Wednesday, March 30, 2011

నిద్రలో పక్క తడిపే అలవాటు (Enuresis) కు విరుగుడు

నిద్రలో పక్క తడపటం (Enuresis) చంటి పిల్లల లక్షణం. పుట్టకతో అనేక అంశాలపై బిడ్డలకు అదుపు ఉండదు.వయసు పెరిగే కొద్ది ఒక్కొక్క దానిమీదే అదుపు సాధిస్తారు. ఈ క్రమంలో ఎక్కడ లోపం జరిగినా ఎదుగుదలకు సంబంధించి సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లో వయసు మీరాక నిద్రలో పక్క తడపటం కూడా ఎదుగుదలలో లోపంవల్ల కనబడే జబ్బు.
     సాధారణంగా పిల్లలు 4, 5 ఏళ్ళ మధ్య కాలంలో పక్క తడపటం ఆపేస్తారు. కొద్దిమంది ఒక వయసు వచ్చాక కూడా రాత్రి పూట పక్క తడుపుతుంటారు. ఇలా తడపటాన్ని వైద్య పరిభాషలో ‘ఎనూరిసిస్’ అంటారు. నిద్రలో పక్క తడిపే పిల్లలందిరిని ఎనూరిసిసు కింద పరిగణించ కూడదు. 4 ఏళ్ళ లోపు పిల్లలు అలా తడపటం సహజ లక్షణమే కాదు, హక్కు కూడా. ఆరు సంవత్సరాల వయసు దాటాక వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పక్క తడిపితే జబ్బుగా గుర్తించాలి. ఇది రెండు రకాలుగా ఉంటుంది.
     మూత్ర వ్యవస్థలో లోపాలు ఏమీ లేకుండా కేవలం ఎదుగుదలలో లోపం వల్ల ఈ సమస్య వస్తే దాన్ని ‘తొలిరకం’ (ప్రైమరి)గా వ్యవహరిస్తారు. మామూలుగా అయితే ఒంటేలు సంచి నిండాక ‘నేను నిండాను త్వరగా ఖాళీ చేయండోచ్’ అని సైగలు (సిగ్నళ్ళు) ద్వారా మెదడుకు సమాచారాన్ని పంపుతుంది. ఈ సైగల రాయబారం నడిపేది ‘వాసోప్రెసిన్’ అనే హార్మోను. మెదడుకు సమాచారం అందగానే ఒంటేలు వచ్చిన ‘అనిపింపు’ (ఫీలింగు) కలిగి ఆ పనికి ఉపక్రమిస్తారు. ఇదంతా మెలకువగా ఉన్నప్పుడు జరిగే తతంగం. అదే నిద్రలో ఉన్నప్పుడు ఈ సైగలు ఒంటేలు వచ్చిన అనిపింపుతో పాటు లేచి పోసుకోవడానికి వీలుగా నిద్రపోతున్న మెలకువ వ్యవస్థను తట్టి లేపాలి. అలా లేపితే నిద్ర మేలుకొని ఒంటేలు పోసుకుంటారు. పక్క తడిపే జబ్బు ఉన్న వారిలో సంచి నిండినట్లు వచ్చే సైగలకు మెదడుకు అందించే వాసోప్రెసిను హార్మోను బాగా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి మెలకువ వ్యవస్థకు సమాచారం అందదు. దాంతో నిద్రలోనే పని కానిచ్చేస్తారు. మరికొంతమందిలో వయసుకు తగ్గట్టు మొదట ఒంటేలుమీద అదుపు వచ్చి కొంతకాలం బాగున్నా తరువాత పక్క తడపటం మొదలు పెడతారు.
     ఒత్తిడి, మూత్ర సంచిలో సమస్యలు, నరాలకు సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు ఆ జబ్బులో ఒక లక్షణంగా పక్క తడుపుతారు. ఈ తరహా పక్క తడపటాన్ని ‘మలిరకం’ (సెకండరీ)గా గుర్తిస్తారు. తొలిరకం పుట్టినప్పటి నుంచి ఉంటుంది. మలిరకం మధ్యలో వస్తుంది. పక్కతడిపే అలవాటు ఉన్న పిల్లలకు ఎక్కువ భాగం తొలి రకానికి చెందినదే అయి ఉంటుంది. మలిరకం చాల అరుదుగా ఉంటుంది. ఇలా విడదీయటానికి కారణం ఏమిటంటే వాటికి చికిత్సా విధానంలో తేడా ఉంటుంది.
     ఏ కారణంవల్ల పక్క తడుపుతున్నా దానివల్ల పిల్లలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నిద్రపరమైన సమస్య కూడా పిల్లలకు ఉండదు. పక్త డిపిన విషయం నిద్ర లేచాక కాని వారికి తెలియదు. మరీ చిన్న పిల్లలకు అయితే తల్లిదండ్రులు చెబితే తప్ప తెలియదు. ఈ జబ్బు ప్రత్యేకత ఏమిటంటే జబ్బు పిల్లలది అయినా ఆందోళన పడేదంతా తల్లిదండ్రులు. ప్రతిరోజూ అదనపు పనితో తల్లులకు విసుగు పుడుతుంది. ఆ విసుగు అంతా పిల్లలమీద చూపిస్తారు. దీనికితోడు ఎవరి ఇంటికైనా పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అవగాహన లేని తల్లిదండ్రులు పిల్లల్ని నిందించటం, ఎగతాళి చేయటం, కొన్నిసార్లు కొట్టటం కూడా చేస్తుంటారు. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బ తినటం, చిన్నబుచ్చుకోవటం చేస్తారు. ఇదంతా తిరిగి వారి మానసిక ఎదుగుదల మీద ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.
     పక్క తడపటం అనే జబ్బువల్ల పక్కవారికి ఎబ్బెట్టుగా ఉండటం తప్ప పిల్లలు ఇతరత్రా ఎదుగుదలకు ఏ రకమైన హానీ ఉండదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తిస్తే ముందువారి ఆందోళన తగ్గుతుంది. పిల్లల్ని తిట్టటం, కొట్టటం, అవహేళనగా మాట్లాడటం లాంటివి చేయకూడదు. దానివల్ల ఉపయోగం కంటే జరిగే నష్టం చాలా ఎక్కువ. కాస్త వయసు వచ్చిన పిల్లలు తమ సమస్యను గుర్తించి మదన పడుతుంటే వారిని తేలిక పరిచేటట్టు ఓదార్చాలి. ప్రయత్నం చేస్తే సమస్య నుండి బైట పడవచ్చన్న భరోసా పిల్లలకు ఇవ్వాలి. చేయించే వైద్యంలో పిల్లలు తమకు తాముగా ఇమిడిపోయే విధంగా తర్ఫీదు ఇవ్వాలి. ఏదో మందులు వేస్తున్నాం అనే ధోరణిలో ఉండకూడదు.


ప్రవర్తన చికిత్స: రాత్రిపూట పడుకోబోయే ముందు పిల్లలకు నీళ్ళు తక్కువగా తాగించాలి. ఐసుక్రీములు లాంటివి తినటాన్ని కట్టడి చేయాలి. ఇంట్లో ఎవరూ చివర పడుకుంటారో వారు పిల్లల్ని లేపి ఒంటేలు పోయించి పడుకోవాలి. అలాగే మధ్యలో పెద్దవారికి ఎవరికి మెలకువ వచ్చినా వారు ఆ పని చేయించాలి. ఒంటేలు బుడ్డ కండరాలను పటిష్ట పరచటానికి పిల్లలచేత కొన్ని రకాల అలవాట్లు, వ్యాయామాలు చేయించాలి. మెలకువగా ఉండేటప్పుడు ఒంటేలు వచ్చినప్పుడు వెంటనే పోసేయకుండా సాధ్యమైనంత సేపు బిగబట్టుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఉచ్చబుడ్డ ఓర్పు పెరుగుతుంది. చేయించదగ్గ మరో వ్యాయామం ఏమిటంటే ఒంటేలు పోసేటప్పుడు త్వరగా ఒకే ధారగా పోయకుండా ఆపి ఆపి ఎక్కువ పోసే అలవాటు చేయాలి. దీనివల్ల ఉచ్చ ఆ ప్రాంతపు కండరాలు గట్టిపడి పక్క తడిపే అలవాటుకు అవకాశం తగ్గుతుంది. పిల్లలకు ప్రవర్తనా పరమైన చికిత్సను మొదలు పెట్టాలి. ముందుగా సమస్యతో ఇబ్బంది పడుతున్న బిడ్డని దాని నుండి బైటపడే విధంగా సమాయత్త పరచాలి. అందుకు పిల్లలతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. నెలలో పక్క తడిపే రోజులు తగ్గే కొద్ది దానికి తగ్గట్టు వారికి బహుమానాలు ఊరించాలి. ఊరించటమే కాదు, సరిగ్గా అమలయ్యే కొద్దీ నిజంగా తీసి ఇవ్వాలి. ఏరోజు అయినా పడక తడపక పోతే ఆ రోజు పిల్లల్ని పదే పదే అభినందించాలి. అలాంటి రోజులు వారిచేతే కాలెండరులో గుర్తు పెట్టించండి. ఆ నెలలో పక్క తడపని రోజులు పెరిగే కొద్ది ఒప్పందం ప్రకారం వారికి బహుమతులు ఇవ్వాలి.
   పక్కతడి అయిన వెంటనే గణగణ మోగే ‘పాడ్ బెల్’ పరికరాలు కూడా మార్కెట్టులో దొరుకుతున్నాయి.చాలామంది పిల్లలకు అవి బాగా పనిచేస్తాయి. క్లినికలు సైకాలజిస్టు పర్యవేక్షణలో దాన్ని ఉపయోగించవచ్చు.


మందులతో చికిత్స : దీనికి విడివిడిగా అనేక చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అయితే వీటన్నింటిని రంగరించి సమగ్ర పరిచే చికిత్స ఉపయోగకరంగా ఉంటుంది. ఎదుగుదల లోపంగా వచ్చే సమస్యకు మానసు వైద్య నిపుణులచేత వైద్యం చేయించాలి. దీనికోసం వాడే మందులు మాత్రల రూపంలోనే కాకుండా ఇప్పుడు సులభంగా ముక్కులోకి పీల్చుకొనే ‘నాసల్ స్ప్రే’లు కూడా దొరుకుతున్నాయి. అయితే వీటిని మైండు ఫిజీషియను పర్యవేక్షణలోనే వాడాలి. మందులు వాడకంతోపాటు ప్రవర్తనా సంబంధమైన ఈ పద్ధతుల్ని నిరంతరం పాటిస్తే ఫలితం బాగుంటుంది

4 comments:

 1. చిన్నప్పుడు నేను కూడా అందరిలాగే ఆరేళ్ళలోపు పక్కతడపటం ఆపేశాను కానీ, తర్వాత కొన్నేళ్ళకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాక నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు కూడా పక్క తడిపేవాడిని. తొమ్మిదవ తరగతిలో అప్పుడప్పుడు పక్క తడిపేవాడిని. క్రమంగా పదవతరగతిలో ఏం జరిగిందో తెలియదు కాని పక్కతడపటం దానంతట అదే ఆగిపోయింది. :-)))

  ReplyDelete
 2. Usually you will be asymptomatic for ever. But if you are pressurized for some reason in future, it MAY likely recur for a short while. Don't bother about the future. - Dr. Teja

  ReplyDelete
 3. maa papa 2005 july born andi... 5 and half years.. pakka thaduputundi . i told to doctors they said 6 years varaku we will see and then check for any treatment ani. weather normal ga unte ok but chali kaalam and now AC vesthe twaraga posestundi... whenever i get up i make sure that she goes to the toilet but konchem late aina she does it already. inka ekkadikaina bayataku vellina kooda she asks to go to toilet more times. every 15 minutes she asks. konchem aapuko amma ani cheppina kangaaru pettestundi.. is it necessary to go for any treatments right now or can we wait? maa vaaru emo sugar unte anni saarlu veltharu urine ki les go for sugar test antaaru.. is it true? please advise. i like the things u told to make some habits of exercise etc. thanks

  ReplyDelete
 4. Your Question will be answered soon in Andhra Bhoomi daily in-detail.(Sanjeevani Page, every Wednesday) It is better to consult local Psychiatrist to get personal advice or treatment for your child

  ReplyDelete