Wednesday, January 5, 2011

కోపాన్ని తగ్గించుకోండి ఇలా... పార్టు-3 .

కోపం జీవ లక్షణం. దాన్ని ప్రదర్శించటం జీవి లక్షణం. మనం సామాజిక జీవులం కాబట్టి సమాజ పరిస్థితులు, వ్యక్తులు కోపానికి కారణం అవుతారు. అయితే సమాజం కానీ, అందులో ఉండే వ్యక్తులు కానీ మనకు తగ్గట్టు ఉండరు. అటు వైపు నుండి ఏదో ఒక రూపంలో కోపానికి కారణం అవుతుంటారు. మనకు నచ్చని సంఘటనలు మన ప్రమేయం లేకుండా జరుగుతూనే ఉంటాయి. అవి మన అదుపులో ఉండవు. అదుపు చేయలేము కూడా. ఇక ఉండేదల్లా మనపై మనకు అదుపు. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవటానికి మనతో మనమే తిప్పలు పడాలి తప్ప బయటి పరిస్థితుల్ని కట్టడి చేయలేము. 

కోపం రావటం జీవ లక్షణమే అయినా దాన్ని ప్రదర్శించే తీరు మాత్రం ‘నేర్చుకున్నదే’. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టూ ఉన్న జనాన్ని నమూనాలుగా తీసుకొని మన మెదడు చురుకుదనం ఆసరాగా కోప ప్రదర్శనా తీరు అలవడుతుంది. అంటే ‘కోపదారి ప్రవర్తన నేర్చుకున్నది’ అని మొదట గుర్తించాలి. నేర్చుకున్నది ఏది అయినా వద్దనుకుంటే వదిలేయవచ్చు లేదా అవసరాలకు తగ్గట్టు తిరిగి మార్చుకోవచ్చు. అందుకు కావల్సిందల్లా మార్చుకోవాలన్న సంకల్పం, దానికి తగ్గ సాధన. అందుకు సిద్ధంగా ఉన్న వారికి కోపాన్ని అదుపులో పెట్టటానికి నాలుగు రకాల ఎత్తుగడలు ఉన్నాయి.

1.  ఓర్పును ఎక్కువ చేసుకోవడం.

2.  కోపాన్ని బలవంతంగా తొక్కిపెట్టటం.

3.  వచ్చిన కోపాన్ని మెత్తగా ప్రదర్శించటం.

4.  వైద్యం చేయించుకోవటం.

నడవడిక మారాలి
వ్యక్తిలో ఉండే ఓర్పు వచ్చే కోపాన్ని కొంత వరకు ఆపగలదు. ఓర్పు ఎంత పెరిగితే కోపం అంత వెనక్కు మళ్ళుతుంది. ఓర్పు తక్కువగా ఉండేవారు ప్రయత్నం చేసి దాన్ని పెంచుకోవచ్చు. కోపానికి కారణం అయిన సంఘటనలను అర్థం చేసుకోవటానికి (చెప్పిన వేళకు రాలేదని కోప్పడటం కంటే ఎందుకు రాలేక పోయారు? ఎదయినా ఇబ్బంది వచ్చిందేమో?) ప్రయత్నించాలి. ఏం జరిగింది. ఎందుకు జరిగింది. ఎలాంటి సందర్భంలో జరిగింది. దానికి కారణాలు ఏమిటి అనే అంశాలను పరిశీలించటం అలవాటు చేసుకోవటం మొదలు పెడితే ఓర్పు దానంతట అదే పెరుగతూ ఉంటుంది. కోపకారకుల నడవడికను (ట్రాఫిక్కు నిబంధనలను తుంగలో తొక్కటం ఆటోవాళ్ళ నడవడిక) అవగతం చేసుకోవటం, వారి తెలివితేటలు (తెలివి తక్కువగా ఉండే పని వాళ్ళు చెప్పిన పనిని సరిగా చేయలేరు), వారికి ఉండే పరిమితులు (కౌంటర్‌లో ఉన్నవారు సొంత నిర్ణయాలు తీసుకోలేరు) తదితర అంశాలను పరగణనలోకి తీసుకొని, వారివైపు నుండి ఆలోచించటం (వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? నేనే ఆ పరిస్థితుల్లో ఉంటే?) అలవాటు చేసుకుంటే ఓరిమి వద్దన్నా పెరుగుతుంది. అహంభావం (నాకు చెప్పటానికి వీరెవరూ?) పెత్తందారీ ధోరణిని (నా ప్రకారమే నువ్వు ఉండాలి) చూపే వారు, ఇతరుల హక్కుల్ని అంగీకరించని వారికి ఓర్పు చాలా తక్కువ. 

ఇలాంటి వారు ఓర్పును పెంచుకోవటానికి యోగా, ధ్యానం, ఊరట (రిలాక్షేషన్) మెళకువలను పాటిస్తుంటారు. తమలో ఇమిడి ఉన్న ఈ నడవడికను మార్చుకోకుండా ఓర్పును ఒంటబట్టిచ్చుకోవటం అనేది జరిగే పనే కాదు. ఇలాంటి వారు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులు, అధికారులుగా ఉంటే కింద సిబ్బంది, వీరి కోపానికి తరుచూ గురవుతుంటారు. అవతలి వారికి వీలుకాక అప్పటికి అణిగి ఉన్నా ఏదో ఒక సమయంలో తిరగబడటం ఖాయం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందు నుంచే నడవడకలో మార్పు తెచ్చుకోవాలి. నడవడిక ధోరణులను ఎవరికి వారు మార్చుకోవటం ఒక పట్టాన వీలయ్యే పని కాదు. ఇలాంటి వారికి ‘‘మది-నడవడిక చికిత్స’’ (కాగిటివ్-బిహేవియర్ థెరపి) చాలా బాగా పని చేస్తుంది. ఇతరులపట్ల మదిలో ఏర్పర్చుకున్న పొరపాటు ధోరణులను సమూలంగా తొలగించి, ఆరోగ్యకరమయిన కొత్త ధోరణులతో మదిని తిరిగి కట్టటం (కాగ్నిటవ్ రీ కన్‌స్ట్రక్షన్) ఇందులో ఇమిడి ఉన్న కిటికు. ఈ చికిత్సను బాగా అనుభవం ఉన్న సైకియాట్రిస్టులు, క్లినికలు సైకాలజిస్టులు మాత్రమే చేయగలరు.

కోపాన్ని అణచవద్దు
ఎదుటివారి మాటలు, చేతలు రెచ్చగొడుతూ ఉంటే ఓర్పు పాయింటు దాటాక కోపం వస్తుంది. కానీ కోప్పడటానికి ఏ మాత్రం అవకాశం లేనప్పుడు ఎలా దించుకోవాలి? కోపకారకులు పెద్దవారు, పలుకుబడి ఉన్నవారు, అధికారులు, బలవంతులుగా ఉన్నప్పుడు వారు తెప్పించే కోపాన్ని అణుచుకోవాల్సి ఉంటుంది. కోపాన్ని అణచిన ప్రతిసారీ ఒంటికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. కోపాన్ని అణచిన ప్రతిసారీ ఒంటికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే ఫరవాలేదు. తరచూ లేదా నిరంతరం ఇలా ఉగ్గబట్టుకోవటం వల్ల జరిగే నష్టం జమ అవుతూ పేరుకుపోతూ ఉంటుంది.
కోపాన్ని చురుకుగా బయటకు చూపినా, లోనికి అణచివేసుకున్నా ఒంట్లో జరిగే మార్పులు దాదాపు ఒకలాగే ఉంటాయి. ఇలా జరిగినప్పుడు అత్యవసర (సింపథిటిక్) నాడీ వ్యవస్థ చెలరేగి పోతుంది. ఈ సమయంలో ఎక్కువ మొత్తంలో అడ్రినలిను, నారడ్రినలిను ఊరుతాయి. ఇవి విడుదల అయిన ప్రతీసారి ఒళ్ళు పాడవుతుంది. అంతేకాకుండా వీటిని తిరగ్గొట్టడానికి అంతే మొత్తంలో ‘కార్టిసాలు’ అనే హార్మోను కూడా ఊరుతుంది. ఈ రెండింటి మధ్య ఎంతగా పోరు జరిగితే ఒళ్ళు అంతగా పాడుబడి పోతుంది. కార్టిసాలుతో వచ్చిన మరో చిక్కు ఏమిటంటే అవసరానికి మించి ఎంత ఎక్కువగా ఊరితే అంత ఎక్కువగా రోగ నిరోధక శక్తిని దెబ్బ తీస్తుంది. కాబట్టి వచ్చిన కోపాన్ని తొక్కి పెట్టటం కంటే మేలు జరిగే రూపంలో విడుదల చేయటం మంచిది.

మెతక కోపం ముద్దు
కోపాన్ని ఎన్ని రకాలుగా చూపినా అవన్నీ చివరకు రెండు పాయలుగా చీలుతాయి. ఒకటి ‘చురుకు కోపం’ (యాక్టివ్ అగ్రషన్) కాగా మరొకటి ‘మెతక కోపం’ (పాసీవ్‌అగ్రషన్). చురుకు కోపం అంటే కొట్టటం, తిట్టటం, అరవటం, విసుక్కోవటం, నసుక్కోవటం, ముఖం చిట్లించుకోవటం లాంటివి. వీటిలో ఏ ప్రవర్తన అయినా నూటికినూరు పాళ్ళు అవతలి వారిపై ప్రతికూలంగా ఉంటుంది. ఈ రకమయిన కోపం అప్పటికప్పుడు అవతలి వారిని భయ పెట్టినా నిడివి కాలంలో వ్యతిరేకత మూట కట్టుకుంటారు. కోపాన్ని మెత్తగా ప్రదర్శించటం అంటే మాట్లాడకుండా ఉండటం, అలగటం, సహాయ నిరాకరణ, తప్పించుకుని తిరగటం, నవ్వుగా మార్చటం. మెత్తని కోపానికి బలం ఎక్కువ. ఎదుటి వారి మనసు గెలుచుకోవచ్చు. కోపానికి కారణం అయిన వారిని మానసికంగా చితక్కొట్టి పగ తీర్చుకొనే రహస్య సూత్రం ఇందులో ఉంది. పైగా ఎదుటి వారిలో పరివర్తన కూడా తీసుకు రావొచ్చు. వారు మునుపటి కంటే మీతో జాగర్తగా ఉంటారు. మానవ సంబంధాలు మెరుగు అవుతాయి. ఇది ఆరోగ్యకరమయిన పద్ధతి.

కోపానికి మందులు ఉన్నాయి
అవధులు దాటే కోపాన్ని అదుపు చేయటానికి ఇప్పుడు మందులు ఉన్నాయి. మెదడు చురుకుదనం వల్ల మానసిక జబ్బుల వల్ల వచ్చే కోపాన్ని ఆయా జబ్బులకు వైద్యం చేయటం ద్వారా కోపాన్ని తగ్గించవచ్చు. ఇవి కాక ఇతర ఏ కారణంవల్ల అయినా అవధులు దాటిన కోపం ప్రదర్శిస్తున్నా, తరచూ ఇంట్లో వస్తువులు పగలగొడుతున్నా, ప్రతి వారితో గొడవ పడి సంబంధాలు దెబ్బతింటున్నా, అనేక మందితో కొట్లాటలకు దిగుతున్నా అలాంటి కోపాన్ని మందులతో సరి చేయవచ్చు. మనసు వైద్య నిపుణులు దీనికి చికిత్స చేస్తారు.
---------------------------------------------------------------
చిరునామా: బ్రైన్ వేవ్ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు-5240011 comment:

  1. కోపం గురించి, దాన్ని తగ్గించగల మార్గాల గురించి చాలా బాగా చెప్పారు శ్రీనివాస తేజ గారు. మూడు పార్ట్లు ఇప్పుడే చదివాను. చాలా మంచి విషయాల్ని తెలియజెప్పారు. Thank you..

    ReplyDelete