Wednesday, August 31, 2011

మీ పిల్లలు సరిగా నిద్రపోతున్నారా?


పిల్లలు అన్నాక ఏదో ఒక దానికి పేచీ పెట్టటం, నస పెట్టటం మామూలే. ఎప్పుడో ఒకసారి నస పెడితే ఏదో ఒకటి చేసి బుజ్జగించటం ప్రతీ తల్లిదండ్రికి ఆనవాయితీనే. అయితే కొంత మంది పిల్లలు అయిన దానికీ కాని దానికి నస పెడు తుంటారు. ఈ అలవాటు మాన్పించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేక పోవచ్చు. చాలా సార్లు వీరి నసను భరించ లేని తల్లిదండ్రులు పిల్లల వీపు విమానం మోత మోగించటం కూడా తరచూ జరుగుతూ ఉంటుంది. పిల్లల్లో ఉండే ఇలాంటి ప్రవర్తనకు కారణాలు గుర్తించి దాన్ని మలుపు తిప్పకపోతే కారణాన్ని బట్టి శారీరక ఎదుగుదలలో, వ్యక్తిత్వం రూపు దిద్దు కోవటంలో తేడాలు రా వచ్చు.
 

అలవాటుగా నస పెట్టే పిల్లలందరినీ జాగర్తగా గమనిస్తే నస ప్రవర్తనకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. అందులో తొలి కారణం పెంపకంలో లోపం కాగా మలి కారణం పిల్లలకు నిద్ర చాలక పోవటం.

తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు పిల్లల్ని అతిగా గారాభం చెయ్యటం, మరీ సున్నితంగా పెంచటం వల్ల వారికి మొండితనం అలవాటు అవుతుంది. ఇలా పెరిగే పిల్లలకు పట్టు విడుపులు అలవాటు కావు, కుటుంబం మొత్తానికి తనే కేంద్రం అనే భావన వారిలో నాటుకు పోతుంది. దాంతో తాము ఆడింది ఆటగా పాడింది పాటగా అనుకుంటారు. వారు కోరింది సమకూర్చి పెడితే, లేదా చెప్పినట్టు పెద్ద వారు నడుడుచుకుంటే సరేకానీ లేకుంటే రచ్చకు మల్లుకుంటారు. ఇలా సమకూర్చి పెట్టటం అన్ని సందర్భాలలో తల్లిదండ్రులకు వీలు పడక పోవచ్చు. అలాంటప్పుడు సాధించుకునే మనస్తత్వం అలవడుతున్న పిల్లలు పేచీకి దిగుతారు. అనుకున్నది సాధించు కోవటానికి తల్లిదండ్రుల మెడలు వంచ టానికి వారికి ఉన్న ఒకే ఒక దారి నస పెట్టడం... రాను రాను అది అలవాటుగా మారుతుంది. ఇలాంటి ప్రవర్తన లేత దశ లోనే గుర్తించి కట్టడి చేయక పోతే వారి వ్యక్తిత్వ ఎదుగుదలలో ఈ ప్రవర్తన అలాగ నిలిచి పోతుంది. కాకుంటే పెద్ద అయ్యాక నస పెట్టే రూపం మార వచ్చు           
ఇక రెండో రకం పిల్లల్లో ముందు చెప్పిన సమస్య లేక పోయినా అప్పుప్పుడు కానీ, తరచూ కానీ నస పిల్లలుగా మారుతారు. ఈ పిల్లల్ని పెంచటం లోపం ఏమీ ఉండదు. పిల్లలు కూడా కావాలని నస పెట్టే రకాలు కాదు. వీరి నసకి కారణం తగినంత నిద్ర లేక పోవటమే. పిల్లలు వారి వయస్సుకు తగ్గట్టుగా తగినంత సేపు నిద్ర పోతే రోజంతా హుషారుగా, చలాకిగా ఉంటారు. నిద్ర చాలనప్పుడు వచ్చే అనేక సమస్యల తోపాటు నస పెట్టటం కూడా ఒకటి.పిల్లల ఎదుగుదలను తిండి తరువాత నిద్ర అత్యంత అవసరం. అటు శరీర పెరుగుదల, మెదడు వికసించటం రెండూ దాదాపు నిద్రలోనే జరుగుతాయి. నిద్ర విషయంలో పెద్ద వారి లాగే పిల్లలు కూడా ఎవరికి వారు ప్రత్యేకమే. నిద్ర తగిన పిల్లల్లో ఎదుగుదల సమస్య లతో పాటు ప్రవర్తనలో కూడా తేడా కన పడుతుంది. అయితే తేడా చంటి పిల్లల్లో ఒక రకంగా ఉంటుంది. పెద్ద పిల్లల్లో మరో రకంగా ఉంటుంది. చంటి పిల్లలు అయితే నిద్ర చాలనప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటారు అదే పెద్ద పిల్లలు నస పెడుతుంటారు.ఎవరు ఎంతసేపు నిద్ర పోవాలనే దాంట్లో కొంత మినహాయింపులు ఉన్నప్పటికీ, నాలుగేళ్ల నుండి పదేళ్ల మధ్యన ఉంటే పిల్లలకు కావల్సిన సరాసరి నిద్ర పోయే వేళలు ఇలా ఉండాలి.

              4-5 ఏళ్ళ వయసు పిల్లలు - 11 గంటల 30 నిమిషాలు   
              5-8 ఏళ్ళ వయసు పిల్లలు - 11 గంటలు  
              8-10 ఏళ్ళ వయసు పిల్లలు -  10 గంటలు   

నిద్ర తక్కువయిన పిల్లల్లో పెద్ద వారిలో ఉన్నట్టే మంపుగా ఉంటుంది. మనసు నిలకడగా లేక పోవటం వల్ల ఏ పని మీదా ధ్యాస పెట్టలేరు. జ్ఞాపకం తగ్గటం, నిర్ణయాత్మక శక్తి లోపిస్తుంది. ఇవ్వన్నీ నిద్ర సరిగా లేనందు వల్ల పిల్లలందరిలో కనిపించే సాధారణ లక్షణాలు. వీటికి అదనంగా కాస్త పెద్ద పిల్లలు అయితే దుడుకు స్వభావాన్ని చూపిస్తారు. చిన్న పిల్లలు అయితే కొంత మంది మందంగా ఉంటారు. చీటికి మాటికి ఏడుస్తూ నస పెడు తుంటారు. కారణం లేకుండా ఏ చంటి బిడ్డ అయినా నస పెడుతుంటే ముందుగా ఆలోంచాల్సింది బిడ్డకు నిద్ర చాల లేదని, ఎదిగే పిల్లలకు రోజుల తరబడి నిద్ర తక్కువ అయినప్పుడు శరీర పెరుగుదల కూడా మందగిస్తుంది. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులు అందరి లోనూ నిద్ర గంటలను తగ్గటానికి కారణాలు అవుతున్నాయి. టీవీ సంస్కృతి వచ్చాక చాలా మంది పిల్లలు వారికి వారుగా త్వరగా నిద్ర పోరు. సెలవుల్లో అయితే ఫరవా లేదు. కానీ బడి ఉన్నప్పుడు వారిని పొద్దునే నిద్రలేపి పంపాల్సి వుంటుంది. అలాంటప్పుడు వారికి నిద్ర చాలదు.పిల్లల్లో ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను చాలా చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేయటాన్ని వైద్య పరిభాషలో ‘బెడ్ రొటీన్స్’ అంటారు. రాత్రి భోజనం అయ్యాక వారితో కబుర్లాడటం, నిద్ర పోవటానికి ముందు పళ్లు తోము కోవటం, స్నానం చేయించటం, పడక దుస్తులు తొడగటం లాంటివి ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో చేయించాలి. పడక మీదకు చేరానే బొమ్మల పుస్తకాలు తిరగెయ్యటం, కథలు చెప్పించుకోవటాన్ని ప్రోత్సహించాలి. ఈ పనులన్నీ ఒకదాని తరువాత ఒకటిగా వరుస క్రమం మారకుండా ప్రతి రోజూ చేయించాలి. ఈ మొత్తం ప్రహసనం కనీసం అర గంటకు తక్కువ కాకుండా ఉండాలి. ఇలా చేయించటం వల్ల ఆ పని మొదలు పెట్టినప్పటి నుండి వారికి తెలియ కుండానే నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా చేయటం వల్ల వారిలో నిద్ర వేళలు గట్టి పడతాయి. కొన్ని పద్ధతులను పాటించటం వల్ల పిల్లల్లో నిద్ర సమస్యలు రాకుండా జాగ్రత్త పడ వచ్చు.

  1. వయస్సుకు తగ్గట్టు పిల్లల్ని నిద్ర పోయేటట్టు అలవాటు చేయాలి
  2. సెలవులతో సంబంధం లేకుండా ప్రతిరోజూ పడుకోవటం, లేవటంలో ఒకే సమయాన్ని పాటించే విధంగా చూడాలి.
  3. సెలవుల్లో పిల్లలు నిద్ర వేళలు క్రమం మారకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మారినా, బడి తెరవటానికి కనీసం వారం రోజులు ముందు నుండి నిద్ర వేళల్ని సరిచేయాలి.
  4.  పిల్లల గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేములు లాంటివి ఉంచొద్దు. అలాగే నిద్ర వేళకు అర గంట ముందు వాటిని చూడనీయకూడదు. అరగంట ముందు చదవటం, హోం వర్కు చేయటం నిలిపేయాలి.
  5.  సాయంత్రాలలో, రాత్రిపూట పిల్లలు తినే ఆహారంలో జాగర్తలు పాటించాలి. సాయం కాలం తరువాత చాకోలేట్లు కోలా డ్రింకులు తాగనీయ వద్దు. వీటిలో ఉండే కీఫిన్ రోజువారీ నిద్రను చెడ గొడుతుంది.
  6.  పడుకునే మందు రిలాక్స్ కావటాన్ని పిల్లలు నేర్పించాలి. ‘బెడ్ రొటీన్స్’ అలవాటు చేయాలి
                                                
                                            


No comments:

Post a Comment