Wednesday, January 19, 2011

మీ నిద్రలో.. "మెరుగు" ఉందా?!

‘‘మీ పేస్టులో ఉప్పుందా?’’ ‘‘మీ ఉప్పులో అయోడిను ఉందా?’’ ఈ ప్రకటనల్ని రోజుకు కనీసం ఓ ఇరవయి సార్లు అయినా (ఇడియట్ బాక్స్) అనబడే టీవీ మన బుర్రల్లోకి దూరుస్తుంది. కారణం! అవి లేకపోతే మేము అమ్ముతాము కొనుక్కోండి అని చెప్పడమే. అంటే మన ఆరోగ్యాన్ని గుర్తు చేస్తూ వ్యాపారం చేసుకోవడం. మీ నిద్రలో ‘మెరుగు’ ఉందా? అనే ఏ ప్రకటనా ఉండదు. కారణం ఏమిటంటే నిద్రనీ, అందులో నాణ్యతనీ ఎవరూ అమ్మలేరు. మనం బాగా నిద్ర పోయినప్పుడు ఒక రకంగా ఉంటాము. నిద్ర తగ్గినప్పుడు మరోలా ఉంటాము. నిద్ర సరిగా లేనప్పుడు తగిన నిద్రను బట్టి పర్యవసానం ఎలా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. అయితే మనకు నేరుగా తెలియకపోయినా నిద్ర వల్ల ఒనగూడే ప్రయోజనాలు బోలెడు ఉన్నాయని పరిశోధనల్లో తెలుతున్నాయి. వెతికే కొద్దీ ఒక్కొక్కటే బయట పడుతున్నాయి.

పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ పనిచేసే నాడుల్లో నిరంతరం మలినాలు ఏర్పడుతుంటాయి. అవి అలాగే పేరుకు పోతే నాడీ వ్యవస్థ పనిలో లోపం ఏర్పడుతుంది. మెలకువగా ఉన్నప్పుడు ఏర్పడిన మలిన పదార్ధాలను తొలగించి నాడులు తమను తాము మరమ్మతు చేసుకునేది నిద్రలోనే. అంతేకాకుండా నాడుల మధ్య సమాచార మార్పిడి కోసం ఏర్పడే అనుసంధానాలు నిద్రలోనే జరుగుతాయి. అంటే అవసరాల నిమిత్తం నాడుల మధ్య పరస్పర సంబంధాలు ఏర్పరుచుకుంటూ ‘నాడీవల’(న్యూరోనాల్ నెట్‌వర్క్)ను రూపొందించుకునే పని నిద్రలో జరుగుతుంది. అందుకే ఎదిగే పిల్లలు ఎక్కువగా నిద్ర పోతారు.
పిల్లల శరీర ఎదుగుదలకు ప్రొటీన్లు ఇటుకల వంటివి. ఎదిగే పిల్లలకు అవి అత్యంత అవసరం. వీటి తయారీని ప్రోత్సహించే ‘గ్రోత్ హార్మోన్’ మామూలుకంటే నిద్రలో ఎక్కువగా విడుదల అవుతుంది. శరీరంలో వచ్చే లోపాలను మరమ్మతు చేయడానికి ప్రోటీనులు కావాలి. అలాగే రోగ నిరోధక శక్తిని పర్యవేక్షించే ఇమ్యునోగ్లాబిన్స్ తయారీకి ఈ ప్రోటీనులే ముడి సరుకు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రోటీనుల తయారీ భారీ ఎత్తున జరిగేది నిద్రలోనే. అలాగే పెద్దల్లో ఎదుగుదల ఆగిపోయినప్పటికీ బతికినంత కాలం శరీరంలో ఎక్కడ లోపం వచ్చినా దాన్ని మరమ్మతు చేసేది కూడా ఈ ప్రోటీనే్ల.
నిద్రవల్ల ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. మనసు కుదుట పడుతుంది. పని చేసేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, చదివేటప్పుడు మనసుకు నిలకడ (Concentration) కుదురుతుంది. మెలకువగా ఉన్నప్పుడు పొందే అనుభవాలు, తెలుసుకున్నవి, నేర్చుకున్నవి నిద్రలో స్థిరపడతాయి. అంటే అవన్నీ అమైనో ఆమ్లపు గొలుసులుగా మారి నిలువ ఉంటాయి. అవసరం అయినప్పుడు జ్ఞాపక శక్తికి అందుబాటులో ఉంటాయి. నిద్రవల్ల మనసు, శరీరం పగలు కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకుంటాయి. అందువల్ల నిద్ర లేవగానే హుషారుగా ఉంటుంది. ఈ విధంగా శరీరం సమతా స్థితిని పొందుతుంది.
ఊబకాయం పెరగడానికి ఉన్న ఇతర కారణాలతోపాటు నిద్ర తగ్గడం కూడా ఓ ప్రధాన కారణం అని పరిశోధనల్లో తేలింది. సరిపోయినంత నిద్ర ఉన్నప్పుడు ఆకలి అదుపులో ఉంటుంది. నిద్ర తగ్గినప్పుడు ఈ అదుపు తగ్గడంవల్ల తెలియకుండానే ఆకలి ఎక్కువై తిని బరువు పెరుగుతారు. లావు తగ్గాలనుకునేవారు ముందుగా నిద్రను సరిచేసుకోవాలి.
శరీరంలో రోజుకు కొన్ని లక్షల కాన్సరు కణాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే మన శరీరంలో ఉన్న ‘ఎన్.కె.కణాలు’ (Natural Killer cells ) అనే మరోరకమైన కణాలు డేగ కన్నుతో పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పుట్టే కాన్సర్ కారక కణాలను వెతికి చంపుతాయి. నిద్ర తగ్గినప్పుడు శరీరంలో ‘కార్టిసాల్’ అనే హార్మోను ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది. ఈ హార్మోను ఎక్కువ అయ్యే కొద్దీ రక్షణ బాధ్యతను చూసే ఎన్‌కె కణాలు బలహీన పడతాయి. దాంతో కాన్సరు కణాలు రెచ్చిపోయి రోగంలా మారేందుకు అవకాశాలు పెరుగుతాయి.
నిద్ర తగ్గినందువల్ల జరిగే నష్టం, ఏ మేరకు నిద్ర తగ్గిందీ, ఎంత కాలంగా తగ్గిందీ, ఎంత నాణ్యత తగ్గిందనేదాన్ని బట్టి ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న నిద్రను మనం సరిగా అనుభవిస్తున్నామా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది.
నిద్రని గంటల్లో కొలవడం అనాదిగా ఉన్నదే. నిద్ర పోయిన సమయాన్నిబట్టి మనం బాగా నిద్రపోయామని అనుకుంటాం. కానీ అన్ని సందర్భాల్లో అది నిద్ర నాణ్యతని సూచించలేదు. అన్నింటిని కొలవగలిగే ఈ రోజుల్లో నిద్రని కూడా కొలవవచ్చు.
ఎవరికి ఎంత నిద్ర కావాలి? ఎన్ని గంటలు నిద్ర పోతారు? పడుకున్న వెంటనే నిద్ర పడుతుందా? నిద్ర పట్టినా అది సరిగా కొనసాగుతుందా? అందులో మేలిమి ఉందా? లాంటి వివిధ అంశాలను నిద్ర నాణ్యతను తెలుపుతాయి. వీటిని అంచనా వేయడానికి అనేక పద్ధతులు, కొలమానాలు ఉన్నాయి. వీటిలో నిద్ర రాసి (క్వాంటిటీ)ని సూచించేవి కొన్ని కాగా మరికొన్ని ‘వాసి’ (క్వాలిటీ)ని సూచిస్తాయి. నిద్ర బలాన్ని, సరాసరి నిద్రకాలాన్ని చూపే కొలత పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ వాటిని డాక్టర్లు వాడతారు. జనం ఎవరికి వారు తమ నిద్రను అంచనా వేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతులు కొన్ని.
రాసి(Quantitative )పద్ధతి : ప్రపంచవ్యాప్తంగా మనుషులు సరాసరిన పడుకొనే విధానం, నిద్రపట్టే విధానం, నిద్రలో గడిపే సమయం, అందులో వచ్చే కలతలు మొదలైన అంశాలు దృష్టిలో ఉంచుకుంటే మంచి నిద్రకు ఈ కింది లక్షణాలు ఉండాలి.
1. సరాసరిన నిద్రపోయే సమయం 7నుండి 9 గంటల మధ్య ఉండాలి.
2. పడుకున్న 10నుండి 20 నిముషాలలో కంటి మీద కునుకు పడాలి.
3. మధ్యలో వచ్చే మెలకువలు స్వల్ప వ్యవధిలో ఉండి తక్కువ సార్లు రావాలి.
4. మంచం మీద పడుకునే సమయంలో 95 శాతం నిద్రలో గడపాలి.
వాసి(Qualitative )పద్ధతి: పైన చెప్పిన రాసి పద్ధతి కేవలం నిద్ర పోయిన సమయాన్ని మాత్రమే సూచిస్తుంది. నిద్రకు ఉండాల్సిన లక్షణాలను మాత్రమే సూచిస్తుంది. అందులో నాణ్యత ఉందా లేదా అన్న విషయాన్ని సూచించలేదు. నిద్రపోయిన వ్యక్తులు, అంతసేపు నిద్ర పోవడం ద్వారా పొందాల్సిన సుఖాన్ని అనుభవిస్తున్నారా లేదా అన్న విషయాన్ని నిద్ర లేవగానే మూడు ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవడం ద్వారా తమ నిద్ర నాణ్యతను అంచనా వేసుకోవచ్చు. నిద్రపోయినప్పుడు పొందే అనుభూతిని ఎవరికి వారు ప్రత్యక్షంగా అనుభవిస్తారు. సరిపడినంత మంచి నిద్రను పొందినపుడు ఎవరికి వారు మూడు అంశాలలో తృప్తి చెందాలి. అవి
1. శరీరం పూర్తిగా ఊరట (Relax) పొందాలి.
2. లేవగానే మనసుకు తాజా (Refresh) అనుభూతి కలగాలి.
3.పోయిన శక్తిని తిరిగి పొంది ఉల్లాసంగా (Rejuvenate) ఉండాలి.
ఇది ఎవరికి వారు తమ నిద్రగురించి అంచనా వేసుకునే పద్ధతి. నిద్రలేచాక ఈ మూడు ‘ఆర్’(3 R) అనుభూతులను పొందినట్టయితే వారిది సుఖనిద్రే. ఈ మూడు ‘ఆర్’లలో దేనికది విడిగా లోపించినా, కలిసి ఉమ్మడిగా లోపించినా మీ నిద్ర సరిగా లేనట్టే. అప్పుడు మీ నిద్ర గురించి కాస్త ఆలోచించక తప్పదు.


No comments:

Post a Comment