Wednesday, February 2, 2011

స్కిజోఫ్రెనియా పై సందేహాలు-సమాధానాలు


ప్రశ్న:
 మా అమ్మాయికి స్కిజోఫ్రెనియా ఉంది. వయసు 20 సంవత్సరాలు. చాలా ఇబ్బందులు పడుతోంది. మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. గుంటూరులో మందులు వాడుతున్నాం. స్కిజోఫ్రెనియా ఎందుకు వస్తుంది అంటారు ?.
                                                                                                                       - ఓ తండ్రి, బాపట్ల

ప్రశ్న: మా అమ్మాయికి 20 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుండి పారానాయుడ్ స్కిజోఫ్రెనియాతో బాధ పడుతోంది. ఈ జబ్బు పూర్తిగా తగ్గుతుందా? పిన్నికి ఇదే జబ్బు మూడేళ్లుగా ఉంది. ఇంకా దారికి రాలేదు. వంశపారం పర్యంగా వస్తుంది అంటున్నారు. నిజమేనా? ఇలాంటి వారికి పెళ్లి చేయవచ్చా? పిల్లలకు వస్తే దేశంలో వ్యాధి కలవారిని పెంచినట్టే కదా?                                                                                                                                                          - పేరు లేదు, నగరం

ప్రశ్న: స్కిజో ఫ్రెనియాకి సరైన మందులు లేవని అంటున్నారు? నిజమేనా?      - నారాయణ రావు, మడకశిర

జవాబు: 
స్కిజోఫ్రెనియా జబ్బు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మందిలో ఒకరికి ఉంటుంది. ఆ లెక్కన మన దేశంలో ఒక కోటి పది లక్షల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. ఇది వంశపారం పర్యంగా వచ్చేందుకు ‘అవకాశం’ మాత్రమే ఉంది. శరీరంలో జన్యువులు ఉన్నంత మాత్రాన అందరికి జబ్బుగా బయట పడాలనేమీ లేదు. సామాజిక పరిసరాలు, పరిస్థితులు అనుకూలంగా ఉంటే జబ్బుగా బయట పడవచ్చు. సామాజిక పరిసరాలు అంటే మానవ (ముఖ్యంగా కుటుంబ) సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉపాధి మొదలయిన అంశాలలో ప్రతికూల వాతావరణం ఉండటం, ఈ సమయాలలో కలిగే మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే కొద్దీ జబ్బు బయట పడడానికి అవకాశాలు పెరుగుతూ ఉంటుంది. స్కిజోఫ్రెనియా లక్షణాలు ఫలానా విధంగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పటానికి వీలు కాదు. కారణం ఏమిటంటే జబ్బు లక్షణాలు ప్రవర్తనలో కలిసిపోయి చిక్కుగా ఉంటాయి. మామూలుగానే ఏ జబ్బు లేకపోయినా ప్రపంచంలో ఏ ఇద్దరి ప్రవర్తన ఒక రకంగా ఉండదు. అలాంటిది జబ్బు లక్షణాలు వారి ప్రవర్తనలో కలిసిపోవటం వల్ల ఏ ఇద్దరి స్కిజోఫ్రెనియా రోగుల్లో లక్షణాలు ఒకటిగా ఉండవు. కేసును బట్టి మొత్తం ప్రవర్తన, జబ్బు లక్షణాలను బేరీజు వేసుకొని మనసు వైద్యులు ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. అయినప్పటికీ అవగాహన కోసం కొన్ని ముఖ్యమయిన లక్షణాలు ఇవి.
  • తన ఆలోచనలు తనకే చెవుల్లో వినపడటం. 
  • ఇతరుల ఆలోచనలు తన మెదడులోకి చొప్పిస్తున్నారనీ, లేదా తన ఆలోచనలను వారు లాగేసుకుంటున్నారని అంటూ ఉంటారు. 
  • తన ఆలోచనలు ఇతరులకు తెలిసి పోతున్నట్టు అపోహ పడతారు. 
  • టీవీ రేడియో, మైకులలో తన విషయాలే ప్రసారం అవుతున్నాయని గొడవ చేస్తారు. 
  • తన ఆలోచనలను, శరీర భాగాలను ఇతరులు లేదా అతీంద్రియ శక్తులు అందులో ఉన్నట్టు వారికి అనిపిస్తుంది. 
  • తన ప్రవర్తన గురించి, చేష్టల గురించి ఇతరులు మాట్టాడుతున్నట్టు, వారిలోవారే గుసగుస లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. 
  • తమలో అతీంద్రియ శక్తులు ఉన్నట్టు భ్రమ పడుతుంటారు. ఇతరులను అనుమానిస్తారు. అక్రమ సంబంధాలను అంటగడతారు. 
  • ఆలోచనలో మధ్యమధ్యలో ఆగిపోవటంవల్ల మాటలు ఆ సందర్భంగా ఇతరులకు అర్థం కాని విధంగా ఉంటాయి. 
  • ఒంటి కదలికలు తగ్గుతాయి. దాంతో ఏ పని చేసినా నిదానంగా గంటల కొద్దీ చేస్తారు. అలాగే కూర్చొని ఉండటం, స్నానానికి పోతే బయటకు రాకపోవటం, తిండి దగ్గర కూర్చుంటే కెలుకుతూ ఉంటారు. 
  • ఇతరులతో మాట్లాడటానికి ఇష్టపడరు. శూన్యంలోకి చూస్తూ కూర్చుంటారు. 
  • తమలో తామే మాట్లాడుకోవటం, నవ్వుకోవటం చేస్తుంటారు. 
  • ఉద్వేగాలకు తగ్గట్టు ముఖంలో హావభావాలు ఉండవు. 
  • జనంలోకి కలవటానికి ఇష్ట పడకపోవడం, దేనిమీదా ఆసక్తి చూపక పోవటం, 
  • తనను గురించి తాను పట్టించుకోకపోవటం (స్నానం, బట్టలు, శుభ్రత విషయంలో), 
  • భవిష్యత్తుపట్ల ముందుచూపు లేకపోవటం, పరిస్థితులను బట్టి వ్యవహరించలేక పోవటం లోపంగా ఉంటుంది. గమ్యంలేని జీవితాన్ని గడుపుతుంటారు. 
  • ఒక విధంగా చెప్పాలంటే తనూ, తన కుటుంబం, చుట్టూ ఉన్న సమాజంలో పని లేకుండా వారిదయిన సొంత లోకంలో ఉంటారు. 
  • వీటికితోడు తమకు రోగం ఉందన్న విషయాన్ని గుర్తించలేరు. ఎదుటివారు చెప్పినా ఒప్పుకోరు. 
  • మందులు వాడటానికి అంగీకరించరు.
ఇవన్నీ అవగాహన కోసం చెప్పిన కొన్ని లక్షణాలు మాత్రమే. అందరిలో అన్ని లక్షణాలు ఉండవు. వ్యక్తి స్వభావాన్నిబట్టి మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి అనుభవం ఉన్న డాక్టరుకు సైతం రోగ నిర్ధారణ చేయటానికి కష్టంగా ఉంటుంది.

ఇక వైద్యం విషయానికి వస్తే ఒకప్పుడు ఈ జబ్బుకు మందులే లేవు. అందుకే ‘మనోవ్యాధికి మందు లేదు’ అనే నానుడి పుట్టింది. ఆ తరువాత పరిమితమయిన వైద్యం అందుబాటులో ఉండేది. పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు కొత్త కొత్త మందులు, వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. 

జబ్బు తగ్గటంలో మందులదే ప్రధాన పాత్ర అయినప్పటికీ పూర్తిగా నయం కావటంలో సామాజిక అంశాలు చాలా కీలకపాత్రను పోషిస్తాయి. సమస్య అంతా ఇక్కడే వస్తుంది. డాక్టర్లు మందులు రాసి, సలహాలు మాత్రమే ఇవ్వగలరు. సామాజిక తోడ్పాటును కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు, చుట్టూ ఉన్న జనం (మొత్తంగా సమాజం) అందించాలి. రోగికి అందే సామాజిక తోడ్పాటు, రోగిపట్ల జాగ్రత్తలు ఏ ఇద్దరికీ ఒకే రకంగా ఉండవు. అందువల్ల జబ్బు అదుపులో ఉంటుందా లేదా అనేది వివరణలు లేకుండా నేరుగా సమాధానం చెప్పటం కష్టం.

జబ్బు రకం, దాని తీవ్రత, రోగికి ఉన్న అవగాహనా శక్తి, రోగి సామాజిక నేపథ్యాన్ని బట్టి చికిత్స చేస్తున్న వైద్యులు మాత్రమే ఏ మేరకు అదుపులో ఉంచగలమనే విషయాన్ని చెప్పగలరు. ఒకటి మాత్రం నిజం. డాక్టరు చెప్పిన సలహాలను పాటిస్తూ వైద్యం చేయించుకుంటే తప్పకుండా ‘చాలా’ వరకు అదుపులో ఉంచుకోవచ్చు.

ఇక పెళ్ళి విషయానికి వస్తే ఈ జబ్బు ఉంది కాబట్టి పెళ్లి చేసుకో కూడదనేదేమీ లేదు. అయితే పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు మానసికంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అరమరికలు లేని విధంగా పరస్పరం అవగాహన, అంగీకారంతో జరగాలి. జబ్బును దాచిపెట్టి చేస్తే అది మోసం అవుతుంది. జబ్బు తగ్గాక లేదా అదుపులోకి వచ్చాక జీవిత భాగస్వామికి తెలిపి వారి అంగీకారంతో చెయ్యవచ్చు. ఇది కూడా కేసునుబట్టి మారుతుంది. ఈ జబ్బు వ్యక్తిత్వాన్ని, ఉపాధిని, గుర్తింపును దెబ్బతీస్తుంది. ఏ మేరకు దెబ్బతినింది అనేదాన్ని బట్టి పెళ్ళి చెయ్యవచ్చా లేదా అనే సందేహాలకు చికిత్స చేస్తున్న వైద్యులు సమాధానం చెప్పగలరు. వారసత్వం వచ్చే జబ్బులు కోకొల్లలు ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని పిల్లల్ని కనకూడదు అనుకుంటే ఎవరూ పిల్లల్ని కనలేరు. పిల్లలకు వస్తుందేమో అనే ఆలోచన అనవసరం.



8 comments:

  1. సైకోసిస్ గురించి కూడా వ్రాయగలరు. సైకోసిస్ కీ దీనికీ ఏంటీ తేడా?

    ReplyDelete
  2. ఒక డాక్టరుగా ఇటువంటి టైటిలుతో ఈ విషయం గురించి రాయడం బాధ కలిగించింది.
    ఇటువంటి సమస్య గురించి నాకు Beautiful Mind చూసినప్పుడు తెలిసింది. John Nash అనే నిజమైన వ్యక్తి, నోబెల్ ప్రైజ్ గ్రహీత జీవితం ఆధారంగా తీసినది. ఇతను ఈ సమస్యతో పోరాడడం, తనకు కనిపించే పాత్రల వయసు తన వయసుతో పాటు పెరగకపోవడం గమనించి తనకి కనిపిస్తున్నది నిజం కాదని అర్థం చేసుకున్నట్టు చూపించారు సినిమాలో. దాదాపు ఇదే అంశంతో హిందీలో "మద్ హోశ్" అని అనుకుంటా సినిమా తీశారు. ఇది ఒక మానసిక సమస్య. తీవ్రమైన సమస్య.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. డాక్టరు గారూ,
    మీ వివరణకు ధన్యవాదాలు.
    మీరు ఇచ్చిన సమాచారం తెలుసుకోవలసినది, ఇంకొంచెం మీరు విశదీకరించినా మంచిదే.
    పదాల గురించి ఒక చిన్న ముక్క నా అభిప్రాయం చెప్పి పక్కకు తప్పుకుంటాను, అసలు విషయం మరుగున పడకుండా ఉండేందుకు.
    సందర్భాన్ని బట్టి మాటల విలువ, అర్థం, అపార్థం మారుతుంటాయి.
    "చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ" అన్నప్పుడు మనకి ఆ నీల మేఘ శరీరుడే కనిపిస్తాడు మనసులో.
    కానీ తెలుగులో ఏదైనా వాక్యం రాసేటప్పుడు "కళేబరం" అన్న పద ప్రయోగం ప్రాణం లేని దేహాన్ని సూచించడానికి వాడడం, మనకి అదే అర్థం స్ఫురించడం జరుగుతుంది కదా.
    మీ వ్యాసమే ప్రజలకు ఈ సమస్య పైన అవగాహన పెంచడానికైనప్పుడు మీ శీర్షిక సామాన్య జనానికి ఏ విధంగా అర్థం అవుతుందో అని నా ప్రశ్న ఉద్దేశ్యం. పదానికి అర్థం ఏదైనా, సామాన్య వ్యావహారిక భాషలో జనాలకి స్ఫురించే అర్థం వేరు కదా అని. సందేహం, వైద్య్యం వంటి పదాలను వ్యాసంలో వాడుతూనే ఉన్నారు కదా. మానసిక సమస్య అంటే నా వంటి వారికి అర్థం అవ్వచ్చేమో? "పిచ్చి" పదం వినగానే స్ఫురించే అర్థం మారాలి అంటే ఇంకా చాలా కృషి జరగాలేమో కదా?

    ReplyDelete
  5. మీ అనిపింపును (ఒపినియను) నేను ఒప్పుకుంటాను. అచ్చ తెలుగు పదాలను వీలు అయినంతగా నా రాతల్లో వాడుతుంటాను. మొదట మీకు అనిపించినట్టే కొంత తడబాటు ఉన్నప్పటికీ రాను రాను అలవాటుగా మారుతాయి. నేను రాసిన "నిద్ర" పుస్తకంలో ఈ ప్రయోగం మంచి పలితాన్ని ఇచ్చింది.

    ReplyDelete
  6. On Rao S Lakkaraju comment: మీరు అన్నది నిజమే. అసలు సంగతి పక్కదారి పడుతుంది. This is not the platform for such type of discussions or comments. thanks for en lighting this point.

    ReplyDelete
  7. మీకు కలిగిన బాధ "పిచ్చి" అనే పదం వాడినందుకు అనుకుంటాను. మన తెలుగుకు పట్టిన శని ఏమిటంటే అచ్చ తెలుగు పదాలు వాడినప్పుడు వాటిని తెలుగు వారే బూతులుగాను, మొరటుగాను, ఎగతాళిగా అనిపింప చేయటం, ఇతర భాషా పదాలను (ముఖ్యంగా సంస్క్రుత పదాలు) గౌరవ పదాలుగా స్వీకరించే ఒక కృత్రిమ కుహాన సంస్క్రుతికి మన మెదళ్ళు అలవాటు పడ్డాయి. అలవాటు పడ్డాయి అనే కంటే సంస్క్రుత వాదులు మనల్ని మానసికంగా అలా చదువు పేరుతో అలా తయారు చేశారు. "మొగుడు-భర్త" "సాకుడు-పోషణ" "చిందు- నృత్యం" "కూడు-అన్నము" "తిండి-ఆహారం" ఇలా... రాసుకుంటూ పొతే మొదటివి మొరటు రెండోవి గౌరవ పదాలు అవుతాయి.
    "పిచ్చి" అని రాయటంలో నాకు వేరే ఉద్దేశం ఏమి లేదు. "సైకోసిస్" కి అసలయిన జాను తెలుగు పలుకు "పిచ్చి" దీనికి మతి భ్రమణం, మతి చెలింపు అని తెలుగు కాని పదాలను వాడే వారు ఉంటే ఉండ్స్వచ్చు కాక. అవి ఏవి సైకోసిస్ అనే అర్థాన్ని నేరుగా ఇవ్వలేవు.
    పిచ్చి పదానికి అర్థం చెప్పుకునే అవకాశాన్ని కలిగించినందుకు మప్పిదాలు (థాంక్స్. కృతజ్ఞతలు అనేది తెలుగు కాదు

    ReplyDelete