Wednesday, September 1, 2010

కార్పో'రేటు' వైద్యం


ఇది కార్పొ'రేటు' యుగం. చిల్లరకొట్ల స్థానంలో సూపరు మార్కెట్లు. అమ్మేది ఉప్పూ పప్పే, కాకుంటే ఏరు కొనేకన్వీయన్సు. మామూలు కాలేజీ లకు బదులు కార్పోరేటు కాలేజీలు. చెప్పేది ఆ పుస్తకంలో ఉన్న చదువే. కాకుంటే పిల్లల్ని చావ గొట్టి అయినా చదివించేకన్వీనియన్సు. అలాగే ఎవరికి వారు చేయించు కొనే వైద్యం స్థానంలో ఇపుడు కార్పొరేటు ఆసుపత్రులు. ఇక్కడ కూడా చేసేది వైద్యమే కాకుంటే అన్నీ ఒక దగ్గర దొరికే కన్వీనియయన్సు'

వైద్యం చేయించు కోవాలంటే విడిగా చేయించు కోవాలా? లేక కార్పొరేటు వైద్యం చేయించు కోవాలా? జనానికి ఇదో పెద్ద చిక్కు సమస్య. వైద్యం బాగుండాలి. అన్నీ సక్రమంగా జరగాలి.క్లాసుగా జరగాలి.ఎక్కడా లోపం రా కూడదు. కానీ డబ్బులు ఎక్కువ కా కూడదు. తక్కువ ఖర్చుతో వైద్యం జరిగి పోవాలి. మరి ఈ రెండింటికీ పొసగదే! ఎలా?

మీరు కాఫీ తాగాలి అనుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న బంకులో తాగితే నాలుగు రూపాయలు. అదే ఫామిలీ రెస్టారెంటులో తాగితే పది రూపాయలు ఉంటుంది. డీలక్సు హోటల్లో దిగి కాఫీని రూముకు తెప్పించుకుంటే ముప్ఫై రూపాయలు కావొచ్చు. అదే ఏ ఐదు చుక్కల హోటల్లోనో దిగి కాఫీ తాగారను కోండి, ఎంత లేదన్నా కనీసం అంటే నూట యాభై రూపాయలు బిల్లు పడుద్ది. ఎక్కడ తాగినా అందులో ఉండేది పాలు, కాఫీ పొడి, చక్కెర. అంతకు మించి అందులో మరేమీ కలిపేందుకు అవకాశం లేదు. అలా తాగే తావును బట్టి కాఫీ ధర మారి పోతూ ఉంటుంది.

ఇక వైద్యం విషయానికి వద్దాం. మీకు జలుబు చేసి కాస్త జ్వరంగా ఉంది. మీ వీధి చివరన ఉన్న సాధారణ వైద్యుల దగ్గరకు పోతే డాక్టరు ఫీజు, మందులతో కలిపి మహా అంటే నూట యాభై అవుతుంది. అదే ఓ మోస్తరుగా ఉన్న ఆసుపత్రికి పోతే కొన్ని రొటీను పరీక్షలు చేస్తారు కాబట్టి ఇంకో రెండు వందలు ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఫిజిషియను దగ్గరకు పోయారను కోండి. స్పెషలిస్టు కాబట్టి ఎక్కువ జాగర్త తీసు కుంటే కానీ న్యాయం చేయ లేరు. అంచేత ఇంకొన్ని ఎక్కువ పరీక్షలు తప్పవు. దాంతో ఓ వెయ్యి నోటు మన దగ్గర నుండి మాయమై పోతుంది. అదే సమస్యకు మీరు సిగ్రేడు కార్పొరేటు ఆసుపత్రికి పోతే మూడు వేలు, ‘బిగ్రేడు అయితే ఐదు వేలు అవుతుంది. మరిక గ్రేడు ఆసుపత్రికి పోతే కనీసం ఓ పదివేలు ఖర్చు కాక పోతే అది రోగికీ, ఆసుపత్రికి నామర్దాగా ఉండదూ?

ఎక్కడ వైద్యం చేయించుకున్నా రోగం ఒకటే. దానికి వాడాల్సిన మందులు ఎక్కడైనా అటూ ఇటుగా ఒకటే. కానీ వైద్య సేవలు అందించడంలో ఒక్కో దగ్గర ఒక్కో శైలి. శైలిని బట్టి చెల్లించాల్సిన మూల్యం. ఇక్కడ మరో మాట అనొచ్చు. డబ్బు పెట్టే కొద్ది వైద్యం నాణ్యత పెరుగు తుంది కదా అని. నిజమే. కానీ వచ్చే క్వాలిటీ వైద్యంలో కంటే కూడా వైద్యం చేసేటపుడు దాని చుట్టూ అల్లుకొని ఉండే ఇతర అంశాల విషయం లోనే. అంటే రూము, రూములో ఉండే పడక, దాని పైన ఉండే దుప్పటీ, వచ్చీరానీ ఇంగ్లీషులో మాట్లాడే నర్సులు, రోజుకు నాలుగు సార్లు నేలను తుడిచే స్వీపర్లు.
ఇవి కాక ఇంకొన్ని విషయాలో కూడా తేడా ఉంటుంది. అవసరం కొద్ది ఎప్పుడు కావాలంటే అప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన అన్ని సదుపాయాలు ఉంటాయి. ఏ సమయంలో అయినా వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి.

వైద్యంలో రోగి చెప్పే లక్షణాలను ఓపిగ్గా విని, జాగర్తగా రోగిని పరీక్షించాక డాక్టరు బుర్ర ఉపయోగిస్తే దాదాపు నూటికి తొంభై పాళ్లు ఇది ఫలానా జబ్బు అని తేల్చి వైద్యం చేయ వచ్చు. అయితే అందుకు డాక్టరు చాలా సమయం వెచ్చించాలి. ఆ సమయానికి తగ్గ డబ్బును ఫీజుగా ఇవ్వ టానికి రోగికి మనసు అంగీకరిస్తుందా? విచక్షణతో చేసే వైద్యంతో నయం కానపుడు వచ్చిన జబ్బును గురించి లోతుగా పరిశీలించ టానికి వైద్య పరీక్షలు చేయాలి. అంత కాలం రోగి ఎదురు చూస్తాడా? ముందే ఎందుకు చేయించ కూడదని నిష్ఠూరం ఆడకుండా ఉంటారా? సరిగ్గా అలాంటి మానసిక ప్రవర్తనకు పరిష్కార మార్గమే కార్పొరేటు వైద్యం. మారే కాలానికి తగ్గట్టు, మానసిక ప్రవర్తనకు తగ్గట్టు వెలిసిన వైద్య వ్యాపార కేంద్రాలు. విచక్షణతో చేసే వైద్యానికి ప్రత్యామ్నాయంగా పుట్టుకు వచ్చిన ఆధునిక వైద్యశాలలు.

ఇక్కడ వైద్య నిర్థారణలో డాక్టరు బుర్ర కంటే వైద్య పరీక్షలు వైద్య పరికరాల ప్రాధాన్యత ఎక్కువ. వాటి సహాయంతో ఉన్న రోగాన్ని భూతద్దంలో వెతికి మరీ పట్టు కుంటారు. అందుకోసం కోట్ల రూపాయలు తగ లేసి పెట్టిన డయాగ్నోస్టిక్ ల్యాబ్ఏం కానూ? దాన్ని ఉపయోగించ వద్దా?

కార్పొరేటు ఆసుపత్రులలో పని చేసే డాక్టరు జీతం తీసుకుని ప్రభుత్వ డాక్టర్లలాగా పని చేయరేమోననే భయమో లేక పద్ధతిగా వైద్య నిర్థారణ పరీక్షలు చేయించ కుండా వైద్యం చేస్తారనే భయమో తెలియదు కానీ డాక్టరు ఖచ్చితంగా కార్పొరేటు డాక్టరు లాగా పని చేయాలంటే నిర్ణీత జీతంతో పాటు కట్స్వెసులుబాటుతో డాక్టరు జీతాన్ని ముడి పెడతాయి ఆసుపత్రి యాజమాన్యాలు. అంటే ఆసుపత్రికి ఆ డాక్టరు సంపాదించి పెట్టే దానిలో ఒక స్థాయి దాటితే దానిపై కొంత శాతం అదనంగా ఇవ్వటం. దీనే్న శాలరీ ప్లస్ కట్స్అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు పని చేస్తుంటే క్వాలిటీ వైద్యంతో పాటు అంతే క్వాలిటీ బిల్లును జనరేట్చేయకుండా ఎలా ఉంటారు? కర్ణుడు మంచి వాడే కావొచ్చు. ఉండేది కౌరవులతో కదా!

జ్వరంతో వచ్చిన రోగికి అది మలేరియా కావొచ్చు, టైఫాయిడు కావొచ్చు, టీబీ కావొచ్చు. ఇలా జ్వరం రావటానికి ఎన్ని రోగాలు ఉన్నాయో (ఎయిడ్సుతో సహా) అన్ని పరీక్షలు చేస్తే కాని వచ్చిన జ్వరం ఫలానా అని తెలియదు. మరి ఇది క్వాలిటీ కాదా? సాధారణ వైద్యానికి జబ్బు తగ్గనపుడు చెయ్యాల్సిన పరీక్షలను ముందు గానే చేయటం క్వాలిటీ వైద్యమే కదా! కార్పొరేటు వైద్యశాల అంటే ప్రతిదీ నిక్కచ్చిగా ఉండాలి. అందుకే అత్యంత జాగ్రత్త తీసు కుంటారు. మరి డబ్బులు అవుతున్నాయని మొత్తు కుంటే లాభం లేదు. అయిదు చుక్కల సత్రాల’ (స్టార్ హోటల్స్)లో నూట యాభై రూపాయలు పెట్టి కాఫీ తాగేటప్పుడు లేని అసహనం ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించు కోవాలి.
మరైతే కార్పొరేటు ఆసుపత్రు లలో వైద్యం చేయించు కోకూడదా? ఇక్కడ అంతా మోసమేనా? అంటే అదేం లేదు. క్వాలిటీ వైద్యం దొరుకుతుంది. ఆ క్వాలిటీ వైద్యానికి తగిన చెల్లింపు చేసుకో గలిగిన వారికి ఇది సమస్య కాదు. అలాగే మోసం కూడా ఏమీ లేదు. చెయ్యని పరీక్షలకు బిల్లులు ఏమీ వేయరు. జాగ్రర్తగా చూసు కోవాలి కాబట్టి ఎక్కువ పరీక్షలు చేస్తారు. లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారు. దానికి తగ్గట్టే ఎక్కువ బిల్లు అవుతుంది. అంతే. ఏ మాటకు ఆ మాటే చెప్పు కోవాలి. పెద్ద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు పెద్ద వైద్యం చేయటంలో విఫలం అయ్యాయని (పచ్చి అబద్ధం) వాటిని పట్టించు కోకుండా ప్రభుత్వమే డబ్బు కట్టి ఆరోగ్యశ్రీ పేరుతో పేద జనానికి కార్పొరేటు వైద్యం చేయిస్తుంది. ఆ విధంగా కార్పొరేటు వైద్యాన్ని ప్రభుత్వమే శంఖంలో పోసి తీర్థం చేసింది. వైద్యం చేయించు కోను డబ్బు ఉన్న వారికి ఇబ్బంది లేదు. ఇటు డబ్బు లేని వారికీ ప్రభుత్వమే కార్పొరేటు ఆసుపత్రులకు డబ్బు కట్టి వైద్యం చేయిస్తుంది. మధ్యలో అంతో ఇంతో కట్టు కోగలిగిన వారి పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. వైద్యం కోసం చూపు లేమో కార్పొరేటు ఆసుపత్రివైపు. ఉన్న డబ్బుల హారతి కర్పూరంలా అయి పోతాయేమోనని మరో వైపు దిగులు.

  •  అయిన దానికీ, కాని దానికీ కార్పొరేటు ఆసుపత్రికి పోవాల్సిన అవసరం లేదు. సాధారణ జబ్బులకు చేసే వైద్యం ఎక్కడైనా ఒకటే.
  •  సమర్థుడైన ఒక జనరలు ప్రాక్టీషరును మీ కుటుంబ డాక్టరుగా గుర్తించండి. వైద్యంలో ఏ సమస్య వచ్చినా ముందుగా ఆ డాక్టరు దగ్గర వైద్యం పొందండి. దాదాపు తొంభై వంతులు వైద్యం అక్కడే జరిగి పోతుంది.
  • కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో నిపుణుల దగ్గర వైద్యం అవసరం అవుతుంది. మీ కుటుంబ వైద్యుల సలహా మేరకు విడిగా ఉండే వైద్య నిపుణులు దగ్గర వైద్యం పొందండి. ఏ కుటుంబ డాక్టరూ సరుకులేని నిపుణుల దగ్గరకు పంపరు.
  • నేరుగా కలిసే రోగుల కంటే, తోటి డాక్టర్లు పంపిన కేసుల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూస్తారు నిపుణులు. పైగా ఏదైనా అవసరం అయితే మీ డాక్టరే నిపుణులతో మాట్లాడతాడు
  • కార్పొరేటు ఆసుపత్రు లలో పనిచేసే డాక్టర్లే చాలా దగ్గర విడిగా వైద్యం చేస్తుంటారు. అదే వైద్యాన్ని ఇక్కడ తక్కువ ఖరీదుతో అందిస్తారు.
  • పెద్ద పెద్ద సర్జీరీలు (గుండె ఆపరేషను, కిడ్నీ మార్పిడి), కొన్ని ప్రత్యేక వైద్య పద్ధతులు చెయ్యాల్సి వచ్చినపుడు ఇవి ఖచ్చితంగా పెద్ద ఆసుపత్రులలో (సాధారణంగా కార్పొరేటు) చేయాల్సిందే. అలాంటప్పుడు తప్పదు. ముందుగా ప్యాకేజి మాట్లాడు కోవటం మంచిది.
  •  ఇన్సూరెన్సు ఉంది కదా అని నేరుగా కార్పొరేటు ఆసుపత్రి లోకి దూర వద్దు. కుటుంబానికి రెండు లక్షల ఇన్సూరెన్సు ఉందని విరోచనాలకు కూడా కార్పొరేటు గడప తొక్కితే పాతిక వేలు బిల్లు కావచ్చు. ఇంకా మీకు వర్తించేది లక్షా డెబ్భై వేలే. నిజమైన అవసరానికి ఇది సరి పోక పోవచ్చు.
  •  ప్రభుత్వ రీ అంబర్సుమెంటుఉందా? పరిమితిని దృష్టిలో ఉంచుకొని కార్పొరేటు ఆసుపత్రుల గడప తొక్క వచ్చు.
  •  మామూలు డాక్టర్ల దగ్గర అయినా కాస్త మొహమాట పడ వచ్చు కానీ కార్పొరేటు డాక్టర్ల దగ్గర మొహమాటం అవసరం లేదు. నికార్సయిన వినియోగదారునిలా ప్రవర్తించండి. అనవసరమైనవి పరీక్షలు చేయించినా, చేయాల్సినవి చేయక పోయినా దానికి మీరు రియాక్టు అవుతారనే సమాచారాన్ని మీరు నోటితో చెప్ప కుండానే వారు గ్రహించే విధంగా మసలు కోండి.



·        


1 comment:

  1. chala bagundi .inka ilantivi post cheyyi.maalantivallaki baga sahaya padatai.

    ReplyDelete