Wednesday, October 13, 2010

బోడి(ఆరోగ్య) సలహాలతో జేబుకు బొక్క

ప్రపంచంలో కాణీ ఖర్చు లేకుండా దొరికేవి ఆరోగ్య సలహాలు. ఇచ్చేది డాక్టర్లు కాదండోయ్... డాక్టర్లు తప్ప మిగతా అందరూ. కావాలంటే మీకై మీరే ఈ విషయాన్ని పరీక్షించి తెలుసుకోవచ్చు.
పేపర్లో మీ పేరు చూసుకోవాలని ముచ్చట పడుతున్నారా! చాల సులభం. ఎలా అంటారా ఓ పెన్నూ, కాగితం తీసుకొని ఆరోగ్యం పైన మీ బుర్రకు ఏది తోస్తే అది రాయండి. అవి నిజామా కాదా అని మీరు ఆలోచించక్కర లేదు. మచ్చుకు ఇలా రాయవచ్చు 
  • నేరేడు కాయలు తింటే అరికాళ్ళకు మంచిది.
  • పసుపు, చింతపండు బాగా నూరి పాలల్లో కలుపుకొని తాగితే కళ్ళకింద నల్లమచ్చలుపోతాయి.
  • కాకరకాయ రసాన్ని బెల్లం వేసుకొని తాగితే పురుగులు (ఏం పురుగులో) చనిపోతాయి
ఇవన్నీ నిజం కాదు ఉత్తుత్తువే. రాసిన దాన్ని ఏదో ఒక పత్రికకు పంపండి. మీ పేరు అది ప్రింటు కావటం ఖాయం. మీరు ఏ పత్రిక తిరగేసిన ఆరోగ్య శీర్షికలలో యిలాంటి సలహాలు ఎన్ని కావాలంటే అన్ని కనిపిస్తాయి. ఎవరు చెబుతున్నారనే దానితో నిమిత్తం లేదు. ఎవరైనా చెప్పొచ్చు. ఏమైనా చెప్పొచ్చు. అది నిజమా కాదా అని రాసేవారు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్య సలహాలు అంటే అలానే ఉంటాయి మరి. మరో విషయాన్ని చూద్దాం 

‘‘నాకు తల విపరీతంగా తలనొప్పి పుడుతుంది’’ అని మాటల సందర్భంలో మీకు తెలిసిన ఓ పదిమంది దగ్గర అని చూడండి! వారిలో ఒక్కరంటే ఒక్కరు ఆ..హా.. అలాగా! అని గమ్మున ఉంటారేమో చూడండి!

‘‘అయ్యో! కాస్త టైగర్‌బామ్ పట్టించలేకపోయారా!’’ ఠక్కున అంటాడు తెలిసిన ఆయన.
‘‘డాక్టర్ భలేరావు. తలనొప్పికి భలే డాక్టరు. ఒకసారి చూపించకూడదూ?’’ పక్కింటాయన.
‘‘సిటీ స్కాన్ తీయించండి ఎందుకైనా మంచిది’’ సహ ఉద్యోగి. 
‘‘ధ్యానం చేస్తే తలనొప్పీ గిలనొప్పులు రావోయ్..’’ మరో స్నేహితుడు.
‘‘మిరియాల కషాయం రెండు పూట్లా తాగితే తలనొప్పి పోతుంది’’ పక్కింటి బామ్మ.
‘‘పని ఒత్తిడి ఎక్కువై ఉంటుంది’’ చుట్టం చూపుగా వచ్చిన బామ్మ.
‘‘ఊరికే ఇంగ్లీషు మందులు వాడొద్దు సార్... హోమియో మందులు ఇప్పించండి’’ పిల్లాడికి ట్యూషను చెప్పటానికి వచ్చిన మాస్టారు.
........ఇలా మీకు ఓపిక ఉండి అడుగుతూ పోవాలే గానీ, వచ్చిన సలహా మళ్ళీ రాకుండా ఎన్ని కావాలంటే అన్ని సలహాలు దొరుకుతాయి. వీరంతా కావాలనో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, మీ చేత ఖర్చుపెట్టించాలనో పథకం వేసుకొని మీకు సలహాలు ఇవ్వలేదు. అడిగినా అడక్కపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా, మీరు పాటించినా పాటించకపోయినా వారికి తోచింది చెబుతారు. చెప్పేటప్పుడు కాస్త కూడా ఆలోచించరు. అలవోకగా నోటి నుండి మాట వచ్చేస్తుంది.

రోగం, మందులు, వైద్యం, ఆసుపత్రి, డాక్టరు లాంటి ప్రస్తావన వచ్చిందంటే దానిపై అభిప్రాయం చెప్పకుండా, సలహా ఇవ్వకుండా ఉండనుగాక ఉండరు. చివరకు డాక్టరుకు బాగాలేక ఆసుపత్రిలో చేరినా చూడటానికి వచ్చే బంధు మిత్రులు ఏదో ఒక సలహా వదిలి పోతారు. ఆరోగ్యంమీద ఇచ్చే సలహా ఇలా ఉంటుంది మరి.

ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా లేదా ఇంట్లో వారికి బాగాలేకపోయినా ఉన్నంతలో ఎవరి స్థాయిలో వారు కాస్త మంచి వైద్యం చేయించాలని అనుకుంటారు. వారికి తెలిసినంతలో ఏదో ఒక విధమైన వైద్యాన్ని చేయించుకోను బైలుదేరుతారు. మధ్యలో ఎవరో దూరుతారు. ఏదో సలహా ఇస్తారు. అనుకున్నదాన్ని అనుకున్నట్టు జరగనీయరు. మిమ్మల్ని బలవంత పెట్టి కాదు. మీ బుర్రలో అనుమానపు తుట్టె కదిల్చి, ఫలానా డాక్టరు బాగా చూస్తారనే నమ్మకం మీకు ఉందనుకోండి. అక్కడికి పోదామని మీరు బైలుదేరుతారు. దారిలో కనపడ్డ మీ మిత్రుడు ‘‘చ చ్ఛా ఆ డాక్టరా? పరమ వేస్టు’ అంటాడు. అసలే ఆరోగ్యం. ఆపై అనుమానం ఒకటి! అక్కడికి మీ పని అయిపోయింది. అతను నిజంగా మంచి డాక్టరు అయినా మీరు దారి మార్చక తప్పని పరిస్థితిని కల్పిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి పోదామని బైలుదేరితే ‘‘ప్రభుత్వ ఆసుపత్రికా?’’ అని దీర్ఘం తీస్తాడు ఓ తెలిసిన బంధువు. దాంతో వాటంతట అవే తెలియకుండా ప్రయివేటు డాక్టరు వైపు లాగుతాయి కాళ్ళు. సలహా ఇచ్చిన దానయ్యకి ఇక్కడ పోయేది ఏమీ లేదు. సలహా పాటించినందుకు తక్కువలో తక్కువ అంటే ఓ నాలుగు వందలు వదిలాయి. అంతే.
మీరు ఒక డాక్టరు దగ్గర వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పటికి బాగానే ఉంది. పూర్తిగా తగ్గటానికి మరో నాలుగు నెలలు మందులు వాడాలని చెప్పాడు వైద్యం చేస్తున్న డాక్టరు. ఆ విషయం తెలిసిన ఒకాయన ‘‘ఎందుకైనా మంచిది ఒకసారి ఫలానా స్పెషాలిటీ ఆసుపత్రిలో చూపించకూడదూ?’’ అని (ఉచిత) సలహా పడేసి మాయమైపోతాడు. అది అది మనసులో దూరినప్పటినుండి జరుగుతున్న వైద్యం మీద నమ్మకం సడలుతుంది. డబ్బులు పోగేసుకొని పెద్ద ఊరికి వెళ్ళి కార్పొరేటు ఆసుపత్రిలో చూపించుకుంటారు. ఫీజులు, పరీక్షలు, ఖర్చులు మొత్తం కలిసి ఓ యాభై వేలు అయింది. చివరకు తేలింది ఏమిటంటే మొదటి డాక్టరు రాసిన మందులే పేర్లు మార్చి రాసి, మరో నాలుగు నెలలు వైద్యం చేయాలి కాబట్టి నెలనెలా రమ్మని సున్నితంగా చెప్పి పంపాడు.
ప్రతినెలా ఎక్కడ పోతావులే అని మళ్లీ పాత డాక్టరు దగ్గరకు పోతే, ‘‘అంటే నా మీద నమ్మకం లేదన్నమాట!’’ అని ఇక నుండి తేడగా చూస్తాడు. ఇపుడు మీరు ఆ డాక్టరు దృష్టిలో అవకాశవాది. మిమ్మల్ని ప్రతిసారీ అనుమానంగా చూస్తాడు ఫలితం మీరు ఎప్పుడు డాక్టరు దగ్గరకు పోయినా కాస్త ఎక్కువే ఖర్చుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీ అదృష్టం ఏమిటంటే ఆ విషయం మీకు తెలియకపోవటం. దీనంతటికీ కారణం ఇతరులు ఇచ్చిన ఉచిత సలహా. దాన్ని పరిశీలించకుండా అమలు పరిచినందుకు చెల్లించిన జరిమాన. ఇక్కడ సలహా ఇచ్చిన వాడికి పోయేది ఏమీ ఉండదు. పైగా సలహా ఇచ్చినవాడికి ఫలానా సలహా ఇచ్చానన్న సంగతే గుర్తుండదు. ఆలోచించకుండా వచ్చిన డయలాగే కదా!
కొత్తగా పెళ్లయిన ఓ సాఫ్టువేరు ఇంజనీరుకు పెళ్లాంమీద అనుమానం. ఇది పెద్ద గొడవకు దారితీసింది. మానసిక వైద్యుల దగ్గరకు పోతే ఇది ‘పారానాయిడ్ స్కిజోఫ్రెనియా’ అని వైద్యం మొదలుపెట్టారు. భార్య కూడా సహకరించింది. నెలకంతా బాగయ్యాడు. అయినప్పటికీ రెండేళ్ళు మందులు వాడాలని డాక్టర్లు సూచించారు. తిరిగి ఉద్యోగంలో చేరాడు. ఇక్కడివరకూ బాగనే వుంది.
మానసిక వైద్యుల దగ్గర మందులువాడితే మెదడు పాడైపోతుందని పక్క సాఫ్టువేరు అడగకుండానే ఓ ఉచిత సలహా వదిలాడు. కావాలని కాదు అనాలోచితంగానే. అసలే అనుమానపు రోగం, ఇంకేముందీ? దాన్నినమ్మి మందులు మానేశాడు. ఇపుడు అనుమానపడటం లేదు కదా అని భార్య కూడా మందులు ఆపినందుకు పెద్దగా పట్టించుకోలేదు. ఆరు నెలలు గడిచింది మళ్లీ అనుమానం మొదలైంది. ఇంతకుముందు భార్యనే అనుమానించిన వ్యక్తి ఇపుడు ప్రతిదానికి ఇతరులను అనుమానిస్తున్నాడు. మందులు వాడకానికి సుముఖంగా లేడు. కారణం ఏమిటంటే ఆ జబ్బుతో బాధపడేవారికి తనలో జబ్బు ఉన్నట్టు గుర్తించలేరు. అందువల్ల మందులు వాడాల్సిన పనేముందని వాదనకు దిగుతారు. జబ్బు కాస్త ముదిరింది. ఉద్యోగం పోయింది. కుటుంబాన్ని పట్టించుకోవటం మానేశాడు. తనలో తానే మాట్లాడుకుంటూ ఇంట్లోనంచి బైటకు కదలటంలేదు. ఇలాంటి మొగుడితో జీవితాంతం వేగలేనని పెళ్లాం విడాకుల కోసం కోర్టుకు ఎక్కింది. పైసా ఖర్చులేని వైద్య సలహాల ప్రభావం ఇలా ఉంటుంది.

ఉచిత సలహాలవల్ల చాలామంది మధ్యలో మందులు మానేస్తారు. రోగాలు ముదరటానికి కారణం అవుతాయి. అనవసరంగా డాక్టర్లను, ఆసుపత్రులను మార్చటం ఖర్చు తడిచి మోపెడు అవుతుంది. అడగకుండా ఇచ్చిన సలహాలు పాటించడంవల్ల పాటించే వారకి నష్టం జరగడంతోపాటు సలహా ఇచ్చేవారికి కూడా ఇబ్బందే. మీ సలహాతో మంచి జరిగితే దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. మహా అంటే "థాంక్స్" చెబుతారు. కానీ చెడు జరిగిందో సలహా ఇచ్చివారిని బండబూతులు తిడతారు
ఇన్ని ఇబ్బందులు వున్నాయి కాబట్టే పక్క వారికి వైద్య సలహాలు ఇవ్వటం లోనూ, తీసుకోవటంలోనూ కొన్ని జాగర్తలు తీసుకోవాలి. అలాంటి జాగర్తలు కొన్ని:
  1. వైద్యం ఓ పెద్ద మయా సముద్రం. దీన్ని గురించి డాక్టర్లకే పూర్తిగా అవగాహన ఉండదు. కాబట్టి సలహా ఇచ్చే వారికి ఏమీ తెలియదనుకోవాలి 
  2. సలహా ఇచ్చ్హేవారు ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా, ఎంత చదువుకున్నా వారు ఇచ్చే సలహాలో వారి నమ్మకాలు కలిసి ఉంటాయి. అవి మీకు పనికిరాక పోవచ్చు 
  3. సలహా సరైనది కాకపొతే రోగం ముదరవచ్చు, వికలాంగులు కావచ్చు, డబ్బులు వదలవచ్చు, బాధను భరించాల్సి రావచ్చు, కాలం కలిసిరాకపోతే చివరకు ప్రాణం మీదకు రావచ్చు అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి.
  4. అడగకుండా ఎవరికీ వైద్య సలహాలు ఇవ్వకండి. అలాగే అడగకుండా ఇచ్చే సలహాలను చెవిన వేసుకోవద్దు 
  5. మిమ్మల్ని ఎవరైనా సలహా అడిగితే మీకు బాగా తెలిస్తేనే ఇవ్వండి. అడిగారు కదా అని నోటికి వచ్చింది చెప్పకండి. తెలియదని చెబితే మిమ్మల్ని ఎవరూ కొట్టరు. తెలియకుండా చెబితే అవతలి వారికి నష్టం.
  6. మంచి డాక్టరు గురించి, మంచి ఆసుపత్రి గురించి నలుగురికి చెప్పటంలో తప్పు లేదు. అలా అని మీరు  పి. ఆర్. ఓ, అవతారం పోషించకండి. సూచనప్రయంగానే చెప్పి, "మీరు కుడా విచారించుకోండి" అని చెప్పండి. 
  7. ఇతరుల సలహా మేరకు డాక్టర్లను, ఆసుపత్రిని మార్చవద్దు. మార్చే ప్రతి సందర్భంలోనూ డబ్బులు ఖర్చు కాక తప్పదు. చేసిన పరీక్షలే మళ్లీ మళ్లీ చేయకా తప్పదు.
  8. ఇతరుల సలహా పాటించబోయే ముందు దాన్ని గురించి కొంత ఆలోచించండి. జరగబోయే మేలుతోపాటు ఖర్చు, పడబోయే ఇబ్బందులు, (పెద్ద ఊర్లలో ఉండే ఆసుపత్రులకు పోయినప్పుడు ఫీజులు, వసతి, ప్రయాణం, తోడు ఉండేవారు, వీటన్నింటికి అయ్యే ఖర్చులు) బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి.
  9. శాస్త్రీయంగా పస లేని సలహాలను "జోక్"గా తీసుకోవాలి. మచ్చుకు తయత్తు కట్టించమనటం, పసరు పోయించమనటం, పట్టు వేయించమనటం లాంటివి. 
  10. ఎవరైనా మంచి సలహా ఇచ్చారనిపించినా ఆ విషయాన్ని మీ కుటుంబ డాక్టరుతో చర్చించండి 
  11. జబ్బును బట్టి, తీవ్రతనుబట్టి, రోగిని బట్టి, కట్టుకోగల డబ్బును బట్టి వైద్యం మారుతూ ఉంటుంది. మీకు సరిపోయిన వైద్యం మరొకరికి సరిపోక పోవచ్చు. అలాగే మీ అనుభవాలు ఇతరులకు పనికిరాక పోవచ్చు.
  12. మీ ప్రాంతంలో ఉండే నాటు వైద్యులు (వీరినే ఆరెంపి, పిఎంపి లని అంటారు) ఇచే సలహాలు మిడి మిడి జ్ఞానంతో ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి 
  13. వైద్య సలహాలు ఇవ్వటానికి అర్హత పొందిన డాక్టర్లు ఉన్నారు. వారి దగ్గర వైద్యం చేయించుకోవటానికే కాదు. సలహా కోసం కూడా సంప్రదించ వచ్చు. సలహా పొందినందుకు ఫీజు చెల్లించటం మరచిపోవద్దు. 

7 comments:

  1. very recently in eenadu vasundhara page a writer wrote a small box item on this subject.writer compared the shape of each vegitable wth our body organs and finally concluded that one must use cauliflower to maintain good brain health/bean seeds to maintain kidneys health nd so on further trash...

    ReplyDelete
  2. ఈ రకం సలహాలలో నిజమెంత ? అనేదానికంటే ముందు పరిశీలించాల్సిన విషయం - అసలీ చిట్కా సలహాల కోసం జనం ఎందుకు ఎగబడుతున్నారనేది.

    మీరేమీ అనుకోకపోతే నేనొక విషయం చెబుతాను. బాధగా ఉన్నా సహించి చదవండి. మన కాలంలోని అల్లోపతీ ఎమ్బీబియ్యెస్ డాక్టర్లలో ఎక్కువమంది వట్టి దోపిడీదార్లు, మంచీ-చెడూ విచక్షణ లేని బందిపోట్లు. వారు చదువుకున్న గబ్బర్‌సింగులు. వచ్చిన ప్రతివాడికీ వందల్లో వేలల్లో వడ్డించడమే వాళ్ళ జీవిత పరమార్థం. ఈమధ్య మామూలు వైరల్ జ్వరాలక్కూడా స్వైన్ ఫ్లూ అని బెంబేలెత్తించి లక్షలాదిమందిని రాష్ట్రవ్యాప్తంగా దోచేశారు. లేడీడాక్టర్లయితే ఇంకా దారుణం - ఋతుశూల ఉన్న ప్రతిస్త్రీకి గర్భాసయం తొలగించి డబ్బుచేసుకోవడం, మామూలు కాన్పుల్ని కూడా సీజేరియన్ సెక్షన్లుగా మార్చడం - ఇదీ వాళ్ళ జీవనం. ఏం క్రెడిబిలిటీ మిగిలింది ఎమ్బీబియ్యెస్ డాక్టర్లకి ? ఈ పరిస్థితుల్లో సహజంగా జనం ఈ బెడద నుంచి నివారణోపాయాల్ని అన్వేషిస్తారు. దీనికి నిజమైన తరుణోపాయం - అల్లోపతీవాళ్ళు తమ పేరాశకి స్వస్తి చెప్పడమే. జనానికి పాశ్చాత్య విజ్ఞానం గుఱించి ఊదరగొట్టినంతమాత్రాన వాళ్ళు కన్విన్స్ అవ్వరు. శాస్త్రం కాదు, ముందు దాన్ని అందించే మీడియమ్స్ (మనుషులు) పర్ఫెక్టుగా ఉండాలి.

    మీకు మూలికావైద్యం తెలుసో లేదో నాకు తెలియదు. సరిగా తెలిసినవాళ్ళు చేస్తే మూలికావైద్యం కూడా సత్ఫలితాలిచ్చేదే. దానికి భారతీయ ఆయుర్వేదశాస్త్రం మూలం. ఆయుర్వేదం తెలిసినవాళ్ళ చేత చేయించుకుంటే గుణం కనిపిస్తుంది. ఇది నా అనుభవం. భయంకర కృత్రిమ విషరసాయనాలతో తయారు చేయబడే అల్లోపతీ మందుల కన్నా మూలికావైద్యమే చాలా చాలా నయం, ప్రభావం కాస్త ఆలస్యమైనప్పటికీ ! అయితే ఆయుర్వేదంలో ఉన్న వస్తుగుణదీపిక అనే పాఠ్యపుస్తకం చదవకుండా మూలికావైద్యాన్ని ప్రిస్క్రైబ్ చేయకూడదు.

    ReplyDelete
  3. శ్రీనివాస తేజ గారు, చాలా మంచి పోస్ట్.. డాక్టర్ల గురించి, చిన్న చిన్న వ్యాధుల గురించీ వీలైనంత మందికి అవగాహన కలిగించాలన్న మీ ప్రయత్నం అభినందనీయం.
    మరో విషయం, మీ బ్లాగులో ఉన్న పాప ఫోటోలు చాలా బాగున్నాయి..:)

    ReplyDelete
  4. మంచి సలహా, ఆలోచించతగ్గదే. సరైన డాక్టర్ దొరకడం కూడా అదృష్టం.
    హోమియో, అయస్కాంతాలు, కరెంటుషాకులు, ఆయిల్ పుల్లింగులూ,ఆక్యుపంక్చర్, రేకి లాంటి (ఆధునిక)వైద్యాల గురించి మీ అభిప్రాయాలు తెలియచేయండి. :)

    ReplyDelete
  5. డాక్టరు గారూ ఉచిత సలహాలు వినడం లొ ఉన్న ప్రమాదం గురించి చాలా చక్కగా చెప్పారు. నా classmate రాధాక్రిష్నమూర్తి అనే డాక్టర్ ఉన్నాడు రాజమండ్రి లో. వాడు క్లినిక్‌కట్టించుకొంటుంటే చూడ్డానికి వెళ్ళాను. ఇల్లు కట్టించుకొనేవాడికి వంద మంది శత్రువులురా అన్నాడు. అదేంటంటే ఒకడొచ్చి వాస్తు ప్రకారం ఇక్కడ బెడ్ రూం ఉండగూడదు అంటాడు,ఇంకొకడు ఇక్కడ బాత్ రూం పెట్టగూడదంటాడు , మరొకడు సింహ ద్వారం ఇక్కడ పెడితే నాశనమైపొతావంటాడు అని వాపోయాడు. కాబట్టి ఏ రంగం లో నైనా స్పెషలిస్ట్ దగ్గరకు పోవడమే ఉత్తమ పరిష్కారం.

    ReplyDelete