Sunday, May 29, 2011

నస నాగయ్యలకు నిద్ర తక్కువ!

పిల్లలు అన్నాక ఏదో ఒకదానికి పేచీ పెట్టటం, నస పెట్టటం మామూలే. ఎప్పుడో ఒకసారి నాసా పెడితే ఏదో ఒకటి చేసి బుజ్జగించటం ప్రతి తల్లిదండ్రికి అనవాయితినే. అయితే కొంతమంది పిల్లలు అయిన దానికి కాని దానికి తెగ నాసా పెట్టేస్తుంటారు. ఈ అలవాటును మానిపించాలని ఎంత ప్రయత్నించినా నస మానిపించటం వీలుకాక పోవచ్చు. చాల సార్లు వీరి నసను భరించలేని తల్లిదండ్రులు పిల్లల వీపు విమానం మోత మోగించే సందర్భాలు ఉంటాయి.  పిల్లల్లో ఉండే ఇలాంటి ప్రవర్తనకు కారణాలు గుర్తించి దాన్ని మలుపు తిప్పకపోతే కారణాన్ని బట్టి శారీరక ఎదుగుదలలో, వ్యక్తిత్వ రూపు దిద్దుకోవటంలో తేడాలు రావచ్చు. అలవాటుగా నస పెట్టె పిల్లల్ని జాగర్తగా గమనిస్తే నస ప్రవర్తనకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. వాటిలో తోలి కారణం  పెంపకంలో లోపం ఒకటి కాగా, మలి కారణం పిల్లలకు నిద్ర చాలకపోవటం.

తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు పిల్లల్ని అతిగా గారాబం చేయడంవల్ల మొండితనం అలవాటు అవుతుంది. ఇలా పెరిగే పిల్లలకు పట్టు విడుపులు అలవాటు కావు.  కుటుంభం మొత్తానికి తనే కేంద్రం అనే భావన వారిలో నాటుకుపోతుంది. దానితో తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా అనుకుంటారు. వారు కోరింది సమకూర్చి పెడితే సరి. లేదంటే రచ్చకు దిగుతారు.  కోరింది సమకూర్చి పెట్టటం అన్ని సందర్భాలలో తల్లిదండ్రులకు వీలుకాక పోవచ్చు. అలాంటప్పుడు సాధించుకునే మనస్తత్వం అలవడుతున్న పిల్లలు పేచీకి దిగుతారు. అనుకున్నది సాధించుకోవడానికి తల్లిదండ్రుల మెడలు వంచటానికి వారికి ఉన్న ఒకే ఒక దారి నస పెట్టటం. రానురాను ఇది అలవాటుగా మారుతుంది. ఇలాంటి ప్రవర్తన లేత దశలోనే గుర్తించి కట్టడి చేయకపోతే వారి వ్యక్తిత్వ ఎదుగుదలతో ఈ ప్రవర్తన అలాగే నిలిచిపోతుంది. కాకుంటే పెద్ద అయ్యాక నస పెట్టే రూపం మారవచ్చు.

ఇక రెండో రకం, పిల్లల్లో ముందు చెప్పిన సమస్య లేకపోయినా అప్పుడప్పుడు కాని, తరచూ కాని నస పిల్లలుగా మారుతారు. ఈ పిల్లల్ని పెంపకంలో లోపం అయితే ఏమీ ఉండడు. పిల్లలు కూడా సాధారణంగా నస పెట్టె రకాలు కాదు. ఎలాంటి పిల్లలు నస పెట్టటానికి కారణం వారికి తగినంత నిద్ర లేకపోవటమే. పిల్లలు వారి వయసుకు తగ్గట్టు తగినంత సేపు నిద్ర పొతే, రోజంతా హుషారుగా, చలాకీగా ఉంటారు. నిద్ర చాలనప్పుడు వచ్చే అనేక సమస్యలతోపాటు నస పెట్టటం కూడా ఒకటి. 

పిల్లల ఎదుగుదలలో తిండి తరువాత నిద్ర అత్యంత అవసరం. అటు శరీర పెరుగుదల, మెదడు వికసించటం రెండూ దాదాపు నిద్రలోనే జరుగుతుంది. నిద్ర విషయంలో పెద్ద వారిలాగే పిల్లలు కూడా ఎవరికి వారు ప్రత్యేకమే. నిద్ర తగ్గిన పిల్లల్లో ఎదుగుదల సమస్యలతో పాటు ప్రవర్తనలో కూడా తేడా కనపడుతుంది. అయితే ఈ తేడా చంటి పిల్లల్లో ఒక రకంగా ఉంటుంది. పెద్ద పిల్లల్లో మరో రకంగా ఉంటుంది. చంటిపిల్లలు అయితే నిద్ర చాలనప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటారు. అదే పెద్దపిల్లలు నస పెడుతూ ఉంటారు.

ఎవరు ఎంతసేపు నిద్ర పోవాలనే దాంట్లో కొంత మినహాయింపులు ఉన్నప్పటికీ, నాలుగేళ్ళ నుండి పదేళ్ళ మధ్యన ఉండే పిల్లలకు కావలసినన్ని సరాసరి నిద్రపోయే వేళలు ఇలా ఉండాలి.
   
  వయసు                       నిద్ర వేళలు గంటల్లో 
   4 - 5 సంవత్సరాలు                  11. 5 
   5 - 8 సంవత్సరాలు                  11
   8 - 10 సంవత్సరాలు                10

నిద్ర తక్కువయిన పిల్లల్లో పెద్దవారిలో ఉన్నట్టే మంపుగా ఉంటుంది. మనసు నిలకడగా లేకపోవడంవల్ల దేనిమీదా ధ్యాస పెట్టలేరు. జ్ఞాపకం తగ్గటం, నిర్ణయాత్మక శక్తి లోపిస్తుంది. ఇవన్నీ నిద్ర సరిగ్గా లేనందువల్ల పిల్లల్దరిలో కనిపించే సాధారణ లక్షణం. వీటికి అదనంగా కాస్త పెద్ద పిల్లలు అయితే దుడుకు స్వభావాన్ని చూపిస్తారు. చిన్నపిల్లలు అయితే కొంతమంది మందంగా ఉంటారు. చీటికిమాటికి ఏడుస్తూ నస పెడుతుంటారు. కారణం లేకుండా ఏ చంటి బిడ్డ అయినా నస పెడుతుంటే ముందుగా ఆలోచించాల్సింది బిడ్డకు నిద్ర చాలలేదని. ఎదిగే పిల్లలకు రోజులతరబడి నిద్ర తక్కువ అయినప్పుడు శరీర పెరుగుదల కూడా మందగిస్తుంది.

ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులు అందరిలోనూ నిద్ర గంటలను తగ్గటానికి కారణాలు అవుతున్నాయి. టీవీ సంస్కృతి వచ్చాక చాలామంది పిల్లలు వారికి వారుగా త్వరగా నిద్రపోరు. సెలవుల్లో అయితే పరవాలేదు కానీ బడి ఉన్నప్పుడు వారిని పొద్దునే్న నిద్రలేపి పంపాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వారికి నిద్ర చాలదు.

పిల్లల్లో ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను చాలా చిన్న వయసు నుండే అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేయటాన్ని వైద్య పరిభాషలో ‘బెడ్ రొటీన్స్’ అంటారు. రాత్రి భోజనం అయ్యాక వారితో కబుర్లాడటం, నిద్ర పోవటానికి ముందు పళ్ళు తోముకోవటం, స్నానం చేయటం, పడక దుస్తులు తొడగటం లాంటివి ప్రతిరోజూ విధిగా ఒక నిర్ణీత సమయంలో చేయించాలి. పడకమీదకు చేరగానే బొమ్మలు పుస్తకాలు తిరగెయ్యటం, కథలు చెప్పించుకోవటాన్ని ప్రోత్సహించాలి. ఈ పనులన్ని ఒకదాని తరువాత ఒకటిగా వరుస క్రమం మారకుండా ప్రతిరోజు చేయించాలి. ఈ మొత్తం ప్రవహసనం కనీసం అరగంటకు తక్కువ కాకుండా ఉండాలి. ఇలా చేయించడంవల్ల ఆ పని మొదలు పెట్టినప్పటి నుండి వారికి తెలయకుండానే నిద్రకు ఉపక్రమిస్తారు. ఎలా చేయటం వల్ల వారిలో నిద్ర వేళలు గట్టి పడుతాయి. కొన్ని పద్ధతులు పాటించటం వల్ల పిల్లల్లో నిద్ర సమస్యలు రాకుండా జాగర్త పడవచ్చు. 
  • వయసుకు తగ్గాట్టు పిల్లలు నిద్ర పోయే విధంగా అలవాటు చేయాలి. అంటే నిద్ర తక్కువ కాకూడదు. 
  • సెలవులతో సంబంధం లేకుండా ప్రతి రోజూ ఒకే వేళకు పడుకోవట, లేవటం అలవాటు చేయాలి.
  • సెలవుల్లో పిల్లల నిద్ర వేళలు మారకుండా జాగర్త పడాలి. ఒక వేళ మారినా, బడి తెరవటానికి వారం ముందు నుంచే నిద్ర వేళలని తిరిగి సరిచేయాలి.
  • పిల్లల రూముల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియొ గేములు లాంటివి ఉంచకూడదు. నిద్ర వేళలకు కనీసం అరగంట ముందు వాటిని కట్టేయాలి. 
  • సాయం కాలాలు, రాత్రులలో పిల్లల తినే తిండిలో చాకొలేట్స్  కోలా తాగుళ్ళు,(పెప్సి, థామస్ అప్)  లాంటివి లేకుండా జాగర్త పడాలి. వీటిలో ఉండే కెఫీన్ సహజంగా పట్టే నిద్రను చెడగొడుతుంది.
  • పాడుకొనే ముందు రిలాక్స్ కావటాన్ని పిల్లలకు నేర్పించాలి.
  • బెడ్ రోటీన్స్ ని పాటించే విధంగా వారిని తయారు చేయాలి.  

చివరిగా ఓ మడత ఏమిటంటే పెద్దవారు కూడా నిద్ర తగ్గితే నస పెడతారు. కాకుంటే పిల్లలంతా ఘోరంగా ఉండదు.

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhkpWsXg3M5_9IN10tY60yy1FS7fOWcdd069g5fNUbXVkYpXjJr1ATO1M1LTtL85kwaGeNDW68PfUMo1P3Hrk5cd6GgdkHJp57Fly54rb4VhxkA7ALw-k7Bq4KFS14LoBdXBYuJ0_aFoqQ/s200/andhrabhoomi_logo.jpg
25 మే 2011 


No comments:

Post a Comment