Thursday, September 9, 2010

రోగాలు - నమ్మకాలు

మనకు వచ్చే జబ్బులు అనేక రకాలు. కీళ్ళ వాతం, చక్కెర వ్యాధి, రక్తపోటు లాంటివి వారసత్వంగా వస్తాయి. జలుబు, విరేచనాలు, టీబీ లాంటి అంటువ్యాధులు మన ప్రమేయం లేకుండా సోకుతాయి. ఉండే వాతావరణం, పరిసరాలను బట్టి కొన్ని జబ్బులు వస్తే, మన అజాగర్తలవల్ల (ప్రమాదాలువల్ల తగిలే గాయాలు) మరికొన్ని జబ్బులు వస్తాయి. అవికాక మనకు మనం కొనితెచ్చు కొనే (సుఖవ్యాధులు, ఆల్కహాలు సంబంధిత రోగాలు) ఉండనే ఉన్నాయి. ఏ జబ్బు రావటానికి అయినా కొన్ని కారణాలు ఉంటాయి. వచ్చాక దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. జబ్బు స్వభావాన్ని బట్టి అది పూర్తిగా నయం కావటమో (జలుబు, మలేరియా), కొంత నష్టాన్ని మిగిల్చిపోవటమో (పోలియో, పక్షవాతం), జీవితాంతం ఉండటమో (చక్కెర జబ్బు, ఎయిడ్స్) జరుగుతుంది. ఇది జబ్బుల సహజ స్వభావం. అందుకనే వైద్యంతో జాగర్త తీసు కోవాలి.

     డాక్టరు సూచించిన ప్రకారం మందులు వేసుకోవటం, జాగర్తలు పాటించడం, తగినంత కాలం వైద్య పర్యవేక్షణ మొదలైన పద్ధతుల్ని పాటించడం ముఖ్యం. కానీ కొంతమంది నమ్మకాలు, విశ్వాసాలు మనసులో దూర్చు కొని వాటిని పరిశీలించరు. ప్రశ్నించరు. ఎవరు ఏది చెబితే అదే. ఎంత గట్టిగా చెబితే అంత గట్టిగా మనసులో నాటుకుంటారు. దాని ప్రకారమే వారి నమ్మకాలు ఉంటాయి. జబ్బుల్ని కూడా అదే నమ్మకాలతో చూస్తారు. జబ్బు తగ్గించు కోవటంలో అడుగడుగునా తెలియకుండా అడ్డు తగులుతుంటారు. జబ్బు తనకు వచ్చినా సరే, ఇతరులకు వచ్చినా సరే. ఇలా ఒక పక్క రోగాన్ని పూర్తిగా శాస్ర్తియ దృక్పథంతో చూసే వారి నుండి అత్యంత మూఢ విశ్వాసా లతో చూసేవారి వరకూ అనేక స్థాయిల్లో జనం ఉంటారు. ఇవన్నీ కాకుండా రోగాన్ని గుర్తించడం, దానికి సరైన వైద్యం చేయించు కుంటేనే అది దారి లోకి వస్తుంది.

చంటి బిడ్డకు విరేచనాలు అయినపుడు ఒంట్లో నీరంతా పోతుంది. దాంతోపాటే లవణాలు పోతాయి. దాంతో బిడ్డ నీరస పడిపోతాడు. డాక్టరును కలిస్తే మందుల తోపాటు నీరు, పళ్ళ రసాలు బాగా తాపించమని సలహా ఇచ్చారు. తల్లి ఇంటికి వచ్చి నీరు తాపించ బోయింది. కొందరికి నీళ్ళు తాగితే విరోచనాలు ఎక్కువ అవుతాయనే ఓ నమ్మకం. దాంతో బిడ్డకు కావాల్సిన నీటిని ఇవ్వలేదు. రెండో రోజు బిడ్డకు మూత్రపిండాలు పాడై పోయాయి. దాన్నుండి పిల్లవాడిని కాపాడు కోవడానికి యాభై వేలు ఖర్చుపెట్టాల్సి వచ్చింది.

ఇక్కడ ఒంట్లో నీరు, లవణాలు పోవటం వాస్తవం. దానికి జరగాల్సిన వైద్యం వాటిని శరీరంలోకి ఇవ్వటం. కానీ వైద్యం జరగకుండా ‘నమ్మకం’ అడ్డుపడింది. ఫలితం బిడ్డకు చావు వరకూ లాక్కొచ్చింది. తల్లిదండ్రులు ఆ డబ్బులు కూడా పెట్టుకోలేకపోతే ఒక నిండు ప్రాణం కేవలం ‘నమ్మకం’వల్ల బలి అయ్యేది. ఏ కారణం చేతనైనా మెదడుకు రక్త సరఫరాలో ఆటంకం వస్తే పక్షవాతం వస్తుంది. ఇది వాస్తవం. దానికి మీ నమ్మకాలతో పని లేదు. జరిగిన వెంటనే వైద్యం మొదలుపెడితే రక్త సరఫరా తిరిగి మొదలై (నిర్దిష్ట సమయంలో) పక్షవాతం నుండి కోలు కోవచ్చు. లేదా కనీసం ఎక్కువ మెదడు పాడు కాకుండా జరగబోయే నష్టాన్ని తగ్గించవచ్చు. సమస్య వచ్చాక ఎంత త్వరగా వైద్యం మొదలు పెట్టామనే దాన్ని బట్టి జబ్బు నుండి కోలు కోవటం ఆధారపడి ఉంటుంది. ఇది శాస్ర్తియ వైద్యం. దీనికి పక్షవాతం పట్ల మీకు ఉన్న నమ్మకాలు ముడి పెడితే నష్టాన్ని భరించక తప్పదు. పక్షవాతానికి నాటు మందు పని చేస్తుందనే ‘నమ్మకం’ మీకుందను కోండి. మీరు నేరుగా డాక్టరు దగ్గరకు పోకుండా నాటు వైద్యుని దగ్గరకు పోతారు. వైద్యం (నాటు) చేయిస్తున్నాం కదా! తగ్గుతుందనే నమ్మకం మీకు ఉండొచ్చు. ఆ నమ్మకం మెదడులో జరిగే మార్పును ఆపలేదు. జరిగాక నా ఖర్మలే అనుకోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.
          
పప్పు తింటే చీము పడుతుంది అనుకొంటారు కానీ కొల్లాజన్ అనే ప్రొటీను పప్పులో ఉంటుంది. దీనివల్ల గాయం త్వరగా మానుతుంది. వేడి చేసే వస్తువులు తిన కూడదు అనేది ఓ నమ్మకం. కానీ ఆహారంలో అలాంటివేమీ ఉండవు తినక పోవటంవల్ల పోషకాహార లోపం ఏర్పడ వచ్చు. బాలింతకు స్నానం చేయించ కూడదని కొందరికి అలవాటు అయి వుంటుంది. కానీ శుభ్రత లేనందు వల్ల తల్లికీ, బిడ్డకూ అనారోగ్యం ఏర్పడుతుంది. కామెర్లకు అల్లోపతిలో మందు లేదని చాలా మంది అనుకొంటుంటారు. కానీ కామెర్లు జబ్బు కాదు. రోగ లక్షణం. కామెర్లు రావటానికి సవాలక్ష కారణాలు. రోగికి వైద్యం పట్ల అవగాహన లేక పోయినా ఫర్వాలేదు కనీసం వైద్యులు చెప్పిన దాన్ని పాటించే తటస్థ విధానాన్ని అయినా పాటిస్తే మేలు.


2 comments:

  1. ekkuva water tagite kidneys ekkuva work chesi padavutayani antaru?nijamena?maa friends okaru early morning 5 glasses neellu tagutaru?manchidena?

    ReplyDelete
  2. ఏదైనా అవసరానికి మించి ఎక్కువ తీసుకోవటం లేదా తక్కువగా తీసుకోవటం మంచిది కాదు. సాధారణంగా మనం నీళ్ళు ఎక్కువ తాగితే శరీర అవసరాలకు పోను మిగిలినవి ఒంటేలు రూపంలో బైటకు పోతాయి. దాని వల్ల కిడ్నీలు చెడిపోవటం జరగదు. అలాగే శరీరంలో నీరు తగ్గినప్పుడు "యాంటి డయురిటిక్ హార్మోను" విడుదల అయి నీటిని కాపాడుకొనే చర్యను చేపడుతుంది అంటే నీటిని బయటకు పోనీకుండా జాగర్త పడుతుంది అందువల్ల ఒంటేలు తక్కువగా వస్తాయి. అంతే కాకుండా వ్యక్తికీ దప్పిక అనుభూతిని యిస్తుంది. కాబట్టి నీరు తాగాలని అనిపిస్తుంది. ఇది శరీరంలో సహజసిద్దంగా జరిగే ప్రక్రియ.
    మొత్తం సారాంశం ఏమిటంటే శరీరానికి ఎంత నీరు కావాలో ఆ మేరకు మన ప్రవర్తనను నియంత్రిస్తుంది. మనం అలా నడుచుకుంటే చాలు. ఈ మధ్య కాలంలో శరీర ధర్మాలపై అవగాహన లేనివారు ప్రకృతి వైద్యం పేరిట ఇలాంటి ప్రచారాలు జరుపుతున్నారు. ఇవన్నీ పిచ్చి ప్రచారాలు. ప్రశ్నించనంత వరకు "చెప్పే వాడికి వినే వాడు లోకువ"

    ReplyDelete