Wednesday, March 30, 2011

నిద్రలో పక్క తడిపే అలవాటు (Enuresis) కు విరుగుడు

నిద్రలో పక్క తడపటం (Enuresis) చంటి పిల్లల లక్షణం. పుట్టకతో అనేక అంశాలపై బిడ్డలకు అదుపు ఉండదు.వయసు పెరిగే కొద్ది ఒక్కొక్క దానిమీదే అదుపు సాధిస్తారు. ఈ క్రమంలో ఎక్కడ లోపం జరిగినా ఎదుగుదలకు సంబంధించి సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లో వయసు మీరాక నిద్రలో పక్క తడపటం కూడా ఎదుగుదలలో లోపంవల్ల కనబడే జబ్బు.
     సాధారణంగా పిల్లలు 4, 5 ఏళ్ళ మధ్య కాలంలో పక్క తడపటం ఆపేస్తారు. కొద్దిమంది ఒక వయసు వచ్చాక కూడా రాత్రి పూట పక్క తడుపుతుంటారు. ఇలా తడపటాన్ని వైద్య పరిభాషలో ‘ఎనూరిసిస్’ అంటారు. నిద్రలో పక్క తడిపే పిల్లలందిరిని ఎనూరిసిసు కింద పరిగణించ కూడదు. 4 ఏళ్ళ లోపు పిల్లలు అలా తడపటం సహజ లక్షణమే కాదు, హక్కు కూడా. ఆరు సంవత్సరాల వయసు దాటాక వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పక్క తడిపితే జబ్బుగా గుర్తించాలి. ఇది రెండు రకాలుగా ఉంటుంది.
     మూత్ర వ్యవస్థలో లోపాలు ఏమీ లేకుండా కేవలం ఎదుగుదలలో లోపం వల్ల ఈ సమస్య వస్తే దాన్ని ‘తొలిరకం’ (ప్రైమరి)గా వ్యవహరిస్తారు. మామూలుగా అయితే ఒంటేలు సంచి నిండాక ‘నేను నిండాను త్వరగా ఖాళీ చేయండోచ్’ అని సైగలు (సిగ్నళ్ళు) ద్వారా మెదడుకు సమాచారాన్ని పంపుతుంది. ఈ సైగల రాయబారం నడిపేది ‘వాసోప్రెసిన్’ అనే హార్మోను. మెదడుకు సమాచారం అందగానే ఒంటేలు వచ్చిన ‘అనిపింపు’ (ఫీలింగు) కలిగి ఆ పనికి ఉపక్రమిస్తారు. ఇదంతా మెలకువగా ఉన్నప్పుడు జరిగే తతంగం. అదే నిద్రలో ఉన్నప్పుడు ఈ సైగలు ఒంటేలు వచ్చిన అనిపింపుతో పాటు లేచి పోసుకోవడానికి వీలుగా నిద్రపోతున్న మెలకువ వ్యవస్థను తట్టి లేపాలి. అలా లేపితే నిద్ర మేలుకొని ఒంటేలు పోసుకుంటారు. పక్క తడిపే జబ్బు ఉన్న వారిలో సంచి నిండినట్లు వచ్చే సైగలకు మెదడుకు అందించే వాసోప్రెసిను హార్మోను బాగా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి మెలకువ వ్యవస్థకు సమాచారం అందదు. దాంతో నిద్రలోనే పని కానిచ్చేస్తారు. మరికొంతమందిలో వయసుకు తగ్గట్టు మొదట ఒంటేలుమీద అదుపు వచ్చి కొంతకాలం బాగున్నా తరువాత పక్క తడపటం మొదలు పెడతారు.
     ఒత్తిడి, మూత్ర సంచిలో సమస్యలు, నరాలకు సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు ఆ జబ్బులో ఒక లక్షణంగా పక్క తడుపుతారు. ఈ తరహా పక్క తడపటాన్ని ‘మలిరకం’ (సెకండరీ)గా గుర్తిస్తారు. తొలిరకం పుట్టినప్పటి నుంచి ఉంటుంది. మలిరకం మధ్యలో వస్తుంది. పక్కతడిపే అలవాటు ఉన్న పిల్లలకు ఎక్కువ భాగం తొలి రకానికి చెందినదే అయి ఉంటుంది. మలిరకం చాల అరుదుగా ఉంటుంది. ఇలా విడదీయటానికి కారణం ఏమిటంటే వాటికి చికిత్సా విధానంలో తేడా ఉంటుంది.
     ఏ కారణంవల్ల పక్క తడుపుతున్నా దానివల్ల పిల్లలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నిద్రపరమైన సమస్య కూడా పిల్లలకు ఉండదు. పక్త డిపిన విషయం నిద్ర లేచాక కాని వారికి తెలియదు. మరీ చిన్న పిల్లలకు అయితే తల్లిదండ్రులు చెబితే తప్ప తెలియదు. ఈ జబ్బు ప్రత్యేకత ఏమిటంటే జబ్బు పిల్లలది అయినా ఆందోళన పడేదంతా తల్లిదండ్రులు. ప్రతిరోజూ అదనపు పనితో తల్లులకు విసుగు పుడుతుంది. ఆ విసుగు అంతా పిల్లలమీద చూపిస్తారు. దీనికితోడు ఎవరి ఇంటికైనా పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అవగాహన లేని తల్లిదండ్రులు పిల్లల్ని నిందించటం, ఎగతాళి చేయటం, కొన్నిసార్లు కొట్టటం కూడా చేస్తుంటారు. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బ తినటం, చిన్నబుచ్చుకోవటం చేస్తారు. ఇదంతా తిరిగి వారి మానసిక ఎదుగుదల మీద ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.
     పక్క తడపటం అనే జబ్బువల్ల పక్కవారికి ఎబ్బెట్టుగా ఉండటం తప్ప పిల్లలు ఇతరత్రా ఎదుగుదలకు ఏ రకమైన హానీ ఉండదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తిస్తే ముందువారి ఆందోళన తగ్గుతుంది. పిల్లల్ని తిట్టటం, కొట్టటం, అవహేళనగా మాట్లాడటం లాంటివి చేయకూడదు. దానివల్ల ఉపయోగం కంటే జరిగే నష్టం చాలా ఎక్కువ. కాస్త వయసు వచ్చిన పిల్లలు తమ సమస్యను గుర్తించి మదన పడుతుంటే వారిని తేలిక పరిచేటట్టు ఓదార్చాలి. ప్రయత్నం చేస్తే సమస్య నుండి బైట పడవచ్చన్న భరోసా పిల్లలకు ఇవ్వాలి. చేయించే వైద్యంలో పిల్లలు తమకు తాముగా ఇమిడిపోయే విధంగా తర్ఫీదు ఇవ్వాలి. ఏదో మందులు వేస్తున్నాం అనే ధోరణిలో ఉండకూడదు.


ప్రవర్తన చికిత్స: రాత్రిపూట పడుకోబోయే ముందు పిల్లలకు నీళ్ళు తక్కువగా తాగించాలి. ఐసుక్రీములు లాంటివి తినటాన్ని కట్టడి చేయాలి. ఇంట్లో ఎవరూ చివర పడుకుంటారో వారు పిల్లల్ని లేపి ఒంటేలు పోయించి పడుకోవాలి. అలాగే మధ్యలో పెద్దవారికి ఎవరికి మెలకువ వచ్చినా వారు ఆ పని చేయించాలి. ఒంటేలు బుడ్డ కండరాలను పటిష్ట పరచటానికి పిల్లలచేత కొన్ని రకాల అలవాట్లు, వ్యాయామాలు చేయించాలి. మెలకువగా ఉండేటప్పుడు ఒంటేలు వచ్చినప్పుడు వెంటనే పోసేయకుండా సాధ్యమైనంత సేపు బిగబట్టుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఉచ్చబుడ్డ ఓర్పు పెరుగుతుంది. చేయించదగ్గ మరో వ్యాయామం ఏమిటంటే ఒంటేలు పోసేటప్పుడు త్వరగా ఒకే ధారగా పోయకుండా ఆపి ఆపి ఎక్కువ పోసే అలవాటు చేయాలి. దీనివల్ల ఉచ్చ ఆ ప్రాంతపు కండరాలు గట్టిపడి పక్క తడిపే అలవాటుకు అవకాశం తగ్గుతుంది. పిల్లలకు ప్రవర్తనా పరమైన చికిత్సను మొదలు పెట్టాలి. ముందుగా సమస్యతో ఇబ్బంది పడుతున్న బిడ్డని దాని నుండి బైటపడే విధంగా సమాయత్త పరచాలి. అందుకు పిల్లలతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. నెలలో పక్క తడిపే రోజులు తగ్గే కొద్ది దానికి తగ్గట్టు వారికి బహుమానాలు ఊరించాలి. ఊరించటమే కాదు, సరిగ్గా అమలయ్యే కొద్దీ నిజంగా తీసి ఇవ్వాలి. ఏరోజు అయినా పడక తడపక పోతే ఆ రోజు పిల్లల్ని పదే పదే అభినందించాలి. అలాంటి రోజులు వారిచేతే కాలెండరులో గుర్తు పెట్టించండి. ఆ నెలలో పక్క తడపని రోజులు పెరిగే కొద్ది ఒప్పందం ప్రకారం వారికి బహుమతులు ఇవ్వాలి.
   పక్కతడి అయిన వెంటనే గణగణ మోగే ‘పాడ్ బెల్’ పరికరాలు కూడా మార్కెట్టులో దొరుకుతున్నాయి.చాలామంది పిల్లలకు అవి బాగా పనిచేస్తాయి. క్లినికలు సైకాలజిస్టు పర్యవేక్షణలో దాన్ని ఉపయోగించవచ్చు.


మందులతో చికిత్స : దీనికి విడివిడిగా అనేక చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అయితే వీటన్నింటిని రంగరించి సమగ్ర పరిచే చికిత్స ఉపయోగకరంగా ఉంటుంది. ఎదుగుదల లోపంగా వచ్చే సమస్యకు మానసు వైద్య నిపుణులచేత వైద్యం చేయించాలి. దీనికోసం వాడే మందులు మాత్రల రూపంలోనే కాకుండా ఇప్పుడు సులభంగా ముక్కులోకి పీల్చుకొనే ‘నాసల్ స్ప్రే’లు కూడా దొరుకుతున్నాయి. అయితే వీటిని మైండు ఫిజీషియను పర్యవేక్షణలోనే వాడాలి. మందులు వాడకంతోపాటు ప్రవర్తనా సంబంధమైన ఈ పద్ధతుల్ని నిరంతరం పాటిస్తే ఫలితం బాగుంటుంది

Wednesday, March 2, 2011

"సెక్స్ వాక్సిన్" చాలా జబ్బులను రానివ్వదు

మనం భైటకు చెప్పినా చెప్పక పోయినా ఆరోగ్యంగా ఉండాలనేది ప్రతివారి కోరిక. కోరిక ఉంటే సరిపోదు. దానికి కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలో ప్రతి వారికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. తెలిసిన వాటిని పాటిస్తారా లేదా అన్నది వేరే సంగతి.

ఆరోగ్యాన్ని కాపాడటంలో తిండి, నిద్ర, శారీరక శ్రమ, పరిసరాల శుభ్రత చాల ప్రాధాన్యత వహిస్తాయి. మనిషి ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచటంలో ఇవి నేరుగా పాలు పంచు కుంటాయి. కానీ బయటకు తెలియకుండా దండలో దారంలా పరోక్షంగా ఆరోగ్యానికి దన్ను(back up) నిలిచేది లైంగికత (సెక్సువాలిటి. దంపతులకు దీనిపట్ల సరైన అవగాహన, పరస్పర తోడ్పాటు ఉండి తరచు లైంగిక ఆనందాన్ని పొందితే వారి ఆరోగ్యం నిలకడగా, బలంగా ఉంటుందని ‘వెతుకులాట’ (రీసెర్చి) ఫలితాలు చెబుతున్నాయి.

లైంగిక కార్యంలో కలిగే సుఖ అనుభూతి, భావప్రాప్తి వల్ల కలిగే ఆనందాన్ని మనం నేరుగా అనుభవిస్తాము . కాని దాని పలితాలు అంతటితో ఆగవు. మనకు తెలియకుండానే అది ఆరోగ్య మేలిమికి అనేక విధాలుగా  ఉపయోగ పడుతున్నట్టు ఆధునిక 'వెతుకులాట'(పరిశోధన)లు  తెలుపుతున్నాయి. వాటిలో కొన్ని....

ఒత్తిడిని ఒత్తేస్తుంది : ఏ కారణంవల్ల ఒత్తిడి కలిగినా దానికి స్పందనగా శరీరం అలజడి, ఆందోళనకు గురవుతుంది. అంటే గుండె వేగంగా కొట్టుకోవటం, బీపీ పెరగటం, శ్వాస ఎక్కువ కావటం లాంటి మార్పులు జరుగుతాయి. ఒత్తిడి కొలతను బట్టి ఈ మార్పుల తీవ్రత ఆధారపడి ఉంటుంది. తరచూ సెక్సులో పాల్గొనే దంపతులతో పోలిస్తే పాల్గొనని దంపతులు ఎక్కువ ఒత్తిడికి స్పందిస్తారు. ఆ సంగతి అనేక వెతుకులాటల్లో రుజువు అయింది. సెక్సు దాకా ఎందుకూ భార్యాభర్తలు ఇంట్లో ఉండి తరచూ కౌగిలించుకుంటున్నప్పుడు, ఉద్యోగ రీత్యా ఎడబాటులో ఉన్నప్పుడు వారి రక్తపోటులో తేడాలు కన పడుతున్నట్టు ఈ నడుమ ఒక పరిశోధనలో తేలింది.

మంచినిద్ర మీ సొంతం : లైంగిక కార్యం సజావుగా సాగాలంటే దానికి ముందు ఉన్న రోజువారీ ఒత్తిడిని అధిగమించాలి.సెక్సుకు దిగుతున్నారంటేనే మీకు తెలియకుండానే ఒత్తిడి నుండి ఊరట పొందుతారన్న మాట. మరి ఇంకేం? మంచి నిద్రకు కావాల్సింది కూడా అదేగా.

ఇంకో ముఖ్య విషయం భావప్రాప్తి కలిగినప్పుడు విడుదలయ్యే ‘హాయి’ (ఫీల్ గుడ్) హార్మోనులు అన్నీ నిద్రకు మంచి సావాసగాళ్ళు. ముఖ్యంగా ఆక్సిటోసిను అనే హార్మోను నిద్రతో ప్రాణ స్నేహం చేస్తుంది. మరో వైపు భావప్రాప్తి అయిన వెంటనే శరీర కండరాలు శరవేగంగా రిలాక్స్ అవుతాయి. ఆ స్థితి నిద్రకు పూల పానుపు పరుస్తుంది.

కొవ్వు కరుగుతుంది : లైంగిక చర్య శరీర కదలికలతో కూడుకున్నది. సాధారణ లైంగిక కార్యంలో మన శరీరం పడే శ్రమ వల్ల సరాసరిన 90 కాలరీల శక్తి ఖర్చు అవుతుంది. అంటే 10 గ్రాముల కొవ్వు (ఒక గ్రాము కొవ్వు 9 కేలరీల శక్తికి సమానం) కరుగుతుంది. కొన్ని రోజుల పాటు ఇలా కరుగుతూపోతే అయిదు, ఆరు నెలల కాలంలో ఒక కేజీ కొవ్వు కరగదూ?

మరో సంగతి తరచూ లైంగిక కార్యంలో పాల్గొనే దంపతులకు నిద్రలేమి సమస్యలు తక్కువగా ఉంటాయి. నిద్ర తగ్గినప్పుడు ఆకలి అదుపు తప్పుతుంది. అంటే తక్కువగా నిద్ర పోయే వారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎక్కువ తిని లావు పెరుగుతారు. కాబట్టి లావు కాకుండా నిద్ర ద్వారా పరోక్ష లాభాన్ని సెక్సు సమకూరుస్తుంది.

రోగ నిరోధకశక్తీ ఎక్కువే : ఎప్పుడో ఒకసారి కలుసుకొనే దంపతుల కంటే వారానికి ఒకటి, రెండు సార్లు సెక్సులో పాల్గొనే దంపతులకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. జలుబు, ఫ్లూ లాంటి తరచూ సోకే వైరసు జబ్బులను ఎదుర్కొనే యాంటీ బాడీలు ‘మునో గ్లాబిలిను-ఎ’. లైంగిక చురుకుగా ఉన్న వారిలో ఈ ఇమ్యూనో గ్లాబిలిను ఎక్కువగా ఉంటుంది. ఏ వైరసులు ఒంట్లోకి వచ్చినా వాటి భరతం పడతాయి.

గుండెకు కొండంత అండ : నెలకు ఒకసారి మొక్కుబడిగా లైంగిక కార్యంలో పాల్గొనే వారిలో పోల్చినప్పుడు వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు కలుసు కొనే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం దాదాపు సగానికి పడిపోతుంది. అలాగే పక్షవాతానికి గురయ్యే అవకాశం కూడా దాదాపు సగానికి పడిపోతుంది.
బరువు అదుపులో ఉండటం, నిద్ర సరిగ్గా పట్టటం, బీపీ అదుపులో ఉండటం, మానసిక ప్రశాంతత పొందటం, హాయి హార్మోనులు విడుదల కావటం లాంటి ఉమ్మడి మంచి ఫలితాలవల్ల ఇది సాధ్యపడుతుంది.

అంతులేని ఆత్మ విశ్వాసం : ఎవరికైనా వయసు పెరగకుండా ఉండదు. ముసలితనం రాకుండా ఉండదు. 40 దాటాకా వీలయినంత వరకూ శారీరక మార్పుల్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. భౌతిక రూపాన్నయితే కప్పిపుచ్చ వచ్చేమో కానీ మీ మనసును ఒప్పించలేరు కదా? సెక్సు ఆ పని చేయగలదు.

వయోభారం పైన పడుతున్నా సరే. మీరు లైంగికంగా చురుగ్గా ఉన్నంత కాలం మీ మనసు ముసలితనాన్ని అంగీకరించదు. ఎప్పుడో ఒకసారి సెక్సులో పాల్గొనే 30ఏళ్ళ యువకుడి కంటే నెలలో రెండు సార్లు సెక్సులో పాల్గొనే తాతలో ఆత్మ విశ్వాసం ఎక్కువగా తొణికిస లాడుతుంది.

ఆరని దాంపత్యం: మన ‘అనిపుంపులు’ (ఫీలింగ్స్) వెనుక జీవ సంబంధమైన నాడీ స్రవాలు, హార్మోనుల దన్ను ఉంటుంది. ప్రేమ, ఆప్యాయత, ఆరాధన అనిపింపులను పర్యవేక్షించేది ఆక్సిటోసిను అనే హార్మోను. తరచూ కౌగిలింతలు, సెక్సులో పాల్గొనే వారిలో ఈ హార్మోను ఎక్కువ విడుదల అవుతుంది. అందువల్ల దంపతుల నడుమ పరస్పర ఆప్యాయత, అనురాగాలు పెరుగుతాయి. వీరి దాంపత్యం ఉదాసీనంగా ఉండదు. కలివిడి ఎక్కువగా ఉండటంవల్ల వారి మనసుల నడుమ దూరం తగ్గుతుంది.

నొప్పులకు ‘నో’ : శరీరంలో నొప్పి పుట్టినప్పుడు దాన్ని తగ్గించ టానికి మన శరీరంలోనే ‘ఎండార్ఫిన్లు’ అనే ' ఫీల్ గుడ్’ హార్మోన్లు ఉంటాయి. ఇవి ఆక్సిటోసినుకు బానిసలు. ఆక్సిటోసిను ఎక్కువ విడుదల అయిన ప్రతిసారి మర్యాద పూర్వకంగా ఇవి కూడా ఎక్కువ విడుదల అవుతాయి. అవి ఎక్కువ అయితే నొప్పి తగ్గుతుంది. కీళ్ళవాతం లాంటి నిడివికాల జబ్బులతో ఎప్పుడూ నొప్పిని భరించేవారు సెక్సు తరువాత కొంతసేపు నొప్పులు మాయం కావటానికి కారణం ఇదే.

వృద్ధాప్య సమస్యలు దూరం: మగవారిలో సమస్యలు ప్రొస్టేటు కాన్సర్, ఆడవారిలో గర్భ సంచి జారటం (ప్రొలాప్స్) వయసుతో పాటు వచ్చే సమస్యలు. లైంగికంగా చురుకుగా ఉండే వారిలో ఈ రెండు సమస్యలు రావటానికి అవకాశాలు తగ్గుతాయి.

ఇన్ని ఉపయోగాలతో పాటు ఆనందపు అంచులు రుచి చూపించే లైంగిక కార్యాన్ని ఏ మేరకు పట్టించు కుంటున్నామనేది ఎవరికి వారు వేసు కోవాల్సిన ప్రశ్న. 

చివరగా ఓ సన్నాయి నొక్కు ఏమిటంటే ప్రేమ, అభిమానాలతో కూడా సెక్సుకూ, అది లేని యాంత్రికమైన వ్యాపార సెక్సుకూ తేడా ఉంది. మొదటి దానితోనే ఉపయోగం ఎక్కువ