Wednesday, April 20, 2011

త్వరగా అయిపోతుంది! మా ఆవిడ రచ్చ చేస్తుంది! ఏం చేయమంటారు?


ఆడక:
 నా వయస్సు 36. మా ఆవిడ వయస్సు 34. నేను లెక్చరర్‌గా పని చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు. నాకు పెళ్ళి అయి ఏడు సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి శీఘ్రస్కలన సమస్య ఉంది. ఇంతకు ముందు మా ఆవిడ ఏమీ అనేది కాదు. గత రెండు మూడేళ్ళుగా ఆ సమయంలో చాలా విసుగు ప్రదర్శిస్తోంది. ఇలాంటి విషయాన్ని డాక్టరుతో చెప్పాలంటే సిగ్గు, బిడియంవల్ల పోలేక పోతున్నాను. మందులు ఏవైనా రికమెండ్ చేస్తారా?
                                                                                                                                 - సత్యమూర్తి, నంద్యాల
బదులు: ఆరోగ్య శీర్షికలు అవగాహన కోసమే తప్ప వైద్యం చేయటానికి కాదు. పత్రికల ద్వారా మందులు సూచించటం సరైన పద్ధతి కాదు. శీఘ్రస్కలనం విషయంలో భర్తది అయితే, బాధ అనుభవించేది భార్య. ఇప్పటికే మీ ఆవిడ లైంగిక జీవితాన్ని ఏడేళ్ళు వృథా చేశారు. ఇకనైనా మేలుకోండి. మీరు డాక్టరు దగ్గరకు పోవాలే కానీ మీరు ఊహించుకున్న సిగ్గు, బిడియం అక్కడ ఏమీ ఉండవు. ముందస్తు ఊహలు పక్కనపెట్టి తెరచిన మనసు (ఓపెన్ మైండ్)తో వెళ్ళండి.

దీనికి రెండు రకాల చికిత్సలు ఉంటాయి. మందులతో వైద్యం చేయవచ్చు. కానీ అది అతుకుల వైద్యమే. మందులు వాడిన్నంత కాలం నిలబడగలరు. మందులు ఆపగానే తిరిగి మామూలు స్థితికి వస్తుంది. అలా కాకుండా శాశ్వతంగా చికిత్స చేయించుకోవాలంటే సెక్స్ థెరఫీ తీసుకోవాల్సి ఉంటుంది. భార్యా భర్తలిద్దరూ చికిత్సలో భాగస్వాములు కావాలి. సైకియాట్రిస్టు లేదా సమర్థత ఉన్న సెక్స్ థెరపిస్టును కలవండి. సరుకు లేని సెక్స్ థెరపిస్టులు ఉంటారు. జాగ్రత్త. పోబోయేముందు విచారించి అర్హతలు చూసి కలవండి.

 ఆడక: డాక్టరు గారూ. మనసు బాగాలేని వారు మానసిక వైద్యుల దగ్గరకు వెళ్లితే ఎక్కువగా మత్తు మందులు రాస్తారనే అపవాదు ఉంది. ఇది ఎంతవరకు నిజం?                                                                     - కేశవ రావు, తడ

బదులు: మీరే అన్నారు కదా! అపవాదు అని. ఇది నిజంగా అపవాదే. ఇలాంటి నమ్మకాలు ప్రబలటానికి కారణం వైద్యం. ఇంకా పాత పద్ధతుల్లో జరుగుతుందని జనం మనసు బిగింపు చేసుకొని ఉండటమే. వైద్యం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్తకొత్త పద్ధతుల్లో వైద్యం చేయగలుగుతున్నారు. పాతికేళ్ళ క్రితం కడుపులో ఏదైనా సమస్య వచ్చి ఆపరేషను చేయాలంటే ఖచ్చితంగా కత్తితో కోసి ఆపరేషను చేయాలి. తరువాత కోసినదాన్ని మూసేయటానికి కుట్లు వేయాల్సి వచ్చేది. వారం నుండి రెండు వారాల వరకూ నొప్పిని భరిస్తూ ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చేది. మరి ఇప్పుడో? కడుపులోకి కేవలం మూండంటే మూడు చిన్న చిల్లులు పెట్టి లాపరోస్కోపిక్ సర్జరీ చేయడం ద్వారా రెండో రోజే ఇంటికి పంపగలుగుతున్నారు.
     మానసిక సమస్యలకు పాతకాలంలో వాడే మందులు మత్తుగా ఉండటం అన్నది నిజమే. అప్పుడు అన్ని మానసిక జబ్బులకు కలిపి మహా ఉంటే ఓ 10 మందులు ఉండేవి. దాదాపు ఇవన్నీ మత్తుగా ఉండేవి కాబట్టి అప్పుడు అలా అనుకొనే వారు. ఇప్పుడు దాదాపు 200 రకాల మందులు డాక్టర్లకు అందుబాటులో ఉన్నాయి. గతంలో మందుల వాడకంవల్ల రోగం తగ్గటంతో పాటు చెడు ఫలితాలను కూడా ఎక్కువగా భరించాల్సి వచ్చేది. ఇప్పుడు చెడు ఫలితాలు దాదాపుగా లేని మందులు అందుబాటులో ఉన్నాయి.
     మరో విషయం ఏమిటంటే కొన్నిరకాల మనసు జబ్బుల్లో నిద్ర పట్టదు. అలాంటప్పుడు జబ్బు తగ్గటంతోపాటు నిద్రకోసం కూడా మందులు కలిపి వాడాలి. బహుశా ఇది కూడా అలాంటి అపవాదు రావటానికి ఒక కారణం. డాక్టర్లు నిరంతరం వారి వైద్య ప్రమాణాలను మెరుగు పరుచుకుంటూ ఉండాలి. అలా మెరుగు పరుచుకోకుండా ఇంకా పాత పద్దతుల్లో వైద్యం చేసే డాక్టర్ల చేతిలో అలా జరిగితే జరగవచ్చు.

ఆడక: మా అమ్మాయి వయసు 23. స్కిజోప్రెనియా ఉంది. హైదారబాద్‌లో వైద్యం చేయిస్తున్నాం. బాగానే ఉంది. అంతకు ముందు ‘ఒలాపిన్ 10ఎం.జి’ వాడేది. దానితో లావు అవుతుందని డాక్టరు గారితో చెబితే ‘సల్పిటాక్ 200 ఎం.జి’ మాత్రలు రాశారు. జబ్బు అయితే బాగా అదుపులో ఉంది కానీ ఆ మందు వాడుతున్నప్పటి నుండి నెలనెలా వచ్చే బ్లీడింగ్ ఆగిపోయింది. డాక్టరు గారితో చెబితే మరేం పరవాలేదు అంటున్నారు. మాకు తెలిసిన వారంతా బ్లీడింగ్ రాకపోతే ఆరోగ్యం చెడిపోతుందని, చెడురక్తం అంతా ఒంట్లో ఉండిపోతుందని అంటున్నారు. పాప భయపడి మందులు వాడను అంటోంది. నిజంగా అలా జరుగుతుందా?                                              - ఈమెయిల్ ద్వారా రాజేశ్వరి

బదులు: మీ ఆ డాక్టరుగారు సరిగ్గానే చెప్పారు. ఈ మందు పనిచేసే విధానంలో గర్భ నిరోధక మాత్రల పాత్రను కూడా అదనంగా పోషిస్తుంది. దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఋతుసమయంలో పోయేది చెడు రక్తం కాదు. మంచి రక్తమే. మహిళల్లో అండం విడుదల అయిన రెండు వారాలకు గర్భం అంటుకోకపోతే రక్తం బయటకు వస్తుంది. పిల్లలు కావాలనుకుంటే ఋతుసమయం గురించి పట్టించుకోవాలి. మీ అమ్మాయికి పెళ్ళి కాలేదు కాబట్టి పెళ్ళయి పిల్లలు కావాలనుకొనేంత వరకూ భయం లేకుండా మందును వాడవచ్చు. డాక్టరు సలహా లేకుండా మీకు మీరే ఆపేసే నిర్ణయం తీసుకోకండి. అవసరం అయినప్పుడు మందును నిలిపేయగానే తిరిగి ఎప్పటిలా బహిస్టు అవుతారు.20 ఏప్రెల్ 2011

Sunday, April 10, 2011

అమ్మాయిలంతా చెడిపోయారు!!

 ఆడక :  నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా ఆఫీసులో పని చాలామంది అమ్మాయిలతో నాకు శారీరక సంబంధాలు ఉన్నాయి. మా కంపెనీలో, ఇతర కంపెనీలలో పనిచేసే చాలామంది నా మిత్రులకు కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయి. నాతో గడిపిన ప్రతి అమ్మాయి బైటకు అమాయకురాలిగా కనిపిస్తారు. ఇలా అని చెబితే తప్ప ఎవరూ నమ్మరు. ఇప్పడు నేను పెళ్లి చేసుకోవాలి. ఇప్పటికే ఇద్దరు సాఫ్ట్‌వేర్ అమ్మాయిలను, మరో ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి చూపులు జరిగాయి. అన్నీ కుదురుతున్నా సంబంధాలను ఒప్పుకోలేకుండా ఉన్నాను. కారణం వీళ్ళు కూడా చెడిపోయి బైటకు అమాయకంగా కనపడుతున్నట్లు అనిపిస్తుంది. నేను సైకియాట్రిస్టును కలవాలని అనుకుంటున్నాను. ఉపయోగం ఉంటుందా?                                                                                          - పేరు రాయని ఓ సాఫ్ట్ వేర్ 
బదులు: చుట్టూ ఉన్న సమాజాన్ని ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో నుండి ఆ విధంగా కనిపిస్తుంది. మీ జీవితంలో జరిగిన అనుభవాలను బట్టి మహిళలపట్ల మీకు అపనమ్మకాలతో కూడిన ఇంగితం (కాగ్నిషన్) రూపు దిద్దుకుంది. మీ చుట్టూ ఓ నలుగురు అలాంటివారు ఉన్నంత మాత్రాన ప్రపంచమంతా అలాగే ఉంటుంది అనుకోవటం అవివేకం. ఏ అంశానికి అయినా పలు కోణాలు ఉంటాయిని గుర్తించటం ముఖ్యం. శీలం అనేది ఎవరికి వారుగా నిర్దేశించుకోవాల్సిన అంశం. మీకు శీలం లేదు కాబట్టి (ఇది నా మాట కాదు. మీ మాటే) ఎదుటి వారిని శంకించే హక్కు మీకు లేదు. పెళ్లి అనేది నమ్మకం పునాది ఏర్పరుచుకునే బంధం. ఆ బంధంలోకి పోవాలంటే మనస్సులో మీరు ఏర్పరచుకున్న అపనమ్మకాలను సమూలంగా తొలగించి వాటి చోటులో తిరిగి కొత్త నమ్మకాలను (కాగ్నిటివ్ రీ కనస్ట్రక్షన్) నాటాల్సి వుంటుంది. అనుభవం ఉన్న సైకియాట్రిస్టుకానీ, క్లీనికల్ సైకాలజిస్టు కానీ ఈ చికిత్సను అందిస్తారు. కొన్ని మానసిక జబ్బులు లేత దశలోఉన్నప్పుడు కూడా ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి. అలాంటిది ఏమైనా ఉంటే వైద్యంతో నయం అవుతుంది.


ఆడక : నా వయసు 20. రెండేళ్ల క్రితం ఒక కల వచ్చింది. నేను రోడ్డులో పాంప్లెట్లు పంచుతున్నట్టు, ఆ పంచేటప్పుడు ఒకమ్మాయి చేయి తగిలి అదో రకమైన స్పర్శతో నన్ను ప్రేరేపించింది. నాకు లైఫ్ ఇచ్చింది. అప్పటినుండి నేను చేసే కంప్యూటర్ పని మానేసి అమ్మాయి కనిపిస్తుందేనోనని పాంప్లేట్లు పంచుతూనే ఉన్నాను. అయినా ఆ అమ్మాయి దొరకలేదు. ఆ అమ్మాయి దొరికే వరకు ఇలా పంచుతూనే ఉంటాను. నాకు అమ్మాయి దొరికే మార్గం చెప్పండి. 
                                                                                                          -     జ్వాలా నరసింహారెడ్డి, అనంతపురం
బదులు: ''సందేహాలు - సమాధానాలు'' శీర్షికకు ఇలాంటి కల్పిత ఊహలతో చాలా ప్రశ్నలు వస్తుంటాయి. సమాధానాలు ఇస్తున్నారు కదా! అని బుర్రకు ఏది తోస్తే దాన్ని ప్రశ్నగా పంపటం అనేది మంచి పద్దతి కాదు. మీకు కల వస్తే వచ్చి ఉడవచ్చు. కానీ కలలో కనిపించిన అమ్మాయి కోసం రెండేళ్లనుండి పని మానుకొని పాంప్లేట్లు పంచటం అనేది కేవలం కల్పితమని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చెప్పేది అంతా నిజమే అయితే ఆలస్యం చేయకుండా మనసు వైద్యులను కలవండి వారు నయం చేస్తారు.

ఆడక : మా పాపకు నాలుగేళ్లు. ఎప్పుడూ ఎత్తుకొనే ఉండాలి. కొత్తవారి దగ్గరకు అస్సలు పోదు. దించితే ఏడుస్తుంది. ఈ ఎత్తు మరుపునుండి పాపని మార్చలేమా? ఏం చేయమంటారు.                                             -వి.రాణి బద్వేలు
బదులు:కుటుంబ సభ్యులు చేసే అతి గారాబం. అతి ప్రేమ, అతి జాగర్తల వల్ల పిల్లలు ఇలా తయారు అవుతారు. పిల్లలపై కుటుంబ సభ్యుల ప్రవర్తన చాలా ఎక్కువుగా ఉంటుంది. ముఖ్యంగా తల్లి ప్రవర్తన, అభద్రతా భావంతో ఉండే తల్లి తన ప్రవర్తన వల్ల పిల్లలను స్వతంత్రంగా ఎదగనీయదు. ప్రవర్తన శాస్త్రంలో ఒక నానుడి ఉంది. ‘‘యాంగ్జియస్  మదర్ విల్ ప్రొడ్యూస్ యాంగ్జియస్ చైల్డ్’ అని. మీరు రాసిన దాన్ని బట్టి సమస్య పాప దగ్గరలేదు. కేవలం మీ దగ్గరే ఉంది. క్లీనికల్ సైకలాజిస్టును కలవండి. మీ ప్రవర్తనలో ఉన్న లోపాన్ని గుర్తించి దాన్ని తొలగిస్తే కొద్ది రోజల్లోనే సమస్య తొలిగిపోతుంది.

ఆడక : మాకు ముగ్గురు పాపలు. అబ్బాయి కావాలనుకుంటూ మూడో అమ్మాయిని కన్నాము. అబ్బాయి పుట్టాలంటే ఫలానా రోజున భార్యభర్తలు కలుసుకుంటే అలాగే జరిగే జరిగేందుకు చైనా చార్టు తెచ్చారు మా వారు. ఇలా నిజంగా జరుగుతుందా?                                                                                             -  పేరు రాయలేదు హైదరాబాదు
బదులు: నమ్మకానికి, శాస్త్రానికి పొసగదు. మీ నమ్మకాలకు శాస్ర్తియ వివరణ కావాలంటే ఇవ్వలేము. ఇప్పటికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇలా కనటం సాధ్యం కాదు. కాకుంటే పుట్టక ముందు కడుపులో పెరిగేది మగబిడ్డా లేదా ఆడబిడ్డా అనే విషయాన్ని మాత్రమే కనుక్కోవచ్చు. కానీ ఇలా కనుక్కోవటం చట్టరీత్యా నేరం. అమాయకత్వంతో తెలియక ఇలాచేస్తే అది అజ్ఞానం అనవచ్చు. అన్నీ తెలిసి చేసేది మూర్కత్వం. మీరు అజ్ఞానులు కాదని మాత్రం చెప్పగలను.