటం, నిరాహార దీక్ష, అలగటం, సహాయ నిరాకరణ లాంటి ‘మెతక కోపపు’ (Passive Aggression) రూఫాలలో కూడా చూపుతారు.


కోపాన్ని ప్రదర్శించడంలో వ్యక్తిగత వైవిధ్యాలే కాకుండా ఒక సమష్ఠి ప్రయోజనం కోసం సామూహికంగా కోపాన్ని ప్రదర్శించే రూపాలు కూడా ఉంటాయి. బందులు, ధర్నాలు, పెన్నుదింపు(Pen down ) లాంటి కార్యక్రమాలు కూడా ఉమ్మడిగా కోపాన్ని ప్రదర్శించడమే. అలాగే ఒక జాతి లేదా వర్గం ఒక రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి సామూహికంగా చూపే ఉమ్మడి కోపమే సత్యాగ్రహం, విప్లవ పోరాటం, ఉగ్రవాదం లాంటి రాజకీయ పోరాట సిద్ధాంతాలు అవుతాయి.

2 comments:

 1. మీ బ్లాగ్ చాలా బావుంది సర్,
  సీజర్స్ గురించి మీకు తెలిస్తే రాయగలరా, మా పాప చాల సఫర్ అవుతోంది.
  ప్రస్తుతం encoratechrono 200, keppra 250 frisium 10 mgలతొ మెడికేషన్ నడుస్తోంది.

  ReplyDelete
 2. please watch
  http://bookofstaterecords.com/
  for the greatness of telugu people.

  ReplyDelete