Wednesday, September 22, 2010

మంచి డాక్టర్ని ఎలా గుర్తించాలి?

మంచి డాక్టరు అంటే ఎవరు? బాగా చూసేవారా? ఫీజు తక్కువ తీసుకొనేవారా? రోగాన్ని నయం చేయటంలో నైపుణ్యం ఉన్నవారా? బాగా మాట్లాడేవారా? ఎక్కువమంది రోగుల్ని చూసేవారా?
సీనియరు మెడికల్ కాలేజి ప్రొఫెసర్లు చాలామంది తమ విద్యార్థులను గమనించిన తరువాత చెప్పే అనుభవం ఏమిటంటే, బాగా చదివిన వారిలో చాలామందికి పెద్దగా ప్రాక్టీసు ఉండటంలేదని. అలాగే ఇపుడు బాగా ప్రాక్టీసులో ఉన్న వారు మెడికలు కాలేజీలకు ఉన్నపుడు పెద్దగా చదివేవారు కాదని. పాతకాలంలో, అంటే వైద్యం వ్యాపారం కాని రోజుల్లో వైద్యంమీద ఆసక్తి ఉండేవారే ఆ వృత్తిలోకి వచ్చేవారు. చేసే వైద్యం ఎలాంటిదైనా అందులో నిజాయితీ, నమ్మకమూ ఉండేవి. కాబట్టే వైద్యులకు దేవుడి హోదా కట్టబెట్టి ‘వైద్యో నారాయణ హరి’ అన్నారు. ‘అప్పిచ్చువాడు, వైదుడు, ఎప్పుడూ పారే ఏరు, ద్విజుడు ఉండే వూరు మాత్రమే ఉండటానికి యోగ్యమైనదని’’ సెలవిచ్చాడు సుమతి నూటకకారుడు. అంటే సమాజంలో వైద్యానికి అంతటి ప్రాముఖ్యత వైద్యుడికి అంత గౌరవమూ ఉండేవి. వైద్యుడికి ఏ లోటూ రానీయకుండా, ఊరు వదిలి పోనీయకుండా చూసుకొనేవారు. అది అప్పటి సంగతి. కాలం మారింది. మనుషులు మారారు. వైద్యమూ, వైద్యుల తీరు తెన్నులూ మారాయి.
ఇపుడు జనం డాక్టర్లని చూసి ‘‘అప్పిచ్చువాడు వైద్యుడు’’ అని చతుర్లాడుతుంటే, డాక్టర్లు మేమేమీ తక్కువ తినలేదని రోగం వచ్చిన వాడని రోగి అనకుండా "ఫిజిచ్చువాడు రోగి" అనే పల్లవిని ఎత్తుకున్నారు. ఇప్పుడు మన సమస్య ఏమిటంటే ఫీజు ఇచ్చినా మంచి డాక్టరు దొరక్కపోతే ఎలా అని.
ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. ఇది వ్యాపార సమాజం. వ్యాపారానికి అతీతమైనది ఏదీ లేదు. బిడ్డను కనే కడుపునే అద్దెకిచ్చి వ్యాపారం చేస్తున్న ఈ రోజుల్లో వైద్యం మాత్రం వ్యాపారం కాకుండా ఎలా పోతుందీ? కాదు అని ఎవరైనా అనుకుంటే అది ముమ్మాటికీ పొరపాటే. వైద్య సేవలు వినియోగదారుల చట్టం పరిధిలోకి వచ్చి పాతికేళ్లు అయి వెండి పండగ చేసుకోబోతున్న తరుణంలో కూడా వైద్యుల్ని పాత చింతకాయ పచ్చడి తరహాలో చూస్తే ఎలా కుదురుతుంది? ఆసుపత్రిని కానీ, డాక్టరుని కానీ మనం చూడాల్సింది పవిత్రత ముసుగు వేసి కాదు. ముసుగు తీసి కట్టిన డబ్బుకు సమానమైన, నాణ్యమైన, సేవ అందుతుందా లేదా అని.
ఇపుడు వైద్యం వ్యాపారం. రోగి వినియోగదారుడు. డాక్టరు సర్వీసు ప్రొవైడరు. మనం కట్టిన డబ్బుకు నమ్మకంగా, నిక్కచ్చగా, నాణ్యమైన సేవలు అందించగలిగే డాక్టరు మనకు కావాలి. మరి అలాంటి డాక్టరు ఎక్కడ దొరుకుతారు? ఎలా ఉంటారు? వెతికి పట్టుకోవడం ఎలా?
ఇది జఠిలమైన సమస్యే. కారణం ఏమిటంటే మంచి డాక్టరును పొందటం అనేది అనేక అంశాలమీద ఆధారపడి ఉంటుంది. సాధారణ వైద్యమా, నైపుణ్య వైద్యమా అనేదానిమీద, కట్టగల ఫీజుపైనా, డాక్టరు అందుబాటుపైనా, వైద్యం కోసం వాడే పరికరాల లభ్యతపైనా ఆధారపడి ఉంటుంది. పైగా ఇక్కడ నకిలీ వైద్యులు, ప్రావీణ్యం లేని వారు, నిపుణత లేని సరుకు నుండి పూర్తి భిన్నంగా మంచి సేవలు అందించగలిగే సరుకు ఉన్న డాక్టర్లవరకూ వివిధ స్థాయిల్లో ఉన్నారు.
నకిలీ డాక్టర్లని వదిలేస్తే అర్హత పొందిన డాక్టర్లలో విషయ పరిజ్ఞానం, దాన్ని ఉపయోగించే విధానాన్ని గీటురాళ్లుగా తీసుకుంటే మొత్తం మూడు కేటగిరీలుగా విడదీయవచ్చు.
సరుకు లేని డాక్టర్లు:
గతంలో ఇలాంటి వైద్యులు మొత్తంలో పావు వంతు కంటే తక్కువగా ఉండేవారు. కానీ ప్రయివేటు వైద్య కళాశాలలు కుప్పలు తెప్పలుగా వచ్చిన నేపథ్యంలో రాను రాను ఇలాంటివారు చాలా ఎక్కువ అవుతున్నారు. ప్రయివేటు వైద్య కళాశాలలు నుండి కొత్తగా వైద్యం మార్కెట్టులోకి వచ్చేవారిలో సాధారణ వైద్యుల్లో అంటే జనరలు ప్రాక్టీషనర్లలో దాదాపు ముప్పావు వంతు. స్పెషాలిటీ వైద్యుల్లో సగానికి పైగా సరుకులేని వైద్యులే. ప్రభుత్వం వీరికి లైసెన్సులు ఇచ్చింది కాబట్టి చట్టపరంగా వీరు వైద్యులే. నాలుగైదుసార్లు వీరి దగ్గర చూపించుకున్నాక పస లేదని అర్థం అవుతుంది. లేదా మరో డాక్టరు అదే కేసును చూసే విధానంలో నాణ్యతను చూపినపుడు వీరి విషయం అర్థం అవుతుంది. జనమే అనుభవం మీద తమను తాము కాపాడుకోవాలి.


బాగా సరుకు ఉన్న డాక్టర్లు :
వీరు చదువుల్లో టాపర్లు. చదవటం మొదలుపెడితే ఆ అంశాన్ని ఈకలు పీకేదాకా వదలరు. అంటే ఏది చదివినా మూలల్లోకిపోతారు. ప్రతిదీ పద్ధతిగా నేర్చుకుంటారు. వైద్యం చేయాల్సి వచ్చినా చాలా పద్ధతిగానే చేస్తారు. ఎక్కడా రాజీపడరు. చిన్న జ్వరాన్ని కూడా భూతద్దంలో చూపే స్వభావం. అంత బాగా నేర్చుకొని కూడా దాన్ని ఎక్కడ, ఎవరికి ఎలా, ఎంతలో, జనానికి తగ్గట్టు వైద్యం చేయటంలో విఫలం అవుతారు. కోటీశ్వరుడికి వైద్యం ఎంతఖర్చులో వైద్యం ఉంటుందో రిక్షా కార్మికుడికి కూడా అలాంటి వైద్యమే, ఇంతే ఖర్చు కూడా. వీరు పెట్టుకోగలిగిన వారికి మంచి వైద్యులే కానీ సాధారణ జనం వీరిని భరించలేరు. సాధారణంగా ఇలాంటివారు మెడికల్ కాలేజీలలో బోధకులుగా, రీసెర్చి సెంటర్లలో బాగా సరిపోతారు. భరించగలిగితే మంచి డాక్టర్లే. సాధారణ జలుబుతో వెళ్లినా దాన్ని రెండు వందల కోణాలలో ఆలోచిస్తారు.
విజ్ఞత ఉన్న డాక్టర్లు :
విషయ పరిజ్ఞానం మరీ ఎక్కువ ఉండదు కానీ, అలా అని తక్కువ కూడా ఉండదు. విజ్ఞత అంటే ‘కామన్ సెన్సు’తో వైద్యం చేయటం వీరి ప్రత్యేకత. రోగి ఆర్థిక స్థితి, రోగ తీవ్రత, దానివల్ల వ్యక్తికి కలిగే ఇబ్బందీ మొదలైన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడికి అక్కడ వర్తింపచేస్తూ వైద్యం చేస్తారు. వీరు సాధారణ డాక్టర్లు కావచ్చు లేదా నిపుణులు కావొచ్చు.



వీరిలో తొలి రకాన్ని వదిలేస్తే, రెండూ మూడు రకాలలో కలపోతలో కూడా కొంతమంది ఉంటారు. మూడు రకాలలో మళ్లీ మంచితనం. నిజాయితీ, డబ్బుకు తగ్గ సేవను కలిపి బేరీజువేయాల్సి ఉంటుంది. ఇన్ని లక్షణాలతో కలగాపులంగా ఉండే డాక్టర్లలో నుండి అవసరమైన అన్ని లక్షణాలను కలబోసుకున్న డాక్టర్లు దొరికితే అదృష్టమే. అందుకే మంచి డాక్టర్లు ఇలా ఉంటారు అని నిర్వచించడం కష్టం. అవన్నీ ప్రత్యక్షంగా, అనుభవం మీద తెలియాల్సిందే.
మంచి డాక్టరు లక్షణాలు(సాధారణంగా) ఇవి:
*అర్హత లేకుండా నిపుణులమని చెప్పుకోరు
*తరచూ వృత్తిపరమైన కాన్ఫరెన్సులకు హాజరు అవుతుంటారు.
*రోగికి సాధ్యమైనంతవరకూ తక్కువ పరీక్షలు చేయిస్తారు.
*మందులు రాశాక వీరు అడగకుండానే జాగ్రర్తలు చెబుతారు.
*రోగి పరిస్థితి తనకు అర్థం కానపుడు మరో డాక్టరి అభిప్రాయం తీసుకుంటారు.
*చికిత్స చేయగలిగినా వసతులు లేనపుడు వేరే వైద్యుల దగ్గరకు పంపుతారు.
*రోగి దగ్గర ఎక్కువ వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తారు.
*మందులతో తగ్గకపోతే అపుడు పరీక్షలు చేయిద్దాం అంటారు.
*రోగ నిర్థారణ అయ్యాక దాన్ని గురించి వివరంగా చెపుతారు.
*రాసిన మందు బ్రాండును  షాపువాళ్ళు మార్చితే ఒప్పుకోరు.
*మీరు చెప్పే సమస్య అంతా విన్నాక ప్రశ్నలు అడుగుతారు.
*అవసరం అయితే తప్ప సూదులను, సలైను వాడరు
*అలవాటుగా, రోటినుగా  బి- కాంప్లెక్స్ మాత్ర్హలు రాయరు
*బలం మాత్రలు రాయమని మీరు అడిగినప్పుడు మిమ్మల్ని సున్నితంగా తిడతారు
*ప్రతివారికి సరుకుల పట్టీ మాదిరి మందులు రాయరు
*ఇతర డాక్టర్లు రాసిన మందులు సరైనవే అయినప్పుడు వాటిని కొనసాగించమని చెబుతాడు
*మందుతాగి ఉన్నపుడు రోగుల్ని చూడరు
ఇక్కడ చెప్పిన వాటిలో ఎన్ని లక్షణాలు ఉంటే  అంత మంచి డాక్టరు అయి ఉండేందుకు "అవకాశం" ఉంది. చివరిగా తేల్చాల్సింది "నిజాయితి"పరుడైన రోగి మాత్ర్హమే

10 comments:

  1. well said teja. What is the percentage of good doctors in the world?

    ReplyDelete
  2. thank you sir.
    manchi analysis and advice icharu.

    ReplyDelete
  3. Nijamgaane Manchi Doctor ante evaroo ani alochistunnaaru prathi okkaaroo.
    Oka saari manchi dr ayina vaade, rendo saari manchi doctor kaalekapotunnaru. Kanuka doctorlani koodaa perminant gaa konneella paatu manchi doctor la list lo unchalememo.
    Eppatikappudu Manchi Doctorla list ni revise cheyaali kaabolu.
    Anyways Nice article. Good Information
    - kiranmai

    ReplyDelete
  4. Inthaki.....Meeru manchi doctoraa kaaada !!!
    NIJAM CHEPPANDI !!!

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. glad to see a doctor in the blogworld. and nice article. medicine poortayyaaka koodaa inta chakkaga telugu raastunnaru :) quite a skill i shud say.

    ReplyDelete
  7. This comment has been removed by a blog administrator.

    ReplyDelete