Saturday, February 26, 2011

ఈ వయసులో అక్రమ సంబంధమా ?


ఆడక:
 మీరు మధుమేహ వ్యాధికి మందులు పెద్దగా అవసరం లేదని అంటున్నారు. కానీ డాక్టర్ల దగ్గరకు పోతే ఐదు, ఆరు రకాల మందులు రాస్తున్నారు. మేము ఎలా అర్థం చేసు కోవాలి?                  - ఆర్.కె.ఎస్. (ఈ మెయిల్ ద్వారా)

జవాబు: మధుమేహం వచ్చాక ముందుగా జీవన సరళిని మార్చు కోవాలి. సరైన జీవన సరళి పాటిస్తున్నా అదుపులో లేనప్పుడు ‘మాత్రమే’ మందులు వాడాలి. మందులు వాడుతున్నాం కదా అని జీవన సరళిని సడలించ కూడదు. మధుమేహం ఉందని రోగ నిర్ధారణ జరిగాక దాన్ని అదుపులో ఉంచు కోవటంలో రోగి ఏమి చేయాలో, ఎలాంటి నిబంధనలు పాటించాలో డాక్టరు అవగాహన కలిగించాలి. అది వారి బాధ్యత. వాటిని పాటించి జబ్బును అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత కేవలం రోగిదే. డాక్టరు తన బాధ్యతను నిర్వర్తించినప్పుడు ఇంకో సమర్థుడిని వెతు క్కోవటం తప్ప మరో దారి లేదు. డాక్టర్లు చెప్పినా రోగి ధోరణి మారనప్పుడు మందులు రాయటం తప్ప వారు కూడా చేయగలిగింది ఏమీ లేదు. మరో వైపు డాక్టర్లందరిలో ఒకే రకమైన నైపుణ్యం, మెళకువలు, నిబద్దత ఉంటాయని ఆశించ వద్దు. మీకు మంచి డాక్టరు దొరికతే మీ బాధ్యత మరింత పెరగాలి. మీ జబ్బు పట్ల మీకే నిబద్ధత లేనప్పుడు ఎంత మంచి డాక్టరు అయినా చేయగలిగింది ఏమీ లేదు. అయనా మీరు సమర్థత ఉన్న తిండి నిపుణురాలు (న్యూట్రీషనిస్టు)ని కలవండి.

అడక: మా వారి వయస్సు 68. హెడ్ మాస్టరుగా రిటైర్ అయ్యారు. మామూలుగా చాలామంచి వారు. ఈ మధ్యన ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ప్రవర్తనవల్ల మా ఇంట్లో నేనూ, పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నాం.
ఎప్పుడూ లేనిది గత ఆరు నెలలుగా నా శీలాన్ని శంకిస్తూ పిల్లల దగ్గర మాట్లాడుతున్నాడు. ఇంటికి ఏ వయసు మగవారు వచ్చినా వారు నా కోసమే వస్తున్నారని అనుమానిస్తున్నారు. పిల్లలు నాకు సపోర్టుగా మాట్లాడితే వారే నా చేత పరువు తక్కువ పని చేయిస్తున్నారని తగువుకి దిగుతున్నారు. ఈ మధ్య పెద్దబ్బాయి ఆయన మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. ఆయనకు బీపీ, షుగరులాంటి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. గత కొంతకాలంగా మతిమరపు ఉంది. ఇప్పుడు పెరిగినట్టు అనిపిస్తోంది. కాఫీ తాగి కూడా నాకు కాఫీ ఇవ్వలేదు అని మళ్లీ అడుగుతారు. ఈ మధ్య నిద్ర కూడా సరిగ్గా పోవటం లేదు. పరువుగల కుటుంబం ఎవరితో చెప్పు కోలేక సతమతమవుతున్నాం. ఈ సమస్య నుండి ఎలా బయట పడేది?                  - రాజ్యలక్ష్మి, అనంతపురం

జవాబు: మీరు రాసిన లక్షణాలను బట్టి మీ వారు బహుశాః ‘ఆల్జీమర్సు’ అనే మెదడుకు సంబంధించిన జబ్బుతో బాధ పడుతున్నట్టు అర్థం అవుతుంది. మతి మరుపు ఈ జబ్బులో వచ్చే ముందు లక్షణం, క్రమంగా మతి మరుపు పెరుగుతూ రాను రాను ప్రవర్తనకు సంబంధించిన లక్షణాలు చోటు చేసుకుంటాయి. అందులో భాగంగానే సైకోసిస్సు లక్షణాలు కనిపిస్తాయి. మిమ్మల్ని అనుమానించటం కూడా ఈ సైకోసిస్సులో ఒక భాగం. కాబట్టి మీ మీద చెప్పే అనుమానాలు అన్నీ జబ్బు లక్షణాలుగా పరిగణిస్తే ముందుగా మీరు, మీ పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. వయసు పెరిగే కొద్దీ మెదడులో నాడీ కణాలు పాడుకావటం కొంత సాధారణమే అయినా ఈ జబ్బు వచ్చినప్పుడు నాడీ కణాల చాలా ఎక్కువగా పాడవుతుంటాయి. దాంతో మెదడు పరిమాణం తగ్గుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు మెదడు ‘తెలివి’లో తరుగుదల ఉంటుంది. తలకు సీటీ స్కాను చేసి మెదడు ఎలా ఉందో చూడాల్సి ఉంటుంది. మనసును పరీక్షించి, తెలివి, జ్ఞాపక శక్తిని అంచనా వేసి జబ్బు తీవ్రతను అంచనా వేస్తారు. పాడైపోయిన మెదడును ఏమీ చేయలేము కానీ మరీ ఎక్కువ పాడు కాకుండా కొంత నిదాన పరిచేందుకు మందులు ఉన్నాయి. అలాగే సైకిసిస్సుకు మందులు వాడితే అనుమానాలు పూర్తిగా తగ్గుతాయి. మీరు ఆలస్యం చేయకుండా మీ ప్రాంతంలో ఉన్న న్యూరాలజిస్టును కానీ సైకియాట్రిస్టును కానీ సంప్రదించండి.

ఆడక: నా వయస్సు 26. భార్యకు 24, మాకు వివాహం అయి ఏడు నెలలు అవుతుంది. రెగ్గులర్‌గా సెక్సులో కలుసుకుంటున్నాము. ఇద్దరం బాగా ఆనందిస్తున్నాము. ఇంత వరకూ మా ఆవిడకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంట్లో వాళ్ళు, బంధువులు ఇంకా కడుపు రాలేదా! మా ఇద్దరినీ ఎత్తి పొడుస్తున్నారు. అని మాలో ఏదైనా లోపం ఉందంటారా? ఇప్పుడు మేము ఏమి చేయాలి?                                                                                                - వి.ఎల్.ఎన్., నిజామాబాద్

జవాబు: మీకు పెళ్ళి అయి ఏడు నెలలే కదా అయింది. ఇప్పుడే ఆ విషయం మీద ఆందోళన చెందటం అనవసరం. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ పిల్లలు పుట్టటం కొంత ఆలస్యం జరగవచ్చు. పెళ్ళయ్యాక రెండేళ్ళు క్రమం తప్పకుండా సెక్సులో పాల్గొంటున్నా గర్భం రాకపోతే అప్పుడు దాన్ని గురించి ఆలోచించాలి. లోపం ఉందా లేదా అని ఇప్పుడే వెతకటం అనవసరం. మహిళల్లో బహిస్టుకీ బహిస్టుకీ మధ్య రోజును గుర్తించి, దానికి ముందు మూడు రోజులు, తరువాత మూడు రోజులు కలుపుకొని ఆ మొత్తం ఏడు రోజుల్లో క్రమం తప్పకుండా సెక్సులో కలవండి. ఫలితం ఉంటుంది. రెండేళ్ళు దాటాక కూడా గర్భం రాకపోతే అప్పుడు డాక్టర్ని కలవండి.

ఆడక: తెలివి పెరగటానికి మందులు ఉన్నాయా?                                                   - పేరు రాయని ఇంటర్ విద్యార్థి

జవాబు: తెలివిని పెంచేందుకు మందులు కానీ, ఆహార పదార్థాలు కానీ ఏమీ లేవు. ఉన్నాయని ఎవరైనా చెబితే అది పూర్తిగా అబద్ధం. పుట్టేటప్పుడే మెదడు దానిదైన సామర్థ్యంతో (ముడి సరుకు) పుడుతుంది. ఎదుగుదలలో లోపం రానంత వరకూ (జబ్బుల వలన కానీ, తిండిలో లోపం వల్ల కానివ్వండి) దాని సామర్థ్యానికి తగ్గట్టు పని చేయటానికి సత్తా ఉంటుంది. మనం చేసేదల్లా శిక్షణ పొందటం ద్వారా దానికి పదును పెట్టటమే. అలా ఎవరికి వారు ఉపయోగంలోకి తెచ్చుకొనేదే వారి ప్రతిభ. మరో సంగతి ఏమిటంటే పుట్టుకతో సామర్థ్యం ఎక్కువగా ఉన్నంత మాత్రాన దానిని ఉపయోగించకపోతే (చదవటం లేదా నేర్చుకోవటం) ప్రతిభగా మారదు. అలాగే సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ దానికి పదును పెట్టి, పూర్తిగా ఉపయోగించుకుంటే అదే తెలివి పెరిగినట్టు లెక్క.


Wednesday, February 2, 2011

స్కిజోఫ్రెనియా పై సందేహాలు-సమాధానాలు


ప్రశ్న:
 మా అమ్మాయికి స్కిజోఫ్రెనియా ఉంది. వయసు 20 సంవత్సరాలు. చాలా ఇబ్బందులు పడుతోంది. మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. గుంటూరులో మందులు వాడుతున్నాం. స్కిజోఫ్రెనియా ఎందుకు వస్తుంది అంటారు ?.
                                                                                                                       - ఓ తండ్రి, బాపట్ల

ప్రశ్న: మా అమ్మాయికి 20 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుండి పారానాయుడ్ స్కిజోఫ్రెనియాతో బాధ పడుతోంది. ఈ జబ్బు పూర్తిగా తగ్గుతుందా? పిన్నికి ఇదే జబ్బు మూడేళ్లుగా ఉంది. ఇంకా దారికి రాలేదు. వంశపారం పర్యంగా వస్తుంది అంటున్నారు. నిజమేనా? ఇలాంటి వారికి పెళ్లి చేయవచ్చా? పిల్లలకు వస్తే దేశంలో వ్యాధి కలవారిని పెంచినట్టే కదా?                                                                                                                                                          - పేరు లేదు, నగరం

ప్రశ్న: స్కిజో ఫ్రెనియాకి సరైన మందులు లేవని అంటున్నారు? నిజమేనా?      - నారాయణ రావు, మడకశిర

జవాబు: 
స్కిజోఫ్రెనియా జబ్బు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మందిలో ఒకరికి ఉంటుంది. ఆ లెక్కన మన దేశంలో ఒక కోటి పది లక్షల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. ఇది వంశపారం పర్యంగా వచ్చేందుకు ‘అవకాశం’ మాత్రమే ఉంది. శరీరంలో జన్యువులు ఉన్నంత మాత్రాన అందరికి జబ్బుగా బయట పడాలనేమీ లేదు. సామాజిక పరిసరాలు, పరిస్థితులు అనుకూలంగా ఉంటే జబ్బుగా బయట పడవచ్చు. సామాజిక పరిసరాలు అంటే మానవ (ముఖ్యంగా కుటుంబ) సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉపాధి మొదలయిన అంశాలలో ప్రతికూల వాతావరణం ఉండటం, ఈ సమయాలలో కలిగే మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే కొద్దీ జబ్బు బయట పడడానికి అవకాశాలు పెరుగుతూ ఉంటుంది. స్కిజోఫ్రెనియా లక్షణాలు ఫలానా విధంగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పటానికి వీలు కాదు. కారణం ఏమిటంటే జబ్బు లక్షణాలు ప్రవర్తనలో కలిసిపోయి చిక్కుగా ఉంటాయి. మామూలుగానే ఏ జబ్బు లేకపోయినా ప్రపంచంలో ఏ ఇద్దరి ప్రవర్తన ఒక రకంగా ఉండదు. అలాంటిది జబ్బు లక్షణాలు వారి ప్రవర్తనలో కలిసిపోవటం వల్ల ఏ ఇద్దరి స్కిజోఫ్రెనియా రోగుల్లో లక్షణాలు ఒకటిగా ఉండవు. కేసును బట్టి మొత్తం ప్రవర్తన, జబ్బు లక్షణాలను బేరీజు వేసుకొని మనసు వైద్యులు ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. అయినప్పటికీ అవగాహన కోసం కొన్ని ముఖ్యమయిన లక్షణాలు ఇవి.
  • తన ఆలోచనలు తనకే చెవుల్లో వినపడటం. 
  • ఇతరుల ఆలోచనలు తన మెదడులోకి చొప్పిస్తున్నారనీ, లేదా తన ఆలోచనలను వారు లాగేసుకుంటున్నారని అంటూ ఉంటారు. 
  • తన ఆలోచనలు ఇతరులకు తెలిసి పోతున్నట్టు అపోహ పడతారు. 
  • టీవీ రేడియో, మైకులలో తన విషయాలే ప్రసారం అవుతున్నాయని గొడవ చేస్తారు. 
  • తన ఆలోచనలను, శరీర భాగాలను ఇతరులు లేదా అతీంద్రియ శక్తులు అందులో ఉన్నట్టు వారికి అనిపిస్తుంది. 
  • తన ప్రవర్తన గురించి, చేష్టల గురించి ఇతరులు మాట్టాడుతున్నట్టు, వారిలోవారే గుసగుస లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. 
  • తమలో అతీంద్రియ శక్తులు ఉన్నట్టు భ్రమ పడుతుంటారు. ఇతరులను అనుమానిస్తారు. అక్రమ సంబంధాలను అంటగడతారు. 
  • ఆలోచనలో మధ్యమధ్యలో ఆగిపోవటంవల్ల మాటలు ఆ సందర్భంగా ఇతరులకు అర్థం కాని విధంగా ఉంటాయి. 
  • ఒంటి కదలికలు తగ్గుతాయి. దాంతో ఏ పని చేసినా నిదానంగా గంటల కొద్దీ చేస్తారు. అలాగే కూర్చొని ఉండటం, స్నానానికి పోతే బయటకు రాకపోవటం, తిండి దగ్గర కూర్చుంటే కెలుకుతూ ఉంటారు. 
  • ఇతరులతో మాట్లాడటానికి ఇష్టపడరు. శూన్యంలోకి చూస్తూ కూర్చుంటారు. 
  • తమలో తామే మాట్లాడుకోవటం, నవ్వుకోవటం చేస్తుంటారు. 
  • ఉద్వేగాలకు తగ్గట్టు ముఖంలో హావభావాలు ఉండవు. 
  • జనంలోకి కలవటానికి ఇష్ట పడకపోవడం, దేనిమీదా ఆసక్తి చూపక పోవటం, 
  • తనను గురించి తాను పట్టించుకోకపోవటం (స్నానం, బట్టలు, శుభ్రత విషయంలో), 
  • భవిష్యత్తుపట్ల ముందుచూపు లేకపోవటం, పరిస్థితులను బట్టి వ్యవహరించలేక పోవటం లోపంగా ఉంటుంది. గమ్యంలేని జీవితాన్ని గడుపుతుంటారు. 
  • ఒక విధంగా చెప్పాలంటే తనూ, తన కుటుంబం, చుట్టూ ఉన్న సమాజంలో పని లేకుండా వారిదయిన సొంత లోకంలో ఉంటారు. 
  • వీటికితోడు తమకు రోగం ఉందన్న విషయాన్ని గుర్తించలేరు. ఎదుటివారు చెప్పినా ఒప్పుకోరు. 
  • మందులు వాడటానికి అంగీకరించరు.
ఇవన్నీ అవగాహన కోసం చెప్పిన కొన్ని లక్షణాలు మాత్రమే. అందరిలో అన్ని లక్షణాలు ఉండవు. వ్యక్తి స్వభావాన్నిబట్టి మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి అనుభవం ఉన్న డాక్టరుకు సైతం రోగ నిర్ధారణ చేయటానికి కష్టంగా ఉంటుంది.

ఇక వైద్యం విషయానికి వస్తే ఒకప్పుడు ఈ జబ్బుకు మందులే లేవు. అందుకే ‘మనోవ్యాధికి మందు లేదు’ అనే నానుడి పుట్టింది. ఆ తరువాత పరిమితమయిన వైద్యం అందుబాటులో ఉండేది. పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు కొత్త కొత్త మందులు, వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. 

జబ్బు తగ్గటంలో మందులదే ప్రధాన పాత్ర అయినప్పటికీ పూర్తిగా నయం కావటంలో సామాజిక అంశాలు చాలా కీలకపాత్రను పోషిస్తాయి. సమస్య అంతా ఇక్కడే వస్తుంది. డాక్టర్లు మందులు రాసి, సలహాలు మాత్రమే ఇవ్వగలరు. సామాజిక తోడ్పాటును కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు, చుట్టూ ఉన్న జనం (మొత్తంగా సమాజం) అందించాలి. రోగికి అందే సామాజిక తోడ్పాటు, రోగిపట్ల జాగ్రత్తలు ఏ ఇద్దరికీ ఒకే రకంగా ఉండవు. అందువల్ల జబ్బు అదుపులో ఉంటుందా లేదా అనేది వివరణలు లేకుండా నేరుగా సమాధానం చెప్పటం కష్టం.

జబ్బు రకం, దాని తీవ్రత, రోగికి ఉన్న అవగాహనా శక్తి, రోగి సామాజిక నేపథ్యాన్ని బట్టి చికిత్స చేస్తున్న వైద్యులు మాత్రమే ఏ మేరకు అదుపులో ఉంచగలమనే విషయాన్ని చెప్పగలరు. ఒకటి మాత్రం నిజం. డాక్టరు చెప్పిన సలహాలను పాటిస్తూ వైద్యం చేయించుకుంటే తప్పకుండా ‘చాలా’ వరకు అదుపులో ఉంచుకోవచ్చు.

ఇక పెళ్ళి విషయానికి వస్తే ఈ జబ్బు ఉంది కాబట్టి పెళ్లి చేసుకో కూడదనేదేమీ లేదు. అయితే పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు మానసికంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అరమరికలు లేని విధంగా పరస్పరం అవగాహన, అంగీకారంతో జరగాలి. జబ్బును దాచిపెట్టి చేస్తే అది మోసం అవుతుంది. జబ్బు తగ్గాక లేదా అదుపులోకి వచ్చాక జీవిత భాగస్వామికి తెలిపి వారి అంగీకారంతో చెయ్యవచ్చు. ఇది కూడా కేసునుబట్టి మారుతుంది. ఈ జబ్బు వ్యక్తిత్వాన్ని, ఉపాధిని, గుర్తింపును దెబ్బతీస్తుంది. ఏ మేరకు దెబ్బతినింది అనేదాన్ని బట్టి పెళ్ళి చెయ్యవచ్చా లేదా అనే సందేహాలకు చికిత్స చేస్తున్న వైద్యులు సమాధానం చెప్పగలరు. వారసత్వం వచ్చే జబ్బులు కోకొల్లలు ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని పిల్లల్ని కనకూడదు అనుకుంటే ఎవరూ పిల్లల్ని కనలేరు. పిల్లలకు వస్తుందేమో అనే ఆలోచన అనవసరం.