Wednesday, September 7, 2011

కారణం లేకుండా హడలెత్తించే పానిక్ డిసార్డర్

తీరగ్గా టీవీ ముందు కూర్చొని కామెడి చానల్ చూస్తోంది 27ఏళ్ళ వసంత. అప్పటి వరకూ కామెడీ సీనులో లీనమయి నవ్వు కుంటున్న వసంతకు ఒంట్లో ఏదో తేడాగా అనిపించ  సాగింది. ఏమి జరుగుతుందో స్పష్టంగా తెలియటం లేదు. గుండె వేగంగా కొట్టు కుంటుంది. ఏదో తెలియని భయం. గుండెల్లో నొప్పిగా, అదిమినట్టు ఉంది. ఊపిరి ఆడటం కష్టంగా ఉంది. గుండె ఆగి పోతుందేమో అన్నట్టు ఒణికడం మొదలైంది. ఎక్కడ బాలెన్సు తప్పి పడి పోతానో అని పరిగెత్తుకుంటూ ఎదురింటి మీనాక్షి తలుపు తట్టి రొప్పుతూనే పరిస్థితి చెప్పింది. సమయానికి మీనాక్షి భర్త వెంకట్రావు ఇంట్లోనే ఉన్నాడు. దంపతులిద్దరూ కంగారు పడి పోయారు. ఏమయిందో ఏమో అని భార్య భర్తలు ఆమెను గబగబా కారులో ఎక్కించుకొని ఆగమేఘాల మీద ఆసుపత్రికి తీసుకెళ్ళారు. దారిలో మీనాక్షి ఒడిలో పడుకున్న వసంత భయంతో రొప్పుతూనే ఉంది. మీనాక్షి ధైర్యం చెప్పటానికి ప్రయత్నిస్తోంది కానీ అవేమీ వసంతకు ఎక్కటం లేదు. కారు వచ్చిన స్పీడు చూసిన ఆసుపత్రి సిబ్బంది గబగబా వసంతను స్ట్రెచ్చరు మీద పడు కోబెట్టి ఎమర్జెన్సీ వార్డు లోకి తీసుకెళ్ళారు. డాక్టరు ఆమెను చూసి వెంటనే ఈసీజీ తీయించాడు. తక్షణ పరీక్షలు అయ్యాక ప్రమాదం ఏమీ లేదని చెప్పి అయినా అబ్జర్వేషను కోసం ఐసీయుకి మార్చారు. కానీ ట్రీట్‌మెంటు కూడా మొదలు పెట్టక ముందే వసంత పరిస్థితి కుదట పడింది. రెండో రోజు తీరిగ్గా మిగిలిన పరీక్షలు కూడా చేసి గుండె జబ్బు కాదని, టెన్షను పడటం వల్ల అలా జరిగిందని చెప్పి ఓ యాభై వేలు బిల్లు చేతిలో పెట్టారు. 
                          
                    **************************************************

చూడ టానికీ, విన డానికి అచ్చం గుండె పోటును తలపించే వసంత పొందిన లక్షణాలను ‘పానిక్ అటాక్స్’ అంటారు. ఇది గుండెకు ఏ మాత్రం సంబంధం లేని, మనసుకు సంబంధించిన దిసర్దారు లక్షణం. దీనికి కర్త,కర్మ,క్రియ అన్నీ మనసే. 

మామూలుగా అయితే భయ పడటానికి చిన్నదో, పెద్దదో ఒక కారణం అంటూ ఉండాలి. కానీ బయటి కారణం అంటూ ఏమీ లేకుండా హఠాత్తుగా మనసులో కలిగే భయం, దాని తాలూకు శారీరక లక్షణాలు కలిపి కొంత సేపు మనిషిని ఊపి పడేస్తాయి. దీని లక్షణాలు గుండె పోటును తలపిస్తాయి.

ప్రతివారికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ‘పానిక్ అటాక్’ అనుభవానికి గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కొందరిలో చాలా తరచుగా వస్తుంటాయి. వచ్చిన ప్రతిసారీ ఆసుపత్రికి పరిగెత్తటం, ఒక రోజు ఆసుపత్రిలో ఉండి బిల్లు కట్టి రావటం, ఇదే దరువుగా ఉంటుంది. పానిక్ అటాక్స్ ఇలా తరచూ వచ్చే జబ్బును ‘పానిక్ డిసార్డరు’ అంటారు. జబ్బు పలానా అని కనుక్కోనంత వరకూ వీరు గుండె డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఫలితం ఉండదు. ఒక అంచనా ప్రకారం గుండె జబ్బుల ఐసీయులో పది మంచాలు ఉంటే కనీసం రెండు మంచాలలో ఈ పానిక్ డిసార్డరు రోగులు పడుకొని ఉంటారు. సమస్య మానసిక రోగం కాగా వైద్యం జరిగేది గుండె జబ్బుల డిపార్టుమెంటులో.

కారణాలు: 
ప్రమాదాల నుండి, అపాయాల నుండి మనల్ని మనం రక్షించు కోవటానికి ప్రకృతి మన మెదడులో భయం అనే ఆయుధాన్ని ఉంచింది. అయితే భయాన్ని పర్యవేక్షించే కేంద్రం అవసరం అయినప్పుడు మాత్రమే పని చేయాలి. అంటే ప్రమాదం ఎదురు అయినప్పుడు అపాయం జరిగినప్పుడు లేదా జరగ బోతుందనే ఆలోచన వచ్చినప్పుడు భయం కేంద్రం పని చేయటం మొదలు కావాలి. పుట్టే భయం తీవ్రతను బట్టి మనం జాగర్తలు తీసుకొని ప్రమాదం నుండి బయట పడతాం. కానీ పానిక్ డిసార్డరు రోగుల్లో ఈ భయం కేంద్రం ఏ కారణం లేకుండా ఉన్నట్టుండి పని చేయడం మొదలు పెడుతుంది. కాసేపటికి దానంతట అదే సర్దుకుంటుంది. పని చేసిన ఆ కొద్ది సమయం రోగి దుంప తెంచి పడేస్తుంది. ఇలా ఎందుకు అనేందుకు ఇదిమిద్దమయిన కారణాలు తెలియటం లేదు. 40శాతం కేసుల్లో జన్యుపరమయిన కారణాలు కనిపిస్తున్నాయి.

ఆల్కహాలు, మాదక ద్రవ్యాలు వాడే వారిలో పానిక్ డిస్డారీరు ఎక్కువగా కనిపిస్తుంది. పానిక్ దిసార్దారు సాధారణంగా 25-30 ఏళ్ళ వయసులో మొదలవుతుంది. కానీ కొద్ది మందిలో ఎప్పుడూ అయినా మొదలు కావచ్చు. మగ వారిలో కంటే ఆడవారిలో దాదాపు రెట్టింపుగా ఉంటుంది. పిల్లల్లో కూడా రావటానికి అవకాశం ఉన్నప్పటికీ సాధారణంగా వారు పెద్దగా పట్టించు కోరు. వయసు పెరిగే కొద్ది దాన్ని గురించి పట్టింపు ఎక్కువ అవుతుంది.

లక్షణాలు: పానిక్ అటాకు ఉన్నట్టుండి హఠాత్తుగా మొదలవుతుంది. మొదలయిన 10-15 నిమిషాలతో తీవ్ర స్థాయికి చేరుతుంది. ఇలా మొదలయిన లక్షణాలు సాధారణంగా గంట, గంటన్నర ఉండి ఆ తరువాత దానంత అదే తగ్గిపోతుంది. కొంత మందిలో లక్షణాలు గంట కంటే ఎక్కువ సేపు ఉండ వచ్చు. పానిక్ లక్షణాలు ఇలా ఉంటాయి.
  • గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవటం, గుండెల్లో నొప్పిగా ఉండటం లేదా అదిమేసినట్టు, పట్టేసినట్టు ఉంటుంది.
  • ఊపిరి ఆడనట్టు గాలి చాలనట్టు ఉంటుంది. శ్వాసవేగం ఎక్కువ అవుతుంది. అలాగే శ్వాస తీసుకునే లోతు కూడా ఎక్కువగా ఉంటుంది.
  • కళ్ళు తిరిగినట్టు ఉండటం. పడి పోతామేమో అన్న భావన ఉంటుంది. తక్షణమే ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది.
  •   తన మీద తనకు అదుపు తప్పేటట్టు ఉందని అనిపిస్తుంది.
  • పరిసరాల నుంచి తాను వేరు అయి పోతున్నట్టు, వాస్తవ పరిస్థితుల నుండి దూరం అవుతున్నట్టు, ప్రకృతితో కరిగి పోతున్నట్టు ఉంటుంది.
  •   కడుపులో దేవుతున్నట్టు, వాంతికి వస్తున్నట్టు అనిపిస్తుంది.  
  • కాళ్ళు, చేతులు మొద్దుబారి పోతున్నట్టు, సూదులు గుచ్చుతున్నట్టు లేదా తిమ్మిర్లు పడుతున్నట్టు ఉండవచ్చు
  • ఒళ్ళంతా చల్లబడి పోవటం లేదా చెమట పట్టటం కొందరికి ఒంట్లో నుండి సెగలు వస్తున్నట్టు అనిపిస్తుంది. 

పైన చెప్పిన లక్షణాలు అన్నీ అందరిలో ఉండక పోవచ్చు. కొందరిలో కొన్ని అదనపు లక్షణాలు కూడా కన పడవచ్చు. పానిక్ డిస్డారు ముఖ్య లక్షణం ఏమిటంటే పానిక్ అటాక్ లక్షణాలు తగ్గిన తరువాత మళ్ళీ వస్తుందేమో అన్న భయం ఎక్కువగా ఉంటుంది.

ఏమి చేయాలి?
పైన చెప్పిన లక్షణాలు ఎవరికి అయినా కనిపించినప్పుడు గుండె డాక్టరు దగ్గరకు పోతారు. ఒక వేళ అవి గుండె జబ్బు వల్ల వస్తే ఇది ఫలానా కారణం వల్ల వచ్చిందని దానికి వైద్యం చేస్తారు. కానీ గుండె కారణం కాదని చెప్పినప్పుడు ఇలాంటి లక్షణాలు గుండె సంబంధమయిన జబ్బులు ఏమీ లేవని డాక్టరు చెబితే మానసిక వైద్యుడిని కలవాలి. మందులతో బాగా అదుపులోకి వస్తుంది. మందులు లేని చికిత్సా పద్ధతులు అయిన కాగ్నాటివ్ బిహేవియరల్ థెరపీ కూడా బాగా ఉపయోగ పడుతుంది.