Wednesday, January 29, 2014

బీపీ పెరిగితే కోపం వస్తుందా?

చాలా మందిలో బిపి చుట్టు కొన్ని అప నమ్మకాలు, తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. అందులో మొట్ట మొదటిది ఉన్నట్టుండి కోపం వస్తే బిపి పెరిగిందనీ లేదా బీపీ ఉన్నట్టుండి పెరిగితే కోపం వస్తుంది అని. ఇది నిజమేనా? చూద్దాం.

                                           *******************

ఏ రోగానికి అయినా దాన్ని అదుపులో ఉంచ టానికి రెండు తీరులు ఉంటాయి. తొలిది అసలు జబ్బే రాకుండా చూసు కోవటం. ఇది ఖర్చు లేనిదీ, మంచి పద్ధతి. వారసత్వంగా వచ్చే జబ్బులను సయితం వీలయినంత వరకూ రాకుండా లేదా ఎప్పుడో వచ్చేటట్టు దూరంగా నెట్టి వేయగలిగిన పద్ధతి. దీనికి ఇంగ్లీషులో ‘ప్రివెన్షన్ ఈజ్ ది బెటర్ దెన్ క్యూర్’ అనే నానుడి కూడా ఉంది. ఎవరు ఏ మంచి మాట చెప్పినా దాన్ని తొందరగా తలకు ఎక్కించుకోక పోవటం మానవ సహజమే కదా? కాబట్టి చాలా కొద్ది మందే ఈ బాటన నడుస్తారు.రెండో తీరు జబ్బు వచ్చాక దానితో వేగటం. ఇక్కడ ఆసుపత్రులు, డాక్టర్లు, పరీక్షలు, మందులు తెర మీదకు వస్తాయి. అంటే చేతి చిలుము వదిలించుకొనే పద్ధతి. దాదాపు ఎక్కువ మంది పోయే దోవ ఇదే. ఇంతకీ బీపీ అంటే ఏమిటీ? అది ఎందుకు వస్తుందీ? వచ్చాక ఎలా తగ్గించాలి అనే లోతు పాతు ల్లోకి మనం పోవద్దు కానీ పై పైన దాన్ని కాస్త చూద్దాం.


మన ఒంట్లో నెత్తురు గొట్టాలు ఉంటాయి. ఇవి మనం నీటి సరఫరాకి వాడే ప్లాస్టిక్కు గొట్టాలు లాంటివి. గుండె నుండి ఒంట్లో ప్రతి భాగానికీ ఈ నెత్తురు గొట్టాల గుండానే నెత్తురు పారేది. వీటి గుండా నెత్తురు పారేటప్పుడు, పారే ఆ నెత్తురు గొట్టం లోపలి వయిపున ఒత్తిడి కలిగిస్తుంది. ఆ ఒత్తిడే ‘బ్లడ్‌ప్రెషర్’ పొట్టిగా బీపీ, తెలుగులో రక్తపోటు అని అంటారు.


గుండె ‘లబ్-డబ్’ అని కొట్టు కుంటుందని మీకూ తెలుసు కదా! గుండె ‘లబ్’ అని కొట్టు కున్నప్పుడు ఈ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎగువ (సిస్టోలిక్) బీపీ అంటారు. సరాసరిన ఇది 120 ఉండాలి. గుండె సడలింపు జరిగి ‘డబ్’ అన్నప్పుడు నెత్తురు గొట్టాలలో ఒత్తిడి తగ్గుతుంది. దీన్ని దిగువ (డయస్టోలిక్) బీపీ అంటారు. ఇది సరాసరిన 80 ఉంటుంది.
వయసు పెరిగే కొద్ది ఈ రెండు బీపీలు కాస్తో కూస్తో పెరగటం సహజం. ఎంత పెరిగినా ఎగువ బీపీ 130, దిగువ బిపి 90కి మించి ఉండ కూడదు. అంతకంటే ఎక్కువ ఒత్తిడి నెత్తురు గొట్టాలలో ఉంది అంటే అది బిపీ కిందే లెక్క.

ఇక్కడ ఓ చిన్న తిరకాసు ఉంది. బీపీ ఎక్కువ ఉండటానికి బీపీ జబ్బే ఉండక్కర్లేదు. మామూలు వారికి కూడా చాలా సార్లు బీపీ పెరుగుతుంది. నెత్తురు గొట్టాలలో బీపీ పెరగటం అన్నది మన ఒళ్ళు లేదా మనసు చేసే పనిని బట్టి పెరుగుతూ ఉంటుంది. మచ్చుకు బాగా పరిగెత్తినప్పుడు మన ఎగువ బీపీ 200 వరకూ పోవచ్చు. వేగంగా నడిస్తే 180 ఉండ వచ్చు. మానసికంగా ఒత్తిడికి గురి అయినప్పుడు గమ్మున కూర్చుని ఉన్నా బీపీ పెరుగుతుంది. అంతెందుకు, పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు ప్రశ్నపత్రం ఇవ్వబోయే ముందు వారి బీపీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే టెన్షనుగా ఉన్నప్పుడు బీపీ పెరుగుతుంది. ఇలా అవసరాన్ని బట్టి, పనిని బట్టి బీపీ మారుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఉన్నప్పుడు బీపీ చూసి మీకు బీపీ జబ్బు ఉందని అంటే పప్పులో కాలు వేసినట్టే.

కొంత మందికి బీపీ జబ్బు లేక పోయినా డాక్టరు గది లోకి పోగానే బీపీ పెరుగుంది. దీన్ని ‘తెల్లకోటు బీపీ’ అంటారు. అంటే తెల్లకోటు వేసుకున్న డాక్టర్‌ను చూడ గానే పుట్టే బీపీ. ఇలాంటి కూడికలూ, తీసి వేతలు ఉన్నాయి కాబట్టే డాక్టర్లు ఒక రోగిని బీపీ ఉన్న రోగి అని ముద్ర వేయబోయే ముందు చాలా జాగర్తలు తీసుకుంటారు. ముందుగా రోగిని మాట ల్లోకి దించి కాస్త శాంతించాక అప్పుడు బీపీ చూస్తారు. అలా చాలా సార్లు బీపీ చూడాల్సి ఉంటుంది. అంతే కాదు కూర్చోబెట్టి, నిలబెట్టి, పడుకోబెట్టి బీపీ చూసి వాటన్నిటి సరాసరిని లెక్క వేసుకొని అప్పుడు కాని బీపీ రోగిగా ముద్ర వేయ లేము.


బీపీ రోగం ఉన్న వారిలో వారి ఒంట్లో ఉండే నెత్తురు గొట్టాలకు సహజంగా ఉండే సాగుదల లక్షణాన్ని పోగొట్టుకుని గట్టిగా, మందంగా తయారవుతాయి. కొన్ని ఏళ్ళపాటు ఇలా ఉండటం వల్ల ఈ గొట్టా లలో కొవ్వు పేరుకు పోయి గొట్టాలు మూసుకు పోతాయి. దీనికి తోడు ఈ గొట్టాలు పెళుసుబారి ఉంటాయి కాబట్టి సులువుగా చిట్లి పోవటానికి అవకాశం ఏర్పడుతుంది. పక్షవాతం రావటానికి ఒకానొక కారణం మెదడులో నెత్తురు గొట్టాలు చిట్లటం. అసలే మూసుకు పోయి ఉన్న నెత్తురు గొట్టా లలో నలకలు (థ్రాంబస్) అడ్డు పడితే ఆ గొట్టం ఏ భాగానికి నెత్తురును పారిస్తుందో ఆ భాగాలకు పారుదల ఆగిపోతుంది. ఇది గుండె నెత్తురు గొట్టాల్లో జరిగితే దాన్ని గుండె పోటు అంటారు. మెదడులో జరిగితే దాన్ని పక్షవాతం అంటారు. ఇలా కిడ్నీలకు, కడుపులో పేగులకు జరిగే అవకాశం ఉంటుంది.


బీపీ రోగం వచ్చాక దాన్ని తగ్గించుకోను నేరుగా మందులు వాడకూడదు. మరీ కొంపలు ముంచుకు పోయేంత బీపీ ఉంటే తప్ప డాక్టర్లు కూడా వెంటనే మందులు రాయరు. బీపీ ఉందని రూఢీ అయ్యాక ముందుగా చెయ్యాల్సింది సోమరితనాన్ని వదలటం. రోజుకు కనీసం అరగంట నుండి గంట పాటు వేగంగా నడవాలి. చిన్న చిన్న దూరాలకు నడిచి పోయే అలవాటు చేసు కోవాలి. మానసిక ఒత్తిడిని కలిగించే పనులను వీలయినంత చాక చక్యంగా దూరంగా ఉంచు కోవాలి. బరువు ఎక్కువగా ఉంటే దాన్ని వదిలించు కోవాలి. దీనికి తోడు ఉప్పు వాడకాన్ని కనీసానికి తగ్గించాలి. ఇలా చేయటం వల్ల పెరిగిన బీపీ వీలయినంతగా కుదురుకుంటుంది. అప్పటికీ ఎక్కువగా ఉంటే అప్పుడు మందులు వాడు కోవాలి. అంత ఓపిక రోగికి లేక పోతే డాక్టర్లు మట్టుకు చేయగలిగింది ఏముందీ, మందులు రాసి చేతులు దులుపు కోవటం తప్ప.


చాలా మందిలో బిపి చుట్టూ కొన్ని అప నమ్మకాలు, తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. అందులో మొట్ట మొదటిది ఉన్నట్టుండి కోపం వస్తే బిపి పెరిగిందనీ లేదా బీపీ ఉన్నట్టుండి పెరిగితే కోపం వస్తుంది అని. ఇది నిజం కాదు గాక కాదు. మన్ను తిన్న పాములా శాంతంగా ఉండే వారికి నెత్తురు గొట్టాలు పగిలేంత బీపీ ఉండవచ్చు. అయిన దానికీ కాని దానికి గయ్యిమని ఎగిరే వారికి తక్కువ బీపీ ఉండ వచ్చు. కోపం అనేది మనసుకు సంబంధించిన ఉద్వేగం. కోపం వచ్చినప్పుడు ఆ కోపానికి తగ్గట్టు బీపీలో సర్దుబాటు జరుగుతుంది. కానీ బిపీ వల్ల కోపం రాదు.


చాలా మంది తమకు ‘లోబీపీ’ ఉందని చెబుతుంటారు. మీకు ఎవరు చెప్పారయ్యా అంటే డాక్టర్లు చెప్పారని మరో డాక్టరు దగ్గర చెబుతారు. నిజానికి లోబీపీ అనేది మమూలు పరిస్థితుల్లో ఉండదు. ఉందీ అంటే దానికి వెనుక ప్రాణానికి ముప్పు తెచ్చి పెట్టగల మరో పెద్ద కారణం ఉండి తీరాల్సిందే. కొద్ది మందిలో ఏ జబ్బూ లేకపోయినా ఎగువ బీపీ 120 కంటే తక్కువగా, దిగువ బీపీ 80 కంటే తక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది వారి వొంటి తీరే తప్ప, అది ‘లోబీపీ’ జబ్బు కాదు. అది వారి బీపీ అంతే.