Wednesday, August 24, 2011

ముధురుతున్న జబ్బులకు ముందస్తు లక్షణాలు


కొంత మందికి ఆరోగ్యం పట్ల జాగర్త ఎక్కువ. ఒంట్లో చీమ చిటుక్కుమన్నా వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగెత్తుతారు. వీరికి ఆరోగ్య సూత్రాలు చెప్పాల్సిన పనే లేదు. పాపం! ఎన్ని జాగర్తలు
  తీసు కోవాలో అన్నీ జాగర్తలు తీసుకుంటూ ఉంటారు. ఇంకొంత మంది ఆరోగ్యాన్ని అస్సలు పట్టించు కోరు నిర్లక్ష్యం ఎక్కువ. రోగం వస్తే ముదిరి పాకన పడేంత వరకూ కదలరు మెదలరు. మరి కొంత మంది అయితే కోరి కోరి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఇప్పుడు మనం చెప్పు కోబోయేది అటు ఎక్కువ పట్టించుకునే వారి గురించి, అటు ఆరోగ్యాన్ని కోరి చెడగొట్టుకునే వారి గురించి కాదు. ఆరోగ్యాన్ని పట్టించు కోకుండా ముదరబెట్టుకునే వారి గురించి. 

అప్పటికి అప్పుడు వచ్చే రోగాలు అయిన జ్వరం, దగ్గు, విరేచనాలు, నొప్పి లాంటివి కన పడినప్పుడు వాటిని భరించటం కష్టం కాబట్టి వెంటనే ఆసుపత్రికి వెళ్లి చూపించుకుంటారు. కానీ కొన్ని జబ్బులు వచ్చిన వెంటనే అసలు లక్షణాలు కన పడవు. ఎవరికి ఏ జబ్బు ఎప్పుడు వచ్చిందో కనుక్కోవటం కొంత కష్టమే అయినప్పటికీ కొన్ని పట్టింపులు, జాగర్తలు తీసుకుంటే నేరుగా కనపడని రోగాలను వీలున్నంత తొందరగా గుర్తించ వచ్చు. దాని వల్ల రోగం నుండి తొందరగా బయట పడటమే కాకుండా దీనికి అయ్యే ఖర్చును బాగా తగ్గించు కోవచ్చు. అలా మీ ఆరోగ్యాన్ని తీవ్ర జబ్బులకు గురి చేయ బోయే కొన్ని లక్షణాలు తెలుసు కోండి.

ఉన్నట్టుండి బరువు తగ్గటం:
మీరు బరువు తగ్గాలనే పట్టింపుతో తిండి మీద అదుపు పెట్టుకుంటూ ఒంటికి శ్రమను ఇచ్చి మీ ఇష్టప్రకారం బరువుతగ్గే సందర్భాలలో తప్ప అలాంటివి ఏమీ చేయకుండా మీరు బరువు తగ్గుటట్టు ఉంటే దాన్ని కాస్త గట్టిగానే గమనించాలి. అలవాట్లలో మార్పులేకుండా అప్పనంగా బరువుతగ్గడం మామూలుగా వీలు అయ్యే పని కాదు. గుర్తించదగిన కారణాలు ఏవీ లేకుండా ఆరునెలల కాలంలో 10 శాతం బరువు తగ్గారంటే మీ ఆరోగ్యం ఎక్కడో చెడిపోతుందని అర్థం. కాన్సరు, మధుమేహం, హైపరు థయరాయిడిజిం, దిగులు, కాలేయ సంబంధ జబ్బులు, తిండి అరుగుదల సమస్యలతోపాటు అరిగిన తిండి ఒంటికి పట్టుటలో సమస్యలు ఉన్నట్టు పరిగణించాలి.

శ్వాసలో ఇబ్బందులు:
ఉన్నట్టుండి ఊపిరి ఆడక పోతేనో,. ఆయాసం వస్తేనో ఎలాగు వైద్యులు కలుస్తారు. కానీ మనం గుర్తించ లేని విధంగా సాధారణం కంటే ఎక్కువసార్లు ఊపిరి పీల్చటం లేదా తక్కువసార్లు ఊపిరి పీల్చటం అలాగే లోతుగా ఊపిరి పీల్చటం లేదా పైపైన పీల్చటం లోపల ముదురుతున్న జబ్బుకు తొలి లక్షణాలు కావొచ్చు. రక్తం లేక పోవటం, శ్వాస నాళంలో అడ్డంకులు, తక్కువ స్థాయిలో ఎప్పుడూ ఉండే ఉబ్బసం, ఊపిరి తిత్తుల్లో రక్తం గడ్డ కట్టటం లాంటి సమస్యలు తలెత్తి ఉండ వచ్చు. ఇవి కాక తెలియని మానసిక ఆందోళన అలజడితో సతమతమవుతూ ఉండి ఉండ వచ్చు.

తికమక పడటం, వ్యక్తిత్వంలో మార్పులు:
ఉన్నట్టుండి తికమక పడిపోవటం, కాస్సేపుఎక్కడ ఉన్నది. చుట్టూ ఏమి జరుగుతున్నదీ తెలియపోవటం, ఏకాగ్రత కుదరకపోవటం, విచిత్రంగా ప్రవర్తించటం, ఎప్పుడూ లేనిది ఉన్నట్టుండి కోపాన్ని ప్రదర్శించటం, ఆలోచనల్లో తేడా రావటం అనేవి మెదడులో జరిగి తిష్టవేసుకొని కూర్చున్న జబ్బులకు తొలి లక్షణాలు. ఇవి కొంతసేపు కనిపించి తిరిగి వాటంతట అవే తగ్గిపోవచ్చు. దాని అర్థం లోపల జబ్బు పోయిననది కాదు. కాబట్టి ఇలాంటి లక్షణాలు తొలిసారి కనిపించినా ఏమీ లేదని తేల్చేవరకు వాటిని గురించి పట్టంచుకోవాలి. పక్షవాతం, మూర్ఛ, మెదడులో పెరిగే కణుతులు, నెత్తురు గొట్టాలలో అడ్డంకులు ఏర్పడటం ఇలాంటి లక్షణాలకు కారణాలు అయి ఉంటాయి.

కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు ఉండటం:
మీరు ఎంత తింటే ఏ మేరకు కడుపు నిండినట్టు ఉంటందో మీకు ఒక అంచనా ఉంటుంది. దానికి భిన్నంగా కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తున్నా వేళకు ముందే ఆకలి అనిపిస్తుంటేనే దాన్ని గురించి కొంత పట్టించు కోవాలి. రోజుల తరబడి పులి తేపులు రావటం, కడుపు ఉబ్బరంగా ఉండటం లాంటి లక్షణాలు జీర్ణవ్యవస్థలో ముదిరే జబ్బుకు ముందస్తు లక్షణాలు. అవి అతి సాధారణమైన అసిడిటీ నుండి పాంక్రియాటీకు కాన్సరు వరకూ ఏదయినా కావొచ్చు.

కళ్ళు ముందు మిరుమిట్లు:
కళ్ల ముందు మిరుమిట్లు కనపడటం, చుక్కలు కన పడటం, ఉన్నట్టుండి కాసేపు చీకటిగా మారటం, కళ్ళ ముందు తెరలు తెరలుగా కనపడటం వెనుక ఒక కారణం ఉంటుంది. అవి అతి సాధారణము అయిన మైగ్రయిను తలనొప్పి నుండి అత్యంత ప్రమాదకరము, అత్యవసర చికిత్స అవసరమైన కంటి లోపలి రెటినా ఊడి పోవటం వరకు ఏదయినా కావొచ్చు.
పైన చెప్పిన వాటిలో లక్షణాలు కనపడినప్పుడు పట్టించు కోక పోయినా సొంత వైద్యముతో తాత్సారం చేసినా కోలు కోలేని నష్టం జరగవచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఎక్కువ రోజులుగా ఉంటే వైద్య సలహాలు పొంది ఇబ్బంది లేదని నిర్థారించు కోవాలి.



                                               
                                                            24-08.2011

No comments:

Post a Comment