Wednesday, December 29, 2010

కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి ? పార్టు - 2

నిత్య జీవితంలో మనకు తారసపడే వ్యక్తులు, బంధువులు, స్నేహితులు, తోటి పనివారు ‘కోపం’ వచ్చినప్పుడు దానిని ఎలా చూపిస్తారనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని చూడండి! అటు ఉగ్రరూపంతో ఊగిపోయే వారినుండి ఇటు ఏ మాత్రం తొణక్కుండా సర్దుకుపోయే వారి వరకూ అనేక స్థాయిల్లో మన కళ్లముందు మెదులుతారు. కోపాన్ని ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కోపం రావడానికి అవసరం అయిన అన్ని దినుసులు ‘మన’లో ఉన్నా, దాన్ని పొడిచి లేపేది మాత్రం ‘బయటి’ కారణాలే. అయితే వచ్చిన కోపం ఎలా ప్రదర్శించాలనేది మాత్రం ‘మనలో’ ఉంటుంది. మనలో మూడు అంశాలు కోపాన్ని నియంత్రిస్తాయి.

  1. వ్యక్తి కోప స్వభావం
  2. వారిలో ఉన్న ఓర్పు
  3. కోప కారకులతో ఉన్న సంబంధం
ఈ మూడు సందర్భాన్ని బట్టి అటు కోపాన్ని పెంచడం కానీ, ఇటు తగ్గించడం కానీ చేస్తాయి. అలాగే కోపాన్ని ఏ రూపంలో చూపాలి, ఎంత వేగంగా చూపాలి అనేది నిర్ణయిస్తాయి.


కోప స్వభావం: కొందరికి మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. వారికి వచ్చే ఆలోచనలు, చేసే పనులు సరాసరి వ్యక్తులకన్నా వేగంగా ఉంటాయి. వీరి ప్రవర్తన, శరీర కదలికలు దానికి తగ్గట్టే ఉంటాయి. ఇలాంటి వారిలో కోపం విడుదల వేగంగా ఉంటుంది. అయితే ఇది జబ్బు కాదు. సహజ స్వభావం.

కొన్నిరకాల మానసిక జబ్బుల్లో మెదడు అతి చురుకుగా ఉంటుంది. చిన్నపిల్లల్లో కనిపించే ‘తులవతనం’ లేదా అతి చురుకుదనం (ADHD), మానియా, కొన్ని రకాల స్కిజోఫ్రెనియా జబ్బుల్లో, మెదడు చురుకుదనం చాలా ఎక్కువ అవుతుంది. ఇవి కాక మెదడును ప్రేరేపించే మాదక ద్రవ్యాలు వాడినప్పుడు కూడా మెదడు చురుకుదనం ఎక్కువ అవుతుంది. ఇలాంటి వారు ఆ సమయంలో సహజ స్వభావానికి భిన్నంగా చిన్న కారణానికి కూడా ఉన్నట్టుండి కట్టలు తెంచుకున్నట్టు (Impulsive) కోపాన్ని చూపుతారు. జబ్బు తగ్గగానే యధాస్థితికి వస్తారు.

ఓర్పు: ఇక ఓర్పు విషయానికి వస్తే ప్రతి వారికి కొంత ఓర్పు సహజంగానే ఉంటుంది. మనకు ఉన్న ఓర్పును పది పాయింట్ల స్కేలుమీద మనమే ఊహించుకోవచ్చు. చాలా చిన్న విషయాన్ని కూడా ఓర్పులేనివారు ఒకటో పాయింటులో ఉంటారనుకుంటే, ఎంత రెచ్చగొట్టినా ఏమాత్రం సడలని వారు పదో పాయింటులో ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర వారిదయిన ఓర్పు పాయింటు(Threshold) ఉంటుంది. కోపానికి కారణమయ్యే సంఘటన జరిగినప్పుడు తమ ఓర్పు పాయింటు వరకు సహనాన్ని చూపుతారు. ఈలోగా సంఘటన సమసిపోయిందంటే పర్వాలేదు. కానీ అవతలి వారు తెగేదాకా లాగితే ఇక సహనం నశించి ఉగ్రరూపులు అవుతారు. మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఓర్పు 10-దో పాయింటులో ఉంటుంది. శిశుపాలుడు తన మాటలతో శ్రీకృష్ణుడిని రెచ్చగొడుతుంటే తన ఓర్పును 10-దో పాయింటు వరకూ వక్కలు లెక్క పెట్టుకుంటూ గడిపి, అది దాటగానే ఆయుధాన్ని వదిలి తల నరికేస్తాడు. అదే ఏ భీముడో అయివుంటే, ఓర్పు తక్కువ కాబట్టి ఆ పని 2-డో పాయింటులోనే జరిగి ఉండేది. ఓర్పు వచ్చే కోపాన్ని కొంత ఆపగలదే కానీ అసలు రానీయకుండా నివారించలేదు. కాకుంటే ఉగ్గబట్టుకునేట్టు చేస్తుంది. వ్యక్తులను, సంఘటనలను అర్ధం చేసుకోలేనివారు, ఎదుటివారి దృష్టితో ఆలోచించలేని వారికి ఓర్పు తక్కువ. అహంభావం, ఆధిపత్య ధోరణులు ఉన్నవారు, ఇతరుల హక్కుల్ని అంగీకరించని వారికి కూడా ఓర్పు తక్కువగా ఉంటుంది. వీటికి భిన్నంగా ఉండే వారికి సహజంగానే ఓర్పు ఎక్కువగా ఉంటుంది.

సంబంధాలు: వచ్చిన కోపాన్ని ఏ రూపంలో ఎంత స్థాయిలో చూపాలనేది ఎవరిమీద కోప్పడుతున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎదుటి వ్యక్తితో వున్న సాన్నిహిత్యం, పగ, ఆ వ్యక్తి వయసు, సామాజిక హోదా, ఆర్థిక స్థితి మొదలైన అంశాలమీద ఆధారపడి వుంటుంది. చెప్పిన మాట విన్నప్పుడు పిల్లలపై ఎక్కువగా కోప్పడతారు. అదే పెద్దవారు విననప్పుడు అంతగా కోపం చూపరు. అలాగే స్నేహితులు ఎగతాళిగా మాట్లాడితే చిరుకోపం చూపే వ్యక్తి గిట్టని వారు ఎగతాళి చేసినప్పుడు చాలా తీవ్రంగా కోపం చూపిస్తారు.
పైన చెప్పిన మూడు అంశాలు కోపం ప్రదర్శించిన వ్యక్తికే కాకుండా కోపాన్ని భరించాల్సిన వ్యక్తికి కూడా వర్తిస్తాయి. ఒకరు కోప్పడినా, అది గొడవగా మారడమా, సద్దుమణగడమా అనేది ఇరువైపులా ఈ అంశాల ప్రాతిపదికనే ఉంటుంది. జరిగే నష్టం వీటినిబట్టే ఉంటుంది.
జీవ లక్షణమైన కోపాన్ని సామాజిక పరిస్థితులకు తగ్గట్టు వెలువరించడంలో ఇన్ని వడపోతలు ఉన్నా వాటిని దాటుకుని ముక్కుమీద కోపాన్ని ప్రదర్శిస్తుంటే, దానివల్ల వచ్చే సామాజిక నష్టాలు ఇలా ఉంటాయి.
  • మానవ సంబంధాలు దెబ్బతింటాయి
  • పగ, ప్రతీకారాలకు కారణం అయి, డబ్బు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది
  • కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు కారణం అవుతుంది.
  • పరువు బజారుకు ఎక్కుతుంది.
  • వృత్తి, దానికి సంబంధించిన వివిధ రకాల నష్టాలు చవి చూడాల్సి వస్తుంది.
  • వ్యాపార లావాదేవీలలో తేడా వచ్చి ఆర్థికంగా నష్టపోతారు.
  • హింసా చర్యలకు పాల్పడి నేరస్తులుగా మారడానికి అవకాశాలు పెరుగుతాయి.
  • ఆరోగ్యం పాడయితే ఆర్థిక భారం పడుతుంది.

ఇక ఆరోగ్యకరమైన అంశాలకు వస్తే, అవసరం అయిన దానికంటే ఎక్కువగా తరచు కోపదారి ప్రవర్తన ఉండేవారికి రక్తపోటు, మధుమేహం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండెపోటు, పక్షవాతం లాంటి వయసుతో ముడిపడ్డ జబ్బులు రావాల్సిన వయసుకంటే కాస్త ముందు గానే రావడానికి అవకాశం ఉంది.

No comments:

Post a Comment