Wednesday, July 11, 2012

సన్నగా ఉన్నారా ? కాస్త లావు పెరగండి ఇలా !

ప్రపంచంలో ఎక్కువ మంది లావుగా ఉండి, అదనం గా ఉన్న బరువును ఎలా తగ్గించు కోవాలో అర్ధం కాక తలలు బాదుకుంటుంటే అందుకు భిన్నంగా మేము లావు కాలేక పోతున్నాము అని బావురు మనే వారికి కూడా కొదవ లేదు .
          "పిల్ల ముఖం కళగానే ఉంది కాని గాలి కొడితే లేచి పోయేలా ఉంది "
         "ఎముకల గుడుకు తోలు తోదిగినట్టు ఉంది " పెళ్లి చూపులకు కూర్చున్న ప్రతిసారి ఇలాంటి కామెంట్లు తప్పటం లేదు            శిరీష కు 
        "ఆ బక్క నాయాలు లంచానికి లొంగటం లేదురా"  నిజాయితీ తో పాటు పాపం సన్నగా ఉన్న్నందుకు  ఇంజినీరు                 మురళి పై  కాంట్రాక్టరు కాంతారావు కామెంటు.
       
           సన్నగా ఉండే వారికి వారి సన్న దానాన్ని బట్టి బక్కది, బక్కామే, బక్కోడు. బక్క పినుగా, బక్క పిచు, రివట లాంటి పేర్లతో నేరుగానో చతుగానో అనుకోవటం కద్దు. ఎలాగయినా లావు అయ్యి ఈ పిలుపులకు దూరం కావాలని పాపం ఈ బక్క జీవులు పడరాని పాట్లు పడుతుంటారు. తిన రాని చెత్తంతా తింటుంటారు. అయినా పాపం కాస్తంత కండ  పెట్టటం గగనం అవుతుంది. కాని ఒక పద్దతి ప్రకారం నడుచుకుంటే వీళ్ళు కుడా "కండ కలవాడే మనిషే నోయ్" అని నిరూపిచు కోవచ్చు.    
   సన్నగా ఉన్నాము అనుకొనేవారు ముందుగా అసలు తాము సన్నగా ఉన్నామా? లేదా? ఉంటే ఎంత సన్నగా ఉన్నారు? అన్న సంగతి తెలుసుకోవాలి.  మీరు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఆ సంగతి 'ఒంటి కట్టుబడి తీరు' ను (బాడి మాసు ఇండెక్సు లేదా బి.ఎం.ఐ) అంచనా వేయటం ద్వారా కనుక్కోవచ్చును. దీన్ని తెలుసుకోవటానికి ముందుగా మీరు ఎన్ని కేజీలు బరువు ఉన్నారో చూసుకోండి. తరువాత మీ ఎత్తును మీటర్లలో  కొలవండి. మీటర్లలో ఉన్న ఎత్తు విలువని అదే విలువతో పెంచి (స్కొయర్) ఆ విలువ ఎంతో కనుక్కోవాలి. ఇపుడు కేజీలలో ఉన్న మీ బరువును ఎత్తుకు కనుగొన్న స్కొయరు విలువతో భాగిస్తే వచ్చే విలువే మీ ఒంటి కట్టుబడి తీరు లేదా బి.ఎం.ఐ.

                             (BMI) బి.ఎం.ఐ = బరువు (కేజీలలో) / ఎత్తు 2 (మీటర్లలో)
మచ్చుకు           మీ బరువు        =  42 కేజీలు, 
ఎత్తు              =  1.7 మీటర్లు అయితే, 
బి.ఎం.ఐ        = 42  x 1.7x 1.7 = 15.6 అవుతుంది. 

ఒంటి కట్టుబడి మామూలుగా ఉన్నవారికి ఈ విలువ 18-25 నడుమ ఉంటుంది. 18 కన్నా తక్కువ ఉంటే ఉండాల్సినంత బరువు లేనట్టే. విలువ ఎంత తక్కువగా ఉంటే వారు ఆ మేరకు బక్క పీచులు అన్నమాట.

కారణాలు :
  1. కుటుంబ సాలు
  2. తిండి లేక పోవటము లేదా ఉన్నా తినక పోవటము
  3. సామాజిక వరవడులు (జీరో సైజు మోజు)
  4. ఒంటిలో థయిరాయిడు హార్మోను ఎక్కువగా ఊరటము
  5. నిడివి కాలం పాటు ఉండే టీబీ కిడ్ని, ఎయిడ్సు, కాన్సరు లాంటి రోగాలు ఉన్న వారు
లావు అయ్యే కిటుకు :
ముందుగా మీ ఒంటి కట్టుబడి తీరును బట్టి మీరు ఎంత సన్నగా ఉన్నారో ఒక అంచనాకు వచ్చాక ఒకసారి డాక్టరును కలిసి సన్నగా ఉండటానికి వైద్యపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఒక వేళ ఉంటే అందుకు వైద్యం చేయించు కోవాలి.
  • తినే కేలరీలు (తిండి) ఖర్చు పెట్టే కేలరీలు (పని) సమానం అయినప్పుడు బరువులో మార్పు ఉండదు.
  • తినే కాలరీల కన్నా ఖర్చుపెట్టే కాలరీలు ఎక్కువ అయితే బరువు తగ్గుతారు.
  • ఖర్చుపెట్టే కేలరీల కన్నా ఎక్కువ తింటే లావు అవుతారు.
మీ బరువును, తిండి అలవాట్లను పర్యవేక్షించే కేంద్రము మెదడులో ఉంటుంది. దాని సమ్మతి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు బరువు తగ్గినా, పెరిగినా అది ఒప్పుకోదు. మీకు తెలియకుండానే అది మీ ప్రవర్తనలో మార్పు చేయటం ద్వారా వెంటనే తగ్గినా లేదా పెరిగిన బరును మునుపటి స్థాయి తెస్తుంది. మచ్చుకు రోజువారీగా తేలిక పని చేసే మగవారి అయితే 2,200 కేలరీలు, ఆడ వారికి అయితే 1900 కేలరీలు అవసరం. వీరు లావు పెరగాలంటే రోజుకు అదనంగా 1,000 కేలరీల తిండి తింటే వారానికి అరకేజీ (కంటే కాస్త తక్కువే) పెరుగుతారు.

తిండిలో మార్పులు :
  1. తిండి పద్ధతికి వచ్చే సరికి రోజుకు మూడు పూటలా కాకుండా కనీసం రోజుకు ఐదు పూటలు తినాల్సి ఉంటుంది. అవి కాక మధ్య మధ్యలో చిరు తిండి తినాల్సి ఉంటుంది. అంటే చెత్త తిండి (fast  foods or junk foods)  కాదు.
  2. పరిమాణం తక్కువగా ఉండి, దానిలో ఎక్కువ కేలరీలు ఉన్న తిండి తినాలి. బాదం, పిస్తా, జీడిపప్పు, కర్జూరం, ఎండు ద్రాక్ష లాంటి వాటిలో శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వేరుసెనగ, సెనగ, బఠాని, చిక్కుడు, అలసంద లాంటి విత్తనాలు చూపుకు చిన్నవే అయినా అవి శక్తి స్వరూపాలు. పైగా తక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి కడుపు నిండదు. మనకు కావాల్సింది అదే. కనుక వీటిని తీసుకోవచ్చు.
  3. తక్షణం శక్తిని ప్రసాదించే వాటిలో పిండి పదార్థాలు ముఖ్యమయినవి. అందులో సులభంగా, త్వరగా అరిగే ‘సరళ’మయినవి, ఆలస్యంగా అరుగుతూ ఎక్కువ శక్తిని ఇచ్చే ‘చిక్కు’ (కాంప్లెక్సు) పదార్థాలు అని రెండు రకాలు ఉంటాయి. లావు కావాలనుకునే వారు వీలున్నంత వరకు ఈ రెండో రకపు పిండి పదార్థాలు తినాలి. అంటే పాలిష్ చెయ్యని బియ్యపు అన్నము, పొట్టు తియ్యని గోధుమలతో తయారైన పదార్థాలు, ఓట్లు, అరటి పండ్లు, బంగాళా దుంప, బీన్స్ మొదలైనవి.
  4. పండ్ల రసాలలో కొన్ని ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. పైనాపిల్, దానిమ్మ ఇందుకు మంచి మచ్చులు. పాలు, అరటి పండుతో చేసిన మిల్కుషేకు కూడా ఎక్కువ కాలరీలను కలిగి ఉంటుంది.
  5. నూనెలు, కొవ్వులు శక్తికి నిలయాలని తెలిసిందే. ఇళ్ళలోవాడే రోజు వారీ నూనెలకు తోడు కొద్దిగా ఆలీవు నూనె, ఫిష్‌ లివరు నూనె (మాత్రల రూపంలో) కలిపితే అవి ఎక్కువ శక్తిని ఇవ్వటమే కాక, ఆరోగ్య పరిరక్షణలో ఉపయోగపడే ఓమేగా ఫాటీ యాసిడ్లను కూడా కలిగి ఉంటాయి. ఇక నెయ్యి, వెన్న, పాలు, పెరుగు కూడా ఎక్కువ శక్తిని ఇస్తాయి. అయితే ఇక్కడ జాగర్తగా ఉండాలి. మీరు తినే తిండిలో నేరుగా వాడే కొవ్వు 30 % కి  మించి లేకుండా జాగర్త తీసుకోవాలి.
  6. గుడ్డులో అత్యంత స్వచ్ఛమైన మాంసకృతులు ఉంటాయి. ఇవి మీ కండరాల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగ పడతాయి. వీలున్నంత వరకూ ప్రతి రోజు గుడ్లను ఆహారంలో భాగంగా చేయాలి.
వ్యాయామం :
తిండి తోపాటు వ్యాయామం తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది. ఏరోబిక్సు, నడక ఆరోగ్యానికి మంచిదే కానీ కండరాల పెరుగుదలకు ఉపయోగ పడవు. కండరాల మీద ఒత్తిడిని పెంచే గుంజిళ్ళు, బస్కీలు, డంబెలుతో చేసే వ్యాయామం చాలా అవసరం. ఇలాంటి వ్యాయామం అలవాటు లేకుండా కొత్తగా మొదలు పెట్టే వారు క్రమంగా పెంచు కోవాలి తప్ప ఒక్క సారిగా భారీ స్థాయిలో చెయ్యకూడదు. అలా చేస్తే మూత్రపిండాలు పాడయ్యే అవకాశం ఎక్కువ.


Wednesday, January 18, 2012

మహిళల్ని వేదించే ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిసార్డర్

కమలకు రాత్రంతా నిద్ర సరిగా పట్ట లేదు. లేచినప్పటి నుంచి చికాకుగా ఉంది. నిద్ర లేచి అలవాటుగా వాకిలి తలుపు తెరిచింది. తలుపు తీయ గానే గుమ్మం దగ్గర కన పడాల్సిన పాల పాకెట్లు కన పడ లేదు. ‘‘అమ్మా! పాలు’’ అంటూ అపుడే వచ్చిన పాల పిల్లవాడు పాకెట్లను చేతికి అందివ్వ బోయాడు. అంతే... ఆలస్యాన్ని భరించ లేని కమల వాడి మీదకు గయ్‌య్ అంటూ లేచింది. పాలు పొయ్యి మీద పెట్టి పిల్లల్ని నిద్ర లేపింది. వాళ్ళు ఒక పట్టాన నిద్ర లేవ కుండా అటు ఇటు పొర్లి మళ్ళీ నిద్రలోకి జారు కోవటానికి ప్రయత్నిస్తుండటంతో చిర్రెత్తు కొచ్చింది కమలకు. ‘‘వెధవ సంత. ఇంట్లో ఒక్కరూ ఎవరి పనులు వారు చేసు కోరు. అన్నిటికీ నే నే చావాలి’’ అంటూ అసహనంగా అరుస్తూ పిల్లలిద్దరినీ వెంటనే నిద్ర లేపింది. పెద్ద పిల్ల పరిస్థితిని గమనించి మాట్లాడకుండా గబ గబా స్నానాల గది లోకి పరుగు తీసింది. కానీ పాపం నాలుగేళ్ళ చంటాడు గయ్‌య్ మంటూ ఏడుపులెత్తుకున్నాడు. అప్పటి వరకు పేపర్ చదువు కుంటున్న ప్రసాదరావు ‘‘ఎందుకే వాళ్ళని అంత హార్ష్‌గా లేపు తావు. నాకు చెబితే నేను లేపే వాడిని కదా!’ అన్నాడు. అంతే! ‘‘ఆ.. ప్రతి రోజూ మీరే లేపేది. ఒక్క పనిలో వేలు పెట్టి ఎరగవు. నిద్ర లేచింది మొదలు ఆ పేపరు ఒకటి నా ప్రాణానికి. పిల్లల్ని తయారు చేశాక చదువు కోవచ్చుగా ఆ వెధవ పేపర్‌ని. ఇంట్లో అందరూ కలిసి నా ప్రాణాలు తోడేస్తున్నారు’’ అంటూ రుస రుస లాడుతూ వంట గది లోకి వెళ్ళింది.

     *******                            *******                            ********                                

స్వతహాగా కమల చాలా నెమ్మదస్తురాలు. ఓపిక ఎక్కువ. ఎప్పుడూ ఎవరినీ విసుక్కోదు. ఈ రోజు కమల ప్రవర్తన అందుకు భిన్నంగా ఉంది. కొందరు మహిళల్లో అప్పుడప్పుడూ కనిపించే ఇలాంటి ప్రవర్తనకు కారణం ‘ప్రీ మెస్ట్రువల్ సిండ్రోం’తో బాధ పడటమే.

ఆడవారిలో ఈడు వయసు వచ్చింది మొదలు నెల నెలా బహిష్టు రావడం సహజం. బహిష్టు రావటం అనేది ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని విధానంలో నెల వారీగా జరిగే తంతు. మహిళల్లో సరా సరిన నాలుగు వారాలకు ఒక సారి ప్రత్యుత్పత్తికోసం అండం విడుదల అవుతుంది. అదే సమయానికి గర్భాశయ లోపలి తలంలో రక్తం జిగురుగా మారి గర్భాశయం లోపలి గోడల్లో మందంగా, పూతలా ఏర్పడుతుంది. ఒక వేళ ఫలదీకరణం జరిగితే దాన్ని గర్భంగా నిలుపు కోవడానికి వీలుగా ఈ ఏర్పాటు జరుగుతుంది. ఫలదీకరణం కనుక జరగక పోతే రెండు వారాలుగా గర్భాశయ గోడల్లో పూతగా ఏర్పడిన రక్తం కరిగి బయటకు వస్తుంది. ఇలా రక్తం బయటకు రావటానినే ముట్టు, నెలసరి, బహిస్టు, బయట చేరటం లాంటి అనేక పేర్లతో వ్యవహరిస్తుంటారు. నెల నెలా వచ్చే రుతుక్రమంలో లూటినైజింగు, ఈస్ట్రోజను, ప్రొజెస్టిరాను అనే హార్మోనులు ఒక పని తరువాత మరొక పనిని గొలుసు కట్టు చర్యలా చేసుకుంటూ పోతాయి. అందులో భాగంగా ఆ హార్మోన్లలో ఉన్నట్టుండి హెచ్చు తగ్గులు ఉంటాయి. మామూలుగా అయితే హార్మోనులకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రమే స్పందిస్తుంది. లో లోపల జరిగే ఈ మార్పులు బయటకు కన పడవు. అందువల్ల ఏ ఇబ్బందులు లేకుండా ఈ కార్యం సాధారణంగా జరిగి పోతుంది.

కొంత మంది మహిళల్లో వారి శరీరంలో వివిధ భాగాలు ఈ హార్మోనుల ప్రభావానికి గురై, శారీరక లక్షణాల రూపంలో ఇబ్బంది పెడతాయి. మరి కొందరిలో వారి మెదడు ప్రభావితం అవుతుంది. చాలా కొద్ది మందిలో అటు శరీరమూ, ఇటు మెదడు రెండూ స్పందిస్తాయి. స్పందించే తీరును బట్టి వారిలో కొద్ది పాటి నుండి చాలా తీవ్ర స్థాయిలో మార్పులు చోటు చేసు కుంటాయి. మెదడు పైన చూపే ప్రభావం వల్ల ఆ సమయంలో వారి ప్రవర్తన మారి పోతుంది. ఈ ప్రవర్తన బహిష్టు రావ టానికి రెండు మూడు రోజుల ముందు నుండి కన పడే మార్పులను ‘ప్రీ మెస్ట్రువల్ సిండ్రోం’ అంటారు. దీనితో బాధ పడే మహిళల్లో కూడా అందరూ ఒకే రీతిగా బాధ పడరు. కొందరిలో కేవలం కొన్ని తేలిక లక్షణా లతో సరి పెట్టగా మరి కొందరిలో తీవ్రంగా ఇబ్బంది పెట్టే ‘ప్రీ మెస్ట్రువల్ డిస్ఫారిక్ డిసార్డర్’గా మారుతుంది. ప్రీ మెస్ట్రువల్ డిస్ఫారిక్ డిసార్డర్ లక్షణాలు ఇలా ఉంటాయి.

మానసిక లక్షణాలు :

మనసులో ఉద్వేగాలు నిలకడగా ఉండవు. వెంట వెంటనే మారి పోతుంటాయి. ఉన్నట్టుండి దిగులు ఆవహిస్తుంది. చిన్న కారణానికే ఏడుపు పొర్లుకు వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండదు. అలజడిగా, ఆందోళనగా ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు పట్టింపు లేని చిన్న విషయానికి కూడా ఈ సమయంలో ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఊహింపు భయం ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత కుదరదు. దానివల్ల ఆలోచనలు స్థిరంగా ఉండవు. మనసు పరి పరి విధాలా పోతుంది. కొందరిలో ఆకలి మందగిస్తే మరి కొందరిలో విపరీతంగా ఆకలి వేస్తుంది. కొంత మందిలో ఈ సమయంలో కొన్ని తిండి అలవాట్లు మార వచ్చు. కొందరికి నిద్ర పట్టక పోగా మరి కొందరు ఎక్కువగా నిద్ర పోయే స్వభావాన్ని చూపుతారు.

ప్రవర్తన లక్షణాలు :

కొంత మందికి ఏ పనీ చేయాలనిపించదు. రోజు వారీగా వారు చేయ గలిగిన పనులు కూడా సరిగా చేసు కోలేరు. మామూలుగా ఉన్నప్పుడు వారిలో ఉండే సహనం, ఓర్పు ఉండదు. విసుగు, చికాకు ఎక్కువ అవుతుంది. అయిన దానికి కాని దానికి చిర్రు బుర్రులాడుతూ ఉంటారు. ప్రతి దానికి చివాలున స్పందిస్తారు. ఆ స్పందన తీవ్రంగా ఉండ వచ్చు. కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ వచ్చే కోపం కారణానికి అనుగుణంగా ఉండదు. చిన్న విషయానికే అగ్గిమీద గుగ్గిలం అయి, ఊగి పోతారు. మచ్చుకు పిలిచిన వెంటనే పలకనందుకే పిల్లల్ని బాది పడేస్తారు. పెద్ద వారితో అయితే గొడవకు దిగుతారు. మామూలుగా ఉన్నప్పుడు తమను తాము అదుపు చేసుకునే వారు ఈ సమయంలో దాన్ని కోల్పోతారు. తమ అనుచిత ప్రవర్తనవల్ల గొడవ మొదలై, అది పెద్దది అవుతుంటే ఒక అడుగు తగ్గి గొడవను సద్దుమణగ నీయకుండా మాట మాట పెంచి అదిపెద్దది అయ్యేందుకు కారణం అవుతారు. దీని వల్ల కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, తోటి ఉద్యోగులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు అయితే ఫరవా లేదు కానీ ఇతరులతో సంబంధాలు తిరిగి మామూలుగా తెచ్చు కోవడం కష్టం కావచ్చు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఆ సమయంలో మహిళ ప్రవర్తన పట్ల భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు అవగాహన ఉండాలి. నెలలో నాలుగైదు రోజులు మాత్రమే ఉండే ఈ ప్రవర్తనని గుర్తించలేక పోవటం వల్ల ఆ సమయంలో మొదలయ్యే చిన్న చిన్న గొడవలు పెద్దవి అయి విడాకులకు దారి తీసిన సందర్భాలు అనేకం.

జాగర్తలు, చికిత్స:

ముందుగా ఇలాంటి ప్రవర్తన తనకు ఉందని మహిళ గుర్తించాలి. నెలలో రెండు మూడు రోజులు ఉండే ఈ ప్రవర్తన పట్ల కుటుంబ సభ్యులకు కొంత అవగాహన ఉండాలి. సమస్య తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు సహకారం అందిస్తే చాలా వరకు ఇబ్బందులు తప్పుతాయి. మాట తీరు, ప్రవర్తన మార గానే దాన్ని గుర్తించి ఆ సమయంలో ఆ మహిళలతో కాస్త జాగర్తగా మెలగాలి. వారి ప్రవర్తనను అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మసలు కోవాలి. ఈ సమయంలో వారిలో కనిపించే విసుగు, కోపానికి, మాటలకు పెద్ద ప్రాధాన్యతను ఇవ్వ కూడదు. వారిని రెచ్చగొట్టే విధంగా కుటుంబ సభ్యులు మాట్లాడ కూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ‘‘నేను నెలసరిలో ఉన్నాను నన్ను నాలుగు రోజులు విసిగించ వద్దు’’ అని కుటుంబ సభ్యుల సహకారాన్ని కోరితే ముప్పావు భాగం ఇంట్లో రాగల గొడవలు నివారించుకున్న వారు అవుతారు. సమస్య ఎక్కువగా ఉన్నా, శరీర లక్షణాలు బాగా ఇబ్బంది పెడుతుంటే డాక్టర్‌ను కలిసి ఆ నాలుగు రోజులు కొన్ని మందులు వాడు కోవాల్సి ఉంటుంది. సాధారణ వైద్యుల దగ్గర నయం కాక పోతే గైనకాలజిస్టు దగ్గర, అక్కడ కూడా తగ్గక పోతే మానసిక వైద్యులను సంప్రదించాలి. సమస్య సాధారణ ప్రీ మెస్ట్రువల్ సిండ్రోం లక్షణాలు దాటి ‘డిస్ఫారిక్ డిసార్డర్’ స్థాయికి పోతే తప్పనిసరిగా మైండ్ ఫిజీషియన్‌ని కలిసి వైద్యం చేయించు కోవాల్సి ఉంటుంది.

11 - 01 -2012